నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 1
యుక్తవయస్సు నుండీ విల్ పవర్ మీదా, విజయం మీదా శ్రద్ధ పెడుతూ వస్తూనేవున్నాను. అయినా సాధించినవి అంతంత మాత్రం విజయాలే. ఎందుకంటే నా వ్యక్తిత్వంలో ఓ ప్రధాన అవరోధం అందుకు (పూర్తిస్థాయి విజయాలకి) ప్రతిబంధకంగా నిలుస్తోంది. దానిని అధిగమించేందుకై పలు ప్రయత్నాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తూనేవున్నాను. అలా ప్రయత్నాలు చేస్తూవున్నాను కనుకనే ఎంతో కొంత విజయాన్ని సాధించుకుంటూ వస్తున్నాను. ఆ లోపం ఏంటంటే నా ప్రయత్నాలు అన్నీ స్పైరలుగా మిగిలిపోవడం. ఉదాహరణకు ఉదయం అయిదు గంటలకే లేచి కలాకృత్యాలు తీర్చుకొని ధ్యానం/సెల్ఫ్ హిప్నటిజం చేస్తే మనస్సుకీ, శరీరానికీ మంచిదని బాగా తెలుసు. ప్రయత్నిస్తాను, పాటిస్తాను... కానీ కొన్ని రోజులే. ఆ తరువాత అది అటకెక్కిస్తాను. మళ్ళీ కొద్దిరోజులకి మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది. మళ్ళీ ధ్యానాన్ని అటక మీది నుండి దించి పాటిస్తాను. అలా మళ్ళీ.. మళ్ళీ. అలా స్పైరలుగా నా వ్యవహారాలు వుండటం వల్ల క్రమంగా ఎదగలేకపోతున్నాను. కాలం గడిచిపోతూనేవుంది కానీ నా పరిస్థితి కొంత తప్ప దాదాపుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగానే వుంటోంది.
ఎందుకనీ అని అడిగితే మీలో విల్ పవర్ లేక అని అందరూ కూడబలుక్కొని అంటారు నాకు తెలుసు. అది సాధించడానికేగా ధ్యానం చెయ్యాలనుకుంటున్నదీ :) చెట్టు ముందా - విత్తు ముందా? ఇలాక్కాదని నాలో ఆత్మ విశ్వాసం కానీ, ఆత్మ బలం కానీ లేకపోవడానికి కారణం ఏంటా అని ఎప్పుడో రంధ్రాన్వేషణ చేసిపడేసాను. నేను ఎంత ముందుకు వెళ్దామన్నా నా మనస్సు సహకరించకపోయేది, వెనక్కి లాగేస్తుండేది. మనస్సూ, శరీరం ధృఢపరచుకునేందుకై వ్యాయామం చేస్తున్నా కూడా దడగా అనిపించి చెయ్యాలనిపించేది కాదు. అప్పుడు లోపం నాలో ఆత్మ బలం లేకపోవడం కాదని ఆత్మబలం లేకపోవడానికి మూలం మరేదొ వుందని దాన్ని కనిపెట్టి కవరప్ చెయ్యడానికి ఎన్నో ఏళ్ళు ప్రయత్నించాను. నాలోని న్యూరోసిస్ అందుకు కారణం. అందులో కూడా ఎన్నో రకాలు వుంటాయి. అది గుర్తించాక అందులో అసలయిన రకం గుర్తించి నివారించుకోవడానికి మరి కొన్ని ఏళ్ళు శ్రమ పడ్డాను. ఇదివరలో రోజూ మందులు వాడుతుండేవాడిని కానీ ఇప్పుడు అవి మానేసి ఇప్పుడు చేప నూనె వాడుతుండటం వల్ల ఆ లక్షణాలు చాలా తగ్గాయి.
అయితే ఈ ప్రయత్నాలు సమస్యని మరుగుపరచగలుగుతున్నాయి కానీ నివారించలేకపోవడం వల్ల ఒత్తిడిలో వున్నప్పుడు ఆ లక్షణాలు ఎంతో కొంత ఉబికివస్తుంటాయి. నా జీవితం మధ్యలోనే పెనం మీదినుండి పొయ్యిలోకి పడిపోయింది కాబట్టి నా జీవితంలో ఒత్తిడీ ఎక్కువే. జీవితాన్ని జోడెడ్ల బండితో సవారీ చెయ్యడం వేరు, మరో కుంటి ఎద్దుని వేసుకొని లాగించడం వేరు. నా న్యూరోసిస్ (GAD) కి మూల కారణాలు ఎంటా అని కూడా పరిశోధిస్తూ వస్తున్నాను. అలాంటి లక్షణాలు ఎందుకు వస్తాయో ఎంతో సమాచారం వుంది. అయితే నాకు ఆ కారణాల వెనుక మూల కారణాలు కావాలి. అందుకోసం అన్వేషణ సాగుతోంది.
ఈమధ్య కాలంలో మా ఆవిడకి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఇప్పించడం, అవి ఫలితాలు ఇస్తుండటంతో దానిమీద ఆసక్తి పెరిగింది. నా సమస్యకీ పరిష్కారం అందులో దొరుకుతుందా అని చూసాను. వెన్నుపూస సమస్యలు న్యూరోసిస్ కు కూడా కారణం కావచ్చునట. ఎందుకయినా మంచిది అని ఉచిత పరీక్షలే కదా అని చేయించుకున్నాను. వెన్నుపూస తలభాగంలో C1 వెర్టెబ్రే లో చాలా సమస్య వుంది అని గుర్తించాం. మామూలుగా అక్కడ కోణం 35 డిగ్రీలో ఏమో వుండాలి. సరిగ్గా గుర్తుకులేదు. నాకు 7 డిగ్రీలే వుంది. 10 కంటే తక్కువయితే సమస్య ఎక్కువని చెప్పారు. ఆ సమస్య వల్ల ఆ ప్రాంతం ద్వారా వ్యాపించే నరాలు ఒత్తిడికి గురి అయి స్పందనలు సరిగ్గా ప్రవహించవుట. తలకు వెళ్ళే నాడులకు రక్తం కూడా సరిగ్గా ప్రవహించదట.
సాధారణ వైద్యులు చాలామంది కైరోప్రాక్టిక్ చికిత్సని విశ్వసించరు. దానిని ఓ కల్ట్ ట్రీట్మెంటుగా భావిస్తారు. అయితే వారిలో, జనాల్లో ఈ విధానంపై నమ్మకం పెరుగుతూ వస్తోంది. మేము కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే ఇది కూడా ప్రయత్నించి చూద్దామని మా ఆవిడకి మొదలుపెట్టాము. చక్కటి ఫలితాలు రావడంతో నేను కూడా ఈ చికిత్స మొదలుపెట్టాను. ఒక నెల తరువాత సాధారణ సమీక్ష వుంటుంది. మూడు నెలల తరువాత మళ్ళీ ఎక్సురేలు తీసి పూర్తి స్థాయి సమీక్ష వుంటుంది. నా ఆరోగ్య భీమా ఈ ఖర్చుని పూర్తిగా భరిస్తుంది కాబట్టి ఆ సమస్య లేదు. అందువల్ల ఓ మూడు నెలలు ఈ విధానంలో వెళ్ళి చూడటం వల్ల నాకు నష్టం లేదు కదా. అయితే కైరోలో కూడా చాలా కొద్ది రిస్క్ వుంది కానీ ఆ మాత్రం రిస్క్ ఎక్కడయినా వుంటుంది.
ఆత్మకు, అంతరాత్మకు (మనం ఇష్టపడేవి, అనుకునేవి, మనస్సు సూచించేవి) సమన్వయం కుదరనప్పుడు ఆత్మ బలం అంతగా వుండదు అనుకుంటాను. ఆ సమన్వయానికి కృషి చెయ్యాలి. సమస్యలుంటే కారణాలు గుర్తించాలి. ఈలోగా విల్ పవర్ ని గ్రూమింగ్ చేస్తూనే వుండాలి. ఒక్కో చిన్ని చిన్ని విజయం విల్ పవర్ ని ఉత్సాహ పరుస్తూనే వుంటుంది. నేను విఫలమయిన వ్యక్తిని అని చెప్పడం లేదు కానీ గొప్ప విజయాలు ఏమీ సాధించలేదు. నాకు వున్న ఆరాటానికి, పరిజ్ఞానానికి ఇంకా గొప్ప స్థానంలో వుండాలి. పట్టుదల వుందా అంటే వుంది కానీ ఎప్పుడూ జారడమూ, పైకి కొంత దూరం వెళ్ళడమే జరుగుతోంది కానీ పూర్తిగా పైకి వెళ్ళలేకపోతున్నాను. అది అందరూ సాధారణ విషయంగానే తీసుకుంటారు కావచ్చు. నేను అలా కాదు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకూ కిందామీదా పడుతూనేవుంటాను. ఇందులో మెరుగుపడితే నాలో నాకు సమన్వయం ఎక్కువయ్యి విజయాల శాతం ఎక్కువవుతుంది. కాకపొతే ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.
అవో ఇవో లోపాలు చాలామందిలో వుంటాయి. వారిలో చాలామంది గుర్తించరు. గుర్తించినా పరిష్కారానికి అంతగా ప్రయత్నించరు. విజయాలు సాధించలేకపోవడానికి విల్పవర్ లేకపోవడమే కారణం అని చాలామంది అంటారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ విల్ పవర్ మెరుగుపరచుకోలేకపోతే అది సాధించలేకపొవడానికి మూలకారణాలు అన్వేషించాలి. జలసూత్రం చంద్రశేఖర్ చెయ్యాల్సింది కూడా అదే. అసలు ఇలాంటి అసలయిన సందేహం అందరికీ రాదు. ఆత్మబలం కోసం కిందామీదా పడుతూనే వుంటారు కానీ దాని గురించి లోతుగా వెళ్ళరు. సమస్యంటూ గుర్తిస్తే సగం సమస్య తీరినట్టే. మిగతా సగం ఇక అది పరిష్కరించుకోవడమే. వారు సమస్యని గుర్తించారు పైగా సమస్యా పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు కాబట్టి అభినందనీయులు.