పొద్దుపోని ముచ్చట్లు - 1

ఈమధ్య నా బ్లాగులో సిటిజెన్ అని ఒకరు అడిగారు - కరోనా డైరీస్ వ్రాయమని. ఇప్పటికే దాని గురించి తెగ వింటున్నాం, చూస్తున్నాం. వ్రాయాలంటే ఇంకా ఎక్కువ ఆలోచించాలి కదా - ఎందుకు లెద్దూ అనుకున్నా కానీ పొద్దు పోవడం కోసమైనా సరే వ్రాసి చూస్తే పోలా అని ఇప్పుడు అనుకుంటున్నాను.

కరోనా మా దగ్గర  ఇలా వుందీ: కెనడాలోని మా రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే కొద్దిగానే వుంది. అదీ తగ్గుముఖం పడుతోంది. 246 cases. 4 deaths. లాక్ డవున్ ఏమీ లేదు కానీ వీలయినంతవరకూ ఇంటిదగ్గరే వుండమనీ, పది మంది కంటే ఎక్కువ గుమికూడవద్దనీ, రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలనీ ఆర్డర్స్ వున్నాయి. వాతావరణం బావున్నప్పుడు మా ఇంటికి దగ్గర్లో వున్న యూవివర్సిటీ గ్రవుండ్స్ లో నడకకి వెళుతూ వుంటాను. ఇక పరుగు ప్రారంభించాల్సిందే  అనుకుంటూ వుంటాను కానీ పెద్ద సెల్ ఫోన్, సైన్‌ఫీల్డ్  సిరీస్‌లో జార్జ్ దగ్గర వుండేటువంటి పెద్ద వాలెట్ పెట్టుకొని ఎలా పరుగెత్తడం చెప్మా?

చాలామందిలాగే నేనూ ఇంట్లోంచి పనిచేస్తున్నా. నాకు ఇంట్లోంచి పని అంతగా ఇష్టం వుండదు. అస్తమానం పెళ్ళాం పిల్లల ముఖాలు మాత్రమే చూస్తూ వుండటం ఏం బావుంటుంది కానీ కష్టమయినా కొన్ని నెలలు తప్పేట్లుగా లేదు కదా.

ఇకపోతే మా నగరం లోని ఒకే ఒక్క డ్రైవ్ థ్రూ కరోనా టెస్టింగ్ సెంటర్ మా అపార్ట్మెంట్ ఎదురుగ్గానే వుంటుంది. మా ఇంట్లోంచి కూర్చున్నా, నిలుచున్నా క్లియర్‌గా కనపడుతూ వుంటుంది. ఎన్ని కార్లు వస్తున్నాయి, వెళుతున్నాయి చూడటం ఒక ఆబ్సెషన్‌లా అయిపోయింది. మూడువారాల క్రితం కార్లు బాగా కనపడ్డాయి. ఆ తరువాత బాగా తగ్గాయి. గత వారం రెండుమూడు రోజులకు ఒకసారి ఒకటీ రెండూ కనపడ్డాయి. ఇవాళ చూస్తే ఇంతవరకూ ఒక్క కారూ కనపడలేదు.

అమెరికా, ఇండియా లాంటి చాలా దేశాల్లాగానే మా ప్రభుత్వం కూడా ఆలస్యంగా విదేశీ ప్రయాణాలని కట్టడి చేసింది. అందువల్ల అప్పటికే కరోనా దేశంలోకి వచ్చేసింది. మన ప్రభుత్వాల అసమర్ధత వల్ల మనం అందరమూ కష్టాలని అనుభవిస్తున్నాం. కొద్ది దేశాలు ఎంచక్కా ముందే జాగ్రత్త పడ్డాయి. గ్జెనోఫోబియా అనుకుటారేమో అని సంకోచంతో మా ప్రధాని ఆలస్యం చేసినట్లుంది. లో రిస్క్, లో రిస్క్ అని చెబుతూ కరోనాకి తలుపులు చాలా వారాల పాటూ తెరిచే వుంచారు. 'ఓ కరోనా రేపు రా!' అని తలుపులు మూసేసి తాళం వెయ్యలేదు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో తప్ప మిగతా వాటిల్లో సమస్య తగ్గుతూ వుండటంతో సంతోషిస్తున్నాం. క్విబెక్ అనే రాష్ట్రంలోదక్షిణ కొరియాలోకి మల్లే ఒక క్రిస్టియన్ కల్ట్  నిబంధనలు పాటించక తెగ పాకించేసారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే సగానికి పైగా కేసులు వున్నాయి. ఈ దేశంలో రాష్ట్రాలని ప్రొవిన్సులు అంటారు.

అప్పుడప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఇతర కుటుంబాలతో కలిసి కుటుంబ సమేతంగా పార్కులకు గట్రా వెళ్ళివస్తుంటాను. మా సిటీ మరీ అస్తామానం ఇంట్లోనే వుండండి అని ఏమీ చెప్పదు. పార్కులకు గట్రా వెళ్ళండి కానీ రెండు మీటర్ల దూరం పాటించమంటుంది. అలా పాటించకపోతే దాదాపుగా 500 డాలర్లు ఫైను. శారీరక మానసిక ఆరోగ్యాలూ ముఖ్యమే కాబట్టి మా కుటుంబాన్ని కూడా నడకకు వెళ్ళేందుకై ప్రోత్సహిస్తూ వుంటాను. ఈ వారం వాతావరణం బాగోలేదు కాబట్టి నడక సాగలేదు. వచ్చే వారం నుండి అంతా ప్లస్ లోనే (సెల్సియస్). అందువల్ల ఎంచక్కా ఇంట్లో పని అయ్యాకా, వారాంతాలలోనూ అలా అలా బయటకి వెళ్ళి రావొచ్చు. కావాలంటే లాంగ్ డ్రయివులకు కూడా వెళ్ళొచ్చు.

మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎలా గడుపుతున్నారు? మానసిక, శారీరక ఆరోగ్యాలు కాపాడుకునేందుకై మీరు ఏం చేస్తున్నారు?