ధ్యానం చేస్తున్నా అంటే ఇంట్లో వాళ్ళు నమ్మరే!

నాకు యోగాసనాల్లో ఇష్టమయినది శవాసనం. ధ్యానం కూడా ఇష్టమే. అందుకే ఆ రెండింటినీ కలిపి (కలిపితే శవధ్యానం అవుతుందంటారా?) మొదలెడుతుంటాను...కాస్సేపటికి బజ్జుంటాను! అందుకే నేను ధ్యానం అనగానే కునుకు తీయడానికో అదో చిన్న సాకు అని ఇంట్లో వాళ్ళు వెక్కిరిస్తుంటారు.

ధ్యానం కోసం మాంఛి మ్యూజిక్ కోసం యూట్యూబులో చూస్తే గంటల కొద్దీ మెడిటేషన్ మ్యూజిక్ వున్న వీడియోలు ఎన్నో వున్నాయ్. అందులో మళ్ళీ ఎన్నో రకాలు. కొన్ని మ్యూజిక్ వీడియోలు అయితే 8 గంటలకి పైగానే వున్నాయి. గత రాత్రి ఎన్నో సంగీతాలు వింటూ పరిశీలించాను. బౌద్ధ సన్యాసులు పఠించే ఓంకార నాదం విన్నవాటిల్లో అన్నింటికికన్నా బాగా అనిపించింది. మంద్ర స్వరంతో - వేదఘోషలా బావుంది. అది నిద్రా ధ్యానం కోసం అటా. అయినా సరే నిన్న రాత్రి పెద్దగా నిద్ర పట్టలేదు. వేదఘోష కూడా యూట్యూబులో దొరుకుతుందేమో చూడాలి. గాయత్రీ మంత్రం ఇంకా కొన్ని మంత్ర మ్యూజిక్కులూ కనిపించాయి కానీ ఇంకా వినలేదు. పనిలో పనిగా కొద్దిగా తంత్ర సంగీతం కూడా వినేసా ;)

ప్రకృతి సంగీతాలు కూడా వున్నాయి. అడవి శబ్దాలూ, జలపాతాల జారుడులూ, వర్షపు చినుకుల సవ్వడులూ, పక్షుల కువకువలూ వగైరాలూ. రాత్రి వర్షం పడింది. చినుకుల సవ్వడి వింటూ వుంటే బావుంది కానీ కృత్రిమ వర్షం వినాలా సహజ శబ్దాలు వినాలా అన్న మీమాంసతో రెండూ వింటూ నిద్రపోవడానికి ప్రయత్నించా కానీ పట్టలేదు. మనస్సు హుశారుగా వుంది - అందుకేనేమో. ఎందుకా హుశారో నాకు తెలుసు.

మెడిటేషన్ కోసం మీకేమయినా మాంఛి మ్యూజిక్కు తెలిస్తే మాకూ చెబుదురూ. ఆమధ్య ఏదో సంగీతం విన్నా - భలే అనిపించింది కానీ వివరాలు మరచిపోయాను. మళ్ళీ వెతకాలి.