... నష్టాలు ఏమయినా వుంటాయేమో ఇంకా అనుభవానికి రాలేదు కానీ ప్రస్థుతానికయితే కాస్తో కూస్తో ఆ పరిచయాలు ఉపయోగపడుతున్నాయి. ఎన్నడూ లేనిది ఈమధ్యే నాకు వారి అవసరం కలిగింది. కలిగిందీ అంటే కలగదూ మరి. దానికో ఫ్లాష్ బ్యాక్ వుంది మరీ. సోమవారం రాత్రి 8 గంటల వేళ హాయిగా సోఫాలొ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ టివి చూస్తున్నా. జనాలు నన్ను అంత విశ్రాంతిగా వుండనిస్తారా? తలుపులూ, కిటికీలూ బిగించుకున్నా కూడా వీధి బయటి నుండి ముందు స్క్రీచ్ మనీ ఆ తరువాత దఢేళ్ మనీ శబ్దాలు వినిపించాయి. రెండు కార్లు గుద్దుకున్నాయి అని అర్ధమయ్యింది. అంతలా ఆ శబ్దాలు వినిపించాక కూడా తొంగిచూడకపోతే ఆత్మ ఘోషిస్తుందని వెళ్ళి బ్లయిండ్స్ తొలగించి ఎదురుగా చూసా ఏమీ కనిపించలేదు. కళ్ళు చిట్లించి కాస్త దూరంలో వున్న ఇంటర్‌సెక్షన్ వైపు చూసి ఉలిక్కి పడ్డా. అక్కడో కారు రోడ్డుకి అడ్డంగా వుంది. ఆ శాల్తీ దిగి కారు చూసుకుంటోంది. ఆ శాల్తీ ఎవరో కాదు - మా ఆవిడే! ఆ కారు నాదే!!
మా ఆవిడ మా ఇంటికి రావడానికని లెఫ్ట్ టర్న్ తీసుకుంటుండగా మరో కారు వచ్చి గుద్దింది. మాది SUV - అతగాడిది కారు అవడం వల్ల మా కారు గిల్లకి కాస్త దెబ్బ తగిలింది కానీ అతగాడి కారు మాత్రం ముందు వైపు ఎడమపక్క బాగా సొట్ట పోయింది. మా ఆవిడ సహజంగానే ఎదుటివాడిని గద్దించింది. వాడు బుద్దిగా పోలీసులకు ఫోను చేసాడు. నేను నెమ్మదిగా నెగోషియేట్ చెద్దామనుకున్నా కానీ మా ఆవిడ నన్ను గదమాయించడంతో నోరు మూసుకుక్కూర్చున్నా. ఇంతలోకే పోలీసు ఆఫీసర్ వచ్చాడు. ఇంకా మన చేతిలో ఏముంటుంది. తగుదునమ్మా అంటూ ఆ చీకట్లో జరిగిన ఈ ప్రమాదానికి ఓ పాదాచారి సాక్షిగా కూడా వుంది. జరిగిందేంటో ఆఫీసరుకి చెప్పింది. రిపోర్ట్ తీసుకొని మా ఆవిడకి ట్రాఫిక్ టికెట్ ఇచ్చి ఐ-బాండ్ మీద అనితను రిలీజ్ చేసాడు. వచ్చే నెల కోర్టుకి వచ్చి చెప్పుకోమన్నాడు.
ఏంటీ కోర్టులో వాదించేదీ? గ్రీన్ లైటు మీద లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత అలా టర్న్ తీసుకున్నవారిదే అవుతుంది. అందువల్ల అక్కడ నెగ్గలేం కానీ కోర్టుకి ఎక్కడం ఇదే మొదటిసారి అవడం వల్ల కొన్ని వివరాలు కావాల్సివచ్చాయి. ఉదాహరణకు ఎదుటి వ్యక్తి కోర్టుకి రాకున్నా అనిత తన తప్పుని ఒప్పుకోవాలా లాంటి సందేహాలు ఎవరిని అడిగినా, నెట్టులో చూసినా దొరకలేదు. నిన్న పౌర పోలీసు శిక్షణకి వెళ్ళినప్పుడు అక్కడ తోటి వారిని అడిగాను. వారికీ స్పష్టంగా తెలియదు. మా శిక్షణను పర్యవేక్షించే అధికారినే ఎంచక్కా అడగవచ్చని చెప్పారు. ఆ అధికారి చాలా మంచి వ్యక్తి, స్నేహ శీలి. విషయం చెప్పి సలహా అడిగాను. చాలావరకు ఎదుటివారు కోర్టుకి రారనీ, అలాంటప్పుడు ఎవరిది తప్పు అనే ప్రశ్నే రాదనీ, కేస్ డిస్మిస్ చేస్తారనీ చెప్పాడు. ఇక అతను కోర్టుకి రాగూడదంటూ మా ఆవిడ తన దేవుడిని ప్రార్ధించాలి. వస్తే ఫైన్లూ, లైసెన్స్ పాయింట్లు పోవడమూ వుంటాయి. అందువల్ల ముందు ముందు వాహన భీమా పెరుగుతుంది.
కొత్త కారు రిపేరుకి ఇచ్చాం. ఎదుటి కారు రిపేర్ ఖర్చులు కూడా మా వాహన భీమా మీదనే పడుతుందనుకుంటాను. వెరసి మొత్తమ్మీద వచ్చే రెన్యూవలులో వాహన భీమా పెరగడం ఖాయం. మా కారు రిపేరుకి ఎంతవుతుందో ఇంకా తెలియదు కానీ ముందు వెయ్యి డాలర్లు మేము కట్టుకోవాలి - మిగతాది భీమా భరిస్తుంది కానీ ఆతరువాత ఎంచక్కా భీమా పెంచేసి ఇచ్చిన డబ్బులు నెమ్మది నెమ్మదిగా గుంజేస్తుంది. ఇంకో సమస్యేంటంటే ఇంకో ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా మేమందరం కార్లు నడపాలి. రెండో ప్రమాదం ఎప్పుడు జరిగినా (బహుశా మూడేళ్ళలో అనుకుంటా) భీమా తారాజువ్వలా పెరిగిపోతుంది. అందుకని చచ్చినట్లు ఒళ్ళు దగ్గరపెట్టుకొని కారు నడుపుతున్నా. ఇహ మా ఇంట్లోని మిగతావారు ఎలా నడుపుతారో ఏమో చూడాలి.
ఇన్ని నెలలుగా మ ఆవిడ కారు నడుపుతుంటే ఇంకా ప్రమాదాలు జరగట్లేదే అని ఈమధ్యనే బాగా ముక్కు మీద వేలేసుకున్నా. నా అంచనా ప్రకారం ఇప్పటికి మూడు ఘోరమయిన ప్రమాదాలయినా జరిగివుండాలి కానీ ఓ ఏడాది తరువాత చిన్న ప్రమాదంతో సరిపుచ్చినందుకు సంతోషంగానే వుంది. ఎవరికీ ఏమీ కాలేదు. కారులో అమ్మలు కూడా వుంది అప్పుడు. కారు నడపడం అంటే ఆట కాదని, అది ఒక బాధ్యత అని ఇప్పటికయినా తనకి భయం ఏర్పడితే అదే పదివేల డాలర్లు. ఆ భయం ఏర్పడటం కోసమే ఇన్నాళ్ళుగా వేచివున్నా.