ఆ రోజు సెప్టెంబర్ 11, 2001. టొరొంటో (కెనడా) లో వుంటున్నాను అప్పుడు. ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టాను. ఆ రోజుకి మా నాన్నగారు మరణించి ఏడాది అవుతోంది. వారి స్మృత్యర్ధం ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకున్నాను. భార్యా పిల్లలూ ఇండియా ట్రిప్పుకి వెళ్ళారు. నాన్నగారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి సంతాప సభ వీడియో చూస్తున్నాను. అప్పుడు మా మేనల్లుడు ఫోన్ చేసాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. తాతయ్య వర్ధంతి రోజు కదా, ఇంట్లోనే వుండి సంతాప సభ వీడియో చూస్తున్నా అని చెప్పాను. అది పక్కన పెట్టు అని చెప్పాడు. ఎందుకు అని అడిగాను విస్మయంతో. వార్తలు పెట్టు అన్నాడు ఏం చెప్పకుండా. ఎందుకు అని అడుగుతూనే టివిలో వార్తల్ ఛానల్ పెట్టాను.
ఏవో దృశ్యాలు హడావిడిగా కదలాడుతున్నాయి. ఎత్తయిన భవంతులు చూపిస్తున్నారు. పొగలు, మంటలూ చెలరేగుతున్నాయి. నేను భృకుటి ముడివేసి "ఏం జరుగుతోంది?" అని అడిగాను మా వాడిని. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద విమానం కూలిపోయింది అని చెప్పాడు. ఆహా అన్నాను కాస్త తేలిగ్గా. రెండు బ్యుల్డింగుల మీద రెండు విమానాలు ఢీ కొట్టాయి అని అప్పుడు చెప్పాడు. "ఆ!?!" అన్నాను అప్పుడు దిగ్భ్రాంతిగా. అప్పుడు సవివరంగా జరుగుతున్నది చెప్పాడు. అప్పటికి ఒక భవంతి కూలిపోయింది అనుకుంటా. అలా ఆ వార్తలు టివిలో చూస్తుండగానే రెండో భవంతీ కూలిపోయింది. చాలా విమానాలు టొరోంటోకి మళ్ళించారు అని వార్తల్లొ విన్నాను. మా ఇల్లు విమానాశ్రయానికి కాస్త దగ్గరే. విమానాల అలికిడి ఎక్కువగా వుందా అని చూసాను కానీ అంతగా ఏమీ అనిపించలేదు.
ఇండియాకి ఫోన్ చేసి మా కుటుంబానికి ఈ విషయం చెప్పి వార్తలు చూడమన్నాను. అప్పుడు వాళ్ళు మా చిన్నక్కయ్య ఇంట్లో వున్నారు. విద్యుత్ లేక వెంటనే వార్తలు చూడలేకపోయారు. కొన్ని గంటలు అయ్యాక వార్తలు చూసి తీవ్రత తెలుసుకున్నారు. సెప్టెంబర్ 14 న వారు ఇండియా నుండి తిరిగిరావాలి. అప్పటికి పరిస్థితులు ఎలా వుంటాయో ఏమో అనుకున్నాం. మిగతా రోజుల్లో పరిస్థితి మందింపు వేసి ఏం ఫర్వాలేదు బయల్దేరండి అని చెప్పాను. వారితో పాటు తొలిసారిగా మా అమ్మ కూడా కెనడా వస్తోంది.
మా ఆవిడ బొంబాయి నుండి ఫోన్ చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయలో వుందిట. ఏడుస్తోంది. ఏమయ్యింది అని అడిగాను ఖంగారుగా. ఎవరి రిస్క్ మీద వాళ్ళు ప్రయాణించాల్సిందే, ఏం జరిగినా మా బాధ్యత లేదు అని ఎయిర్ లైన్స్ వాళ్ళు చెప్పారుట. వాళ్ళు వస్తున్నది ఎయిర్ ఇండియా అనుకుంటా. ఇలా దుఃఖిస్తూ మాట్లాడితే తొలిసారిగా విదేశాలకు వస్తున్న మా అమ్మ ఎక్కడ ఖంగారు పడుతుందో అని ఆమెకు కనిపించకుండా పక్కకు వచ్చి మా అనిత మాట్లాడుతోందిట. ఏమీ జరగదనీ, ఇంకా అందరూ చాలా జాగ్రత్తగా వుంటారు కాబట్టి ఎలాంటి దుస్సంఘటణలూ జరగవని ధైర్యం చెప్పి ఎంచక్కా వచ్చెయ్యమని చెప్పాను. మొత్తం మీద ధైర్యం కూడతీసుకొని క్షేమంగా కెనడా వచ్చేసారు.
ఈ సెప్టెంబర్ 11 కి యు ఎస్ లో ఆ సంఘటణ జరిగి పదేళ్ళు అవుతుంది. మా నాన్నగారు మరణించి పదకొండేళ్ళు అవుతుంది. ఇలా ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 11 అంటే ముప్పిరిగొన్న భావాలతో, ఆలోచనలతో, జ్ఞాపకాలతో ఆ రోజంతా గడిచిపోతుంది.
అప్పుడు నేనూ అక్కడే అమెరికాలో ఉన్నానండీ! మా వారు పొద్దున్నే ఎనిమిదింటికో, ఎనిమిదిన్నరకో ఆఫీసు నుంచిఫోన్ చేసి "టీవీ పెట్టు టీవీ పెట్టు" అని హడావుడి చేస్తే ఇండియాలో ఏమైనా అయిందా అనుకుంటూ పెట్టా____అప్పటిదాకా "గోల్డెన్ గాల్స్" సీరియల్ చూస్తూ ఉన్నదాన్ని! అప్పటికే మొదటి బిల్డింగ్ మీద అటాక్ జరిగింది. రెండో బిల్డింగ్ మీద అటాక్ మాత్రం లైవ్ లో చూశాను! అంతే హడలి పోయాము, అప్పటిదాకా అందరూ అది ప్రమాదమనే అనుకున్నారు కదా!
ReplyDeleteఇండియా నుంచి స్నేహితుల ఫోన్లు! న్యూయార్క్ లో అనుకుంటా ఒక సిఖ్ మీద దాడి, అప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ మనసులో మెదిలే ఆలోచనలు తల్చుకుంటే ఎందుకో దిగులేస్తుంది. అమెరికన్స్ ఎంత భయప్డి ఉంటారో తల్చుకుంటే కూడా! మా పక్కింట్లో ఉండే మార్క్ అనే అమెరికన్ మాత్రం న్యూయార్క్ లో ఇన్సిడెంట్ తర్వాత...మా దగ్గరకు వచ్చి" మీకు బయటికి వెళ్ళడానికి సంకోచంగా ఉంటే నేను వెళ్ళి మీకేమైనా కావల్సి వస్తే తెస్తాను! ఇండియన్ స్పైసెస్ వగైరా కావాలంటే చెప్పండి" అని అడగటం చాలా సంతోషపెట్టింది మమ్మల్ని!
ఆ ఘటన జరిగిన కాసేపట్లోనే డౌన్ టౌన్ అంతా ఖాళీ చేయించి ఉద్యోగులందర్నీ ఇంటికి పంపారు.
ఏమిటో, అది గుర్తొస్తే చాలా గ్లూమీగా అనిపిస్తుంది!
@ సుజాత
ReplyDeleteఆ సమయంలో ఇక్కడ వున్న ప్రతి ఒక్కరినీ ఆ సంఘటణ ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తుంది అనుకుంటాను. అప్పుడు మీరు ఏ సిటీలో వున్నారో చెప్పలేదు.