పోలీస్ ట్రైనింగుకి వెళుతూ వస్తున్నానోచ్

శరత్తు పోలీసు ఏంటా అని ఖంగారు పడకండి. సిటిజెన్ పోలీసింగ్ అని మా పట్టణంలో ఓ ప్రోగ్రాం వుంది. వారానికి మూడు గంటల చొప్పున తొమ్మిది వారాలు మా పోలీసు స్టేషను వారు ఆసక్తి చూపించిన వారిలో ఎన్నిక చేసిన పౌరులకు శిక్షణ ఇస్తారు. అందులో భాగంగా నిన్న మొదటి తరగతి జరిగింది. చాలా బాగా జరిగింది. మాది 32 వేలమంది వుండే చిన్న పట్టణమే అయినా కూడా దాదాపుగా 120 మంది పోలీసులు మా స్టేషనుకి వున్నారు. అందులోని అన్ని శాఖల అధిపతులు వచ్చి మాకు ఆహ్వానం చెప్పి, మాట్లాడి వెళ్ళారు.

మా స్టేషను గురించి పూర్తిగా వివరించారు. విభాగాలు, అధిపతులు, తేడాలు, సౌకర్యాలు, విధానాలు అన్నీ విడమరచి చెప్పారు. ఆ తరువాత ఓ ముప్పావు గంట సేపు స్టేషను అంతా తిప్పి చూపించారు. లోపల స్టేషన్ అంత పెద్దగా వుంటుందని అనుకోలేదు. చిన్న పట్టణానికే అంత పెద్ద పోలీసు స్టేషన్ వుండటం ఆశ్చర్యం అనిపించింది. ఇంకా పెద్ద పట్టణాలకు ఇంకెంత పెద్ద స్టేషనులు వుంటాయో కదా. ఎన్నో గదులు, ఎన్నో సౌకర్యాలు. లాకప్ సెల్స్ కూడా లొనికి వెళ్ళి చూసాము. ఫైరింగ్ రేంజ్ కూడా వుంది. మాకు ఫైరింగులో కూడా కాస్త శిక్షణ ఇస్తారుట కానీ కాల్చే అధికారాలు వుండవు లెండి. మాకు తిప్పి చూపించిన అధికారి SWAT టీం మెంబర్. ఆ టీం ఎలా పనిచేస్తుందో కూడా వివరించాడు.

శిక్షణలో భాగంగా ఒక రోజు నాలుగు గంటలు స్క్వాడ్ (పోలీస్) కారులో ఆఫీసు పక్కన కూర్చొని తిరిగి చూస్తూ అతని విధుల్లో సహకరించాల్సి వుంటుంది. వచ్చే వారం పోలీస్ కుక్కతో ప్రదర్శన వుంటుంది. నేరస్తులని పట్టుకోవడానికి పోలీసు కుక్కలు ఎలా ఉపయోగపడుతాయో వివరిస్తారు. అలా అలా ఒక్కో వారం ఒక్కో విశేషం వుంటుంది. తరగతులు అన్నీ పూర్తి చేసాక ఇష్టమయితే పౌర పోలీసుగా బాధ్యత స్వీకరించవచ్చును. అప్పుడు వారానికి కనీసం నాలుగు గంటలు అయినా మన స్వంత కారులో పెట్రోలింగ్ చెయ్యాల్సి వుంటుంది. ఒక వైర్లెస్ సెట్ ఇస్తారు. ఏదయినా అనుమానాస్పదంగా  అనిపిస్తే స్టేషనుకి మెసేజ్ ఇస్తే ఆఫీసర్లు వస్తారు.

వారం వారం నా శిక్షణా విశేషాలను మీతో పంచుకుంటాను. కొత్త కొత్త కార్యక్రమాల్లో పాల్గొంటూ కొంగ్రొత్త విషయాలను తెలుసుకుంటూ జీవిత పయనం సాగిస్తుంటేనే  ఉత్సాహంగా వుంటుంది కాదూ?

10 comments:

  1. You have got very good writing skills :) Keep going.

    Keep introducing us new good topics.

    ReplyDelete
  2. "పోలీసు" శరత్తుగారికి శుభాభినందనలు..!!

    ReplyDelete
  3. @ ప్రవీణ
    అలాగే :) మీ ప్రశంస నన్ను సంతోషపరిచింది.
    @ రవికిరణ్
    :)
    @ మిర్చి
    హ హ.

    ReplyDelete
  4. sarat, i appriciate your enthusiasm. elantivalli ela telusukuntarandi?

    ReplyDelete
  5. @ రవి
    తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే తెలుస్తూనేవుంటాయి. ఆయా విషయాల మీద మనకు నజర్ వుండాలంతే. ఉదాహరణకు ఈ విషయం ఎలా తెలిసిందో చూద్దాం. మా సిటీ పోలీసు వాళ్ళు ప్రతి ఏడాదీ నేషనల్ నైట్ ఔట్ కార్యక్రమం క్రింద ప్రజలకు చేరువ కావడానికి ఒక రోజు వివిధ ఆంశాలు చేపడుతారు. అలాంటివాటికి మనవాళ్లు సాధారణంగా వెళ్లరు. నేను వెళ్ళాను, కుటుంబాన్నీ, మిత్రులనూ తీసుకువెళ్ళాను. పిల్లలకు, మాకూ చాలా బాగా కాలక్షేపం అయ్యింది. అక్కడ ఈ ప్రోగ్రాం - సిటిజెన్ పోలీస్ ఆకాడీమీ గురించి ప్రచారం చేసారు. ఆ అవకాశాన్ని నేను అందుకున్నాను.

    ReplyDelete
  6. మీరు పొట్ట ఉన్న మరో పోలీస్ అన్న మాట...

    ReplyDelete
  7. ఆహా! ఇలాంటివి బెంగళూరులో కూడా ఉంటే ఎంతబాగుండును? చాలా సంతోషం శరత్ గారూ! అయాం ఇన్స్పైర్ర్డ్ నౌ అండ్ విల్ డూ సంథింగ్...

    ReplyDelete
  8. @ kvsv
    ఇప్పుడు పొట్ట దాదాపుగా తగ్గించేసానుగా.

    @ lamp
    :) సంతోషం. తప్పకుండా ప్రయత్నించండి. జీవితం పాత కొత్తల సమ్మిళితంగా వుండాలి అనుకుంటాను నేను. (ఉదాహరణకు) కేవలం పాతనే అభిమానిస్తూ చదివిన పాత పుస్తకాలనే పది సార్లూ తిరగేస్తూ, పాత చిత్రాలనే పాతిక సార్లు చూస్తూ పోతే కొత్తదనం లేక చాదస్తం అలవడుతుంది. అందుకే కొత్త కొత్తవి ప్రయత్నిస్తూ వుంటే మన చుట్టూ వున్న, మన మనస్సుల్లో వున్న ఎల్లలని ఇంకా దూరం జరపడానికి ఉపకరిస్తాయి.

    ReplyDelete
  9. పొట్ట పోలీసు కాదు... kvsv గారూ..., మన శరత్... "పొట్టి పోలీసు"

    ReplyDelete