ఇక్కడ తాగి కారెక్కితే...(పౌర పోలీసు శిక్షణ నుండి వివరాలు)

షికాగోకి వచ్చిన తొలిరోజుల్లో ఒక రాత్రి పూట రెండు గంటల ప్రాంతంలొ మా ఇంటి ముందు వీధిలో ఫ్లాషింగ్ పోలీసు లైట్లు వెలుగుతుతూవుంటే ఏం జరుగుతోందా అని నేను చీకట్లోనే వుండి నిశ్శబ్దంగా కిటికీలకు వున్న బ్లైండ్స్ కొద్దిగా తొలగించి చూసాను. ఒక కారు వెనకాల పోలీసు కారు వుంది. అందులోని ఓ అమ్మాయిని కిందికి దిగమని ఆదేశించాడు ఆ పోలీసు అధికారి. ఆ తరువాత ఆమెను రకరకాల విన్యాసాలు చెయ్యమని అదేశించాడు. పోలీసులు అలా కూడా చేస్తారని అప్పటిదాకా నాకు తెలియదు కాబట్టి ఆశ్చర్యపడుతూ అలాగే గమనిస్తూ వెళ్ళాను. నెమ్మదిగా అర్ధమయ్యింది ఆ పరీక్షలన్నీ ఆమె బాగా తాగి వుందో లేదో తెలుసుకోవడం కోసమని.

డ్రైవింగ్ అండర్ ఇంఫ్లుయెన్స్ (DUI) గురించి చెబుతూ బాగా తాగిన వారిని ఎలా గుర్తిస్తారో, ఎలాంటి పరీక్షలు చేస్తారో, వాటి పర్యవసనాలు ఏంటో చెబుతూవుంటే నాకు వణుకు పుట్టింది. ఎందుకంటే ఒకసారి అందుకు అరెస్టు అయితే బయటకి రావడానికి కనీసం 6,500 డాలర్లు అవుతాయిట. వాళ్లు చెప్పినదంతా విని ఎంత తాగిన తరువాత కారు ఎక్కకూడదు, ఎక్కువయ్యిందని ఎలా తెలియాలి అని అడిగాను. తాగిన తరువాత కారు తోలకపొవడమే మంచిదని చెప్పారు. తాగని వారినెవరినన్నా డ్రైవ్ చెయ్యమని చెప్పాలని సలహా ఇచ్చారు. లేదా అక్కడే పడుకోవాలి లేదా టాక్సీ తెప్పించుకోవాలి.   ఎందుకంటే మన శరీరం మీద మందు ప్రభావం లెక్క కట్టడం క్లిష్టమయిన లెక్క. ఎంత తాగాం, ఎప్పుడు తాగాం, ఎప్పుడు తిన్నాం, మన మెటబాలిజం, మన వంట్లోని కొవ్వు, బరువు , మన వంట్లోని మిగిలిన చెత్తా చెదారం అన్నీ ప్రభావం చూపిస్తాయి. ఏదో అనుకొని లెక్క తప్పితే పోలీసు కారు వెనకాలే లైట్లు వేసుకుంటూ వస్తే అప్పుడు చచ్చింది గొర్రె అనుకోవాలి. పర్యవసనాలు  కఠినంగా వుంటాయి.

ఉదాహరణకి వంట్లో ఎంత కొవ్వు ఎక్కువుంటే అంతగా మన శరీరం మందుని హరాయించుకోదు. గంటకి ఒక ఆల్కాహాల్ సెర్వింగ్ చొప్పున మన శరీరం జీర్ణం చేసుకుంటుందిట. ఎన్ని సెర్వింగులు తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాం దాన్ని బట్టి కూడా వుంటుంది. తాగినవాడు స్టెడీగానే వున్నాననుకోవచ్చు కానీ బయటివాడికి తెలుస్తుంది ఆ తూలుడు. ఇంట్లో తూలితే ఫర్వాలేదు - రోడ్డు మీద మన కారు తూలితేనే వుంటుంది తమాషా.

ఓ మూడేళ్ళ క్రితం మాత్రం బాగా తాగి కారు నడిపాను. మా ఇంటి దగ్గరి మిత్రుడి ఇంట్లో పార్టీకి వెళ్ళి బాగా మందు పుచ్చుకున్నాను. దగ్గరేగా, ఫర్వాలేదులే అని కారు తోలుకుంటూ వచ్చాను. అలాంటప్పుడు పొరపాటున పోలీసులు పసిగట్టి ఆపితే జరిగే పర్యవసానాలు తెలిస్తే అంత పని చెయ్యకపోదును. ఈమధ్య కూడా ఒ రెండు సార్లు తాగి నడిపాను కానీ అంత ఎక్కువ తాగలేదు లెండి. అయితే నేను తక్కువ తాగాననుకున్నది పోలీసులకు ఎక్కువగా అనిపించవచ్చు. అప్పుడు వస్తుంది చిక్కు.

మరీ పెద్ద టపా వ్రాసే ఉద్దేశ్యం లేదు కాబట్టి తాగి పట్టుబడితే జరిగే పర్యవసనాలు వివరంగా వ్రాయలేదు. ఆసక్తి వున్న వారు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. అందుచేత మందు బాబులూ - బహుపరాక్!

1 comment:

  1. మందు బాబులు బాగా గుర్తుంచుకోవలసిన విషయం.గత వారం డెట్రాయిట్ పిస్టన్స్ మాజీ ఆటగాడు బెన్ వాలెస్ తాగి కారు నడుపుతూ పట్టుబడ్డాడట!

    ReplyDelete