సమ్మెల వల్ల సకల లాభాలు

నాయకత్వ లక్షణాలు: ఊరకే ఎవడి పని వాడు చేసుకుంటూపోతే వారిలో వున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బయటపడుతాయి? సమ్మెల్లో విధ్వంసం చెయ్యడానికి చాలా మందికి నేతృత్వం వహించాల్సి వుంటుంది. ఎన్ని షట్టర్లు ధ్వంసం చేస్తే, ఎన్ని బస్సులు కాల్చివేస్తే అంత గొప్ప నాయకుడు అన్నమాట. ఇలా సమ్మెలలో నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాక బాగా ఎదిగిపోయి రాజకీయనాయకుడు అయిపోయి దేశానికి ఎంచక్కా సేవ చెయ్యొచ్చు.

విశ్రాంతి: కొందరు పొట్ట గడవడం కోసమో, అధిక ఆదాయం కోసం కుటుంబ సమయాన్ని వీలయినంతగా త్యాగం చేసేసి మరీ పనిలోనికి వెళుతుంటారు. ఇలాంటివారికీ, అందరికీ పెళ్ళాం, పిల్లలతో మరియు బంధు మిత్రులతో బాగా  సమయం గడపడానికి అవకాశం చిక్కుతుంది.

ఒత్తిడి నుండి విముక్తి: చాలామందికి తమ ఆగ్రహావేశాలను బయటికి ప్రకటించి తమలోని ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం వస్తుంది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు చాలా పిరికి వారు. వారికి ప్రభుత్వం మీద కోపం వస్తే సాధారణంగా రోడ్డు  మీదకి ఎక్కి ఆందోళనలు చెయ్యరు. ఎవరికివారు ఆనందంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చూరుకుంటారు.  మనవారికి అంత అగత్యం లేదు. ప్రభుత్వం మీద కోపం వస్తే పక్కనే వున్న బస్సు అద్దాలు పగలగొట్టి మన ఆగ్రహాన్ని తీర్చుకుంటాం.

వైవిధ్యం: అన్ని రోజులూ ఒకేలా వుంటే ఏం బావుంటుంది. మాలాగా ప్రతి పని రోజూ కాళ్ళీడ్చుకుంటూ పనికి వెళితే ఏం ఆనందం వుంటుంది? అప్పుడో ఇప్పుడో బందులో, సమ్మెలో జరిగితే ఆ మోనాటనీ పోతుంది. అందువల్ల మనలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. సమయం లేక ఎన్నాళ్ళ నుండో వాయిదా వేసుకున్న పనులు చక్కపెట్టుకోవడానికి వీలు కుదురుతుంది.

ఇలా సమ్మెల వల్ల ఇంకెన్నో ప్రయోజనాలు వుంటుండవచ్చు. మిగతావి మీరు అందించండి. అయితే నాదో సందేహం. ఎన్నడన్నా ఒకరోజు సమ్మె అంటే బాగానే వుంటుంది కానీ ప్రతి రోజూ సమ్మె రోజు అయితే కూడా బాగానే వుంటుందంటారా?

2 comments:

  1. >ఎన్నడన్నా ఒకరోజు సమ్మె అంటే బాగానే వుంటుంది కానీ ప్రతి రోజూ సమ్మె రోజు అయితే కూడా బాగానే వుంటుందంటారా
    scheduled సమ్మె అయితే, సొంత పనులు చేసుకోటానికి, ముందుగా ప్రణాళిక రచించుకోవచ్చు.

    ReplyDelete
  2. @ పానీపూరీ
    అయితే సమ్మెలను చట్టబద్దం చేసి వ్యవస్తీకృతం చేస్తే బావుంటుంది. నెలకు ఓసారి సమ్మె రోజుగా ఏర్పాటు చేస్తే ఆ రోజు సమ్మగా అందరూ సమ్మె చేసుకోవచ్చు. మరీ నెలకు ఒక రోజేనా అని మళ్ళీ సమ్మె చేస్తారేమో. పోన్లెండి, వారానికి ఒక రోజు ఇచ్చేద్దామా? మనకు పోయేదేముందీ? సగటు మానవునికి ఇబ్బందా? అతనెవరు? అదీ మనమే కదా.

    ReplyDelete