స్త్రీకి పురుషుడి నుండి ప్రేమ కావాలని మరీ పద్ధతిగా చెప్పమాకండి. అది అందరికీ తెలిసిందే కదా. వేరే సంగతులు చూద్దాం. శ్రద్ధ, అవగాహన, గౌరవం, అంకితత్వం, ఆమోదం, భరోసాలు స్త్రీలకు బాగా అవసరమయిన ఆంశాలని రచయిత జాన్ గ్రే చెబుతారు. ఆ ఎమోషన్స్ ఆడవారికి ముఖ్యంట. అవి మగవారికీ, అందరికీ అవసరమే కానీ స్త్రీల విషయంలో మాత్రం మగవారి నుండి అవి బాగా ఆశిస్తారు.
శ్రద్ధ: ఆడవారేమన్నా అప్సెట్టయ్యారని అనిపించిదనుకోండి. మనమేం చేస్తాం? ఆత్మరక్షణకి ప్రయత్నిస్తాం. అలా చెయ్యొద్దు - తల తీసుకువెళ్ళి రోకట్లో పెట్టెయ్యమని చెబుతాడీ రచయిత. వాళ్ళ బాధలూ గట్ర వినెయ్యాలిట. వాళ్ళు మనల్ని తిడుతున్నా, అవమాన పరుస్తున్నా నోరు మూసుకొని కూర్చొని వాళ్లకి కలిగిన కష్టాలకి గాను సానుభూతి ప్రకటిస్తుండాలిట. వాళ్ళ సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తుండాలిట. ముందు కాస్త ఇబ్బంది పడితే పడ్దారు కానీ పారిపొవద్దంటాడు. అలా వాళ్ళు మన బుర్రల్ని దంచీ దంచీ విశ్రాంతి పొందుతారుట. మగవారు పరుగెత్తితే ఆశాభంగం చెందుతారుట. అలా వారు కష్టపడి అనగా మన బుర్రల్ని తినీ సేదతీరాకా మన ఓపికని మెచ్చుకొని మనతో మంచిగా వుంటార్ట. మరి తెలిసీ, తెలిసీ రోట్లో తల పెట్టే ధైర్యం మీకు వుందా? నాకయితే ఇంకా రాలేదు సుమండీ. ప్రాక్టీసు చేస్తున్నా. ఇదివరలో గొడవ పెట్టేసుకొని మరీ పారిపోయేవాడిని. కాకపోతే ఈ పుస్తకం చదివాక మౌనంగా పారిపోతున్నా. కొంచెం బెటరూ.
అవగాహన: వాళ్ళ పట్ల మనకుండే అవగాహన వారిని సంతోషపెడుతుందంట. ఎప్పుడూ, ఎక్కువగా మన గురించి మనమే పట్టించుకోకుండా వారి యొక్క ఆసక్తులూ, అభిరుచులూ, ఆత్మాభిమానాలూ దృష్టిలో వుంచుకొని ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కువ సంతోషంగా వుంటారు.
గౌరవం: మగవారి కన్నా ఎక్కువగా గౌరవానికి స్త్రీలు ప్రాధాన్యత నిస్తారు. తరతరాలుగా మనం స్త్రీలను చెప్పుకింద తేలులాగా అణిచివేస్తూ వస్తున్నాం కాబట్టి వారికి తగినంత గౌరవం ఇవ్వడానికి ఇష్టపడుతుండకపోవచ్చు. వాళ్ళు మనకు గౌరవం ఇస్తుండాలి కానీ మనం వారికి ఇవ్వడం ఏంటి అని అనిపిస్తుండొచ్చు. నేను అప్పుడప్పుడు మా ఆవిడని చాలా ఈజీగా తీసిపారేస్తుంటాను. అప్పుడు ఆమె గౌరవానికి భంగం కలిగినట్లు అనిపించినా తేలిగ్గా తీసుకుంటాను. అలాంటి విషయాల్లో నేను సవరించుకోవాల్సివుంది. వారు చెప్పేవి నచ్చకపోయినా, విభేదాలు వున్నా అవి సగౌరవంగా తెలియజెయ్యాలి కానీ తీసిపారేస్తే వారియొక్క అహం దెబ్బతిని మనమీది గౌరవం తగ్గుతుంది. అగౌరపరచకుండా వుండటమే కాకుండా వారి పట్ల బహిరంగంగా కూడా సముచితమయిన గౌరవం చూపిస్తూపోయినప్పుడు బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. స్త్రీలకు తమ రెస్పెక్ట్ పట్ల అంత పట్టింపు వుంటుందని అనుకోలేదు.
అంకితత్వం: వారి పట్ల మనకుండే నిబద్ధత వారిని చాలా సంతృప్తి పరుస్తుంది. వారి పట్లనే మనం ఫోకస్ చేసి వుండటం వారిని ఆహ్లాదపరుస్తుంది. మనం సాధారణంగా మన పట్లనో లేక మన ప్రియురాలి పట్లనో ఫోకస్ చేసివుంటాం కానీ ఇంట్లో ఆవిడ పట్ల మనకు ఫోకస్ ఎందుకుంటుందీ? బోరు కొట్టదూ. వారికి విశాలభావాలు అయినా నేర్పించాలి లేదా మనం అలాంటి విషయాల్లో కుచించుకుపోవాలి.
ఆమోదం (వాలిడేషన్): ఈ పాయింట్ నాకు సరిగ్గా అర్ధం కాలేదు. మరోసారి చదవాలి కానీ అర్ధం అయినంతవరకు వ్రాస్తాను. అప్సెట్ కావడం ఆడవారి హక్కు అంటాడు రచయిత. వాళ్ళు మానసికంగా బాధల్లో వున్నప్పుడు ఏవో కొంపలు మునిగిపోతున్నాయని ఖంగారు పడి ఎందుకలా కంగారు పడిపోతున్నావంటూ వారిని కంగారు పెట్టకుండా తాపీగా మనల్ని వుండమంటాడు. వారి యొక్క అప్సెట్ మైండ్ వాలిడే అంటాడు. వాళ్ళలా కాసేపు బాధపడి బయటకి వస్తారని ఈలోగా ఎందుకలా అని అడగకుండా వారికి కావాల్సినంత సానుభూతి ప్రవహింపచెయ్యమనీ రచయిత సలహా.
భరోసా: వారికి అన్నివిధాలా, అన్ని వేళలా భరోసాగా వుండాలి. నేనున్నాను కదా, నీకెందుకు భయం, అంతా మంచిగా జరుగుతుందిలే అనే విశ్వాసాన్ని వారికి అందివ్వగలగాలి. ఇదే సందు అనుకొని ఉచిత సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోవాలి. వారి యొక్క ఆందోళన సబబు అయిందని గుర్తిస్తూ సానుభూతి, ధైర్యం చెప్పాలి కానీ అందులో సమస్య ఏముంది, అంతా నువ్వు చేసుకున్నదే, నీ ఖర్మ, అందుకు బాధ్యత నీదే, నువ్వు ఇలా చేస్తే సమస్యలు కొని తెచ్చుకుంటావు అని వారు వర్రీలో వున్నప్పుడే వాయించొద్దు. ఏ విషయం ఎప్పుడు ఎలా చెబితే బావుంటుందో కూడా ఆ పుస్తకంలో జాన్ గ్రే వివరించాడు.
మరి స్త్రీనుండి పురుషుడికి ఏం అవసరమో ఇంతకుముందు టపాలో చెప్పుకున్నాం కదా. నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం. ఆడవారికి ప్రాధాన్యమయినవేమో ఇవీ: శ్రద్ధ, అవగాహన, గౌరవం, అంకితత్వం, ఆమోదం, భరోసాలు. ఇలా ఆడవారి, మగవారి ప్రాధాన్యతలకు వున్న తేడాల్ని గమనించుకుంటూ పోతే ఎంతో కొంత సఖ్యత అయినా వున్నదానికంటే మెరుగుపడుతుంది కాదూ?