ప్రశంసకీ, పొగడ్తకీ తేడా ఇదీ

దీని గురించి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెస్ పీపుల్ అన్న చక్కటి పుస్తకంలో డేల్ కార్నెగీ చాలా చక్కగా వివరిస్తాడు. అదో గొప్ప వ్యక్తిత్వ వికాసపు పుస్తకం. వీలుచేసుకొని మరీ చదివెయ్యండి. సరదాగా, సులభ శైలిలో వుంటుందది. పొగడ్తలో స్వార్ధం వుంటుంది, స్వప్రయోజనం వుంటుంది. ప్రశంసలో నిజాయితీ వుంటుంది, నిస్వార్ధం వుంటుంది. మనం ఎదుటివారిని ప్రశంసించినప్పుడు అది ఎదుటివారిని సంతోషపరుస్తుంది, వారికి ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రొత్సాహన్ని ఇస్తుంది. పొగడ్తలో కూడా అవే లాభాలు కనపడ్డప్పటికీ వాటి ప్రయోజనం తాత్కాలికమే. అది ప్రశంస కాదనీ పొగడ్త అని తెలిసాక ఇక వాటికి విలువ వుండదు. పైగా పైకి కాకపోయినా మనస్సులో అయినా పొగిడేస్తున్న వ్యక్తిపై నిరసన భావం ఏర్పడుతుంది.

మనం ఎవరినయినా మెచ్చుకునేటప్పుడు ఊరికే ఉబ్బేస్తున్నామా లేక అందులో వాస్తవం వుందా అనేది గమనించుకోవాలి. ఒక చిన్న ప్రశంస కొన్ని సార్లు ఎన్నో అద్భుతాలు చేస్తుంది. పైన చెప్పిన పుస్తకంలో ప్రశంస యొక్క ప్రాధాన్యతను గురించి రచయిత వివరిస్తూ ఇప్పటికిప్పుడు మీకెదురుగా వున్న వ్యక్తిని ఏదో ఒక విషయంలో మెచ్చుకొని చూడండి అని చెబుతాడు. ఆ పుస్తకం మొదటిసారి చదివినప్పుడు నాకు బకరాగా మా మేనల్లుడు దొరికాడు. వాడు ఆ రోజే కొత్త బూట్లు కొనుక్కున్నట్టున్నాడు. తళతళా మెరసిపోతున్నాయి, బావున్నాయి కూడానూ. అదే విషయం వాడితో అన్నాను. అప్పుడు వాడు చిన్న పిల్లాడు. వాడెంతో సంతోషపడ్డాడు. వాడి బూట్లు నాకు నచ్చిన వైనం మా అక్కయ్యకి కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరు అదే పని చెయ్యండి. మీ ఎదురుగ్గా ఎవరున్నారు? వారిలో మీకు నిజ్జంగా నచ్చిందేంటీ? ఇప్పుడు మీరు నా బ్లాగు చదివేస్తున్నారు కాబట్టి యమర్జంటుగా నన్నే పొగిడెయ్యరు కదా! నన్నొదిలెయ్యండి కానీ మీ ఎదురుగా వున్న ఇంకెవరినన్నా చూసుకోండి. వారిని ప్రశంసించి చూడండి అంతే కానీ పొగిడి చూడకండి.

మా ఇంట్లో పిల్లల్ని సాధారణంగా ప్రశంసిస్తుంటాను. అమ్మలయితే వాటికి అతీతంగా తయారయ్యింది. నువ్వలాగే అంటుంటావులే డాడీ అని తీసిపారేస్తుంది. అది కాదమ్మా నేను నిజంగానే అంటున్నా అన్నా కూడా  అది వినిపించుకోదు. ఆ గడుగ్గాయిని ఏం చెయ్యాలిక చెప్మా? ఇహ మా పెద్దమ్మాయి. దానికి పొగడ్తల సంగతేమో కానీ ప్రెయిజ్ కూడా ఇష్టం వుండదు. ఉదాహరణకి అది సాధారణంగా చెల్లెల్ని పట్టించుకోదు. ఎప్పుడన్నా శ్రద్ధ చూపినప్పుడు మెచ్చుకొని తనలో చెల్లెల్ని బాగా చూసుకుంటున్నా అనే బిలీఫ్ సిస్టం డెవెలప్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటానా - మీరలా మెచ్చుకుంటే నాకసలే చెయ్యబుద్ధికాదంటుంది. ఇంకేం చేస్తాం - నోరు మూసుకుంఠాం. కాపోతే తనకి చేరాల్సిన పాజిటివ్ సజెషన్స్ తనకి సటిల్ గా అయినా చేరేలా కిందా మీదా పడుతూనే వుంటాను.

ఇహ మా ఆవిడనా - ఏం చెప్పమంటారు లెండి. సాధారణంగా తిడుతూనే వుండేవాడిని - ఎప్పుడో కాని మెచ్చుకున్న పాపాన పోయేవాడిని కాదు. అటు ఆమే అంతే లెండి. అదేం ఖర్మొ గానీ అలాంటి వ్యక్తిత్వ (పుస్తక) ప్రవచనాలు పెరటి చెట్టు అనగా పెళ్ళాం దగ్గర ఉపయొగించేంత ఓపిక, తీరికా వుండవెందుకో. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు లెండి.

ఇంతకీ ఈ విషయంపై టపా వ్రాసినందుకు మీరు నన్ను మెచ్చుకుంటారా లేక పొగిడేస్తారా?

4 comments:

  1. మా కోసం ఇంత ఓపికగా వ్యక్తిత్వ వికాస మాస్టర్ గా అవతారం దాల్చి ఎన్నో విషయాలు వివరిస్తున్నారు .చాల థాంక్స్ (ఇది పొగడ్తో ,ప్రశంసో మీరే తేల్చుకోవాలి మరి)

    ReplyDelete
  2. ఈ పొగడడం లో టైమింగ్ పాటించాలి, ఎప్పుడు మొదలెట్టాలి, ఎప్పుడు ఆపాలి అనేది చూసుకుంటూ, పొగిడీ పొగడనట్టు గా ఉంటే, అంటే అవతలివాళ్ళను బుట్టలో పడెయ్యడం కోసం కాదని వారికి అర్ధమయ్యేలా పొగుడుతూ, వారిని వెన్ను తట్టి ప్రోత్సహించినట్టు, వారిలో ఉత్సాహం నింపేట్టు ఉండాలి.

    లేకపోతే..., అతి వినయం ధూర్త లక్షణం... లాగా అతి పొగడ్తం... కూడా...

    ReplyDelete
  3. శరత్ గారు ఇలాంటి విషయాలు మీరు చాలా బాగా చెప్తారు కాని మీకు కూసింత వెర్రి పిచ్చి కూడా ఉన్నాయండీ మరోలా అనుకోకండి ఎదో ఊరికీ అన్నా..

    -Raghav

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    మీది ప్రశంసే నండి :) నాకు తెలిసినవి పంచుకోవడం ద్వారా నేను మరింత నేర్చుకోగలుగుతున్నాను.

    @ మిర్చి
    మీరు చెప్పినదానినే ప్రశంస అంటారు - పొగడ్త అనరు.

    @ రాఘవ్
    నాకు వేపకాయంత వెర్రి వున్నమాట నిజమేనండి - అందుగ్గానూ నేను గర్విస్తుంటాను. లేకపోతే మీ అందరిలాగా సాధారణంగా వుండేవాడిని. కాస్త సృజనాత్మకత, పట్టుదల, మొండితనం, తెగింపు, ఆత్మవిశ్వాసం గట్రా లాంటివి వున్నవారికి మీరందరూ ఇచ్చే బిరుదులు అవే కదా. సంతోషం.

    ReplyDelete