దాదాపుగా ఓ పన్నెండేళ్ళ క్రితం జరిగిందిది. కెనడాలోని టొరొంటోలో వుంటున్నా అప్పుడు. అర్ధరాత్రి ఇండియా నుండి ఫోన్ వచ్చింది. మీ అక్కయ్య గారి దగ్గర మీ నంబర్ తీసుకున్నాం అంటూ మొదలయ్యింది అవతలి వారి నుండి మాట. అప్పుడప్పుడే నాకు నిద్ర విచ్చుకుంటోంది. చెప్పండి అన్నాను. "ఫలానా వారి గురించి (వారి పేరు ఇప్పుడు నాకు గుర్తుకులేదు - అందుకే ఫలానా అంటున్నాను) మీకు తెలిసేవుంటుంది. వారి యొక్క బావను మాట్లాడుతున్నానూ, ఆ సంఘటణ గురించి మాకు ఎక్కువగా వివరాలు తెలియడం లేదు. మీకేమయినా తెలిస్తే చెప్పండి" అని అన్నారు అటువైపునుండి.
"నాకూ ఎక్కువ వివరాలు తెలియవండీ. వారు పై అంతస్తు నుండి దూకి మరణించారు అన్న విషయమే తప్ప మిగతా వివరాలు నాకూ తెలియవండీ. వారియొక్క క్లోజ్ ఫ్రెండ్ మా స్నేహితుడే. అతనికి ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మీకు తెలియజేస్తాను. ఒక పది నిముషాల తరువాత మళ్ళీ నాకు ఫోన్ చెయ్యండి" అని చెప్పాను. ఆ తరువాత ఆ అర్ధరాత్రి మా ఫ్రెండుకి ఫోన్ చేసి నిద్రలేపి ఆ సంఘటణ యొక్క వివరాలు తెలుసుకున్నాను. ఆ తరువాత ఇండియా నుండి ఫోన్ కోసం ఎదురుచూసాను కానీ ఎంతకూ రాలేదు. మరి నేను అయినా వారికి ఎందుకు ఫోన్ చెయ్యలేదో నాకు గుర్తుకులేదు కానీ వారి యొక్క నంబర్ సరిగ్గా మా ఫోనులో డిస్ప్లే కాకపొవడం కారణం అయ్యుండొచ్చు. వాళ్ళు మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చెయ్యలేదా అని ఆశ్చర్యపోతూ పడుకుండిపోయాను.
తెల్లవారింతరువాత మా అక్కయ్యకి ఫోన్ చేసాను. వాళ్ళని మళ్లీ వివరాల కోసం ఫోన్ చెయ్యమన్నాను కానీ ఎందుకో చెయ్యలేదు అని చెప్పాను. వారికి వివరాలు చెప్పావట కదా అంది అక్కయ్య. నేనెప్పుడు చెప్పానూ? మా ఫ్రెండుని కనుక్కొని చెబుతా అన్నాను కదా అని ఆశ్చర్యపోయాను. అతను మరణించాడన్న విషయం చెప్పింది నువ్వేనట కదా అని అక్కయ్య అన్నది. అప్పుడు అర్ధమయ్యింది నేను చేసిన పొరపాటు. గాఢనిద్రలో నుండి అకస్మాత్తుగా లేచినందువల్ల అనుకుంటా అప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచెయ్యలేదు.
ఇండియా నుండి ఫోను చేసిన ఆ బంధువులకి అసలు విషయం తెలిసే వుంటుందని భావించాను. విషయం తెలిసే మరిన్ని వివరాల కోసం ఫోన్ చేస్తున్నారనుకున్నాను. ఇంతకీ నేను చెప్పేంతవరకు వారికి తెలిసిందేమిటి అంటే 'పై అంతస్తు నుండి కింద పడ్డాడు - హాస్పిటల్లో చేర్పించారు' అని మాత్రమేనట. అతను అప్పుడే, ఎప్పుడో మరణించిన విషయం నేను చెప్పేదాకా వారికి తెలియనే తెలియదట. అసలు విషయం తెలిసిపోయింది కాబట్టి వారు మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదని మా అక్కయ్య చెప్పింది.
ప్చ్!
No comments:
Post a Comment