తొలిసారిగా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్న రోజులవి. ఖమ్మంలోని మెగాబైట్స్ విద్యా సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా చేస్తున్నాను. ఊరికే విద్యార్ధిగా వుండకుండా ల్యాబ్ అసిస్టెంటుగా కూడా చేస్తుండేవాడిని. అలా కొద్దిరోజుల్లోనే ల్యాబ్ మేనేజర్ అయ్యాను. అలా కూడా ఊరుకోకుండా డిప్లమా విద్యార్ధులకు పాఠాలు చెబుతుండేవాడిని. అప్పుడు నా శ్రమ చూసి ఒకరన్నారు "ఇలా చెయ్యడం ఇటు శరత్తుకీ లాభం - అటు ఆ సంస్థకీ లాభం". అది నిజం. అలా చెయ్యడం వల్ల, ఇతరులకి బోధించడం వల్ల నేను నేర్చుకుంటున్న పాఠాలు నాలో బాగా ఇంకిపోయేవి. నేను ఉచితంగా పనిచేస్తుండటం వల్ల అటు ఆ విద్యాసంస్థకూ కొన్ని ఖర్చులు తప్పేవి. ఇలా మనం ఏది చేసినా విన్-విన్ సిచువేషన్ గా వుండేట్లు చూసుకుంటే బహుళ ప్రయోజనాలు వుంటాయి. ఇంకో లాభం కూడా వుండేది. అలా ఆ సంస్థలో పలు పాత్రలు పోషించడం వల్ల అందరికీ తలలో నాలుకలా వుండేవాడిని, అందరికీ ప్రీతిపాత్రుడిని అయ్యేవాడిని, అన్ని విషయాలను నేనే సమన్వయం చేసేవాడిని. క్లాసులో, ఆ సంస్థలో మొదటగా నేనే వచ్చేవాడిని.
ఆ తరువాత అదే టెక్నిక్ విజయం-విజయం పరిస్థితి అన్ని సార్లు కాకపోయినా చాలాసార్లు ఉపయోగించాను. బ్లాగుల్లో కూడా ఎలా ఉపయోగించాలా అని ఈమధ్య ఆలోచించాను. మామూలు కబుర్లు వ్రాస్తే నాకు గాని, చదువుతున్న మీకు గాని ప్రయోజనం ఏముంది? చాలామందికి వుంటుంది తమ నాన్నారి గురించి వ్రాయాలని, తమ పిల్లల గురించి వ్రాయాలని, తాము చదువుతున్న పుస్తకాల గురించి వ్రాయాలని. చాలామంది తమ అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల గురించి వ్రాస్తూనేవుంటారు. ఇంకొంతమంది వాటి గురించి విశ్లేషిస్తూనేవుంటారు. అలా తమ గురించి వ్రాసుకోవడం చెప్పుకోవడం ఎవరికయినా సరే అలాగే నాకయినా సరే ఉత్సాహంగానే వుంటుంది. అయితే వాటిని చదివిపడెయ్యడమేనా? ఊరికే మన సొల్లు కార్చుకుంటూ వెళుతుంటే ఎవరికి ఆసక్తి వుంటుంది? మరీ బాగానో, నవ్వు తెప్పించే విధంగానో వ్రాస్తే కాలక్షేపం కోసం కొంతమంది చదువుతుండొచ్చు. అంతకుమించి అలాంటి వ్రాతల వల్ల నాకు గానీ, మీకు గానీ ప్రయోజనం ఏముంటుంది?
అలా అని బొత్తిగా నా గురించి ప్రస్థావించకుండా అస్థమానం ఇతర విషయాలే వ్రాస్తూవుండలేము కదా. అందుకే ఒక వైపు నా విశేషాలు మీతో పంచుకుంటూనే అవి మీకూ, నాకూ కాస్తయినా ప్రయోజనకరంగా వుండేలా ఆలోచించాను. అప్పుడు వచ్చిన ఆలోచనే ఇది. వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుతూ, నామీద ప్రయోగాలు చేసుకుంటూ ఆ విశేషాలను మీతో పంచుకోవడం. అలా అని ఎప్పుడూ దాంపత్య సంబంధాల గురించే వ్రాస్తుంటా అనుకోకండి. వైవిధ్యమయిన ఆంశాలని ఎన్నుకుందాం. అలా అని నా అన్ని టపాలూ ఇలాంటివే వుంటాయని కాదు.
నాకు ఇంఫోటెయిన్మెంట్ అంటే ఇష్టం. బొత్తిగా సమాచారమే ఇస్తూపోతే పాఠ్యపుస్తకాల్లా అవి బోర్ కొడుతాయి. బొత్తిగా కాలక్షేపం కబుర్లు వ్రాస్తూ పోతే మీకూ నాకూ అంతకుమించి ప్రయోజనం కలిగించవు. అందుకే మీకూ, నాకూ ప్రయోజనకరంగా సమాచారమూ, కాలక్షేపమూ కలగలిపిన ఈ ఇంఫోటెయిన్మెంట్ టపాలు. ఆనందించండిక.
Annai Keka Idea. Go ahead
ReplyDeleteబాగా చెప్పారు .ఫార్మాప్రయోగాల్లాంటివి కాకపోవడంచేత ,ఈ ప్రయోగాలవల్ల మీకు వచ్చిపడే నష్టం కూడాఏమిలేదులెండి
ReplyDelete@ అజ్ఞాత తమ్ముడూ
ReplyDelete:)
@ అజ్ఞాత
నిజమే. వస్తే లాభమే తప్ప తెచ్చే నష్టం ఏమీ వుండదు వీటివల్ల. ప్రయత్నిస్తే, ప్రయోగాలు చేస్తే పొయ్యేదేమీ వుండదు వీటివల్ల.