(కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసం)
అలోపతినే కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎన్నో వున్నాయి. మన ఆయుర్వేద కూడా అదే కదా. అయితే సాధారణ వైద్యులకి అలాంటి ప్రత్యామ్నాయ వైద్యం అంటే అంతగా గురి వుండదు. తమ విధానాలని తప్ప మిగతావాటిని తరచుగా నిరసిస్తుంటారు. రోగులుగా మనకు కావాల్సింది మన సమస్య నుండి ఉపశమనం. అది ఏ విధానం అయినా ఫరవాలేదు - ప్రమాదకరమయినది కాకుంటే చాలు. అన్ని విధానాలు అన్ని జబ్బులని నయం చేయకపొవచ్చు కానీ ఒక్కో విధానమూ దాని ప్రత్యేకతను బట్టి కొన్ని సమస్యలను దూరం చేస్తుండవచ్చు.
మనం ఏదయినా సమస్య వస్తే సాధారణంగా సాధారణ వైద్యుని దగ్గరికి వెళతాం. అక్కడ తగ్గకపోతే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అలానూ తగ్గకపోతే ఇతర విధానాల వైపు చూస్తాం. అలా ఒక్కో నమ్మకమయిన విధానమూ ప్రయత్నిస్తూ పొవాల్సిందే. ఏదో ఒక విధానం మన సమస్యకు సరిగ్గా సూట్ అవచ్చు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. మన సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. మరి మీరు అలా మీ ఆరోగ్య సమస్యా పరిష్కారం కోసం ఒక్కోటీ ప్రయత్నిస్తూ వుంటారా లేక అది ఇక మొండి జబ్బు అని అవస్థపడుతుంటారా?
ఒక్క శారీరక సమస్యలే కాదు ఏ సమస్య అయినా పరిష్కారం అయ్యేదాకా పలు మార్లు, పలు విధాలుగా ప్రయత్నిస్తూ పోవాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు, ఎలాగోలా పరిష్కారం దొరుకుతుంది. అప్పటిదాకా ఆ జవాబు కోసం అన్వేషణ సాగిస్తూ వుండాల్సిందే. అలా నేను ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాను. ఇంకా కొన్ని సమస్యలకు పరిష్కారం వెతుకుతూనే వున్నాను. ఎవరో ఒకరు చెప్పినదానిని విని సమాధానపడి అక్కడే ఆగిపోవద్దు. అక్కడే ఆగిపోతే ఆ సమస్యల్లోనే, ఆ అవస్థల్లోనే అలాగే వుండిపోతాం. అలా కాకుండా ప్రయత్నిస్తూ పోతుంటే కొత్త విషయాలు తెలుస్తుంటాయి, మన సమస్య మీద మనకు అవగాహన విస్తృతం అవుతుంది.
అలాగే మీరు చేసే ఆ ప్రయత్నాల్లొ కైరోప్రాక్టిక్ కూడా ఒకటి అవచ్చు. మీకు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు వుంటే ఈ చికిత్స మీకు భేషుగ్గా పనిచేస్తుండవచ్చు. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది అంటారు కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో రెసెర్చ్ జరగలేదు కాబట్టి ప్రయత్నించి చూడవచ్చు. మీకు ఏ శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ వున్నట్లయితే ఈ విధానం వల్ల ఉపయోగం వుండవచ్చేమో తెలుసుకోండి.
కైరోప్రాక్టర్లు అంటే వెన్నెముక నిపుణులు. వెన్నెముక ఇంజినీర్లు గా అనుకోవచ్చు. మన ఆరోగ్య సమస్యలు చాలావరకు మన వెన్నెముక సరిగ్గా లేనందువల్లనే వస్తాయి అని వారు విశ్వసిస్తారు. ఎక్సురేలు, శారీరక పరీక్షలు, తదితర ఎక్కువ ఖర్చు కాని పరీక్షలు చేసి మన వెన్నెముకలో వున్న సమస్యలని గుర్తిస్తారు. వెన్నెముకలోని ఎముకల కూర్పు సరిగా లేకపోతే అందులోంచి వచ్చే నరాలు ఒత్తిడి చెంది స్పందనలు సరిగ్గా ప్రసరించక, రక్తం సరిగ్గా ప్రవహించకా పలు ఇబ్బందులు ఏర్పడుతాయి అనేది వారి సిద్ధాంతం. అందుకే వారు వెన్నెముక సరిచేయడం ద్వారా సమస్యలని పరిష్కరిస్తుంటారు. వెన్నెముక యొక్క ప్రాధాన్యత గురించి మీకు తెలుసు కదా. అయినా సరే దాని గురించి మరోసారి చెప్పుకుందాం.
మిగతా అన్ని ప్రయత్నాలు చేసి, అవస్థ పడి వారి దగ్గరికి రాకుండా ముందే వారి విధానాన్ని ప్రయత్నించమంటారు. సులభంగా సాల్వ్ అయ్యేపనికి ఎన్నో డబ్బులూ, ఎంతో శ్రమా, ఎన్నో మందులూ, మాకులూ ఎందుకంటారు. అందువలన సమస్యలు వున్న వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా వెన్నెముక పరీక్షించుకుంటే రాబోయే సమస్యలూ, నిద్రాణమయిన సమస్యలూ తెలుస్తాయి. మీరు కన్విన్స్ అయితే చికిత్స మొదలెట్టుకోవచ్చు లేకపోతే లేదు. అయితే మనం పరిపూర్ణంగా వుండటం అనేది అరుదు కాబట్టి చిన్నవో పెద్దవో వెన్నెముక సమస్యలు తేలుతూనే వుంటాయి. వాటిని ఇప్పుడే సరిదిద్దుకోవాలా లేక అలక్ష్యం చేసి ముదిరాక సర్దుబాట్లు చేసుకోవాలా అన్నది మీ ఇష్టం.
అయితే దీని మీద గురి కుదిరేదెలా? మీరు పెద్దగా విని వుండని చికిత్సా విధానం గురించి మీకు నమ్మకం వుండాలి కదా. అందుకే ఇతర విధాల మెరుగుపడని జబ్బులు, సమస్యలు మీకు గానీ, మీకు తెలిసినవారికి గానీ వుంటే ఈ విధానం ప్రయత్నించండి. వారికి ఉపశమనం కలిగితే మీకు ఈ విధానం పట్ల ఆసక్తి పెరగవచ్చు. అప్పుడు మీరు కూడా ప్రస్థుతం ఆరోగ్యవంతులుగానే వున్నా కూడా ఓ సారి మీ వెన్నెముక ఏ స్థితిలో వుందో పరీక్షించుకోవచ్చు.