Showing posts with label కైరోప్రాక్టిక్. Show all posts
Showing posts with label కైరోప్రాక్టిక్. Show all posts

కైరోప్రాక్టికుతో తీరే కష్టాలేంటి?

(కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం)
 
మన వెన్నెముకలోని ఏఏ ప్రాంతాలు సరిగా లేకపోతే వాటి ప్రభావం మన శరీరంలోని ఏఏ అంగాల మీద పడుతుంది మరియు వాటియొక్క లక్షణాలు ఏంటి అనేది పైన వున్న చిత్రంలో వివరంగా ఇచ్చారు.  అది క్లిక్ చేసి అవసరం అయితే పెద్దదిగా చేసి వివరాలు చూడండి. మీకు ఆయా లక్షణాలు వుంటే కైరో ట్రీట్మెంట్ ప్రయత్నించి చూడవచ్చు. ఆయా లక్షణాల ద్వారా వచ్చే ఉపలక్షణాలు వున్నా కూడా మూల కారణాన్ని సవరించేందుకై ఈ చికిత్స తీసుకొని చూడవచ్చు. ఏదయినా ఒక అవలక్షణం వుంటే దానికి ఎన్నో కారణాలు వుండవచ్చు. అయితే దాని వెనుక కారణం వెన్నెముక సరిగా లేకపోవడం అయినట్లయితే మాత్రం ఈ విధానం వల్ల ఫలితం వుండవచ్చు.  ముఖ్యంగా మీరు ఎన్నో ఇతర ప్రయత్నాలు చేసినా కూడా మీ పరిస్థితిలో మెరుగుదల లేకపోయినట్లయితే  మాత్రం ఇది తప్పకుండా ప్రయత్నించి చూడాల్సిందిగా  సలహా ఇస్తున్నాను.

ఈ క్రింది 3 డి మరియు ఇంటరేక్టివ్ చిత్రం ద్వారా వెన్నెముక యొక్క ఒక్కొక్క ప్రాతం ఏ విధంగా ఒక్కో అవయవం మీద ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు.

సరి అయిన కైరోప్రాక్టరుని ఎన్నిక చేసుకోవడం ఎలా?

(కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం వ్రాసిన వ్యాసం)

ప్రతి వృత్తిలోనూ. వైద్యుల్లోనూ పలు మోసగాళ్ళు వున్నట్టే ఈ వృత్తిలోనూ మోసగాళ్ళు వుండవచ్చు. వారికి సరి అయిన విద్యార్హతలు కానీ, అనుభవం కానీ వుండకపోవచ్చు. ఎక్కడో ఆషామాషీగా నేర్చుకొని మీ వెన్నెముక మీదనే ప్రయోగాలు చేసి పరిపూర్ణులవ్వాలని అనుకుంటుండవచ్చు. ఇండియాలో అయితే బార్బర్ షాపుకి వెళ్ళి మంగలివారితో ఎంచక్కా మెడలు విరగ్గొట్టించుకోగలము కానీ అలా అందరి చేతికీ ఆషామాషీగా మన వెన్నుముకను ఇవ్వలేము కదా. బాగుచేసేదేమో కానీ భ్రష్టు పట్టిస్తే  వున్నవాటికి తోడుగా మరికొన్ని సమస్యలు చేరి అవస్థల పాలవుతాం. అందుచేత వెన్నెముక అనేది మన శరీరంలోని అతి ముఖ్యమయిన భాగాల్లో ఒకటి కాబట్టి  చాలా జాగ్రత్త అవసరం. వైద్యం వికటిస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

పాశ్చాత్య దేశాలలో ప్రమాణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి ప్రాక్టీసు చేసేవారందరూ ఏదో ఒక మంచి ప్రొఫెషనల్ కాలేజీలోనే చదివివచ్చి వుంటారు. ఇండియాలో వున్న కైరోప్రాక్టర్లు  ఎలా విద్యార్హతలు సాధిస్తారో నాకు తెలియదు.  ఈ ప్రాక్టీసు నేర్పే మెడికల్ కాలేజీలు అక్కడ వున్నాయా లేక విదేశాల్లో నేర్చుకొని వచ్చి అక్కడ ప్రాక్టీసు చేస్తారా అన్నది కనుక్కోవాల్సిన విషయమే.

కైరోప్రాక్టిక్ సంస్థలో వైద్యం కోసం చేరేముందు కానీ లేదా కైరోప్రాక్టర్ దగ్గర చేరే ముందు గానీ ఆ సంస్థ గురించి, ఆ డాక్టర్ గురించి కొద్దిగా నెట్టులో రెసెర్చ్ చేసి వెళ్ళడం వల్ల కాస్త అవగాహన పెరగొచ్చు. సంస్థల మీద సాధారనంగా నెట్టులో మెచ్చుకోళ్ళు తక్కువా, ఫిర్యాదులు ఎక్కువా వుండటం సహజమే కాబట్టి ఫిర్యాదులు ఎక్కువ కనిపించినా కంగారు పడనవసరం లేదు కానీ మీకు కూడా సంశయాత్మకంగా అనిపిస్తే వెరిఫై చేసుకొని వెళ్ళడం మంచిది.  మీకు ఆరోగ్య భీమా వుంటే అది ఎంతవరకు కవర్ చేస్తుంది మీరు ఎంతవరకు చేతినుండి పెట్టుకోవాలి అనే విషయాల పట్ల అవగాహన అవసరం. కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే మీ భీమా ఆ వైద్యుడిని కవర్ చేస్తుందా, చేస్తే ఎంతవరకు కవర్ అవుతాయి అనే విషయాలు మీ ఇన్సూరెన్స్ సంస్థతో మాట్లాడి కనుక్కొని వెళ్ళడం మంచిది.

కైరోప్రాక్టర్ నమ్మదగ్గ విషయాలే చెబుతున్నాడా లేక అతిశయోక్తులు చెబుతున్నాడా అనేది గమనించండి. వారి ఒత్తిడి మేరకు కాకుండా మీకు నమ్మకం వుంటేనే చికిత్సలో చేరండి. ఏ ఆరోగ్య సమస్యనయినా చిటికెలో నయం చేయగలమని ప్రగల్భాలు పలుకుతున్నారేమో చూడండి. కైరో సెంటర్ కానీ, కైరో డాక్టర్ కానీ మీకు విశ్వాసం కలిగించలేకపోతే వెనక్కి రండి. ఈ డాక్టర్ కాకపోతే ఇంకొకరు. సందేహంగా అనిపించినప్పుడు, సమర్ధత లేదనిపించినప్పుడు మొహమాటానికి వెళ్ళి నడుములు విరగ్గొట్టించుకోవాల్సిన అగత్యం లేదు కదా.

మీరు ఈ విధానంలో చికిత్స తీసుకోవాలనుకున్నప్పుడు మీ బంధుమిత్రులు కానీ, కోలీగ్స్ కానీ ఈ చికిత్సకు వెళ్ళారేమో కనుక్కొని వారు సూచించిన వైద్యుని దగ్గరికి వెళితే మీకు ఇంకా నమ్మకంగా వుంటుంది. ఫలితాలు వుంటేనే ఎవరయినా రికమెండ్ చేస్తారు కాబట్టి మీకూ మంచి ఫలితాలు ఒనగూడే అవకాశాలు వుంటాయి.

కొన్ని సార్లు కొద్దిపాటి రుసుముతో వెన్నెముక ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని స్టాల్స్ పెట్టి మరీ చెబుతుండవచ్చు. మేము వెళుతున్న కైరో సెంటర్ మాకు అలాగే తెలిసింది. కేవలం 20 డాలర్లకి ప్రాధమిక పరీక్షలు చేసి ఇస్తాం అన్నారు. సరే అని మా ఆవిడని చూపించాను. వెన్నెముకలో సమస్యలున్నాయన్నారు. ప్రయత్నించి చూద్దాం అనుకున్నాం. చికిత్స తీసుకున్నాం. అలా వారూ విన్ అయ్యారు మేమూ విన్ అయ్యాము.  విన్ విన్ స్థితి. ఇలాంటి స్థితి అన్ని పార్టీలకీ మేలు చేస్తుంది. అయితే అలాంటి ఉచిత పరీక్షలకి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరి వెన్నెముకలూ పర్ఫెక్టుగా వుండవు కనుక చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ అయినా బయటపడుతుంటాయి. అవి పెద్దపెద్ద సమస్యలు కానప్పటికీ మీలో మీరు గుర్తించలేని సమస్యలు ఇప్పటికే కలగజేస్తుండవచ్చు. అవి తక్షణ సమస్యలు కానప్పటికీ అవీ అలాగే వదిలేస్తే మున్ముందు ముదిరిపోవచ్చు. అలాంటప్పుడు చికిత్స తీసుకోవాలా లేక తిరస్కరించాలా అన్నది వివిధ ఆంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయించుకోవాల్సి వుంటుంది.

కైరోప్రాక్టిక్ ట్రీట్‌మెంట్ పనిచేస్తుందా?


(కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసం)

అలోపతినే కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎన్నో వున్నాయి. మన ఆయుర్వేద కూడా అదే కదా. అయితే సాధారణ వైద్యులకి అలాంటి ప్రత్యామ్నాయ వైద్యం అంటే అంతగా గురి వుండదు.  తమ విధానాలని తప్ప మిగతావాటిని తరచుగా నిరసిస్తుంటారు. రోగులుగా  మనకు కావాల్సింది మన సమస్య నుండి ఉపశమనం. అది ఏ విధానం అయినా ఫరవాలేదు - ప్రమాదకరమయినది కాకుంటే చాలు. అన్ని విధానాలు అన్ని జబ్బులని నయం చేయకపొవచ్చు కానీ ఒక్కో విధానమూ దాని ప్రత్యేకతను బట్టి కొన్ని సమస్యలను దూరం చేస్తుండవచ్చు. 

మనం ఏదయినా సమస్య వస్తే సాధారణంగా సాధారణ వైద్యుని దగ్గరికి వెళతాం. అక్కడ తగ్గకపోతే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అలానూ తగ్గకపోతే ఇతర విధానాల వైపు చూస్తాం. అలా ఒక్కో నమ్మకమయిన విధానమూ ప్రయత్నిస్తూ పొవాల్సిందే.  ఏదో ఒక విధానం మన సమస్యకు సరిగ్గా సూట్ అవచ్చు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. మన సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. మరి మీరు అలా మీ ఆరోగ్య సమస్యా పరిష్కారం కోసం ఒక్కోటీ ప్రయత్నిస్తూ వుంటారా లేక అది ఇక మొండి జబ్బు అని అవస్థపడుతుంటారా?

ఒక్క శారీరక సమస్యలే కాదు ఏ సమస్య అయినా పరిష్కారం అయ్యేదాకా పలు మార్లు, పలు విధాలుగా ప్రయత్నిస్తూ పోవాల్సిందే.  ఎప్పుడో ఒకప్పుడు, ఎలాగోలా పరిష్కారం దొరుకుతుంది. అప్పటిదాకా ఆ జవాబు కోసం అన్వేషణ సాగిస్తూ వుండాల్సిందే. అలా నేను ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాను. ఇంకా కొన్ని సమస్యలకు పరిష్కారం వెతుకుతూనే వున్నాను. ఎవరో ఒకరు చెప్పినదానిని విని సమాధానపడి అక్కడే ఆగిపోవద్దు. అక్కడే ఆగిపోతే ఆ సమస్యల్లోనే, ఆ అవస్థల్లోనే అలాగే వుండిపోతాం. అలా కాకుండా ప్రయత్నిస్తూ పోతుంటే కొత్త విషయాలు తెలుస్తుంటాయి, మన సమస్య మీద మనకు అవగాహన విస్తృతం అవుతుంది.

అలాగే మీరు చేసే ఆ ప్రయత్నాల్లొ కైరోప్రాక్టిక్ కూడా ఒకటి అవచ్చు. మీకు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు వుంటే ఈ చికిత్స మీకు భేషుగ్గా పనిచేస్తుండవచ్చు. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది అంటారు కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో రెసెర్చ్ జరగలేదు కాబట్టి ప్రయత్నించి చూడవచ్చు. మీకు ఏ శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ వున్నట్లయితే ఈ విధానం వల్ల ఉపయోగం వుండవచ్చేమో తెలుసుకోండి.

కైరోప్రాక్టర్లు అంటే వెన్నెముక నిపుణులు. వెన్నెముక ఇంజినీర్లు గా అనుకోవచ్చు.  మన ఆరోగ్య సమస్యలు చాలావరకు మన వెన్నెముక సరిగ్గా లేనందువల్లనే వస్తాయి అని వారు విశ్వసిస్తారు. ఎక్సురేలు, శారీరక పరీక్షలు, తదితర ఎక్కువ ఖర్చు కాని పరీక్షలు చేసి మన వెన్నెముకలో వున్న సమస్యలని గుర్తిస్తారు. వెన్నెముకలోని ఎముకల కూర్పు సరిగా లేకపోతే అందులోంచి వచ్చే నరాలు ఒత్తిడి చెంది స్పందనలు సరిగ్గా ప్రసరించక, రక్తం సరిగ్గా ప్రవహించకా పలు ఇబ్బందులు ఏర్పడుతాయి అనేది వారి సిద్ధాంతం. అందుకే వారు వెన్నెముక సరిచేయడం ద్వారా సమస్యలని పరిష్కరిస్తుంటారు. వెన్నెముక యొక్క ప్రాధాన్యత గురించి మీకు తెలుసు కదా. అయినా సరే దాని గురించి మరోసారి చెప్పుకుందాం.

మిగతా అన్ని ప్రయత్నాలు చేసి, అవస్థ పడి వారి దగ్గరికి రాకుండా ముందే వారి విధానాన్ని ప్రయత్నించమంటారు. సులభంగా సాల్వ్ అయ్యేపనికి ఎన్నో డబ్బులూ, ఎంతో శ్రమా, ఎన్నో మందులూ, మాకులూ ఎందుకంటారు.  అందువలన సమస్యలు వున్న వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా వెన్నెముక పరీక్షించుకుంటే రాబోయే సమస్యలూ, నిద్రాణమయిన సమస్యలూ తెలుస్తాయి. మీరు కన్విన్స్ అయితే చికిత్స మొదలెట్టుకోవచ్చు లేకపోతే లేదు. అయితే మనం పరిపూర్ణంగా వుండటం అనేది అరుదు కాబట్టి చిన్నవో పెద్దవో వెన్నెముక సమస్యలు తేలుతూనే వుంటాయి. వాటిని ఇప్పుడే సరిదిద్దుకోవాలా లేక అలక్ష్యం చేసి ముదిరాక సర్దుబాట్లు చేసుకోవాలా అన్నది మీ ఇష్టం.

అయితే దీని మీద గురి కుదిరేదెలా? మీరు పెద్దగా విని వుండని చికిత్సా విధానం గురించి మీకు నమ్మకం వుండాలి కదా. అందుకే ఇతర విధాల మెరుగుపడని జబ్బులు, సమస్యలు మీకు గానీ, మీకు తెలిసినవారికి గానీ వుంటే ఈ విధానం ప్రయత్నించండి. వారికి ఉపశమనం కలిగితే మీకు ఈ విధానం పట్ల ఆసక్తి పెరగవచ్చు. అప్పుడు మీరు కూడా ప్రస్థుతం ఆరోగ్యవంతులుగానే వున్నా కూడా ఓ సారి మీ వెన్నెముక ఏ స్థితిలో వుందో  పరీక్షించుకోవచ్చు.

కైరోప్రాక్టిక్ మీద పుస్తకం

అంతర్ముఖి పుస్తకం ప్రూఫ్ రీడింగ్ అయిపోయి చివరి దశ ఎడిటింగులో వుంది. బ్లాగుల మీది పుస్తకం కొన్ని కారణాలవల్ల ప్రస్థుతానికయితే పక్కన పడేసాను. 

ఇక పై కైరో మీద పుస్తకం వ్రాయదలుచుకున్నాను. అందు గురించి ముందుగా ఈ బ్లాగులో వరుసగా టపాలు వెలువడుతాయి.  మీలో ఎక్కువమందికి ఆ టాపిక్ మీద ఆసక్తి లేదనుకుంటాను కానీ తెలుగు వారికి చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన లేదు కాబట్టి ఈ పుస్తకంతో అది పరిచయం చెయ్యబోతున్నాను.  కైరో వల్ల మాకు ప్రయోజనాలు కలుగుతున్నాయి కాబట్టి అది పదిమందికీ ఉపయొగపడవచ్చనే  ఉద్దేశ్యంతో ఈ పుస్తకం కోసం ఉపక్రమిస్తున్నాను. కైరో తో మాకు కలిగిన అనుభవాలు కూడా వరుసగా పొందుపరుస్తాను కాబట్టి ఒక రియాలిటీ పుస్తకంగా కూడా అవుతుంది. ఒకవేళ మేము ఆశించిన ప్రయోజనాలు సమకూరకపోయినా అందులో తెలియజేస్తాను.

ఇందువల్ల కలిగే ప్రయోజనాలతో పాటుగా దీని మీద వున్న విమర్శలు, అపోహలు కూడా వివరిస్తాను. ఇందులో జరిగే మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నాకు తెలిసినంత వరకు పొందుపరుస్తాను. మీరు ఎవరయినా నిర్మాణాత్మక వ్యాఖ్యల ద్వారా ఈ విషయానికి సహకరించినా అవి పొందుపరుస్తాను.

కైరో కాలక్షేపం

సాధారణంగా వైద్యుని దగ్గరికో, చికిత్సకో వెళితే మననొక గదిలోకి తీసుకువెళ్ళి చికిత్స చేసి పంపిస్తారు. మా కైరో సెంటర్ అలా కాదు. గ్రూపు చికిత్సలా అనిపించి ఉత్సాహంగా వుంటుంది. అందరం పక్కపక్కనే కూర్చొని నడుము వ్యాయామాలు చేస్తుంటాము. ఒక్కొక్కరినీ వరుసగా పిలిచి మా ఎదురుగానే ఒక్కొక్కరి నడుమునూ ఆ వైద్యులు విరగ్గొట్టి పంపిస్తుంటారు...ఖంగారు పడకండి...నేను అనేదేమంటే వెన్నుపూస సర్దుబాటు చేసి పంపిస్తుంటారు. మరో పక్కన తల్లితండ్రులతో పాటుగా వచ్చిన పిల్లకాయలు అక్కడి ఆటస్థలంలోనే కాకుండా మేమున్న ప్రదేశానికి వచ్చి అల్లరల్లరిగా ఆడుకుంటుంటారు. మరో పక్క టివిలో మంచి సినిమాలు వస్తుంటాయి.

అక్కడ మాకే కాకుండా పిల్లలకీ మంచి కాలక్షేపం అవుతుంటుంది కాబట్టి అమ్మలు రోజూ మాతో ఉత్సాహంగా వస్తుంటుంది. అది వచ్చి ఆ సెంటరు అంతా హడావిడిగా చుట్టేస్తూ అక్కడికి వచ్చిన పిల్లలని ఎంచక్కా ఆడిస్తుంది. వీడియోలో ఏదయినా సినిమా అయిపోతే దానికి ఇష్టం వచ్చిన సినిమా అడిగి మరీ పెట్టించుకుంటుంది. స్టాఫ్ కి ముచ్చట్లు చెబుతుంది. డాక్టర్లతో పరిహాసాలు ఆడుతుంది. మాతో పాటు వ్యాయామాలూ చేస్తుంది.

మా స్నేహితుని కుటుంబం కూడా అందులో చేరారు కాబట్టి మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్కడి వ్యాయామాలు చేస్తుంటే కాలమూ, శ్రమా తెలియకుండా అయిపోతోంది. ఆ సెంటర్ వారియొక్క వ్యాపారం నాలాంటి (బకరా?) వారివల్ల మూడు పూవులూ, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది కాబట్టి హడావిడిగా, రణగొణధ్వనులతో, పిల్లల కేరింతలతో, సినిమా శబ్దాలతో కలిసి అది ఒక తిరనాల లాగా అయిపోయి సరదాగా వుంటోంది. అలా అది మాకు రోజూ సాయంత్రం ఓ పాస్‌టైం లాగా అయిపోయింది.

మీరు ఒహవేళ కైరోప్రాక్టరుని చూసుకోవాలనుకుంటే కూడా మా దానిలాంటి సెంటరునే చూసుకోండి. మీ చికిత్స సమయంలో మీరు ఒక్కరే గడపాలంటే బోరు కొట్టి రోజూ రావాలని అనిపించకపోవచ్చు. అయితే మీరు ప్రైవసీకి, ప్రశాంతతకు, గుంభనానికి ప్రాధాన్యం ఇచ్చేవారు అయితే మీకు ఇలాంటి కైరో కేంద్రాలు నచ్చకపోవచ్చు. ఏ సెంటరు ఎలా వున్నా కూడా ఫలితాలు ముఖ్యం అనే సంగతి మనకు తెలుసు కదండీ. అయితే మంచి ఫలితాలు రావాలంటే రోజూ వెళ్ళలనిపించేదిగా వుండాలి. ఆ, బోర్, ఇవాళ ఏం వెళ్తాములే బాబూ అనిపించేట్లయితే ఇంకా ఫలితాల దగ్గరికి ఏం వెళతాము చెప్పండి?

కారు వీల్ బ్యాలన్సింగ్ లాంటి మన కాళ్ళ బ్యాలన్సింగ్

మన కారుకి అప్పుడప్పుడు వీల్ బ్యాలన్సింగ్ చేయిస్తూ వుండాలి కదా. మరి మన కాళ్ళ బ్యాలన్సింగ్ గురించి ఎప్పుడయినా ఆలోచించారా? రెండు వారాల క్రితం కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు వాళ్ళు నా కాళ్ళు బ్యాలన్సులో లేవు అని చెప్పినంతవరకూ, ఆ తరువాత ఎక్సురేలలో చూసేంతవరకూ నాకు ఆ స్పృహేలేదు. జనాల్లో కొంత శాతం మందికి కాళ్ళ ఎత్తు సరిసమానంగా లేకపోవడం సాధారణమే. అయితే వాటిని సరి చేసుకోకపోతే పలు ఇబ్బందులు తల ఎత్తవచ్చు. ప్రస్థుతానికి మీకు సమస్యలు లేకపోయినా ముందు ముందు సమస్యలు రావచ్చు. శరీరంలో, కీళ్ళలో పలు భాగాల్లో నొప్పి తదితర సమస్యలు రావచ్చు. మీకు ఇప్పటికే అటువంటి సమస్యలు వుంటే మీకు ఈ సమస్య వుందేమో సరిచూసుకోవడం మంచిది. మీకు ఏ సమస్య లేకున్నా కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే నిగూఢమయిన సమస్యలు తెలిసే అవకాశం వుంది.
 
కొన్ని వివరాలకు ఈ క్రింది ఆర్టికల్ చూడండి:
 
కాళ్ల ఎత్తు సమానంగా లేకపోతే శరీరం అందుకు బ్యాలన్సు చేయడానికి కష్టపడుతూ పెల్విక్ ఎముకనూ, వెన్నెముకనూ వంకర చేస్తుండవచ్చు. అలా అలా వెన్నుముకలొ ప్రధమ మరియు ప్రధానమయిన ఎముకలు అట్లాస్ ఎముకలని కూడా వంకర చేస్తుండవచ్చు. అట్లాస్ ఎముకలు మెదడు క్రింది భాగంలో వుంటాయి. మెదడు కాండం వీటిమీద కుదురుగా వుంటుంది.    వీటి వంకరతనం వల్ల మెదడు కాండం మరియు దానినుండి వచ్చే నరాలూ ఒత్తిడికి గురి అయ్యి  పలు శారీరక, మానసిక సమస్యలు ఏర్పడుతాయి. ఒకవేళ అట్లాస్ ఎముకలే బ్యాలన్సులో లేకపోయినా అది బ్యాలన్స్ చేయడానికి మన శరీరం ఒకవేపే ఎక్కువగా పెరిగి అందువల్ల కాళ్ళ ఎత్తు కూడా పెరగవచ్చునట.
 
ఎత్తు కనుక్కున్నాక మీరు చెయ్యాల్సిందేమిటి? ఒక విధానం ఆ ఎత్తు తగ్గుదల సరిచేయడానికి మరోవైపు ఎత్తు పెంచడం. బూట్ల లోపట ప్యాడ్ లు పెట్టి ఎత్తు సరిచేయవచ్చు. అలా కాకుండా అసలు ఆ ఎత్తు హెచ్చుతగ్గులనే సరిచేయడం ఇంకో విధానం. నేను ప్రస్థుతం రెండవది ప్రయత్నిస్తున్నాను. అవసరమయితే కొద్ది వారాల ద్వారా ఆ ప్రయత్నాలకు తోడుగా మొదటి విధానం కూడా వాడుతాను. మన కారు చక్రాలలో హెచ్చు తగ్గులుంటే సరిచేయిస్తాము తప్ప ఒకవైపు ఎత్తు టైర్లు వెయ్యము కదా. ఇక్కడా అంతే కానీ కాళ్ళు సరికానప్పుడు ఎత్తు ప్యాడులు అయినా వాడాల్సి వుంటుంది.
 
నా పరిస్థితి చూసి నవ్వేసుకోకండి. ముందు మీ పరిస్థితి ఏంటో చెక్ చేయించుకోండి. వైద్యుడు చెప్పేదాకా నాలోని అసమానత్వం నాకు కూడా తెలిసిరాలేదు. మీకే కాక మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ పరీక్ష అవసరం. మున్ముందు సమస్యలు  ముందే బయటపడవచ్చు లేదా నిద్రాణంగా వున్న సమస్యలు తెలిసిరావచ్చు. ఆర్థోపెడిక్ వైద్యుడిని అడిగితే ఈ పరీక్ష చేస్తుండవచ్చు.

Frieberg1 has determined that about 50% of the population have uneven leg length, but found that of the low back pain patients, 75% had leg length inequality of 5mm or more.

1Friberg, Ora. "Clinical symptoms and biomechanics of lumbar spine and hip joint in leg length inequality" Spine 1983


Credits: http://gwheellift.com/why-to-use-heel-lifts.html