కొన్నాళ్ల క్రితం మనలోని ఎదుగుదల క్రమంగా వుండాలి కానీ స్పైరల్ లాగా మళ్ళీ మొదటికి వస్తూండకూడదని వ్రాస్తూ అందువల్ల నేను అనుకున్నంతగా ఎందుకు ఎదగలేకపొతున్నానో వ్రాసాను. ఉదాహరణగా నా జిమ్ము ప్రహసనాలు తెలియజేసాను. ఎన్నేఏళ్ళ నుండో జిమ్ముకి వెళుతున్నా కూడా కొద్దిరోజులు చేసి మానివేయడం జరుగుతుండేది. జిమ్ముకని వెళ్ళి సానా గదిలో కూర్చొని కాలక్షేపం చేసి వస్తూండేవాడిని. అన్ని విషయాల కన్నా ఆరోగ్యమే మనకు అందరికీ ముఖ్యం కదా. మంచి ఆరోగ్యం సాధించాలంటే మంచి వ్యాయామం మనం చేస్తుండాలి. వ్యాయామం వల్ల బహుళ ప్రయోజనాలు వున్నాయి. శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది. చురుకుదనం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. మనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆ ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోగలిగితే ఎన్నో విజయాలు మనం సాధించవచ్చు.
కొందరికి అన్ని అవకాశాలు చక్కగా కలిసివస్తుంటాయి. పెద్దగా శ్రమపడకుండానే పైకి వస్తుంటారు. అందరికీ అలా వుండదు కదా. అందుకే మనం ప్రయత్నిస్తూ పోవాలి. ప్రయత్నిస్తూపోతుంటే అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. అలా కృషి చెయ్యాలంటే ముందు మనలో ఉత్సాహమూ, విశ్వాసమూ, ఆరోగ్యమూ వుండాలి కదా. అందుకోసం వ్యాయామం చక్కగా దోహదం చేస్తుందని తెలుసు కాబట్టి దాని మీద బాగా శ్రద్ధ పెడుతుంటాను కానీ తొందర్లోనే చతికిల పడుతుంటాను. అలాంటి నాలోని విఫల వ్యవస్థను సరిచేసుకోవడానికి ఎన్నాళ్ళ నుండో ప్రయత్నిస్తూ వస్తున్నాను. ఏవీ పెద్దగా ప్రయోజనం కలిగించలేదు కానీ ఇన్నాళ్ళకి ఆ వ్యవస్థని అధిగమించానని అనుకుంటున్నాను.
గత అయిదారు వారాలుగా క్రమం తప్పకుండా, చక్కగా జిమ్ములో వ్యాయామం చేస్తున్నాను. మామూలుగా అయితే ఒకటో, రెండో వారాల తరువాత ఆ ఉత్సాహంలో నీరసించిపోవాలి. ఈసారి అలా కాకుండా పద్ధతిగా వెళుతున్నాను. ఈ వారం నుండి రోజుకి రెండు సార్లు కూడా వెళుతున్నాను. ఉదయం అయిదుగంటలకే లేచి జిమ్ముకి వస్తున్నాను. మధ్యహ్న భోజన విరామ సమయంలో కూడా చేస్తున్నాను. అలా రోజుకి రెండు సార్లు నడిపిస్తున్నాను. అయితే తడవకి నలభై నిమిషాల కంటే ఎక్కువూగా వ్యాయామం చేసే సమయం లభించడం లేదు. ఆ సమయాన్ని పెంచాల్సివుంది. ఆ నలభై నిమిషాల సమయంలోనూ పది నిమిషాలు వార్మప్ ఏరోబిక్ ఏక్టివిటీసుకే పోతుంది కాబట్టి అసలు వెయిట్ ట్రైనింగ్ చేసేది ప్రతి తడవకీ అరగంటే అవుతోంది. సమయం పెంచాలి...పెంచాలి.
ఈ పనుల వల్ల శరీరంలో కండ పెరుగుతోంది, బొజ్జ తగ్గుతోంది, నామీద నాకు విశ్వాసం బలపడుతోంది, ఉత్సాహం ఇనుమడిస్తోంది. అయితే వ్యాయామం వ్యాయామం కోసమే అనుకుంటే ఫలితాలు అక్కడే ఆగిపోతాయి. అందువల్ల వచ్చిన ఉత్సాహన్ని, విశ్వాసాన్ని మన జీవితంలో ఎదుగుదల కోసం వినియోగించుకున్నప్పుడే మన శ్రమకి మరింత సార్ధకత వుటుంది. అందుకే వచ్చేవారం నుండి ఇంకో అరగంట ముందు లేచి రోజూ ఒక అరగంట అయినా నా కెరీరులో ఎదుగుదల కోసం వినియోగించాలనుకుంటున్నాను.
అవును. మనకు ఎన్నో విషయాలకు తీరిక వుంటుంది కానీ మన కెరీర్ కోసం మాత్రం సమయం లభించదు. అన్ని పనులన్నీ అయ్యకనో లేకపోతే అర్జంటు అయితేనో మన కెరీర్ కోసం సమయం వెచ్చిస్తాం. అది పొరపాటు అని నా అభిప్రాయం. ఏరోజుకారోజు మన కెరీర్ విషయంలో ఒక అరగంట అయినా సాధన చేస్తుండాలి, మన కత్తులని సాన పడుతుండాలి. మొండికత్తితో బ్రతుకు యుద్ధంలో ఏం గెలవగలం? ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలని సానపెట్టుకుంటే ఏ అనుకోని పరిస్థితి వచ్చినా కూడా బెదరకుండా ఎదుర్కోగలం. వున్న కంఫర్ట్ జోనులోనే తృప్తి పడితే మన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వుండిపోవూ? అందుకే రోజుకి ఓ అరగంట అయినా మన దృష్టి మన కెరీర్ మీద వుండాలనుకుంటాను. ఆ అరగంట ఎక్కడ దొరుకుతుందేమిటి? రోజుకి ఎన్ని గంటలు వృధా చెయ్యడం లేదేమిటి? బజ్జులో, బ్లాగులో లేదా జీడిపాకం లాగే సీరియళ్ళో, వార్తలో ఎన్ని చూడటం లేదూ మనం? రోజూ గంటల కొద్దీ వార్తలు చూడకపోతే ఏదో దేశద్రోహం చేస్తున్నట్లుగా ఫీలయ్యే వారూ నాకు తెలుసు. అందులో ఈమధ్య అన్నా నిరసన ఆయె చూడొద్దూ? దేశాన్ని ఉద్ధరించొద్దూ? ఉద్ధరించీ, ఉద్ధరించీ ఏ రాత్రో ఆలస్యంగా పడుకోవద్దూ? మరి మనల్ని ఎవరు ఉద్ధరిస్తారూ? అందుకే మన కోసం కూడా ఓ అర్ధగంట అయినా అవసరం అంటాను. ఇవన్నీ నాకు నేను చెప్పుకుంటున్న నీతి బోధలు లెండి. మీకూ నచ్చితే వినెయ్యండి - నచ్చకపోతే వదిలెయ్యండి. సింపుల్.
I really like your blog these days, inspiring in some ways.It sounds like a personal development blog !
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteసంతోషం. ఒక్క ఆర్ధిక విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఈమధ్య నేను గణనీయమయిన ప్రగతిని సాధిస్తున్నాను. ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని చెప్పుకుంటూ పోతే అవి శుష్క వచనాలుగానే మిగిలిపోతాయి. అందుకే వ్యక్తిత్వం కోసం, విజయం కోసం నేను చేస్తున్న కృషి సోదాహరణంగా వివరిస్తూ వుంటాను. అవి ఇతరులకూ ఉపయోగపడితే ఆనందమే. మీరు అన్నట్లుగా పర్సనల్ డెవెలప్మెంట్ డైరీలాగా నాకు అయినా ఉపయోగపడుతాయి. అప్పుడప్పుడు నా అభివృద్ధిని సమీక్షించుకోవడానికి ఉపకరిస్తాయి.
సార్,ఓక ఉపాయం చెపుతాను.వ్యాయామం నాకు
ReplyDeleteఇస్టం బలె ఉంటుంది అను కుంటూ ఉండండి.
తెలీకుండానె ఇష్టం వచ్చెస్తుంది.మీ మనసె మిమ్మల్ని
తరుముతుంది.