కార్పెట్ కష్టాలు

మా చిన్నప్పుడు ఇళ్లళ్ళో ఎంత చక్కగా ఆడుకునేవారం! ఎగిరేవారం, దుమికేవారం, పారబోసేవారం, మట్టి కాళ్ళతో వచ్చేవారం, తడికాళ్లతో తన్నుకునేవారం. హ్మ్ - ఇప్పుడో ఏమీ పారబొయ్యడానికి వీల్లేదు, ఏమీ ఒలకబొయ్యడానికి వీల్లేదు, మట్టికాళ్ళతో నడవడానికి వీల్లేదు. ఇల్లంతా కార్పెటండీ బాబూ - కార్పెట్. ఇళ్ళాన్నీ అద్దాల మేడలు అయిపోయి బహు సున్నితం అయిపోతున్నాయి. ఇంట్లో పిల్లలకి గాని పెద్దలకి గానీ పెద్దగా స్వేఛ్ఛ లేకుండా అయిపోతోంది. ఏదయినా సరే జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా తాగాలి, జాగ్రత్తగా ఆడుకోవాలి. మరక పడిందంటే చాలు మన మూడ్ ఆఫ్. అది కనిపించకుండా పొయ్యేదాకా, కనుమరుగయ్యేదాకా అష్టకష్టాలు. అయినా సరే మొండికేసిందా మనల్ని వెక్కిరిస్తూ మన కళ్ళెదుట కనిపిస్తూనే వుంటుంది.
 
మనది కిరాయి కొంపయితే ఆ ఇల్లు మారేటప్పుడు ఇల్లు ఓనర్ ఆ మరకకు గాను ముక్కుపట్టి డబ్బులు వసూలు చేస్తాడు. మనది స్వంత ఇల్లు అయితే ఇల్లు అమ్మేటప్పుడు కొత్త కార్పెట్ వేసివ్వాలి లేదా ధర తక్కువ కయినా అమ్ముకోవాల్సి వుంటుంది. అందుకే ఇలాంటి సమస్యల వల్లనే స్వంత ఇళ్ళున్న వారిలో చాలామంది ఆ ఇంట్లో వుండటం కన్నా రేపు అమ్ముడుపోయే ధర కోసమే ఆలోచిస్తుంటారు. అద్దాల మేడలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమ కోసం బ్రతకకుండా ఇల్లు కోసం బ్రతికేస్తుంటారు. ఎక్కడ ఆ ఇల్లుకి మచ్చ పడుతుందో, ఎక్కడ కార్పెట్ ఖరాబవుతూందో అని అనునిత్యం ఆందోళన పడుతుంటారు.
 
మనకు చిన్నపిల్లలున్నారంటే చాలు మనకుండే కంగారుకి తోడుగా మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ కార్పెట్ ఎక్కడ ఖరాబు చేస్తారో అనే బెంగ ఒకటి. ఎంత మన ముచ్చట్లల్లో మనమున్నా మన పిల్లలు ఏం చేస్తున్నారా అనీ అందుకోసమయినా పిల్లలని ఓ కంట కనిపెడుతూ వుండాల్సిందే. మరీ చిన్న పిల్లలు అయితే తినేటప్పుడు ఎక్కడ వాంతి చేసుకుంటారో అని ఇంటి బయటకు వెళ్ళి తినిపించాల్సి వుంటుంది.
 
ఇండియాలో ఇంకా ఈ కార్పెట్ సంస్కృతి పెద్దగా రావట్లేదనుకుంటాను. సంతోషం. మా దగ్గరి దుర్లభమయిన చలికాలంలో కాళ్ళకు చలిపెట్టకుండా కార్పెట్ కానీ, చెక్క ఫ్లోర్ కానీ వేస్తారు. (నాప) రాయి వేస్తే పాదాలకు బాగా చలి పెడుతుంది కాబట్టి సాధారణంగా వెయ్యరు. వేసినా వంటగది, బాత్ రూముల్లో మాత్రమే వేస్తారు. మేము కెనడాలో వున్నపుడు సాధారణంగా చెక్క ఫ్లోర్ వుంటుండేది. అది శుభ్రపరచుకొవడానికి సౌకర్యంగా వుండేది. దుమ్ము, ధూళి వున్నా కనపడేది. అందుకు గాను రోజుకోసారి అయినా ఊడ్చేవాళ్ళం. ఏదన్నా మట్టి, మురికి పడ్డా నీళ్ళతో సులభంగా కడిగేసేవారం. యు ఎస్ లో ఎక్కువగా కార్పెటెడ్ ఇళ్ళే దొరుకుతున్నాయి. కార్పెట్ మీద దుమ్మూ, ధూళి వున్నా కూడా కనపడదు కాబట్టి వెంఠనే వెళ్ళి శుభ్రం చెయ్యాలి అని అనిపించదు. పైగా ఇల్లంతా వాక్యూం చెయ్యాలంటే అదో ప్రత్యేకమయిన పని కాబట్టి వారానికో సారి జరుగుతుంటుంది ఆ పని. ఇహ చేతగాకపోతేనో, తీరికలేకపోతేనో వచ్చే వారాంతం, వచ్చే వారాంతం అనుకుంటూ లేదా నువ్వు వాక్యూం చెయ్యి అంటే నువ్వు వాక్యూం చెయ్యి అనేసుకుంటూ  అలా అలా వారాలు గడుస్తుంటాయి. ఈలోగా అప్పుడప్పుడు ఓ నెల అయినా గడిచిపోవడం కద్దు. ఇలా ఈ కార్పెట్లు ఏం పరిశుభ్రమో అర్ధం కాదు.
  
ఇవన్నీ చూస్తుంటే మన పాదాలకి కార్పెట్లు కావాలన్నంత మెత్తదనం అవసరమా అనిపిస్తుంది. స్వేఛ్ఛగా, పిల్లల్లా ఆడుకోలేని పిల్లలని చూస్తుంటే వారిమీద జాలేస్తుంది. నాకయితే నా చిన్నప్పటి నాపరాతి ఇళ్ళే నయం అనిపిస్తుంది. అంతగ్గాకపోతే హార్డ్‌వుడ్ ఫ్లోర్లయినా ఫర్వాలేదు కానీ ఈ కార్పెట్ కష్టాలయితే నాకు ఒద్దు బాబూ అనిపిస్తుంది కానీ ప్రస్థుతం అయితే అవి తప్పేట్లుగా లేవు.

3 comments:

  1. మరే,,బాగా చెప్పారు..carpet శుబ్రంగానే వుందనుకుంటా.మా పాప జోగాడుతూ నోట్లో వెంట్రుకలు దుమ్ము కనిపించేదాకా!!!!!

    ReplyDelete
  2. కార్పెట్ వల్ల అలర్జీలు, ఆస్త్మా కూడా రావచ్చని వైద్యులు చెబుతున్నారండి.

    ReplyDelete
  3. @ నిరు
    ఈ కార్పెట్ల వల్ల మొత్తానికి రోజూ ఇల్లు శుభ్రం చేసుకొనే రోజులు గతించాయి అనిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే వాక్యూం క్లీనరు ఫిల్టర్ మరియు ఇతర భాగాలు క్లీన్ చేసుకోవాలి అని తెలియని వారూ కొంతమంది వుంటారు. కొన్నేళ్ళయ్యాక గానీ అది కూడా క్లీన్ చేసుకోవాలనే విషయం మాకు అర్ధం కాలేదు. పేరుకి వాక్యూం చేసినట్లే వుంటుంది కానీ దుమ్ము మాత్రం పోదు. అప్పట్లో మా ఆవిడ వాక్యూం చేస్తుండటంతో క్లీనర్ విషయం పట్టించుకునేవాడిని కాదు. ఒకసారి నేను చేస్తూ దుమ్ము వెళ్ళకపోవడం గమనించి క్లీనర్ తెరచి చూస్తే అందులో తట్టెడంత దుమ్ము ఏళ్ళ తరబడి పేరుకుపోయి వుంది.

    ఇంకో విషయం ఏంటంటే బట్టలు వేసినప్పుడల్లా డ్రై క్లీనర్ ఫిల్టర్ ఓపెన్ చేసి లింట్ క్లీన్ చెయ్యాలనేది తెలియని వారూ వుంటారు. ఒకసారి కిరాయికి ఒక ఇంట్లో చేరాము. అంతకుముందు వున్నవారికి ఆ విషయం తెలియదనుకుంటా. బోలెడంత లింట్ పేరుకుపోయి వుంది.

    @ అజ్ఞాత
    అస్త్మా, అలెర్జీల అవస్థ కూడా నిజమే అయ్యుంటుంది. రోజూ వాక్యూం చేస్తే ఆ సమస్య వుండదేమో గానీ అంతగా రోజూ కష్టపడేవారు తక్కువే వుంటారు.

    ReplyDelete