సాధారణంగా వైద్యుని దగ్గరికో, చికిత్సకో వెళితే మననొక గదిలోకి తీసుకువెళ్ళి చికిత్స చేసి పంపిస్తారు. మా కైరో సెంటర్ అలా కాదు. గ్రూపు చికిత్సలా అనిపించి ఉత్సాహంగా వుంటుంది. అందరం పక్కపక్కనే కూర్చొని నడుము వ్యాయామాలు చేస్తుంటాము. ఒక్కొక్కరినీ వరుసగా పిలిచి మా ఎదురుగానే ఒక్కొక్కరి నడుమునూ ఆ వైద్యులు విరగ్గొట్టి పంపిస్తుంటారు...ఖంగారు పడకండి...నేను అనేదేమంటే వెన్నుపూస సర్దుబాటు చేసి పంపిస్తుంటారు. మరో పక్కన తల్లితండ్రులతో పాటుగా వచ్చిన పిల్లకాయలు అక్కడి ఆటస్థలంలోనే కాకుండా మేమున్న ప్రదేశానికి వచ్చి అల్లరల్లరిగా ఆడుకుంటుంటారు. మరో పక్క టివిలో మంచి సినిమాలు వస్తుంటాయి.
అక్కడ మాకే కాకుండా పిల్లలకీ మంచి కాలక్షేపం అవుతుంటుంది కాబట్టి అమ్మలు రోజూ మాతో ఉత్సాహంగా వస్తుంటుంది. అది వచ్చి ఆ సెంటరు అంతా హడావిడిగా చుట్టేస్తూ అక్కడికి వచ్చిన పిల్లలని ఎంచక్కా ఆడిస్తుంది. వీడియోలో ఏదయినా సినిమా అయిపోతే దానికి ఇష్టం వచ్చిన సినిమా అడిగి మరీ పెట్టించుకుంటుంది. స్టాఫ్ కి ముచ్చట్లు చెబుతుంది. డాక్టర్లతో పరిహాసాలు ఆడుతుంది. మాతో పాటు వ్యాయామాలూ చేస్తుంది.
మా స్నేహితుని కుటుంబం కూడా అందులో చేరారు కాబట్టి మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్కడి వ్యాయామాలు చేస్తుంటే కాలమూ, శ్రమా తెలియకుండా అయిపోతోంది. ఆ సెంటర్ వారియొక్క వ్యాపారం నాలాంటి (బకరా?) వారివల్ల మూడు పూవులూ, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది కాబట్టి హడావిడిగా, రణగొణధ్వనులతో, పిల్లల కేరింతలతో, సినిమా శబ్దాలతో కలిసి అది ఒక తిరనాల లాగా అయిపోయి సరదాగా వుంటోంది. అలా అది మాకు రోజూ సాయంత్రం ఓ పాస్‌టైం లాగా అయిపోయింది.
మీరు ఒహవేళ కైరోప్రాక్టరుని చూసుకోవాలనుకుంటే కూడా మా దానిలాంటి సెంటరునే చూసుకోండి. మీ చికిత్స సమయంలో మీరు ఒక్కరే గడపాలంటే బోరు కొట్టి రోజూ రావాలని అనిపించకపోవచ్చు. అయితే మీరు ప్రైవసీకి, ప్రశాంతతకు, గుంభనానికి ప్రాధాన్యం ఇచ్చేవారు అయితే మీకు ఇలాంటి కైరో కేంద్రాలు నచ్చకపోవచ్చు. ఏ సెంటరు ఎలా వున్నా కూడా ఫలితాలు ముఖ్యం అనే సంగతి మనకు తెలుసు కదండీ. అయితే మంచి ఫలితాలు రావాలంటే రోజూ వెళ్ళలనిపించేదిగా వుండాలి. ఆ, బోర్, ఇవాళ ఏం వెళ్తాములే బాబూ అనిపించేట్లయితే ఇంకా ఫలితాల దగ్గరికి ఏం వెళతాము చెప్పండి?
No comments:
Post a Comment