బాడీ బ్యుల్డింగ్ మీద వెయిట్ లిఫ్టింగ్ మీద ఆర్టికల్స్ చదివినప్పుడు చేస్తున్న వ్యాయామాలు ఓవర్ ట్రైనింగ్ కాకుండా 5,6 వారాలకు ఒకసారి అయినా ఓ వారం విరామం ఇస్తే బావుంటుందని తెలుస్తోంది. ఈమధ్య నా విషయంలో కాస్త ఓవర్ ట్రైనింగ్ అనగా ఎక్కువ కష్టపడటం జరిగింది కాబట్టీ మరియు ఈమధ్య జిం మొదలెట్టి 6 వారాలు అవస్తోంది కాబట్టీ వ్యాయామానికి ఓ వారం విరామం ఇస్తున్నాను. ఇలాంటి విరామమే మిగతా అన్ని రకాల వ్యాయామాలకూ అవసరమా లేదా అన్నది నాకు తెలియదు కానీ అలా వ్యవధి ఇస్తే బావుంటుందనుకుంటా. మోనాటనీ అనిపించకుండా, బోర్ కొట్టకుండా మళ్ళీ కొత్త ఉత్సాహంతో వ్యాయామాలు చెయ్యడానికి అది ఉపకరిస్తుంది. మీరు వారాల కొద్దీ వరుసబెట్టి వ్యాయామాలు చేస్తున్నవారయితే ఓ వారం విరామం మీకూ మంచిదేమో చూడండి.
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు కండరాలు అలసిపోతాయి, వాటిల్లోని ఫైబర్ గాయపడుతుంది కాబట్టి అవి మళ్ళీ రికవర్ అవడానికి ఓ రెండు రోజులయినా పడుతుంది. అందుకే అలాంటి వ్యాయామాలు రోజు విడిచి రోజు చెయ్యమంటారు. అలాగే వారానికి ఓ రెండు రోజులు విశ్రాంతి ఇమ్మంటారు. అప్పటికీ మానని కండరాల ఇబ్బందులు ఏమయినా వుంటే ఇలా అయిదు ఆరు వారాల కొకసారి ఓ వారం జిమ్ముకి వెళ్ళకుండా వుంటే అవి పూర్తిగా విశ్రాంతి పొంది బాగా పుంజుకుంటాయి. మళ్ళీ ఉవ్విళ్ళూరుతూ వెయిట్ లిఫ్టింగ్ మొదలు పెట్టవచ్చు. అలా కాకుండా వరుసగా బరువులు ఎత్తుతూపోతే కండరాలు అలవాటు పడిపోయి వృధా శ్రమ తప్ప పెద్దగా ప్రయోజనం వుండదు.
ఇలా వ్యాయామం చెయ్యని సమయాన్ని ఎంచక్కా ఎప్పటినుండో వాయిదా వేస్తున్న ఇతర పనులు చక్కపెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా వ్యవధి ఇస్తేనే మళ్ళీ జిమ్ముకి వెళ్ళేది ఎప్పుడా అని ఆత్రంగా వుంటుంది. మళ్ళీ జిమ్ముకా అనే నిరాసక్తత వుండదు. నాకయితే ఫుల్లు స్వింగులో వున్న ఎక్సర్సైజుకి ఇలా గ్యాప్ ఇవ్వాల్సిరావడం అసహనంగా వుంది. మళ్ళీ ఎప్పుడు జిమ్ము గడప ఎక్కాలా అని ఆత్రంగా వుంది. ఈ ఆత్రాన్ని పెంచడానికేనేమో అలా ఓ వారం దూరంగా వుండమంటారు. ఆలుమగల మధ్య ఆషాఢమాసం లాగా నాకు ఈ వారం వ్యవధి తయారయ్యిందన్నమాట. ఈలోగా ఎంచక్కా నా బరువు టార్గెట్ సాధించొచ్చు. ఇప్పుడు 56 కిలోలు వున్నాను. ఈ వారాంతం లోగా ఇంకో రెండు కిలోలు పెరగాలి.





















