మగాళ్ళు మూడు రకాలు

స్త్రీల శరీరంలో ఎక్కువగా పురుషులకి ఏం నచ్చుతుంది అనే దాన్ని బట్టి పురుషులని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. తల: వీరికి స్త్రీ తల భాగం కానీ తలలోని ఒక భాగం అనగా కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, దంతాలు కానీ,  శిరోజాలు కానీ, మెడ కానీ బాగా నచ్చుతాయి. నా మిత్రుల్లో ఒకరికి శిరోజాలు బాగా నచ్చుతాయి.

2. బాడీ:  వీరికి స్త్రీ శరీరం (తల మరియు పాదాలు మినహా) కానీ లేదా అందులోని ఏ భాగం అయినా కానీ నచ్చవచ్చు. స్థనాలు, నడుము, వీపు, పిరుదులు, తొడలు, కాళ్ళు వగైరాలలో ఏదయినా వీరికి విపరీతంగా నచ్చవచ్చు.

3. పాదాలు: వీరికి స్త్రీల పాదాలు అంటే మహా ఇష్టం

అలా అని పై వర్గాల వారికి కేవలం అవే నచ్చుతాయని కాదు కానీ వాటిని మాత్రం అన్నింటికంటే బాగా ఇష్టపడుతారు. 

నాకు స్త్రీల పాదాలు అంటే బోలెడంత ఇష్టం. అయితే చాలామంది స్త్రీల పాదాలు బావుండవు - కొద్ది మందివి మాత్రమే బావుంటాయి. అందంగా వున్నంత మాత్రాన అందమయిన పాదాలు వుండాలని ఏమీ లేదు. నేను పెళ్ళి చేసుకున్నప్పుడు కూడా పెళ్ళి చూపుల్లో పాదాలు కనిపిస్తాయేమోనని చూసేవాడిని కానీ ఆ అవకాశం రాలేదు - మనమేమో సిగ్గు విడిచి అడగలేం. మీరు మరీనూ! ఎలా అడుగుతారండీ అలా? 

నాకు పెళ్ళి సంబంధం కుదిరినప్పుడు నా కాబోయే భార్య పాదాలు బావుండాలని వెయ్యి నాస్తిక దేవుళ్ళకి (?) మొక్కుకున్నాను. ఏ నాస్తిక దేవుడో (!) కరుణించాడనుకుంటా. పెళ్ళి రోజు చూసాను - సూపర్ అంటే సూపరూ! ఇంకేం ఇహ ఇంట్లో నా చూపులెప్పుడూ అటువైపే :) అతిగా అవకాశం ఇస్తే పాదాలు పలుచన అయిపోతాయనేమో ఎక్కువ భాగం కప్పివేయబడేవుంటాయి - కోపం చెందినప్పుడయితే మరీనూ :(

మీరు ఏ టైపు పురుషులో చెప్పుకోండి చూద్దాం!

బ్లాగిల్లు బావుంది


బ్లాగిల్లు సంకలిని http://www.blogillu.com/  బావుంది. హారం మూతపడ్డ తరువాత కూడలి మాత్రమే చూస్తూ వస్తున్నాను.  అది పెద్దగా నచ్చకపోయినా అలాగే నెట్టుకుంటూవచ్చేస్తున్నా కానీ ఈమధ్య బ్లాగిల్లు, బ్లాగు వేదిక ఎలా వుంటాయో చూసాను. అందులో బ్లాగిల్లు నచ్చింది. నచ్చడానికి మరో కారణం వ్యాఖ్యల సైటు వుండటం కూడానూ. అయితే కొంతమంది ఈమధ్య విమర్శిస్తున్నట్లుగా రెండు మూడు బ్లాగుల నుండే ఎక్కువ వ్యాఖ్యలు కనపడుతూ చిరాకు అనిపిస్తోంది. కొంతమంది సూచించినట్లుగా వీలయితే ఆ బ్లాగులకు/సైట్లకు ఒకవైపు జాగా కెటాయించడం ద్వారా ఆ సమస్య పరిష్కరించవచ్చనుకుంటా.

వార్తలూ, సినిమా వార్తలూ, కాపీ అండ్ పేస్ట్ బ్లాగులను నిరోధిస్తే బ్లాగిల్లు ఇంకా బావుంటుంది.

చదువుతున్నా... The Happiness Trap పుస్తకం

రుణాత్మక ఆలోచనల (నెగటివ్ థాట్స్) విషయమై కొంతకాలం క్రితం వరకు వచ్చిన చాలా పద్ధతులు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లాంటివి ఆయా ఆలోచనలను నిరోధించి మన మనస్సు నమ్మినా నమ్మకపోయినా ధనాత్మక ఆలోచనలను ఆలోచిస్తుండాలని చెబుతాయి. అలా చెప్పుకోగా చెప్పుకోగా మన మనస్సు ఆ పాజిటివ్ థాట్స్ ను విశ్వసించి మనలో మెరుగుదలకు తోడ్పడతాయి అని చెబుతాయి.

కొన్నేళ్ళ క్రితమే వచ్చిన ఏక్సె్‌ప్టాన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ (ACT) అలా మనస్సుతో యుద్ధం చెయ్యడం వల్ల లాభం లేదనీ, అలా చెయ్యడం మన శక్తి యుక్తులని వృధా చేసుకోవడమే అనీ,  మన మనస్సుతో రాజీపడాలనీ చెబుతుంది. ఇలా ధనాత్మకంగా ఆలోచించగానే అలా మన మనస్సు ప్రభావితం కాదనీ, అది చాలావరకు వృధా ప్రయత్నం అని చెబుతుంది. అందుకు బదులుగా ఆయా ఆలోచనల మీద యుద్ధం మానివేసి వాటిని యథాతథంగా ఆమోదించేసి ఇహ వాటిని పెద్దగా పట్టించుకోకుండా డిఫ్యూజ్ చేసివేస్తూ మన విలువల ప్రకారం, లక్ష్యాల ప్రకారం అడుగు వేస్తూ పోవడమే ఉత్తమం అంటుంది. 

నా వరకు CBT కంటే ACT కన్విన్సింగుగా వుండి దానికి సంబధించిన పుస్తకాలు చదువుతున్నా. మిగతాకొన్ని రుగ్మతలతో పాటుగా  మైల్డ్ మరియు మోడరేట్ మానసిక కృంగుబాటు వున్నవారికి CBT, ACT, తదితర పద్ధతులు ఉపకరిస్తాయి. క్లినికల్ కృంగుబాటు వున్నవారికి మందులతో పాటు ఈ పద్ధతులు ఉపకరిస్తాయి. నేను చదువుతున్న పుస్తకం వర్శన్ ఇల్లస్ట్రేటెడ్ కాబట్టి కామిక్స్ చదివినట్లుగా సరదాగా వుంది. నెగెటివ్ థాట్స్ తో ఇబ్బంది పడుతున్న ఎవరయినా ఇలాంటి పద్ధతులు పాటించి ఆలోచనా విధానాన్ని మార్చుకోవచ్చు.

ఆ పుస్తకం యొక్క అమెజాన్ లింక్ ఇది. ఇక్కడ ఆ పుస్తకం యొక్క సమీక్షలు కూడా మీరు ఇక్కడ చదవవచ్చు:
 

ధ్యానం చేస్తున్నా అంటే ఇంట్లో వాళ్ళు నమ్మరే!

నాకు యోగాసనాల్లో ఇష్టమయినది శవాసనం. ధ్యానం కూడా ఇష్టమే. అందుకే ఆ రెండింటినీ కలిపి (కలిపితే శవధ్యానం అవుతుందంటారా?) మొదలెడుతుంటాను...కాస్సేపటికి బజ్జుంటాను! అందుకే నేను ధ్యానం అనగానే కునుకు తీయడానికో అదో చిన్న సాకు అని ఇంట్లో వాళ్ళు వెక్కిరిస్తుంటారు.

ధ్యానం కోసం మాంఛి మ్యూజిక్ కోసం యూట్యూబులో చూస్తే గంటల కొద్దీ మెడిటేషన్ మ్యూజిక్ వున్న వీడియోలు ఎన్నో వున్నాయ్. అందులో మళ్ళీ ఎన్నో రకాలు. కొన్ని మ్యూజిక్ వీడియోలు అయితే 8 గంటలకి పైగానే వున్నాయి. గత రాత్రి ఎన్నో సంగీతాలు వింటూ పరిశీలించాను. బౌద్ధ సన్యాసులు పఠించే ఓంకార నాదం విన్నవాటిల్లో అన్నింటికికన్నా బాగా అనిపించింది. మంద్ర స్వరంతో - వేదఘోషలా బావుంది. అది నిద్రా ధ్యానం కోసం అటా. అయినా సరే నిన్న రాత్రి పెద్దగా నిద్ర పట్టలేదు. వేదఘోష కూడా యూట్యూబులో దొరుకుతుందేమో చూడాలి. గాయత్రీ మంత్రం ఇంకా కొన్ని మంత్ర మ్యూజిక్కులూ కనిపించాయి కానీ ఇంకా వినలేదు. పనిలో పనిగా కొద్దిగా తంత్ర సంగీతం కూడా వినేసా ;)

ప్రకృతి సంగీతాలు కూడా వున్నాయి. అడవి శబ్దాలూ, జలపాతాల జారుడులూ, వర్షపు చినుకుల సవ్వడులూ, పక్షుల కువకువలూ వగైరాలూ. రాత్రి వర్షం పడింది. చినుకుల సవ్వడి వింటూ వుంటే బావుంది కానీ కృత్రిమ వర్షం వినాలా సహజ శబ్దాలు వినాలా అన్న మీమాంసతో రెండూ వింటూ నిద్రపోవడానికి ప్రయత్నించా కానీ పట్టలేదు. మనస్సు హుశారుగా వుంది - అందుకేనేమో. ఎందుకా హుశారో నాకు తెలుసు.

మెడిటేషన్ కోసం మీకేమయినా మాంఛి మ్యూజిక్కు తెలిస్తే మాకూ చెబుదురూ. ఆమధ్య ఏదో సంగీతం విన్నా - భలే అనిపించింది కానీ వివరాలు మరచిపోయాను. మళ్ళీ వెతకాలి.

అర్ధరాత్రి అర్జంట్ కాల్

గతరాత్రి పన్నెండుగంటల తరువాత మా ఫోన్ మ్రోగసాగింది. ఎత్తాను. మా అమ్మాయితో మాట్లాడవచ్చా అని అటువైపునుండి ఓ మహిళ కంఠం. ఆదివారం రాత్రి అంత అర్జంటుగా ఏం మాట్లాడాలబ్బా అనుకుంటూ మీరు ఎవరు అని అడిగాను. "...పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మాయితో మాట్లాడాలి" అంది. ఇదేమన్నా ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను. గతంలో ఒకసారి కెనడాలో వున్నప్పుడు ఇలాగే అర్ధరాత్రి ఒక ప్రాంక్ కాల్ వచ్చిన విషయం గుర్తుకువచ్చింది. మా పాప పడుకుంది అని చెప్పాను. మీరు తన తండ్రా అని అడిగింది ఆమె. అవును అని చెప్పాను. "మీ పాప స్నేహితురాలు ... గతకొన్ని గంటల నుండి తప్పిపోయింది. వెతుకుతున్నాం. ఆ అమ్మాయి తరచుగా మీ పాపకి ఫోన్ చేస్తుంటుంది కాబట్టి మీ పాపకి ఏమయినా తెలుసేమో అని ఫోన్ చేస్తున్నాం" అని ఆ పోలీస్ ఆఫీసర్ అంది. మీ ఇంటికి ఈరోజు ఏమయినా వచ్చిందా అంటే రాలేదు అని చెప్పాను. ఏమయినా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషనుకి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి పెట్టేసింది. 

ఆ అమ్మాయి ఆఫ్రికన్ అమెరికన్. వయస్సు పదకొండు లేదా పన్నెండు. మా పాపకి వున్న మంచి స్నేహితురాళ్లలో ఆమె ఒకరు. నన్ను చక్కగా మిస్టర్ అంటూ మా ఇంటి పేరుతో పిలుస్తుంటుంది. మా పాప పొద్దున లేచాక నిన్న ఏమయినా అమ్మాయి తనను కాంటాక్ట్ చేసిందేమో కనుక్కున్నా. లేదని చెప్పింది. విషయం క్లుప్తంగా చెప్పి స్కూల్ కి వెళ్ళాక ఆ అమ్మాయి వివరాలు ఏమయినా తెలుస్తాయేమో కనుక్కొమ్మని చెప్పాను. ఆ అమ్మాయి దొరికిందా లేదా అని కనుక్కోవడానికి ఆమె తల్లి ఫోన్ నంబర్ మా దగ్గర లేదు. తండ్రి విడాకులు తీసుకున్నాడు. ఎక్కడవుంటాడో మాకు తెలియదు.  

ఆ అమ్మాయి క్షేమమేనని, దొరికేసివుంటుందని ఆశిద్దాం.

సిక్కయ్యానోచ్!


Medical Flat Boot

పాశ్చాత్య జీవనంలో ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే సులభంగా అనారోగ్యం రాకపోవడం. సాధారణ అనారోగ్యం వచ్చినా ఒక పూటో, ఒక రోజో వుంటుంది అంతే. కాస్త నలతగా అనిపించి సిక్ లీవ్ తీసుకున్నా కూడా ఒక రోజుకన్నా ఎక్కువ అలా తీసుకోవడానికి మొహమాటంగా వుంటుంది. నిజంగా అనారోగ్యానికి గురి అయ్యి సిక్ లీవ్ ఒక్క రోజు తీసుకున్నా అది బోగస్ అనే సాధారణంగా ఆఫీస్ ప్రజలు అనుకుంటారని అంటారు.  అదే ఇండియాలో వున్నప్పుడు అయితే తరచుగా జ్వరాలు వచ్చేవి - ఓ వారం అయినా వుండేవి. అన్నిరోజులు మనం దర్జాగా గడుపుతూవుంటే ఇంట్లో వారు సపర్యలు చేసేవారు. జరుగుబాటు వుండే జ్వరం వచ్చినంత సుఖం లేదని సామెత కూడా వుంది కదా.
 
ఈ దేశాలకు వచ్చిన తరువాత 1999 డిసెంబరులో కెనడాలో ఓ సారి ఫ్లూ వచ్చి ఓ పది రోజులు ఆఫీసుకి వెళ్ళలేకపోయాను కానీ జరుగుబాటు జరగలేదు :( కారణం మా పాప స్కూల్లో ఫ్లూ తగిలించుకొని వచ్చి నాకూ, మా ఆవిడకీ, మా ఇంట్లోనే అప్పుడు వున్న మా మేనల్లుడికీ అంటించింది.  అప్పుడు నాకు ఫ్లూ వాక్సిన్ల గురించి అవగాహన లేదు. ముందుగా మూడురోజుల్లో కోలుకుంది నేనే. కిందామీదా పడి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని ఇంట్లోవారికందరికీ నేనే సపర్యలు చేసి వారిచేత సెబ్బాస్ అనిపించుకున్నా :(  అలా నేను బాగా సిక్కయ్యానన్న ఆనందం ఆవిరి అయ్యింది. ఆ తరువాత కొన్ని నెలల క్రితం ఓ చిన్న సర్జెరీ అయి కొద్దిరోజులు ఇంట్లోనే వున్నాను.
 
మళ్ళీ ఇన్నాళ్లకి కాస్తంత కాలం అనారోగ్యం కలిగింది. గతవారం ఒకరోజు రాత్రి కాలు నొప్పిగా అనిపించి ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందబ్బా అని బుర్ర గోక్కుని జ్ఞాపకాలు రివైండ్  చేసుకొని చూసుకుంటే ఓ రెండు రోజుల క్రితం నా కుడి పాదానికి బాత్రూం తలుపు తగిలి స్వల్పంగా నొప్పి అనిపించడం గుర్తుకువచ్చింది. హోం రెమెడీస్ నడిపిస్తూ స్వల్పంగా కుంటుకుంటూ ఆఫీసుకి రెండు రోజులు అలాగే వెళ్ళాను. మూడో రోజు రాత్రికి వాచిపోయింది! నన్ను నడవనియ్యలేదు. ఆఫీసు ఎగ్గొట్టి గాభరాగా డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అతను మరింత గాభరాగా బొటనవేలి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందేమో అన్నాడు. ఎక్స్-రేలకు వ్రాసాడు. మరీ బాత్ రూం తలుపు తగిలినంతనే పాదం ఫ్రాక్చర్ అవుతుందా అనుకున్నా.  పాదం వంగకుండా మెడికల్  ఫ్లాట్ బూట్ ఓ వారం వాడమన్నాడు! ఫ్రాక్చర్ అయితే నెలన్నర వాడాలి అన్నాడు. అదే అయితే కనుక క్రచెస్ కూడా వాడాల్సివుంటుంది అన్నాడు. అవన్నీ వేసుకొని ఆఫీసుకి వెళ్ళాల్సి వుంటుంది. ప్రస్థుతానికి ఓ వారం ఆఫీసుకి వెళ్ళకుండా పాదానికి విశ్రాంతి ఇవ్వమన్నాడు. 
 
అదేరోజు ఎక్స్-రే ఫలితాలు వచ్చాయి. ఫ్రాక్చర్ ఏమీ లేదు. సంతోషం. మా డాక్టర్ పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెప్పి నొప్పి తగ్గటానికి కొన్ని హెర్బల్ మందులు సూచించాడు. పాదానికి పసుపు పట్టించమన్నాడు. పసుపు రోజూ ఓ మూడు చెంచాలు పాలల్లో వేసుకొని తాగమన్నాడు. మా వైద్యుడు డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతీ లెండి.  వాటికి తోడుగా హీట్ ప్యాడ్, కూల్ ప్యాడ్ లు వాడుతున్నాను. నొప్పి, వాపు రోజురోజుకీ స్వల్పంగా తగ్గుతున్నాయి. వచ్చేవారం కల్లా పూర్తిగా నయం అవచ్చు. ఈ వారం అంతా మెడికల్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ క్రింద ఇంట్లోనే వుంటున్నా. అదండీ సంగతి.

మా మామగారి ఆశ్రమం!


ఇది అచలాశ్రమం ఫోటో కాదు
 
 
పెళ్ళికి ముందు: అప్పట్లో డిస్టర్బుడ్ గా వున్న రోజుల్లో ఏ ఆశ్రమంలో నయినా కొన్ని నెలలు తలదాచుకుంటే బావుంటుందనుకునేవాడిని. ఒకరోజు మా మిత్రుడి పనిమీద అతనితో కలిసి మా టవునుకి కొంత దూరంలో వున్న ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో అచలాశ్రమం పేరిట చక్కటి ప్రదేశం కనిపించింది. అందులో చేరితే బావుండును అనుకున్నా కానీ తీరికలేకనో ఎందుకో లోపటికి వెళ్ళి వివరాలూ కనుక్కోలేదూ - అందులో చేరనూ లేదు - ఎందులోనూ చేరలేదు.
 
పెళ్ళి అయిన తరువాత: మా అత్తగారిది అదే ఊరు. చిత్రంగా ఆ ఆశ్రమం మా మామగారిదే. వారే అచల మార్గ బోధకులు. నాకు నవ్వొచ్చింది. పెళ్ళికి ముందు ఆ ఆశ్రమంలో చేరివుంటే నా కాబోయే భార్యకి సైటు కొట్టి వుండేవాడినేమో. మా అత్తగారి ఇల్లు ఆ ఆశ్రమానికి చాలా దగ్గర్లో వుంటుంది మరీ!
మామగారు దేశమంతా తిరుగుతూ అచల బొధ చేస్తుంటారు. నా పెళ్ళయిన కొత్తలో నాకు చాలా బోధించాలని చూసారు కానీ నాకు ఎక్కక తిక్కగా అనిపించేది. నాకీ బోధలు వద్దు మహాప్రభో అని ఒకసారి స్పష్టంగా చెబితే ఇహ అప్పటినుండీ వదిలేసారు. కొద్దిసేపంటే భరించవచ్చు కానీ గంటలకు గంటలు ఆ బోధ ఎవరు భరిస్తారు చెప్పండి? అసలే కొత్తగా పెళ్ళయిన రోజులాయే - మనస్సు మరెక్కడో వుంటుంది కాదా?  
 
ఒకరోజు అందరం కలిసి ఆ ఆశ్రమానికి వెళ్ళాం. చిన్న ఆశ్రమం - అసలు దానికి ఆశ్రమం అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు - చిన్న మందిరం అది కానీ చక్కగా చిన్న చిన్న చెట్లు మొక్కలతో ప్రశాంతంగా వుంది. అందులో అచల గురువుల విగ్రహాలు వున్నాయి. ఒక భక్తురాలు అందులో వుంటూ ఆ ఆశ్రమానికి సేవలు చేస్తుంటుంది. ఆమె వుండటానికి ఓ రెండు గదుల నివాస ప్రదేశం మందిరం పక్కనే వుంది. ఇంకా ఎవరయినా వచ్చి ఆ ఆశ్రమంలో గడుపుతామంటే వీలవుతుందో లేదో. అంతకూ ఎవరయినా వస్తే మరెక్కడన్నా బస కల్పిస్తారేమో.  
 
మా మామగారు మా దగ్గరికి (యుఎస్ కి) వచ్చినప్పుడు నన్ను అచల మార్గ అమెరికా శాఖాధిపతిగా నియమిద్దామనుకున్నారు కానీ ఎక్కడా వారి బోధనలకు నేను దొరికితే కదా. నాగురించి వారికి అంతా తెలియదు పాపం. వారిది అచలమార్గం అయితే నాది చలమార్గం (రచయిత చలం)  అని క్లుప్తంగా చెప్పి తప్పించుకున్నాను. అయితే మా మామగారూ, తన మామగారూ కలిసి మా పొరుగింటాయనకు గంటల కొద్దీ బోధించేవారు. వాళ్ళ మామగారిది సహజమార్గం. మా నైబర్ కాస్త మొహమాటస్థుడు అని మీకు అర్ధమయ్యే వుంటుంది. 

శాంతి ఆశ్రమం నుండి ఉత్తరాలు


ఇరవై ఏళ్ళ క్రితం దివ్యా వీడ్ అనే అమెరికన్ తన తల్లితండ్రులకు శాంతి ఆశ్రమం నుండి వ్రాసిన ఉత్తరాలు ఇంటర్నెట్ లో పెట్టింది. నిన్ననే ఆ ఉత్తరాల సంకలనం పూర్తి చేసాను. చక్కగా అనిపించాయి ఆమె వ్రాతలు. ఒక అమెరికన్ దృష్టికోణంలో ఇక్కడి ఆశ్రమ అనుభవాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. ఈ ఆశ్రమం కాకినాడకి రెండుగంటల దూరంలో (పీఠాపురానికి గంట దూరం అనుకుంటా) తొటపల్లి హిల్స్ గ్రామలో వుంటుంది.

http://www.wattpad.com/user/DivyaWeed

నాకు దేవుడు, మోక్షం వగైరాల మీద ఇంకా విశ్వాసం లేదు కానీ సెక్యులర్ స్పిరిచువాలిటీ (లౌకిక ఆధ్యాత్మికత అనొచ్చా?) మీద ఆసక్తి బహుమెండు. భక్తి లేదు కానీ ప్రార్ధనలు, భజనలు, ధ్యానం అంటే ఇష్టం.   ఎంటో ఈ ద్వైదీ భావాలు. నేనెప్పుడు నాకు అర్ధం అవుతానో ఏంటో. శాంతి ఆశ్రమం గురించి చదివా కాబట్టి దాని గురించి వివరాలు సేకరిస్తున్నాను. ఇవాళే ఆ ఆశ్రమ నిర్వాహకులు అంజనేయులు గారికి ఫోన్ చేసాను. ఒక రెండు వారాలు వుంటాను అని అన్నాను. జూన్, జులైలో అక్కడ కాస్త వేడిగా వుంటుంది కాబట్టి కోటగిరి ఆశ్రమం నాకు బావుండగలదని తెలిపారు. దివ్య రచనలు చదవడం వల్ల నాకు కోటగిరి ఆశ్రమం గురించి తెలుసు. ఊటీకి దగ్గర్లోని పర్వత ప్రాంతం అది. శాంతి ఆశ్రమం శాఖ అక్కడ వుంది. నాకు ఆశ్రమాలే నచ్చుతాయనుకుంతే పర్వత ఆశ్రమాలు ఇంకా బాగా నచ్చేస్తాయి. కానీ అక్కడికి ఆశ్రమ వాసం పేరిట వచ్చే ధనవంతులయిన యాత్రీకులే ఎక్కువని దివ్య తన ఉత్తరాల్లో వివరించింది.

http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india


ఇహపోతే ఆశ్రమ వాసం అంతా ఈసారి ఒక్క ఆశ్రమంలో చెయ్యాలా లేక వారానికో ఆశ్రమం తిరగాలా, ఒక్కడినే వెళ్ళాలా లేక కుటుంబంతో వెళ్ళాలా లేక ఆసక్తి చూపించే బంధుమిత్రులు ఎవరయినా వుంటే వారితో కలిసి వెళ్ళాలా అనేవి నా ధర్మ సందేహాలు. 

శాంతి ఆశ్రమానికే తప్పనిసరిగా వెళతా అని కాదు. ఇంకా మిగతా ఆశ్రమాల వివరాలు కూడా సేకరిస్తాను. ఇలా ఆశ్రమవాసం మీద ఆసక్తి చూపిస్తున్నా అని పూర్తిగా సన్నాసి అయిపోయా అనుకోకండి. దేనిదారి దానిదే సుమీ. ఒక్కోక్కప్పుడు ఒక్కోదానిమీద ఆసక్తి మెండుగా వుంటుందంతే.

మంచి ఆశ్రమాలు సూచించండి


రెండు మూడు నెలల తరువాత ఓ నెల కోసం నేను ఇండియా వచ్చే అవకాశాలు వున్నాయ్. ఆ సమయంలో వీలయినంత వరకు చక్కని ఆశ్రమాలలో ప్రకృతికి, ప్రశాంతతకు దగ్గర్లో నివసించాలని వుంది. అలా అని డబ్బులు బాగా వసూలు చేసే సంస్థలు వద్దు.   నిరాడంబరంగా వుండే, వ్యాపార ధోరణి లేని ఆశ్రమాలు సూచిద్దురూ. నెట్టులో వెతికితే కొన్ని కనపడ్డాయి కానీ మీకు తెలిసినవి మరి కొన్ని వుండొచ్చు కదా అని ఈ విధంగా కోరుతున్నాను.

ఈ సారికి మాత్రం తెలుగు ప్రాంతం ఆశ్రమాలే దర్శించదలుచుకున్నాను. 

శాంతి ఆశ్రమం గురించి దివ్యా వీడ్ వ్రాసిన ఉత్తరాలు ప్రస్థుతం చదువుతున్నాను:
http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india

...And Then There Were None


...పుస్తకం చదువుతున్నా. వ్రాసిందెవరనుకున్నారు? అగాధా క్రిస్టీ. ఆమె మిస్టరీ నవలలు చిన్నప్పుడెప్పుడో కొన్ని చదివాను. చిన్నప్పుడు డిటెక్టివ్, మిస్టరీ నవలలు చాలా చదివేవాడిని లెండి.  మళ్లీ చాలాకాలం తరువాత ఆమె రచన చదవడం.  ఇప్పటికి ఆ పుస్తకం కొన్ని పేజీలు చదివా. ప్లాట్ నెమ్మదిగా బిగుస్తోంది. అందులోని పాత్రలన్నీ ఇండియన్ దీవికి చేరుకుంటాయి. ఆ తరువాత ఏమవుతుందో నాకు ఇంకా తెలియదు. ఎప్పుడెప్పుడు తరువాయి పేజీలు చదివెయ్యాలా అని ఆతృతగా వుంది.

ఈమధ్య గుడ్ రీడ్స్ డాట్ కాం వాళ్ళు జీవితంలో చదివెయ్యాల్సిన 100 పుస్తకాలు ప్రకటించారు. అందులో కొన్ని అయినా చదివెయ్యాలి అని కంకణం కట్టుకున్నా.  అందులో సూచించిన పుస్తకం ఇది.ఈ లిస్టులో మీరు చదివేసిన, నచ్చిన పుస్తకాలు వుంటే సూచిద్దురూ. వీలయితే తెప్పించుకుని చదివేస్తాను.

http://www.goodreads.com/list/show/69635

అన్నట్లు ఈ పుస్తకం నేను చదివాక ఎవరికయినా కావాలా? US లో వున్నవారు అడ్రసు చెబితే అందులో ఒకరికి బుక్ పోస్ట్ చేస్తాను. బదులుగా మీరు కూడా ఓ పుస్తకం వీలయితే నాకు పంపిద్దురూ.