ఇది అచలాశ్రమం ఫోటో కాదు
పెళ్ళికి ముందు: అప్పట్లో డిస్టర్బుడ్ గా వున్న రోజుల్లో ఏ ఆశ్రమంలో నయినా కొన్ని నెలలు తలదాచుకుంటే బావుంటుందనుకునేవాడిని. ఒకరోజు మా మిత్రుడి పనిమీద అతనితో కలిసి మా టవునుకి కొంత దూరంలో వున్న ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో అచలాశ్రమం పేరిట చక్కటి ప్రదేశం కనిపించింది. అందులో చేరితే బావుండును అనుకున్నా కానీ తీరికలేకనో ఎందుకో లోపటికి వెళ్ళి వివరాలూ కనుక్కోలేదూ - అందులో చేరనూ లేదు - ఎందులోనూ చేరలేదు.
పెళ్ళి అయిన తరువాత: మా అత్తగారిది అదే ఊరు. చిత్రంగా ఆ ఆశ్రమం మా మామగారిదే. వారే అచల మార్గ బోధకులు. నాకు నవ్వొచ్చింది. పెళ్ళికి ముందు ఆ ఆశ్రమంలో చేరివుంటే నా కాబోయే భార్యకి సైటు కొట్టి వుండేవాడినేమో. మా అత్తగారి ఇల్లు ఆ ఆశ్రమానికి చాలా దగ్గర్లో వుంటుంది మరీ!
మామగారు దేశమంతా తిరుగుతూ అచల బొధ చేస్తుంటారు. నా పెళ్ళయిన కొత్తలో నాకు చాలా బోధించాలని చూసారు కానీ నాకు ఎక్కక తిక్కగా అనిపించేది. నాకీ బోధలు వద్దు మహాప్రభో అని ఒకసారి స్పష్టంగా చెబితే ఇహ అప్పటినుండీ వదిలేసారు. కొద్దిసేపంటే భరించవచ్చు కానీ గంటలకు గంటలు ఆ బోధ ఎవరు భరిస్తారు చెప్పండి? అసలే కొత్తగా పెళ్ళయిన రోజులాయే - మనస్సు మరెక్కడో వుంటుంది కాదా?
ఒకరోజు అందరం కలిసి ఆ ఆశ్రమానికి వెళ్ళాం. చిన్న ఆశ్రమం - అసలు దానికి ఆశ్రమం అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు - చిన్న మందిరం అది కానీ చక్కగా చిన్న చిన్న చెట్లు మొక్కలతో ప్రశాంతంగా వుంది. అందులో అచల గురువుల విగ్రహాలు వున్నాయి. ఒక భక్తురాలు అందులో వుంటూ ఆ ఆశ్రమానికి సేవలు చేస్తుంటుంది. ఆమె వుండటానికి ఓ రెండు గదుల నివాస ప్రదేశం మందిరం పక్కనే వుంది. ఇంకా ఎవరయినా వచ్చి ఆ ఆశ్రమంలో గడుపుతామంటే వీలవుతుందో లేదో. అంతకూ ఎవరయినా వస్తే మరెక్కడన్నా బస కల్పిస్తారేమో.
మా మామగారు మా దగ్గరికి (యుఎస్ కి) వచ్చినప్పుడు నన్ను అచల మార్గ అమెరికా శాఖాధిపతిగా నియమిద్దామనుకున్నారు కానీ ఎక్కడా వారి బోధనలకు నేను దొరికితే కదా. నాగురించి వారికి అంతా తెలియదు పాపం. వారిది అచలమార్గం అయితే నాది చలమార్గం (రచయిత చలం) అని క్లుప్తంగా చెప్పి తప్పించుకున్నాను. అయితే మా మామగారూ, తన మామగారూ కలిసి మా పొరుగింటాయనకు గంటల కొద్దీ బోధించేవారు. వాళ్ళ మామగారిది సహజమార్గం. మా నైబర్ కాస్త మొహమాటస్థుడు అని మీకు అర్ధమయ్యే వుంటుంది.
No comments:
Post a Comment