మా చిన్నదానికి దయ్యాల భూతాల సినిమాలంటే చాలా ఇష్టం. పోనీ అది ఒక్కతే చూస్తుందా, అబ్బే గజగజ ఒణుకుతూ నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని కావలించుకుంటుంది. మరె దయ్యాలంటే నాక్కూడా భయం కదా. నేనూ గజగజా వణుకుతూ వుంటాను. ఇద్దరం అలా వణికేస్తూ ఆ సినిమాలు చూసేస్తుంటాం. సినిమా అంతా చూసేకా 'నిజ్జంగా దయ్యాలున్నాయా డాడీ' అని అడుగుతూ వుంటుంది. లేవు అని చెబుతుంటాను. 'మరి అవి లేనప్పుడు మరి అవంటే నీకు ఎందుకంత భయం' అని అడుగుతుంది. "దయ్యాలు లేవని నాకు తెలుసు కానీ వాటికి తెలియదు కదా" అని సమాధానం ఇస్తుంటాను.
పైన నేను కూడా వణుకుతూ చూస్తున్నట్లు వ్రాసా కదా. సరదాగా అలా వణికినట్లు నటిస్తూవుంటా అంతే. నిజం అనుకునేరు. ఏం నమ్మట్లేదా?
అప్పట్లో ఇండియాలో 'ఓ స్త్రీ రేపు రా' అని కొంతమంది తమ గోడల మీద వ్రాస్తున్నారని విని మా గోడ మీద 'ఓ స్త్రీ ఇవాళే రా!' అని వ్రాసేవాడిని. వచ్చేదేదో కామినీ పిశాచం అయివుండాలని ఆశించేవాడిని కానీ ఎవరూ రాలా. ప్చ్.
నా చిన్నప్పుడు మా ఇంట్లో కిరాయికి వుండే మాస్టారు మాకందరికీ నిజంగా జరిగిన సంఘటణలు అంటూ చాలా చాలా దయ్యాల కథలు చెప్పేవాడు. మా నాన్నేమో ఆ కథలన్నీ నమ్మవద్దని నాకు చెప్పేవాడు. ఎవరి మాటలు నమ్మేదీ? చివరికి ఎందుకయినా మంచిదని ఇద్దర్నీ కాదని దయ్యాల్నే నమ్మడం మొదలెట్టా. అర్ధరాత్రి రెంటికి వస్తే చచ్చే చావొచ్చేది.
సి బి రావు గారు వ్రాసిన ఆమె ఎవరు? పోస్టు చూసాక ఇవన్నీ గుర్తుకు వచ్చాయి.
అవునూ ఈ పోస్ట్ మీరు ఒక్కరే చదువుతున్నారా లేక పైన ఫోటోలోలాగా అదృశ్యంగా ఇంకెవరయినా మీ పక్కనే వుండి ఈ టపా చదుతున్నారా? కామెంటెయ్యమని తనకి చెప్పండి మరి.







