మా ఇంట్లో మగ పార్టీ

ఇదండీ మా లోకల్ మిత్రులకు పంపించిన ఆహ్వానం. ఇది మీకు అందరికీ ఆహ్వానం అనుకునేరు. మా స్నేహితులకి పంపిన ఈమెయిల్ ను ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా అంతే. కొద్దివారాల్లో సఫారీ సప్పర్ ఏర్పాటు చెయ్యాలనే వుద్దేశ్యం కూడా వుంది. అది మా అందరికోసం లెండి - కేవలం మగవారికోసం కాదు. ఇంకా ఇలాంటివి పరస్పర కుటుంబ కాలక్షేపం కోసం ఏమేం చెయ్యొచ్చో లేదా మీరేం చేస్తుంటారో తెలియజేస్తే మేము కూడా అవి ప్రయత్నిస్తాము.  
"For maga males eyes only!!

Gents night out, Potluck (with BYOB)

... రాత్రి ని మన అందరికోసం (అనగా మగ జెంట్స్ కోసం) మా ఇంట్లో డిసైడ్ చేసిన. పండగ చేసుకుందం రండ్రి.  ఆడ పురుగు కూడా మన మధ్య జొరబడ్డానికి వీల్లేదు.  ఆడలేడీస్ మన ముచ్చట్లు దొంగ చాటుగా ఎక్కడినుండన్నా వినకుండా బగ్స్ ఏమయినా పెడితే స్వీప్ చేస్తాలెండి. మా ఇంట్లో ఆ రోజు నేను తప్ప ఎవరూ వుండరు కబట్టి  మా చిన్ని ఇల్లు అంతా మనదే. 

ఓ కూరో, అన్నమో, సలాడో, కుకీసో, చిప్సో, బర్గర్లో, పిజ్జానో ఎదో ఒహటి అందరం తినడానికి పట్రండి. అలాగే ఎవరి డ్రింక్ వాళ్ళు తెచ్చుకోండి. తిని, తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యాలు ఆ రాత్రికి మానుకోండి. ఎంచక్కా మా ఇంట్లోనే విశ్రమించండి లేదా తెల్లార్లూ తాగుతూ, తింటూ, కబుర్లు వింటూ (లేదా చెబుతూ) శ్రమించండి. ఆదివారం ఉదయం అర్జంటుగా మీరు పక్క లేవాల్సిన పని లేదు - బద్దకంగా మీ ఇష్టం వచ్చినప్పుడే లేద్దురు గానీ - తొందరేం లేదు.

ఈ ఈలేఖ మీకు అందాక మౌనాంగీకారమో లేదా మౌనానంగీకారమో  కాకుండా కొద్దిగా ఓపిక తెచ్చుకొని నాకో, అందరికో మీరు వస్తున్నారో, రాట్లేదో, లేక ఆలోచిస్తున్నారో తెలియపరిస్తే బావుంటుంది. అలాగే ఇంకేమన్నా ఆలోచనలు వుంటే తెలియజేయండి. ఇదివరకు ఇలాంటి ఈమెయిల్స్ ఇచ్చినప్పుడు మీ స్పందన నాకు తెలియక సందిగ్దంగా వుండేది. 

ఇన్నాళ్ళూ ఎప్పుడు మనం (అనగా పాపం మగ మేల్సుమి) స్వేఛ్ఛగా మాట్లాడుకుందామనుకున్నా ఆడాళ్ళు పక్కనే తయారయివుండేవారు  కాబట్టి నోరు నొక్కుకొని ముచ్చట్లు పెట్టుకున్నాం కదా. అందుకే ఈ ఏర్పాటు చేసేసా. అంచేతా మంచి తరుణం - మించిన దొరకదు. రండ్రండి. ఆ శనివారం సాయంత్రం ఆరుగంటల వరకల్లా వచ్చేయండి. కుదరకపోతే ఎనిమిది వరకన్నా ప్రయత్నించండి. అదీ కుదరకపోతే ఏ రాత్రికయినా వచ్చెయ్యండి.

అతి ముఖ్యమయిన గమనిక: అలాగే పనిలో పనిగా బ్యాచులర్ పార్టీ ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందని కొంతమంది చిలిపి వ్యక్తులు (ఆబ్బే ఖచ్చితంగా నేను కానే కాదు - గారంటీ)  సూచిస్తున్నారు  కానీ నేనే వద్దంటున్నా! అయినా మనలో పెళ్ళి కాని వ్యక్తులు ఎవరూ లేదు కదా - మన ఖర్మ కొద్దీ. ప్చ్. మంచి అవకాశం మిస్సయిపోతున్నామని మీరు బాధపడుతున్నారా. సరే ఓ పని చేద్దాం. సిచువేషన్ ఎవరికయినా డిమాండ్ చేస్తే ఎవరికయినా మళ్ళీ పెళ్ళి చేద్దాం (ఒత్తినే అనుకుందాం) . ఇప్పటికిప్పుడు ఎవరికి ఆ సిచువేషన్ వుంది చెప్మా? ఒకరికి వుంది కానీ అదెవరో మీరే కనుక్కోండి చూద్దాం. (అబ్బే నాకు మాత్రం గల్లీ గల్లీలో రెండో పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అస్సలు లేదు - మీరు నమ్మినా నమ్మకపోయినా సరే - ఆ!) ఈ పేరా అంతా సరదాగా వ్రాసిందే. నిజమే కాబోలు అనుకొని చొంగలు కార్చుకుంటూ వస్తే మాత్రం బాధ్యత నాది కాదు."

Liothyronine Sodium మెడిసిన్ ఇండియాలో దొరుకుతుందా?

మా అమ్మగారికి కూడా హైపో థైరాయిడిజం వుందని TSH, FreeT3, Free T4 రక్త పరీక్షలు చేయిస్తే ఇవాళే తెలిసింది.   RT3 పరీక్ష ఇండియాలో చెయ్యరంట.

Liothyronine Sodium మెడిసిన్ ఇండియాలో దొరుకుతుందా? దొరికితే బ్రాండ్ పేర్లు తెలియజేయగలరు. ఇది హైపో థైరాయిడ్ చికిత్స కోసం ఉపయోగపడే T3 మందు.

అలాగే ఇండియాలో Natural Desiccated Thyroid (T4 + T3 కోసం) లభిస్తుందా చెప్పండి. వాటి బ్రాండ్ పేర్లు చెప్పగలరు.

దీనిపైన ఓ ఉద్యమమే నడుస్తోందబ్బా

మనం పలు ఉద్యమాల గురించి వింటూ వుంటాం కానీ ఈ పేషెంట్ల ఉద్యమం నాకు కొత్తగా అనిపించింది. అదీ థైరాయిడ్ పేషెంట్ల ఉద్యమం. నేనూ ఆ పేషెంటునే కాబట్టి ఈ ఉద్యమంలో చేరిపోయి ఆ పిటిషన్ నేనూ సైన్ చేసాను. ఒక అంచనా ప్రకారం 40% ప్రజలలో ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్ అపసవ్యతలు ఎంతో కొంతయినా వుంటాయి కానీ చాలామంది వైద్యులకి ఈ విషయాల మీద క్షుణ్ణమయిన అవగాహన లేకపోవడం వలన పది శాతం పేషెంట్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు.

అందువల్ల మిగతా వారందరూ చికిత్సకు లోను కాకుండా పలు లక్షణాలతో బాధపడుతున్నారు. డాక్టర్లలో, వైద్యసంస్థలలో ఈ విషయంలో మార్పు కోరుతూ రోగులు ఉద్యమిస్తున్నారు. మీకు కూడా థైరాయిడ్ సమస్య లక్షణాలున్నా కూడా మీ వైద్యుడు సరిగా నిర్ధారించడం లేదు అనుకుంటే ఈ పిటిషన్ చదివి సంతకం చెయ్యండి. మీ వైద్యుడితో మీరు తెలుసుకున్న విషయాలు చర్చించండి. అయినా సరే మీ మాట పట్టించుకోక పాత పద్ధతుల్లోనే మిమ్మల్ని  విశ్లేషిస్తుంటే కనుక మీరు మరో వైద్యుడిని చూసుకోవడం మంచిదేమో మరి. 

http://www.thyroidchange.org/  

Your Voice is Needed

The patient petition, "Patients with Thyroid Dysfunction Demand Better Care," is an initiative to increase awareness and improve the overall care of thyroid dysfunction. Our voices can effect change worldwide!
 

ఇహపోతే థైరాయిడ్ మరియు ఎడ్రినల్ హార్మోన్లు ఓ రెండు వారాలుగా నేను తీసుకుంటున్నాను. గత మూడు రోజులుగా నాలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది కానీ అది భ్రాంతో (ప్లేసిబో ఎఫెక్ట్?) నిజమో తెలియదు. తాత్కాలికమో, శాశ్వతమో తెలియదు. చూద్దాం. పూర్తిగా గుణం కనిపించడానికి నెలన్నర అయినా పడుతుంది.

ఈ శనివారం మా (మగ జెంట్స్) వంటకాలోచ్!

ఇదండీ ఇవాళ మా పట్టణంలోని దగ్గరి బంధుమిత్రులకు పంపిన ఈలేఖ:
"ఈ శనివారం - ఎన్నాళ్ళుగానో వేచిన ఉదయం - కాదు కాదు మధ్యాహ్నం. మగవారి కలల పంటలు కాదు కాదు వంటలు పండే రోజు.  మగజెంట్స్ అందరూ మా ఇంట్లో ఈ శనివారం సాయంత్రం వంటొండాలని ఆడలేడీస్ అందరూ (కాకపోతే కొందరు లెద్దురూ) డిసైడ్ చేసిండ్రు. అంచేత ఆ రోజు మధ్యాహ్నం లంచ్ గించు ముగించుకొని మా ఇంటికి వచ్చి మీ పాకశాస్త్ర ప్రావీణ్యతను వెలుగులోకి తేండి. మన ప్రావీణ్యతలను మహిళాలోకం పరీక్షించి బహుశా బహుమతులు ఇస్తే ఇస్తారు. లేదా అభినందన పత్రాలు  ఇవ్వొచ్చు. వాటిని  గెలిచిన వారు మెడలో తగిలించుకొని తిరగవచ్చు లేదా మీ ఇంట్లో (మా ఇంట్లో కాదు) గోడకి అతికించుకోవచ్చు. నాకు ప్రధమ బహుమతి రాకపోతే అలుగుతానని ఆల్టిమేటం ఇచ్చేస్తా.  అందరం వరుసగా వంటలొండేసరికి రాత్రి అవుతుంది. ఆ తరువాత మన వంటలు ఆడాళ్ళు తిన్నాక వాళ్లంతా క్షేమంగా వుంటే(నే) పిల్లలూ, మనమూ  తినేద్దాం.

నేను చేమగడ్ద పులుసు మరియు/లేదా కోడిగుడ్డు పులుసు వండుతాను. ఇలాగే మిగతా అందరూ చెప్పిన వంట చెప్పకుండా తలో వంటా తాము బాగా ప్రావీణ్యం వున్నది తెలియపరిస్తే బావుంటుంది. (హింట్: నాన్ వెజ్ కూరలకి ఎక్కువగా మార్కులు పడే అవకాశం వుంది. ఈ సదవకాశాన్ని మీరందరూ ఎంచక్కా ఉపయోగించుకోండి). ఇంటిదగ్గర వండి తెస్తామంటే ససేమిరా కుదర్దని మహిళా లోకం ఖండితంగా చెప్పింది. బోగస్ మగ వంటకాలు వుండొచ్చని వారి అనుమాన పెనుభూతం. అంచేతా అలాంటి ఆలోచనలు మానేసి శుబ్బరంగా మా ఇంటికి వచ్చి వండేసెయ్యండి. వంటలు ఏమాత్రం రాని మగ మహారాజులు ఏ 'కుకింగ్ ఫర్ డమ్మీస్' పుస్తకమో చదివి ప్రయోగాలు  చెయ్యొచ్చు లేదా  సింపుల్గా ఏ పచ్చి పులుసో, రసమో, టమాటో రసమో చేసిపడెయ్యొచ్చు. వారికి కన్సోలేషన్ ప్రైజ్ వస్తే రావచ్చు.  అంచేతా అందరూ వచ్చేసెయ్యండి - వండేసెయ్యండి - వండేసెయ్యండంతే!

మిగతా వివరాలు నెమ్మదిగా మీకు అందరికీ ఫోన్లు చేసి తెలియజేస్తుంటాను.  ఈలోగా మీకేమయినా సందేహాలూ, ఫందేహాలూ వుంటే కడిగేసెయ్యండి కాదు కాదు అడిగేసెయ్యండి."

నాకు వంటలు బాగానే వండటం వచ్చని నాకు నామీద వున్న సదభిప్రాయం (మిగతావారి సదభిప్రాయాలు అడక్కండేం)  అయితే ఇంట్లో అరుదుగా మాత్రమే ప్రయత్నిస్తాను. ప్రయత్నించినా చెడగొడతాను. హమ్మో నా వంట మా ఆవిడకి నచ్చేసిందంటే ఇంకేమన్నా వుందా - రోజూ నన్నే వండెసెయ్మనే ప్రమాదం లేదూ - హందుకే. మా ఆవిడ ఇండియా ట్రిప్పుకి గట్రా వెళ్ళినప్పుడు మాత్రం ఎంచక్కా చక్కగా వండుకొని తినేస్తాను.

ఇహపోతే ఈ శనివారం నేను వండే కూరలేంటో చూసారు కదా. చేమగడ్ద పులుసు లేదా కోడిగ్రుడ్ల పులుసు. నాకు పులుసు కూరలు అందునా ఆ కూరలు అంటే మహా ఇష్టం లెండి. ఈ వారం వంటల్లో మన కూరలు అద్దిరిపోవాలి. మన బ్లాగర్ల పరువు నిలబడాలి. అందుకే ఆ కూరలు ఎలా ఘుమఘుమ లాడేట్టు వండాలో చెప్పి కాస్తంత పుణ్యం కట్టుకుందురూ లేదా వంటల సైట్లు అయినా సూచించండి.  మొత్తమ్మీద మనకు ప్రధమ బహుమతి రావాలి. రాకపోతే నేరం నాది కాదు మీదే!

ఆ రోజు మా పాకశాస్త్ర ప్రావీణ్యం ఎలా వెలిగిపోతుందో, జడ్జిలు ఏమంటున్నారో, తిన్నవాళ్ళ పరిస్థితి ఏంటో లైవ్ బ్లాగింగ్ చేద్దునా ?

ముఖ్యమంత్రిగా శర్మిళ (అయితే బావుండును)

అవినీతి గురించి కాస్సేపు పక్కన పెట్టేసి మాట్లాడేసుకుందాం.  మన రాష్ట్రానికి ఇంతవరకూ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరూ రాలేదు. అందువల్ల అలా శర్మిళ వస్తే కొత్తగా, ఓ చరిత్రగా వుంటుంది. వచ్చే అసంబ్లీ ఎన్నికలు దాటిపోయేంతవరకు కూడా జగన్ జైల్లో వుండి వైకాపా ఘనంగా గెలిస్తే శర్మిళ కు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ చాలా వుంటుంది. శర్మిళ ఉత్సాహవంతురాలు, ప్రతిభావంతురాలు. ఓపికా, శక్తీ మరియు సామర్ధ్యం ఆమెకు వున్నాయి. పరిపాలన దక్షత వుందో లేదో కానీ ఆ కుర్చీలో కూర్చుంటే అదే వస్తుంది లెండి.  యువ నాయకురాలు. ప్రజలని ఉత్తేజ పరచగలదు. ఆమె ఛీఫ్ మినిస్టర్ అయితే ప్రభుత్వానికి ఓ కొత్తదనం, ఉత్సాహం కలుగుతాయి. చూడటానికి కూడా చక్కగా వుంటుంది. నాకయితే జగన్ సిఎం అవుతాడనే దానికంటే శర్మిళ ముఖ్యమంత్రి అవుతారనుకుంటేనే ఉత్సాహంగా వుంది. ప్లీజ్ జగన్ - మీరు జైల్లోనే వుండండి. అలా జైల్లో వుంటే వైకాపా మీద సానుభూతి పెరిగి, పాపం ఆడకూతుర్లు అంతగా కష్టపడుతున్నారని వోటర్లకి జాలి కలిగి వైకాపాని ఘనంగా గెలిపించొచ్చు.

అలా ఆమె ముఖ్యమంత్రి అయ్యేకా  తన సోదరుడు జగన్ని జైళ్ళ శాఖా మంత్రిగా చేసేయ్యొచ్చు. అలాంటి శాఖ వుందో లేదో నాకు తెలియదు. అది లేకపోతే లేదా అది వున్నా కూడా దానికి తోడుగా జగనుకి హోం మినిస్ట్రీ ఇస్తే  భలే బావుంటుంది.  జైల్లోంచే ఎంచక్కా లా అండ్ ఆర్డర్ కాపాడొచ్చు. మరి విజయమ్మ పరిస్థితి ఏంటని మీరు అడగవచ్చు. ఆమె భవిశ్యత్తు ఎన్నడో ఊహించి అప్పట్లోనే ఓ టపా వ్రాసిపడేసా కదా. వైకాపాకి బోల్డన్ని  ఎంపీ సీట్లొచ్చాయనుకోండీ కింగ్ మేకర్ ఎవరు అవుతారు? జైల్లో వున్న జగన్ కాడూ. అప్పుడు మరో వైపు అఖిలేశ్ యాదవ్ కూడా కింగు మేకరవుతాడు లెండి. ఈ ఇద్దరు మేకర్ల మధ్య పోటీ వుంటుందన్నమాట. ఎవరి కింగు కోసం వారు పోరాడుతారు.  విషయం అర్ధమయ్యింది కదా. కొండకి తాడు కట్టి లాగితే కొండ ఒహవేళ రాకపోయినా కనీసం గవర్నర్ గిరీ అయినా రావచ్చు కదా. అలా ఆంధ్రాకి గవర్నరుగా విజయమ్మ వచ్చే అవకాశాలు లేవా ఏంటీ? బ్రదర్ అనిల్ గురించి మాత్రం నన్ను అడక్కండి. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు.  దేవాదాయ శాఖ ఇస్తే సరిపోతుంది. ఏమంటారు? మీరు ఏ గనుల శాఖో సూచిస్తుండొచ్చు. అవునా?

ఇక శర్మిళకి దీటుగా ఇతర పార్టీల్లో మంచి మహిళా నాయకత్వం ముందుకు రావాలంటే తెలుగుదేశంలో చంద్రబాబు కోడలూ, బాలక్రిష్ణ కూతురూ, లోకేశ్ భార్యా అయిన బ్రాహ్మిణికి మాత్రమే ఆ స్పార్క్ వుంది. అలాగే కాంగ్రెసులో పురంధేశ్వరి. పురంధేశ్వరి, బ్రాహ్మిణి మరియు శర్మిళలో ఎవరు ఏపికి ప్రధమ మహిళా ముఖ్యమంత్రి అయినా సంతోషమే నాకు. అయితే మొదటి ఇద్దరూ (రాష్ట్ర) రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. తెరాస కవిత అంటే నాకు కంపరంగా వుంటుంది. ఎందుకూ అంటే ప్రతి దానికీ లాజిక్కులు ఏం చెబుతాం. ఆమె నాకు నచ్చలేదంతే.  మీకు నచ్చితే తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిణిగా ఆమెను ప్రతిపాదించండి మరి.

రేపటి రోజు నాకు కాస్తంత ఆసక్తికరం

ఎందుకంటే రేపు ఉదయం 8 గంటలకు మా ఫామిలీ డాక్టరుని కలిసి నా పరిస్థితి చర్చించబోతున్నాను.  నా ప్రస్థుత పరిస్థితి బాగానే వుంది - చాలా వరకు కుదుట పడ్డాను కానీ నా సమస్యకి మూల కారణం పరిశోధిస్తున్నాం కదా. క్రితం సారి కలిసినప్పుడు నాకు హైపోథైరాయిడిజం లేదన్నాడు కానీ దాని గురించి మరింత నేను తెలుసుకున్నాక, నా ల్యాబ్ రిపోర్టులు వివరంగా పరిశీలించాక నాకు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం  వుందనే నేను అనుకుంటున్నాను. డిప్రెషన్  స్ఫుటమయిన (ఓవెర్ట్) హైపోథైరాయిడిజం వున్నవారికంటే సబ్ క్లినికల్ గా వున్నవారికే ఎక్కువగా వచ్చే అవకాశం వుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే మా వైద్యుడు నేను చెప్పిన దానికి కన్విన్స్ అవుతాడా లేదా అన్నది ఆసక్తికరం. చూడాలి మరి. ఆసక్తి వున్నవారు వివరాల కోసం క్రింది లింక్ చూడండి:

ఇహపోతే నా పిట్యూటరీ గ్రంధికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టూ వస్తుంది. ఆ లెవల్స్ ఎలా వుంటాయో చూడాలి. ట్యూమర్ వుండవచ్చునని ఏమయినా తెలుస్తుందా అనేది కూడా ఆసక్తికరం. అది వుండొచ్చు అని అనుమానంగా వుంటే MRI చేయించుకోవాలి. ప్రతి అయిదుగురిలో ఒక్కరికి ఆ ట్యూమర్లు వుండొచ్చునట కానీ అందులో దుష్పలితాలు చాలా తక్కువ మందికి దారితీస్తాయిట. అయితే ఎక్కువమంది తమ ఆరోగ్య సమస్యలకి కారణంగా పిట్యూటరీని పరిగణించకపోవడం వల్ల కూడా ఆ గణాంకాలు తక్కువగా వెల్లడిస్తున్నాయని నా అభిప్రాయం. మందులు వాడితే చాలామందికి ట్యూమర్లు తక్కువ అవుతాయి. కొద్దిమందికి సర్జెరీ, రేడియేషన్లు అవసరం అవుతాయి. నాకు వున్న లక్షణాలను బట్టి ఈ సమస్య నాకు వుంటే వుండవచ్చు అని నా అనుమానం. హైపో పిట్యూటరిజం వల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుండవచ్చు. అందుకే ఆ పరీక్ష కూడా చేయించమని డాక్టరుని అడిగాను. చూడాలి.

పై రెండింటిలో ఏదో ఒకటి తెలిస్తే లక్షణాలను కాకుండా మూల కారణాన్ని నివారించడానికి ప్రయత్నించొచ్చు. ఆ రెండూ కూడా కాకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. వేరే కారణాలు ఏమయి వుండవచ్చు అనేది మళ్ళీ పరిశోధించాలి.

హెలెన్ - ఓ వ్యధా గాధ - సినిమా

ఈ సినిమా 2009 లొ వచ్చింది. క్లినికల్ డెప్రెషన్ గురించి ఇదో చక్కటి సినిమా అయినప్పటికీ కొన్ని లోపాలు వున్నాయి. హెలెన్ గా ఆష్లీ జూడ్ నటించింది. ఆమె అంటే నాకు ఇష్టం. ఈ సినిమా చూడటానికి కాస్తంత ధైర్యం, ఓపికా కావాలి. వ్యధను చాలా సహజంగా చూపించారు కాబట్టి దాన్ని భరించే శక్తి చాలామందికి వుండకపొవచ్చు. బోర్ కొట్టి ఆపేస్తుండొచ్చు కానీ చివరంటా చూడగలిగితే చక్కటి ఎమోషనల్ సినిమా ఇది. మానసిక కృంగుబాటులో వుండేవారి మానసిక, శారీరక స్థితి ఎలా వుంటుందో చాలా అవగాహన కలిగిస్తుంది. మీ ఇంట్లో ఎవరయినా డిప్రెషన్ తో గానీ, ఏంగ్జయిటీ తో కానీ అతలాకుతలం అవుతున్నా మీకు ఆ విషయం అర్ధం కాకపోవచ్చు. మీ బంధువో, మిత్రుడో సఫర్ అవుతున్నా కూడా ఆ వ్యక్తి చెయ్యి దాటిపోయేంతవరకూ మీకు అనుమానం కూడా రాకపోవచ్చు. అందువల్ల ఇలాంటి సినిమాలయినా చూడటం వల్ల ఆయా సమస్యలపై అవగాహన వస్తుంది. 

హెలెన్ యొక్క జీవితం చక్కగా నడుస్తుంటుంది కానీ ఎన్నో ఏళ్ళుగా తనలో వున్న విచారాన్ని నిభాయించుకోలేక క్రమంగా బయటపడుతూ వుంటుంది.  ఎందుకు ఈమెకు ఇంత విచారం, ఎక్కడ లోపం జరిగింది అని భర్త విస్మయపడుతూ వుంటాడు కానీ వ్యధ చెందడానికి బయటి కారణాలు వుండక్కరలేదని  అతగాడు అర్ధం చేసుకోలేకపోతుంటాడు. ఆమెకు తానేం లోపం చేసేడో అర్ధం కాక సతమతం అవుతుంటాడు.  అపరిమితమయిన వ్యధను భరించలేక, జీవితం పట్ల ఏమాత్రం ఉత్సాహం, శక్తి, ఆశ లేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుంటూ వుండటంతో  మానసిక వైద్యశాలలో చేరుస్తారు.  మళ్ళీ ఇంటికి తీసుకువస్తారు. మొదటి భర్తతో కలిగిన టీనేజి కూతురు గానీ, భర్త గానీ ఆమె పట్ల ఎంతో ప్రేమ, ఆదరణ చూపిస్తున్నా కూడా ఆమెని సవ్యంగా అర్ధం చేసుకోలేక ఆమె ప్రవర్తనతో విసిగిపోయి దూరం అవుతుంటారు.

మందులు వాడుతూ వున్నా కూడా హెలెన్ లో మార్పు రాదు.   ఆమె డిప్రెషన్ మందులకి లొంగదు. ఆమె పరిస్థితిని ఆమె స్టుడెంట్ అయిన మెటిల్డా మాత్రమే సవ్యంగా అర్ధం చేసుకొని ఆసరా ఇస్తుంది. ఆమె బై పోలార్ (డిప్రెషన్ + మానియా) డిజార్దర్ తో అవస్థ పడుతూ వుంటుంది కాబట్టి హెలెన్ సమస్యను తేలిగ్గా అర్ధం చేసుకుంటుంది.  వీళ్లిద్దరి స్నేహం భర్తకు నచ్చదు. భర్తతొ విసిగిపోయి మెటిల్డా దగ్గరికి హెలెన్ వచ్చేస్తుంది. ఇద్దరూ చాలా దగ్గర అవుతారు. ఆ తరువాత ఆ ఇద్దరి జీవితాలు ఏమవుతాయి అనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది. 

మానసిక కృంగుబాటు వున్న మహిళగా ఆష్లీ చాలా సహజంగా నటించింది. ముగింపు వాస్తవానికి చాలా దగ్గరగా వుంటుంది.  శుభం కానీ అశుభం కానీ లేకుండా అసలయిన పరిస్థితిని తెలియజేస్తూ చిత్రం ముగుస్తుంది. వాస్తవానికి, సహజత్వానికి వీలయినంత దగ్గరగా ఈ సినిమా తీసినందుకు ఆ దర్శకురాలిని మెచ్చుకోవాలి.  ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్  లో ఆన్లయినులో లభిస్తోంది. ఈ  సినిమా చూడలేని వారు ఈ క్రింది లింకులో కథ, రివ్యూలు చూస్తే ఈ సినిమా గురించి కొంతయినా తెలుస్తుంది.  

గర్ల్ ఇంటరుప్టెడ్ - సినిమా

ఈ మధ్య కొన్ని సైకలాజికల్ సమస్యల ఇతివృత్తాలున్న సినిమాలు చూసాను. అందులో ఈ Girl, Interrupted (1999) సినిమా ఒకటి. సుసానా కేసెన్ అనే ఆమె 18 నెలలు మానసిక వైద్యశాలలో గడిపింది. ఆమె అనుభవాలను ఒక పుస్తకంగా వెలువరించింది. దానిని ఈ సినిమాగా తీసారు. హీరోయినుగా అందగత్తె వియోనా రైడర్ చాలా చక్కగా నటించింది. అయితే అస్కార్ అవార్డ్ మాత్రం ఇంకో నటి అంజెలీనా జోలీకి వచ్చింది. చాలామందికి ఓ సోషియో పాత్ గా అంజెలీనా జోలీ నటన నచ్చేస్తుంది.నర్సుగా వూపీ గోల్డ్‌బెర్గ్ నటన కూడా చాలా బావుంటుంది.

ఇది 1960 లోని కథ. ఒకసారి సుసానా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడంతో తల్లితండ్రులు ఆమెని మానసిక వైద్యశాలలో చేరుస్తారు. అక్కడ మిగతావారికి ఎలాంటి సమస్యలు వుంటాయి అనేది ఆసక్తికరం. మన తెలుగు సినిమాల్లో చూపించేలా మాత్రం అది వుండదు. సుసానాకి బార్డర్లైన్ పర్సనాలిటీ  డిజార్డరుగా భావించి చికిత్స చేస్తుంటారు.   బ్రిటనీ మర్ఫీ అనే ఇంకో అందమయిన  అమ్మాయి డైజీగా నటించింది. ఆమెకు బలూమియా అనే ఈటింగ్ డిజార్డర్ వుంటుంది. అయితే అది ఆమెకు ఎందుకు వచ్చివుండవచ్చు అనే విషయాన్ని చాలా అంతర్లీనంగా అందులో సూచిస్తారు. అదేంటో ఇక్కడ చెప్పడం బావోదు. సినిమాలో ఆమెకు సంబంధించిన ఒక సన్నివేశం నన్ను నిర్ఘాంతపరచింది. అంత స్పష్టంగా అలాంటి సన్నివేశాలు అలా చూపించేస్తారని అనుకోలేదు. అది ప్రణయ సన్నివేశం అనుకునేరు. కాదు. ఈ సినిమాలో చూపించినట్లుగానే ఆమె నిజ జీవితంలోనూ జరగడం గమనించదగ్గ విషయం.

అక్కడ వున్న ఒక అమ్మాయికి బాగా అబద్ధాలు ఆడే రుగ్మత వుంటుంది. ఆమె సుసానాకి రూమ్మేట్. ఇలా పలు మానసిక రుగ్మతలు వున్న ఆ అమ్మాయిల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఈ సినిమా చూస్తే కొన్ని రుగ్మతల మీద అయినా కాస్త అయినా అవగాహన కలుగుతుంది.  సుసానా మొదట్లో ఆ వైద్యశాలలో కొంతకాలమే వుంటా అనుకుంటుంది కానీ 18 నెలలు వుండాల్సివస్తుంది. సైకియాట్రిస్టులు ఆమెకు కౌన్సిలింగ్ చేస్తుంటారు కానీ నర్స్ వెలరీ (వూపీ) తెలియజెప్పిన పద్ధతిలో నడుస్తూ తన భావాలను, ఆలోచనలను  వ్రాతల్లో, పెయింటిగుల్లో వ్యక్తపరుస్తూ స్థిమితపడుతూ వుంటుంది. ఆ తరువాత ఆమె మనో రుగ్మత తొలగిపోయిందని చెప్పి ఇంటికి పంపించేస్తారు. నిజంగా తనకి ఆ మెంటల్ డిజార్డర్ వుండిందా అని విస్మయ పడుతూ కారులో ఇంటికి వెళుతూవుంటుంది. 

మానసిక సమస్యలు, సంఘర్షణల ఇతివృత్తాలు నచ్చేవారికి, ఎమోషనల్, డార్క్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చాలామంది అందమయిన అమ్మాయిలు సినిమా అంతా వుంటారు కాబట్టి ఈ సినిమా ఆకర్షణీయంగా కూడా వుంటుంది.  ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను ఈ క్రింది లింకులో చూడవచ్చు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఆన్లైనులో అందుబాటులో వుంది. 

నిన్న షిర్డీ సాయిబాబా గుడికి వెళ్ళి వచ్చాం

ఈమధ్య లౌకిక ఆధ్యాత్మికుడినిగా మారుతున్నాగా. సెక్యులర్ స్పిరిచువాలిటీని తెలుగులో అలాగే అంటారా లేక వేరే పదం వుందా? అలా అని దైవ భక్తి, మరొ జన్మలు, మహత్మ్యాలు వంటి వాటి పట్ల విశ్వాసం ఏమీ లేదు. కానీ పది మందితో కలిసి చేసే ప్రార్ధనలూ, సాంప్రదాయాలూ, సంస్కృతీ ముచ్చట గొలుపుతున్నాయి. లౌకిక ఆనందంతో పాటుగా కొంత అయినా అలౌకిక ఆనందం కూడా కావాలనిపిస్తోంది.

ఇహనుండీ వీలయిన ప్రతి ఆదివారం ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ, నాస్తిక కేంద్రాలు దర్శించాలనుకుంటున్నాం. ఒక మానవతా వాద కేంద్రం కొంత దూరంలో వుందని ఈమధ్యే తెలిసింది లెండి. హిందూ కేంద్రాలలో కూడా ఎన్నో వున్నాయి కదా, షిర్డీ సాయితో పాటుగా, రామక్రిష్ణా మిషన్, చిన్మయ మిషన్ వున్నాయి. అవి కాకుండా పలు గుడులు, గోపురాలూ వున్నాయి.  

నా చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి ఆధ్యాత్మిక కేంద్రాలు తిరుగుతూ ఆ చర్చలు వింటుండేవాడిని. నాన్నగారితో కలిసి నాస్తిక సభలకు వెళుతూ ఆ చర్చలు వింటుండేవాడిని. అయితే మా పిల్లలకు పెద్దగా ఏదీ దక్కకుండా అయ్యింది. ఆ శూన్యతను ఈమధ్యే గమనిస్తున్నాను.  అందుకే వాళ్లనీ తీసుకెళుతున్నాను. మరీ మూఢత్వంలోకి వెళ్ళకుండా సెక్యులర్ స్పిరుచువాలిటీ అంటే ఏంటో తెలియజేస్తున్నా. ఆ తరువాత వారి ఇష్టం.  ఇటు ఎథీస్ట్ కార్యక్రమాలు లేకపోవడమూ, ఆధ్యాత్మిక కేంద్రాలకి పెద్దగా వెళ్ళక పోవడం వల్ల రెంటికీ చెడుతున్నాం. అందుకే బుద్ధ, సంఘ, ధర్మల యొక్క శరణు కోరుతున్నాను. స్పిరిచువల్ కార్యక్రమాల్లొ పాల్గొంటూనే హేతుబద్ధంగా వుండగలిగేలా చూస్తున్నా. నాలాంటి వారు ఒకరో ఇద్దరో ఇలా మారగానే నాస్తికులు అందరూ చివర్లో ఇలాగే అవుతారని కాదులెండి. నా కేసు చాలా డిఫరెంటూ. 

నిన్న గుడికి వెళ్ళాంగా. గురువారం షిర్డీ భక్తులకి  ముఖ్యమయిన రోజు. మాకు దగ్గర్లోని ఓ చిన్న గుడికి వెల్దామంటే సాయి భక్తురాలయిన మా ఆవిడ గంట దూరంలోని సాయి గుడికే వెళదామని పట్టుబట్టింది.   వెళ్ళాం. అక్కడి కార్యక్రమాలు అన్నీ ముచ్చటగా తిలకించాను. నా చిన్నప్పుడు మా దగ్గరి వూర్లో మా అమ్మగారితో కలిసి మల్లన్న దేవుడి గుడిలో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో అలా గుడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే గడిపి వచ్చేవారం.  ఆ దేవుడి మహిమలు అక్కడి భక్తులు  పరవశంతో చెప్పుకునేవారు. కాస్త చీకటి పడ్దాక పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో చెక్క భజనలు చేస్తూ మల్లన్నని కీర్తించేవారు. అలా మనసికంగా, శారీరకంగా, అలౌకికంగా ఎంతో సాంత్వన పొందేవారు. ఇక్కడ కూడా అలాంటి చురుకయిన భజనలు వుంటాయేమోనని చూస్తున్నా కానీ ఏవీ? అన్నీ కూర్చొని పాడే భజనలే కానవస్తున్నాయి. శారీరకంగా కదులుతూ భజనలు చేస్తుంటే వచ్చే ఆనందమే వేరు అనుకుంటా కానీ ఇక్కడి హిందువులు ఎవరూ ఆ విషయం పట్టించుకుంటున్నట్లుగా  లేదు. ఎవరినయినా ఈ సందేహం అడగాలి. కాలంతో పాటుగా భక్తి కూడా బహు సున్నితం అయినట్లుగా వుంది. 

ఇలా వ్రాస్తున్నానని చెప్పి పూర్తిగా భక్తుడిగా మారుతున్నా అని కాదండోయ్. అలౌకికత్వాన్ని కూడా కొంత బ్యాలన్స్ చేసుకోవాలనుకుంటున్ననంతే.  ఇప్పటికిలా అనిపిస్తోందీ - ఇలా చేద్దాం. రేపటి నాడు ఏమనిపిస్తుందో - నేనేమవుతానో మరి - చూద్దాం. 

రెండోసారి - తప్పు చేద్దాం రండి

...అనగా తప్పు చేద్దాం రండి అనే పుస్తకం రెండో సారి చదువుతున్నానన్నమాట. అదేదో బూతు పుస్తకం కాదండోయ్ - యండమూరి వ్యక్తిత్వ వికాస పుస్తకం. తెలుగు పుస్తకం కాబట్టి అదీ రెండో సారి కాబట్టి ఎక్కడెక్కడ  నస వుందో తెలుసు కాబట్టి తొందరగానే సాగిపోతూవుంది. వారి వ్యక్తిత్వ పుస్తకాలు వేరే ఏమీ చదవలేదు. విజయానికి అయిదు మెట్లు ఎవరింట్లోనో కనపడితే కాస్సేపు తిరగేసాను. నాకు గుర్తున్నంత వరకు దీనితో పోలిస్తే అదే బావుంది. ఇందులో కొంత అతి, సుత్తి, నస వున్నాయనిపిస్తోంది. ఆయన గారి పుస్తకాల్లో ఎలాగూ ఆణిముత్యాలు వుంటాయనుకోండీ కానీ ఈ పుస్తకం సగం మాత్రమే నచ్చింది. మిగతా అంతా సోదే నా దృష్టిలో.

ఇది ఛేంజ్ మేనేజ్మెంట్ గురించి వ్రాసిన పుస్తకం. మార్పు అనేది మన వాళ్లలో చాలా తక్కువ. ఎల్లప్పుడూ బూజు పట్టిన భావాలను, పద్ధతులను పట్టుకొని వ్రేలాడుతూ వుంటారు. అలాంటి వారు ఇలాంటివి చదివి మార్పు చెందితే బాగానే వుంటుంది... కానీ మనం ఇలాంటి పుస్తకాలను కూడా నవలల్లాగా సంతోషంగా చదివి పడేస్తామే.  నా మనస్సుకి కూడా ఈ మధ్య కాస్తంత బూజు పట్టింది. అందుకే కాస్త ఇలాంటి పుస్తకాలను తిరగేస్తున్నాను. కొత్త ఉత్సాహం నింపుతున్నాను. కొత్త యుద్ధాలకు సన్నద్ధం అవుతున్నాను. 

విజయాలు సాధించేవారందరూ ఇలాంటి పుస్తకలు చదివే అవి సాధిస్తారని కాదు గానీ వారిలో స్వతస్సిద్ధంగా ఆ లక్షణాలు అలవడతాయి. అంతటి దృశ్యం లేని నాలాంటి వారు ఇలాంటివి చదివి, అమల్లో పెట్టి అయినా మార్పు చెందాలి మరి.  ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నాలో గొప్ప మార్పులు రాకపోయినా, నేను గొప్ప విజయాలు సాధించకపోయినా కూడా చాలా చిన్న చిన్న మార్పులకి, చిన్న చిన్న విజయాలకి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఎంతో దోహదం చేసాయి. 

ఒక్క ఉదాహరణ చెబుతాను. డేల్ కార్నెగీ పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెన్స్ పీపుల్ చదవక ముందు నేనో పెద్ద సోది గాడిని. ఎలా అంటే ఎలానయితే నా బ్లాగులో అస్తమానమూ నా గురించి వ్రాస్తుంటానో అలానే వాగేవాడిని. అది చదివాక అలా మన గురించి మనం అస్తమానం సుత్తి వెయ్యడం ఎంత పొరపాటో తెలిసివచ్చింది. నా నోరు చాలా వరకు పడిపోయింది. కర్ణ రంధ్రాలు విశాలం అయ్యాయి. అనగా ఎక్కువగా వినడం మొదలెట్టాను. అందుకే ఎవరయినా కలిసినప్పుడు ఎక్కువగా వింటూ వుంటాను. అవతలి వారిని తమ గురించి చెప్పడానికి ప్రోత్సహిస్తుంటాను. వారి వివరాలు, ఆసక్తులూ కనుక్కుంటాను. నా గురించి అడిగితే కానీ పెద్దగా చెప్పను.  

తప్పు చేద్దాం రండి మీరూ చదివినట్లయితే దాని మీద మీ అభిప్రాయాలని ఇక్కడ పంచుకోండి.