పార్కులో జాషువా చెట్ల క్రింద నేను
లాస్ ఏంజిల్స్ వెళ్ళిన మరుసటి రోజు మధ్యాహ్నమే మొజవే డిజర్ట్ డ్రైవ్ కి మమ్మల్ని తీసుకువెళ్ళాడు మా సీతారామ్. నాకు ఎడారి అంటే ఎంతో ఇష్టం. అందులో ప్రయాణం చేయాలని ఎన్నాళ్ళుగానో నా అభిలాష. ఆ ప్రయాణం అంటే మా చిన్నమ్మాయి కూడా ఎంతో ముచ్చట పడింది. కొండలు, గుట్టలు. ఎడారి చెట్ల మధ్యగా ప్రయాణం ఎంతో బాగా జరిగింది కానీ మా అమ్మాయీ, నేనూ కాస్తంత నిరుత్సాహపడ్డాం. ఎడారి అంటే మా దృష్టిలో ఎంతో ఎత్తయిన ఇసుక తిన్నెలు. హ్మ్. ఈ ఎడారులు ఏంటో గానీ ఇసుక ఏమాత్రం కనిపించలేదు. ఇలాంటి భూముల్ని కూడా ఎడారులు అంటారని మాకు అప్పుడే తెలిసింది. ఇసుక తిన్నెలు లేకున్నా సరే కొండలు, గుట్టలు, రాళ్ళు, ఎడారి చెట్లతో ఎడారి నాకు బాగానే అనిపించింది కానీ మా అమ్మాయి మాత్రం నాలుక చప్పరించింది. దారిలో ఒక ఒయాసిస్సుకి కూడా మా మిత్రుడు తీసుకువెళ్ళాడు కానీ ఆ కథ తరువాత.
పార్కులో స్నేహితుడు సీతారామ్ మరియు నేను
ప్రయాణంలో జాషువా చెట్టు గురించి మా ఫ్రెండ్ వివరించాడు. యుఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆ చెట్టు వుంటుందని చెప్పి చూపించాడు. ఆ చెట్లు వివిధ ఆకారాలతో భలేగా వుండి బాగా నచ్చాయి. ఈ చెట్ల కోసం ప్రత్యేకంగా ఓ జాతీయ ఉద్యానవనం కూడా వుందనీ మనం అక్కడికే వెళుతున్నామనీ చెప్పాడు. అబ్బో చాలా పెద్ద పార్క్. వివరాల కోసం పై లింక్ నొక్కండి. జాషువా చెట్టు వివరాల కోసం క్రింది లింక్ నొక్కండి. అక్కడ ఆ గుట్టలమధ్య, చెట్ల మధ్య సూర్యాస్తమయం చూసాం. అక్కడ చాలామంది గుట్టలు ఎక్కడం (రాక్ క్లైబింగ్ హాబీ) చూసాను. నా యుక్తవయస్సులో మా టవును చుట్టు పక్కల మా మిత్రులతో కలిసి గుట్టలు ఎక్కడం - మమ్మల్ని దొంగలుగా అనుమానించి సమీప గ్రామం వారు తన్నడానికి సిద్ధపడటం - మా ఇల్లు ఎక్కడ వుందో చెబితే ఎవరో ఒకరు మమ్మల్ని గుర్తుపట్టడంతో బ్రతుకు జీవుడా అని బయటపడటం గుర్తుకువచ్చాయి.
మా ఆవిడా నేనూనూ
ఎడారిలో ప్రయాణమూ, ఒయాసిస్సూ, జాషువా ట్రీ నేషనల్ పార్కు నాకు భలేగా నచ్చాయి కానీ మా అమ్మాయీ, మా ఆవిడా గులగసాగారు. ఏం చేస్తాం - వారికి ప్రకృతి అంటే వికృతి. వెకేషన్ అంటే చెట్లూ చేమలు చూడ్డమా అని వారి విమర్శ. హ్మ్. ఇంకా ఆ పార్కులో చాలాసేపు వుందామని నా మిత్రుడూ, నేనూ అనుకున్నాం కానీ అందువల్ల ఇహ కొనసాగించలేక తిరుగుప్రాయాణం పట్టాము.
మీలో ఎవరయినా ఈ పార్కును చూసివుంటే మీ అనుభూతులు ఇక్కడ పంచుకోండేం. మీరు లాస్ ఏంజిల్స్ వెళితే కనుక, మీరు ప్రకృతి సౌందర్యారాధకులు అయితే గనుక ఆ పార్క్ తప్పకుండా చూసిరండి. మీ ఫ్యామిలీకి గనుక ప్రకృతి అంటే విరక్తి వుంటే గనుక వెంట తీసుకెళ్ళకండి :)
ఇదే పోస్టుని మిగతా చాలామంది బ్లాగర్లు అయితే దాదాపుగా ఈ క్రింది విధంగా వ్రాస్తారు!
"మా కుటుంబంతో పాటుగా ఆ పార్కుకి వెళ్ళాం. అందరం చక్కగా అనందించాం. మా ఆవిడ అయితే అంత మంచి పార్కు చూపించినందుకు గాను ఆనందం పట్టలేక అక్కడికక్కడ ఓ ముద్దు ఇచ్చేసింది. ఇహ మా అమ్మాయి అయితే ప్రకృతిలో పరవశించి పోయి కేరింతలు కొట్టింది. మా వాళ్ళ ఆనందం చూసాకా మా మిత్రుడు మరికొన్ని ప్రదేశాలు చూపించగా తనివితీరా దర్శించాము. తిరిగివస్తుంటే అక్కడ నుండి కదలబుద్ధి కాలేదు. మళ్ళీమళ్ళీ ఈ పార్కుని మా కుటుంబంతో కలిసి చాలాసార్లు చూడాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీని అంతా వెంటబెట్టుకొని వెళ్ళండి. వారంతా తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు" :)