కన్సాసులో నెమ్మదిగా వీడియో చిత్రాలు నిర్మిద్దామని సులేఖాలో ఒక ప్రకటన ఇచ్చాను. ముగ్గురు స్పందించారు. వచ్చి కలిసారు. అందులో ఒకతను సినిమాటోగ్రఫీలో న్యూయార్కులో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇంకొకతను వాళ్ళన్నయ్య శ్రీను. అతను వ్యాపారస్థుడు. కన్సాసులో ఏవో కొన్ని దుకాణాలు వున్నయ్ - దాంతోపాటే కొన్ని డబ్బులూ వున్నయ్. సినిమా నిర్మాణం మీద అతనికి ఆసక్తి. (ఈమధ్యే వాళ్ళు 'వెల్‌కమ్ టు అమెరికా - ఇంటర్ జంప్ అయినా' అనే సినిమా నిర్మించారు కానీ ఇలాంటి సినిమాలు విడుదలకు నోచుకోవడం కష్టం లెండి. కథ, డైరెక్షను గట్రా అతనిదే. తన పేరు US శ్రీను అని పెట్టుకున్నట్టున్నారు). ఇంకొకతని పేరు రాజు. అతనికి సినిమాల్లో నటించాలని - వీలయితే హీరోగా రాణించాలని బాగా కోరిక. బాగానే వుంది కానీ ఆడాళ్ళు ఎవరూ స్పందించలేదు. మరి ఈరోయిన్ను ఎట్టా చెప్మా?
అందుగ్గాను ఒక బ్రహ్మాండమయిన ఐడియా వచ్చింది నాకు. నా 'ఎవరు?' నవలలో ఒక జంట కేవలం ఫొనులో మాట్లాడుకుంటారు. వాళ్ళ కథ 15 నిమిషాలకు మించి రాదు. ట్రయల్ గా ఆ కథ వీడియో చిత్రంగా తీద్దామని నిర్ణయించుకున్నాం. ఫోనులోనే మాట్లాడుకుంటారు కాబట్టి హీరోయిన్ లేకపోయినా కథ నడుస్తుంది. కేవలం మా హీరోగారిని మాత్రమే ఫోను పట్టుకొని మాట్లాడుతున్నట్టు చూపిస్తాం. లేకపోతే ఏం చెయ్యమంటారు చెప్పండి - నేను ఆ ఆడవేషం వెయ్యలేను కదా! సరే, ఇదేదో బానే వుంది కానీ కనీసం హీరోయిన్ కంఠం అయినా కావాలి కదా. దానికి పరిష్కారం వీజీగానే దొరికింది.
అది ఎలా అంటే ఇండియా నుండి వచ్చి మా క్లయింట్ దగ్గరే పనిచేస్తున్న వీరేశం నా గదిలోనే కొన్ని నెలలుగా వుంటున్నాడు. ఒక రోజు ఇద్దరం ఫుల్లుగా మందు పుచ్చుకున్నాకా హీరోయిన్ గురించీ, హీరోయిన్ కంఠం గురించీ నా అవస్థలు భోరుభోరున తనకి విన్నవించుకున్నాను. మనోడికి పెళ్ళి అయ్యింది కానీ పెళ్ళాం ఇండియాలోనే ఏదో గవర్నమెంట్ టీచరుగా పనిచేస్తోంది. 'నువ్వేం బెంగపడకు బ్రదర్ - వాయిస్సే కదా - మా ఆవిడని ఒప్పిస్తాగా' అని ముద్దుముద్దుగా ముద్దముద్దగా చెప్పాడు. అప్పటికి నాలుగో పెగ్గు మీద వున్నానేమో నాకు యమ సంతోషం వేసింది - సమస్యకి ఓ పరిష్కారం దొరికింది కదా అని. ఆనందంగా మరో రెండు పెగ్గులు లాగించి ఓ మూడు పెగ్గులు మనోడికి తాగించి తృప్తిగా బజ్జున్నాను. మర్నాడు మనోడు ఆ ఊసే ఎత్తడే! 'బ్రదర్ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతావా?' అంటే 'ఎందుకూ?' అంటాడేమిటండీ? 'రాత్రి ఏదో కమిటయ్యావు కదా బ్రదర్' అని నెమ్మదిగా గుర్తుకుచేసా. ఇప్పుడు మందు మత్తు దిగింది కదా 'అబ్బే, మా ఆవిడ అలాంటిది కాదు బ్రదర్ ' అన్నాడు తాపీగా. వార్నీ, వీడి దుంపతెగ అనుకున్నాను. మందు మీద ఓ మాట - మందు దిగాక మరో మాటనా అని నిశ్శబ్దంగా నా నోట్లో పళ్ళు నేను నూరుకున్నాను కానీ ఇంకేమీ చెయ్యలేకపోయాను.
ఇదిలా నడుస్తుండగా ఈమధ్యలో మా హీరోగారికి ఒక జ్ఞానోదయం అయ్యింది. 'ఠాఠ్ - హీరోయిన్ను లేకుండా సిన్మా ఏంటీ - నేను వేషం వెయ్యను గాక వెయ్యను!' అని శ్రీనుతో నాకు సందేశం పంపించాడు. అలా అంటే నేను బెదిరిపోయి ఎక్కడినుండన్నా కథానాయికని పట్టుకువస్తాని అని అతగాడి దింపుడుగల్లెం ఆశ. 'శరత్ అలా బెదిరిపోయేరకం కాదు - తనకి వళ్ళు మండిదంటే సిన్మా క్యాన్సిల్ చేస్తాడూ' అని శ్రీను హెచ్చరించారుట కూడా - అయినా అతను వినలేదు. నాకు నిజంగానే మండింది. అసలే వాళ్ళావిడ గురించి వీరేశం హ్యాండిచ్చినందుకు నాకు మండుతోంది - పైనుండి ఇతగాడొకడు. సినిమా స్టార్ట్ కాకముందే ఇతను ఇంత మొండిగా వుంటున్నాడు - ఇక తరువాత ఇంకెన్ని ఇబ్బందులు పెడతాడో అనిపించింది. సినిమా క్యాన్సిల్ అని అనౌన్స్ చేసాను. 'అబ్బెబ్బే, హీరోయిన్ లేకపోయినా ఫర్వాలేదు - సోలోగా నటనే బెటర్ బ్రదరూ' అని మళ్ళీ వచ్చాడు. ఠాఠ్ - కుదరనే కుదరదన్నాను. నా నిర్ణయం మార్చుకోను అని ఖరాఖండిగా చెప్పేసాను. అలా ఆ సినిమాకి శుభం కార్డ్ పడింది.
ఆ తరువాత అక్కడినుండే ఇండియాలో వీడియో చిత్రం తీయించాలని ప్రయత్నించాను కానీ ఇక్కడ వుండి అక్కడ తీయించడం చాలా ప్రయాస అని అర్ధమయ్యింది. అక్కడో డైరెక్టరుని పెట్టి రెండు మూడు రోజులు షూటింగ్ అయిందనిపించాము. ఈలోగా ఇక్కడ నా ప్రాజెక్ట్ అయిపోవడంతో డబ్బులు లేక అక్కడ ఆ ప్రాజెక్ట్ మూలకు పెట్టాల్సొచ్చింది.
అటుపై షికాగోలో ప్రొజెక్ట్ రావడంతో కన్సాస్ నుండి వచ్చాను. అక్కడివాళ్ళు ఆ తరువాత కూడా సినిమా ప్రయత్నాలు చేసారు. రాజునే హీరోగా పెట్టి శ్రీను ఓ చిత్రం ప్రారంభించారు. హీరోయిన్ సమస్యని శ్రీను తెలివిగా తీర్చుకున్నాడు. రాజు వాళ్ళావిడతో మాట్లాడి మీరు హీరోయినుగా చెయ్యకపోతే మరో హీరోయినుని వెతకాల్సొస్తుంది - ఆ తరువాత ఇంకే పరిణామాలూ జరిగినా నా బాధ్యత లేదని తేల్చిచెప్పాడు. పాపం అమాయకురాలు - ఆమె బెదిరిపోయి వాళ్ళాయన పక్కన హీరోయినుగా నటించడానికి ఒప్పేసుకుంది. మరో హీరోయిన్ తన ముఖానికి దొరకడం కష్టం కనుక రాజు కూడా తన భార్యతో సంతోషంగా సర్దుకుపోయాడు. అయితే ఆ సినిమా ఎంతవరకు వచ్చిందీ - ఏమయ్యిందీ వివరాలు నాకు గుర్తుకులేవు.
ఙ్ఞాపకాలు అని చెప్పి చివర్న గుర్తు లేదు అంటే ఎలాగండీ?
ReplyDelete@ శ్రీకాంత్ చారి
ReplyDeleteహహ. సమాధానం మీకు తెలియక కాదు గానీ కావాలని అడిగారని అర్ధమయ్యింది.
నా బ్లాగులో మీకిది తొలి వ్యాఖ్య అనుకుంటా. గత కొన్నేళ్ళుగా మిమ్మల్ని కాస్త గమనిస్తున్నాను. ఇది మీరు పెట్టుకున్న పేరా లేక నిజం పేరా అని ఆలోచిస్తుంటాను. తెలంగాణా ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతాచారి పేరు మీ కలం పేరుగా పెట్టుకున్నారేమోననీ అనుకుంటున్నా.
oorike vndelaa lere'
ReplyDelete@ Ravi
ReplyDelete:)
@ అజ్ఞాత5 ఏప్రిల్, 2015 9:14 [PM]
హహ. అదో ఇదో చెయ్యకపోతే నాకు తోచదు సుమీ. అబ్బో అవన్నీ మీకందరికీ అన్నీ చెప్పలేను గానీ ఎన్నెన్ని విషయాలు, ఎంత యంత్రాంగమూ, ఎన్ని కుట్రలూ, ఎన్ని కుతంత్రాలూ, వ్యూహాలూ, ప్రతివ్యూహాలూ :))
Baavutundi ala experiments chesthunte life lo zing paaripodu.*
ReplyDelete