నాకు ఒయాసిస్సులు అంటే ఇష్టం. ఎడారి కథలు చదువుతున్నప్పుడూ, ఆ సినిమాలు చూస్తున్నప్పుడూ ఒయాసిస్సులు కనిపిస్తే సంబరం వేస్తుంటుంది. అంత పెద్ద ఎడారుల మధ్య ఒయాసిస్సులు వుండటం అనేది ప్రకృతి గొప్పదనం కదా. మనుషుల, జంతువుల దాహం తీరుస్తూ, తమ పచ్చికదనంతో అలసిసొలసిన శరీరాలను సేద తీరుస్తూవుంటాయవీ. అందుకే ఎడారి దారులు వాటి గుండా వెళుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనుషులూ, జంతువులూ సూర్య కిరణాల వెలుగుని (mirage) చూసి ఒయాసిస్ అని భ్రమపడి నిరాశ చెందుతూవుంటారు.
ఈసారి వెకేషనులో ఒయాసిస్ చూస్తాననిఏమాత్రం ఊహించలేదు. మా మిత్రుడు సరాసరి దాని దగ్గరికి తీసుకువెళ్ళి ఇది ఒయాసిస్సు అని చెప్పేదాకా గుర్తించలేదు. నిజమే చుట్టూ మొజావే ఎడారి. రాళ్ళూ, పర్వతాలూ, పొదలూ, బీడు భూముల మధ్య ఓ చక్కటి వృక్షజాలం వున్న ప్రదేశం అదీ. అదే 'బిగ్ మొరాంగో కాన్యన్ ప్రిజర్వ్'! దానిలోపలి దాకా బోర్డ్ వాక్ వుంది. దానిమీద నడుచుకుంటూ చెట్ల పైరగాలిని ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలరావాలని ఆలకిస్తూ, ఫోటోలు తీసుకుంటూ వెళ్ళాము. ఈ నేచర్ వండర్ లో తిరుగాడుతూ ప్రకృతి యొక్క గొప్పదనాన్ని మనసారా మెచ్చుకోకుండా వుండలేకపోయాను. సమయం లేదుగానీ వుంటే అక్కడే ఏకాంతంగా కూర్చొని గడిపెయ్యాలని వుండింది.
అయితే ఇది మా అమ్మాయికీ, మా ఆవిడకీ పెద్దగా నచ్చలేదు. ఇదో మామూలు చెట్లు, నీరు వున్న ప్రదేశం లాగానే భావించారు కానీ ఒయాసిస్సు యొక్క ప్రధాన్యతను గుర్తించలేకపోయారు. వివరించడానికి కొద్దిగా ప్రయత్నించాను కానీ వారి తలలకు అంతగా ఎక్కలేదు. ఇహ వెళదామని తొందరపెట్టారు కాబట్టి అందులో నా పాదయాత్రను త్వరగానే ముగించక తప్పలేదు. మరుసటి రోజు లాస్ ఏంజిల్స్ లోని డిస్నీల్యాండుకి వెళితే మావాళ్ళు బాగానే సంతోషించారు. అటుపై లాస్ వెగాస్ వెళ్ళాం. ఆ ట్రిప్ ఎంత ఘనంగా జరిగిందో మున్ముందు మీకు వివరిస్తాను!
ఈ ఒయసిస్ చూసినవాళ్ళు మీ అనుభూతులను మాతో పంచుకోండి. మీరు ఎప్పుడయినా లాస్ ఏంజిల్స్ వెళితే మీరు గనుక నేచర్ లవర్స్ అయినట్లయితే ఈ ప్రిజెర్వ్ చూడటం బావుండగలదు.
No comments:
Post a Comment