ఈమధ్య బుర్ర ఖాళీగా వుంటొందని బుర్రకి కాస్త పని ఇస్తున్నాను. నేను పెద్దగా ఆలోచించకుండా ఎప్పటికప్పుడు నాకు పనులు సూచించే పనిని నా అంతహ్ చేతనకు ఇచ్చేసాను. అయితే నాకేం కావాలో తెలిస్తే కదా నా సబ్ మైండు, సబ్మిసివ్ మైండ్ నాకు సూచనలు ఇవ్వగలిగేది. అందుకే రోజూ ధ్యానం లాంటి సెల్ఫ్ హిప్నటిజం చేస్తూ నా సబ్ మైండుకి నాకేం కావాలో బోధించాలి. బహిర్ చేతన మెలకువలో వుంటే అంతహ్ చేతన అంత దూరం నన్ను వెళ్ళనివ్వదు. మనకెన్నో పనులాయే - ఆ మాత్రం హిప్నటిజం చేసుకుంటూ ఆటో సజెషన్స్ ఇవ్వడానికి సమయం ఎలా దొరుకుతుంది. అలా లాభం లేదని రోజూ నేను ఆఫీసుకి రైల్లో వెళ్ళి వచ్చే సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను.
చేసుకోవాలనుకున్నానూ...హంతవరకు బాగానే వుంది కానీ 45 నిమిషాల రైలు ప్రయాణంలో ఓ పది నిమిషాలు పేపర్ చదివేసరికే కళ్ళు మూతలు పడుతుంటాయే! అలాంటప్పుడు ధ్యానముద్రే కానీ ధ్యానం ఎలా కుదురుతుంది. అయినా సరే నా ధ్యానానికో దారి కనిపెట్టేసా... కునుకుపాటు అయిన తరువాతే అయ్యగారు హాయిగా విశ్రాంతి తీసుకున్నాకే ధ్యానం పాట మొదలెట్టాలనుకున్నా. మహా అయితే ఓ ఇరవై నిమిషాలు కునికిపాట్లు పడతాను. తరువాత అంతా కలత నిద్రే కదా. అప్పుడు నా సబ్‌కాన్షియస్ మైండుకి నాకేం కావాలో, నేనేం చెయ్యాలనుకుంటున్నానో, నేను ఎలా తయారవాలనుకుంటున్నానో సూచనలు ఇవ్వదలిచాను. గత రెండు రోజులుగా అలాగే చేస్తున్నాను. నా ఆశలు, ఆశయాలు దానికి విన్నవించుకొని వాటికి తగ్గట్టుగా సంసిద్ధం అవాల్సిందిగా, నన్ను నడిపించాల్సిందిగా వేడుకుంటున్నాను.
ఇలాంటప్పుడు ఒక ముఖ్యమయిన టెక్నిక్ మరువవద్దు. మనం ఎలా వుండాలనుకుంటున్నామో చాలా బాగా విజువలైజ్ చేసుకోవాలి. అలా అని ఓ సూపర్ మ్యాన్ లా దృశ్యాలు వేసుకొని గోడమీది నుండి దూకమని కాదు. వాస్తవ విరుద్ధంగా కలలు కంటే మీ సబ్ మీ పట్ల మొరాయించక ఛస్తుందా? రోజూ ఆఫీసుకి వెళ్ళేప్పుడు ఆఫీసులో గడిపే సమయం ఎలా నిర్మాణాత్మకంగా వుండాలో ఆలోచిస్తుంటాను. ఇంటికి వెళ్ళేప్పుడు ఇంట్లో పనులు ఎలా సమర్ధవంతంగా చక్కబెట్టుకోవాలో ఆలోచిస్తుంటాను.
పాపం నా సబ్ మైండు బాగానే నా కొరకు పాట్లు పడుతోంది - కానీ నేనూ నా అవుటర్ మైండూ కొన్నిసార్లు దాన్ని సరిగ్గా వినిపించుకుంటే కదా. నిన్న రాత్రి 9 గంటలకి నిద్రకు సంసిద్ధం కావాలని నా సబ్ మైండ్ నాకు సూచించింది. కానీ మనం వింటేనా? ఎదురుగా టివిలో రోకు ప్లేయరు ద్వారా మా ఆవిడ పెట్టిన అల్లుడా మజాకా సినిమా వస్తోంది. చిరంజీవి సినిమా అసాంతమూ చూడకుండా నిద్రకు వెళ్ళడమే! మా ఆవిడకి ఎప్పుడూ చెబుతుంటాను - పని దినాలు సినిమాలు పెట్టి పనులు పాడు చెయ్యొద్దని. సినిమా పూర్తి అయ్యేక మాత్రమే కసిరాను. ఇంకా అనలేదేమిటా అని అనుకుంటున్నా అని అంది. నిద్రపోయేసరికి 11 అయ్యింది. ఉదయమే 4:40 కి లేచి ఓ ఇరవై నిమిషాలు నెట్టు చూసి కాలకృత్యాలు కొన్ని తీర్చుకొని 5:30 నుండి ట్రెడ్మిల్లు మీద ఏ సినిమానో చూస్తూ జాగింగ్ చెయ్యాలనేది నా టైం టేబిలూ. నా బొంద టైం టేబిల్. 11 కి పడుకుంటే నాలుగున్నరకి ఎలా లేచేదీ? గుణుస్తూ నాలుగున్నర అలారం తీసివేసి పడుకున్నాను.
అలారం లేకున్నా కూడా ఎక్కువ సేపు నిద్ర పొకున్నా కూడా మెలకువ వచ్చింది. లేచి చూస్తే 4:40 అయ్యింది. నేనంటే ఎదవని కానీ నా సబ్ ఎదవ కాదని అర్ధమయ్యింది. ఎక్కువసేపు పడుకోలేదు కదా హాయిగా ఆరింటి దాకా బజ్జుంటా అని మొరాయించబోయాను కానీ నా సబ్ విన్నది కాదు. లే లే అని తరిమింది. లేచి కాస్సేపు నెట్టు, బ్లాగులూ చూసి, బ్రష్ చేసుకొని ఓ నలభై నిమిషాలు హిందీ సినిమా లక్కీ, ఓ లక్కీ నెట్‌ఫ్లిక్సులో పెట్టుకొని చూస్తూ ట్రెడ్‌మిల్లు మీద జాగింగ్ చేసాను. ఇలా ఓ మూడు రోజుల నుండి చేస్తున్నానేమో బెల్ట్ ఓ రంధ్రం తగ్గింది.
ఆ విధంగా నా సబ్ మైండ్ నేను ఎలా చెబితే అలా సలహాలు ఇస్తూ వస్తోంది. నేను దానికి ఇచ్చే ఆదేశాలు ఎప్పటికప్పుడూ ఫైన్ ట్యూనింగ్ చేస్తూ వస్తున్నాను. ఉదాహరణకు నిన్న ఒక ఆదేశం దానికి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నాకు తప్పుగా ప్రవర్తించింది. రైల్లో ఇంటికి వెళుతూ ఇంటికి వెళ్లగానే ఆవురావురుమని అన్నం తినను. ఆకలి ఆపుకోవడానికి టీ తాగుతాను అని చెప్పాను. అది గుర్తుచేసి టీ తాగించింది. కానీ టీ తాగి మనం ఊరుకుంటామా ఏంటీ? వెంఠనే మళ్ళీ నా పద్ధతిలో నేను అన్నమూ లాగించాను. కొంతలో కొంత నయమనుకోండి అంతగా అన్నం పట్టలేదు. ఇవాళ మరింత జాగ్రత్తగా సూచనలు ఇచ్చుకోవాలి. ఒరే ఎర్రి పప్పా, టీ తాగి మళ్లీ అన్నం మెక్కడం కాదురా, బ్రక్కోలీనో లేక మరో కూరగాయ ఏదయినా ఊరగాయలో కలుపుకొని తిని చావరా అని నాకు నేను చెప్పుకోవాలి.
ఇలా నా అంతరాత్మతో నా ఆటలు నాకు భలే వున్నాయండీ. చిత్రంగా నా ఆశలు, ఆశయాల వైపు నేను సూచించినట్లుగా భలే సహకరిస్తూ వస్తోంది. మరో సారి మరిన్ని అంతరాత్మ కబుర్లు చెప్పుకుందాం. నేను ఇదివరకు విశదీకరించినట్లుగా విజయానికి తాళం చెవి మన మనస్సులోనే వుంటుంది. దానిని పట్టుకొని తలుపులు తెరుస్తూ పోవాలంతే. అదే సాధన చేస్తున్నాను - బుడుబుడి అడుగులతో, తప్పటడుగులతో, బాలారిష్టాలతో. ఇదేరకంగా పెరిగి పెద్దవాడిని అయితే ఇహ నాకు తిరుగేవుండదు. చూద్దాం. పెరుగుతానో లేక నా అంతరాత్మ నుండి పారిపోతానో.
గమనిక: నా సబ్ కాన్షియస్ మైండును రిఎన్‌ఫోర్స్ చేసుకోవడం కోసం కూడా ఈ టపా వ్రాసుకున్నాను.