కొన్నేళ్ళ క్రితం హిట్స్ HITS అనే బూతు కథల యాహూ గ్రూపులు బాగా చూస్తుండేవాడిని. అప్పట్లో చాలామంది రచయితలు ఎంతో చక్కగా అందులో కథలూ, సీరియళ్ళూ రాసేవారు. నేనుకూడా బూతు కథలు కాకపోయినా సరసమయిన కథలు, సీరియళ్ళూ వ్రాసేవాడిని. అయితే ఎవరి రచనకూ పాఠకులు పెద్దగా స్పందించేవారు కాదు. అందువల్ల రచయితకి తమ రచన ఎలా వుందో తెలియక, ఫీడ్‌బ్యాక్ రాక బాగా నీరసంగా వుంటుండేది. ఒకనాడు బాగా వళ్ళు మండిన రచయిత ఒకరు గ్రూపులో అందరికీ ఒక మెసేజీ ఇచ్చాడు. ఇక్కడ కథలన్నీ చదివి ....మేనా లేక ఎవడన్నా ఈ కథలు ఎలా వున్నాయో అని చెప్పేది వుందా అని బూతులు తిట్టాడు. దానితో చాలామంది చదువరులకు నిద్రమత్తు వదిలి అప్పటినుండీ రచనలపైన వ్యాఖ్యానిస్తూ వచ్చేరు.
నా ఉద్దేశ్యం ప్రకారం ఏ రచయితకయినా విమర్శలు వచ్చినా ఫర్వాలేదు కానీ అసలు స్పందనే లేకుంటే చాలా నిరుత్సాహంగా వుంటుంది. ఊరికనే చదివి వెళ్ళిపోవడం కాకుండా కనీసం మీకు బాగా నచ్చిన టపాకో లేదా బాగా నచ్చని టపాకో స్పందిస్తూ వెళుతుంటే ఆయా రచయితలకి ఇంకా వ్రాయాలన్న ఉత్సాహం వుంటుంది.
మనం ఏదయినా ఫంక్షన్లు చేసినప్పుడు బహుమతులు వస్తుంటాయి కదా. ఎవరెవరు ఏమిచ్చారనేది ఇంటి ఆడవాళ్ళు భలేగా గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ ఎదుటి వారింట్లో ఏదయినా ఫంక్షన్ అయినప్పుడు మళ్ళీ అదే వెలకు సమానమయినదే చదివిస్తుంటారు. ఈ ఆడవారికి ఎన్నేళ్ళయినా ఎవరు ఏ ఫంక్షనుకి ఏం ప్రెజెంట్ తెచ్చి ఇచ్చారో భలేగా గుర్తుకువుంటుంది. మరి ఈ కాలంలో ఏమోగానీ నా చిన్నప్పుడు అయితే ఇంట్లో ఆడవారి మధ్య ఈ బహుమతుల ముచ్చట్లు చూసి భలే నవ్వొచ్చేది.
అలాగే కామెంట్ల విషయంలో కూడా ఎవరయినా (నాలాగా!) గుర్తుంచుకు వుంటారేమోనని ఖంగారుగా వుంటుంది. ఎందుకంటే ఇండియాలో వున్నప్పుడు ఎవరయినా ఫ్రెండ్స్ తో పాటుగా చాయ్ తాగినప్పుడో, టిఫిన్ తిన్నప్పుడో నేను బిల్లు కడతానంటే నేను బిల్లు కడతానని ఆవేశపడుతూ కట్టేస్తుంటాము కదా. నాకేమో అలా ఫైటింగ్ చేయడం రాక ఇతరులకి ఆ బిల్లు కట్టే బాధ్యత వదిలేస్తుంటాను. అలా మూడు నాలుగు సార్లు ఎవడయినా వరుసగా బిల్లు కట్టాడనుకోండి - వాడి మనస్సులో మనతో స్నేహం గురించి రిగర్ మార్టిస్ ప్రారంభమవుతుంది. అలాగే బ్లాగుల్లో కూడా ఛీ నేనే ఎప్పుడూ పనిలేని వాడిలాగా వాడి బ్లాగులో కామెంట్లు వెయ్యాలి కానీ వాడేమో నా బ్లాగు ముఖం కూడా చూడడా అని ఎక్కడ ఏ మిత్ర బ్లాగరయినా అలిగికూర్చుంటారేమో అని సందేహంతో పిసుక్కు ఛస్తుంటాను.
ఎవరెవరికి కామెంటు వేసి చాలారోజులయ్యింది అనేది దృష్టిలో వుంచుకుని వారెదయినా మంచి పోస్టు లేదా నాకు నచ్చిన పోస్టు వేసినప్పుడు నేను కూడా కామెంటేసి నా హృదయభారం దింపుకుంటా. ఉదాహరణకు నాన్న బ్లాగులో ఆ మధ్య కామెంటు వేసి చాలా రోజులయ్యింది. నాకు సూటబుల్ పోస్టులు అందులో రావడం లేదు. ఇటేమో భా రా రా అడపాదడపా నా బ్లాగులో వ్యాఖ్యానిస్తూనేవున్నారు. వారేమనుకుంటున్నారో అని నాకు అనిపిస్తూనేవుంది. మొత్తమ్మీద ఈమధ్య ఆ బ్లాగులో నాకు నచ్చిన పోస్టులు వచ్చాక నా సమస్య తీరింది. అయితే మరి అందరూ ఇలాగే కొంతయినా ఆలోచించి వ్యాఖ్యానిస్తారా లేదా అన్నది నాకు తెలియదు. అయితే టపా నచ్చకపోయినా సరే, స్పదించాల్సినంత అవసరం లేకపోయినా సరే మొహమాటానికి వ్యాఖ్యానించడం నాకు నచ్చదు. అందుకే నేను సాధారణంగా అలా చెయ్యను.
ఇహ ఇంకా కామెంటర్లను వర్గీకరణ చెయ్యాలంటే చాలా రకాలుగా చెయ్యవచ్చును. అదంతా ఎందుకులెండి ఇప్పుడు. నా భావం మీకు చేరింది కదా - చాలు. అయితే ఇలా నేను ఎప్పుడూ ఇలా కామెంట్ల లెక్కల్లో సీరియస్ అనుకోకండి. ఈ విషయాలన్నీ నిజమే అయినా సరదాగానే తీసుకోండి. మరీ తూకం వేసి వ్యాఖ్యానిస్తాననుకోకండి. అలాగే మీ కామెంట్లు లెక్క కడుతూ బాకీ కామెంట్లు వసూలు చేస్తాననుకోకండి. మొహమాటానికి నా బ్లాగులో కామెంట్లు వెయ్యకండి. నిజంగా మీకు స్పందించాలనిపిస్తే మాత్రం కాస్త ఓపిక చేసుకొని నిర్మొహమాటంగా వ్రాయండి. తిట్ల కామెంట్లయినా ఇష్టమే కానీ అసలే కామెంట్లు లేకపోతే ఉత్సాహంగా వుండదు. మీరు బహిరంగంగా మీ అభిప్రాయం చెప్పలేకపోతే అజ్ఞాతంగానయినా వ్యాఖ్య వెయ్యండి. నాకు అజ్ఞాతల మీద గౌరవం వుంది. వారు నాకు విలువైన సూచనలు, సలహాలూ ఇస్తూ వస్తున్నారు.
ఇక నా బ్లాక్ లిస్టు సంగతేంటో చూద్దామా? ఇది టాప్ సీక్రెట్ సమాచారం. ష్! ఎవ్వరికీ లీక్ చెయ్యకండేం!
1. నవతరంగం (ఎందుకో మీకు తెలుసు)
2. గడుసరి బ్లాగు (వీరికి చాదస్తం ఎక్కువ)
3. బాకు బ్లాగు (ఇందులో కామెంటెస్తే వచ్చే జన్మలో దున్నపోతయి పుడతామని ఎవరో బెదిరించారు - ఎందుకయినా మంచిదనీ...)
4. కోతల బ్లాగు ( అన్నీ ఛాదస్తపు వ్రాతల కోతలే)
5. తూలిక బ్లాగు (పెద్దవారు. అంత పెద్దవారితో నాకెందుకులే అని)
6. పి ఎస్ మహాలక్ష్మి యాత్రా బ్లాగ్ (వారి మెంటాలిటీ నాకు నచ్చదు)
7. గొల్లపూడి (సెలబ్రిటీ)
8. AVS (సెలబ్రిటీ)
9. మా బావ బ్లాగులన్నీ (ప్రేమ ఎక్కువై)
10. తాడేపల్లి (మహా సనాతన బ్లాగు)
ఇంకా ఏం బ్లాగులని బ్లాక్ చేసానబ్బా? ప్రస్తుతానికి వేరే బ్లాగులేవి గుర్తుకు రావడం లేదు. ఈ లిస్టులో మార్పులు, చేర్పులూ, కొండొకచో మినహాయింపులూ సహజంగానే వుంటూవుంటాయి. పై లిస్టులోని బ్లాగుల్లో నా కామెంటు కనిపిస్తే అట్టేట్టా అనకండి. బ్లాకు లిస్టులోలేని బ్లాగులన్నింటిలో నేను వ్యాఖ్యానిస్తాననీ, వ్యాఖ్యానించాననీ కాదుగానీ వాటి పట్ల నాకు ప్రత్యేక తిరస్కారం మాత్రం ప్రస్తుతానికి లేదు. అలా అని ఆ బ్లాగులు అన్నీ నాకు నచ్చే బ్లాగులూ అని కాదు. హమ్మయ్య. ఇక ఈ కామెంట్ల కామెంటరీ ముగించేద్దామా? మీ బ్లాక్ లిస్టు ఏదయినా వుంటే కూడా తెలపండి మరి. అలాగే ఎవరెవరు నా బ్లాగులని బ్లాక్ లిస్టులో పెట్టారో ఇక్కడే కామెంటు ద్వారా తెలియజేయండి ;)