మా వెకేషన్ చక్కగా (కొన్ని విషయాలు మనహా - తరువాత వివరిస్తాను) ముగిసింది. నా దగ్గరి స్నేహితుడు సీతారామ్ కు ఆ ప్రాంతాలు అన్నీ కొట్టిన పిండి కాబట్టి తన ఇంట్లో వుండమని, తనే దగ్గర వుండి అన్ని ప్రాంతాలూ చూపిస్తా అన్నాడు కాబట్టి అతని ఇంట్లోనే బస చేసాము. ఏఏ ప్రాంతాలు దర్శించాము అనే విషయాలు తరువాత వ్రాస్తాను. ముఖ్యంగా మన దేశీలు పెద్దగా వెళ్ళని ప్రాంతాల గురించి మాత్రం వివరిస్తాను.
అయితే మేము అనుకున్నదానికి అదనంగా ఇంకొకటి జరిగింది. తన raw food జీవన విధానం గురించి మా స్నేహితుడు చెవులు మూసి చావగొట్టినంత పనిచేసాడు. సుత్తి వీరభద్రరావులా అంతనితో వున్న అన్ని రోజులూ, గంటలూ, నిమిషాలూ ఠంగఠంగ వాయించాడు! పోనీ చెప్పడంతో ఆగాడా? అబ్బే నా చేతా ఆ ద్రావకాలేంటో మొహమాటం లేకుండా అన్ని రోజులూ త్రాగించాడు, ఏవేవో మొలకలూ, గుగ్గిళ్ళూ తినిపించాడు. అతగాడి భార్యతో మొరపెట్టుకుందామంటే ఆమెదీ అదే శైలి! ఇంకెక్కడిది నాకు దారి? మా ఆవిడా, మా పాపేమో ఇదంతా ఓ సర్కస్సులా చూస్తూ వెళ్ళారు. అతగాడేమో ఓ రింగుమాస్టారిలా నన్ను ఓ ఆట ఆడుకున్నాడు.
ఈ ప్రపంచంలో ఎవరండీ అంత శ్రద్ధగా మీ ఆరోగ్యం గురించి వివరిస్తారు? మొహమాటం లేకుండా మనని పాటించేలా చూస్తారు? అతను చెప్పేదాంట్లో విషయం వుంది అని నాకు తెలుసు. అందుకనే అతగాడి మాటలు శ్రద్ధగా వింటూ వెళ్ళాను. అతను చెయ్యమన్నవి ఓపికగా చేస్తూ వెళ్ళాను. అవన్నీ నాకు తెలియని విషయాలు కావు. మా కుటుంబ వైద్యుడు ఆ విధానాలు పాటించమని కొన్నేళ్ళుగా మాతో పోరుతూనే వున్నాడు. అడపాదడపా ప్రయత్నించాను కానీ వాటికి కట్టుబడి వుండలేదు. ఇలాంటి వాటికి ఇంట్లో సహకారం లేకపోతే ఎక్కువదూరం వెళ్ళలేము.
ఇప్పటివరకు రా జీవిత విధానం గురించి అస్పష్టంగా నా మదిలో మెదులుతున్న ఆలోచనలకు మా ఫ్రెండ్ స్పష్టత ఇచ్చాడు, ఓ పరిపూర్ణ అవగాహన కలిగించాడు. మన జీవితాల్లో ఇలాంటి ఉత్ప్రేరకాలు అవసరం. లేకపోతే మన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లు వుంటుంది. ఇంటికి వచ్చాకా ఇక ఈ రా జీవిత విధానాన్ని మొదలెట్టాలని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో వారు ముఖ్యంగా మా చిన్నమ్మాయి పాటించేలా చూస్తాను. మా మిత్రుని తొమ్మిదేళ్ళ కవలలు కూడా raw భోజనాన్నే ఎక్కువగా భుజిస్తారు. ఆల్రెడీ ఈ వెకేషనులో వున్నప్పుడే మితాహారం తీసుకోవడం, పాలు తగ్గించడం, మంచి ఆహారాన్ని పెంచడం చేస్తూ వచ్చాను. వెకేషనుకి వెళ్ళకముందు నా బొజ్జ చూసుకొని బాగా విచారించాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దిక్కుమాలినది తగ్గకపోగా పెరుగుతూ వస్తోంది - ఏం చెయ్యాలి చెప్మా అనుకుంటూ వుంటే మా సీతారాముడి రూపేణా పరిష్కారం కనపడింది.
ఇదివరలో కొన్నేళ్ళక్రితం ఓ లేడీ బ్లాగరు కాలిఫోర్నియా నుండే అనుకుంటా గ్రీన్ స్మూతీస్ గురించి, రా ఫుడ్ గురించి వ్రాసేవారు. అప్పట్లో నేను కూడా కొంత పాటించి ఎందుకో వదిలేసాను. నేను కూడా గ్రీన్ స్మూతీస్ తాగుతున్నా అంటే ఆవిడ చాలా సంతోషపడింది. ఆమె పేరు, బ్లాగు పేరు గుర్తుకులేదు. ఇలాంటివి ఏదో అరకొరా పాటిస్తే లాభం లేదు. ఒక జీవన విధానంగా చేసుకోవాలి. మా సీతారాముడి కుటుంబం దీనిని ఒక జీవన శైలిగా ఎలా మార్చుకుందీ, ఎలాంటి ఫలితాలు పొందుతున్నదీ మరో టపాలో వివరిస్తాను. అతను ఓ మూడేళ్ళ క్రితం మహా ఊబకాయంతో వుండేవాడు. ఇప్పుడు ఊబకాయం తగ్గింది కానీ ఇంకా అతనికి అధిక బరువు వుంది. అది కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాడు.