విజయం వైపు పయనం - స్వ'గతం'

విజయవాడ VK కంప్యూటర్స్ లో ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు బోధకుడిగా పనిచేస్తున్నా రోజులవి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అని కూడా చూడకుండా నా పఠనంలో లీనమయ్యేవాడిని. అక్కడి రెసెప్షనిస్ట్ కొన్ని రోజులు చూసీచూసీ "ఏంటండీ, కనీసం మా వైపు తల ఎత్తి కూడా చూడరా!" అని అడిగింది. నేను నవ్వేసాను. ఇక పూణేలో కంప్యూటర్సులో మాస్టర్స్ చేస్తున్న రోజులవి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా పాఠ్యపుస్తకాలు అదే పనిగా చదివేస్తుండేవాడిని. అలా నన్ను చూసి మిగతా ఫ్రెండ్స్ కొంతమంది కాస్త ఎగతాళి చేస్తుండేవారు. మొదటి ఏడాది ఫలితాలలో ఆ క్లాసులో మొదటి నుండి రెండోవాడిగా వచ్చాను. అది చూసి ఇంతకుముందు వ్యాఖ్యానించినవారే పొరపాటయ్యిందని చెప్పి ప్రశంసించారు. ఇక రెండో (చివరి) ఏడాది ఫలితాలలో చివరినుండి రెండో వాడిగా వచ్చాను!  ఏమయ్యింది? మధ్యలో పెళ్ళయ్యింది! 'విద్యా వివాహా నాశాయా' అని ఊరకే అన్నారా! పెళ్ళికి ముందు ఎన్ని సమస్యలున్నా జీవితంలో పైకి రావాలని కిందా మీదా పడేవాడిని. నేను చదువుతున్న దాంట్లో, చేస్తున్నదాంట్లో దాదాపుగా అగ్రగామిగా వుండేవాడిని. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా కృషి చేసేవాడిని. 

పెళ్ళి అయిన తరువాత నా పప్పులు పెద్దగా ఉడకలేదు. ఏదో కెనడాకి వచ్చాను, యుఎస్ కి వచ్చాను - ఏదో పనిచేసుకు బ్రతుకుతున్నాను కానీ సంపాదనాపరంగా చూస్తే గడించింది పెద్దగా ఏమీలేదు. అలా అని అప్పుల్లో వున్నా అని కాదు. అందుకు ఎన్నో కారణాలు - అవన్నీ మీతో పంచుకోలేను - అవన్నీ క్లాసిఫైడ్ :)). ఒక కారణం మాత్రం చెప్పగలను. మధ్యలో నాలో కృంగుబాటు మొదలయ్యింది. ఎందుకు మొదలయ్యిందీ అని అడక్కండి - అది క్లాసిఫైడూ. మొదలయ్యింది కదా అనీ మందూ మాకులూ వాడా. వాటితో మోటివేషన్ మటాష్ అవుద్దని నాకు తెలియదు - ఎవరూ చెప్పలేదు. నేను అంతేనేమో అని హాయిగా తలమీద తడిగుడ్డ వేసుకొని బ్రతుకువెళ్ళదీసేవాడిని. చాలా ఏళ్ళ తరువాత ఎందుకో నామీద నాకు అనుమానం వచ్చి పరిశోధించగా పరిశోధించగా ఆ సంగతి తెలిసింది. ప్రత్యామ్నాయం కనిపెట్టి అవి వాడి కాస్త ఫలితాలు వచ్చేసరికి ఇంతకాలం అయ్యింది. ఇప్పుడు నా మనస్సు మళ్ళీ యుద్ధానికి సంసిద్ధం అయ్యింది.

జీవితంలో ఎందులోనయినా పైకిరావాలంటే మనకు కాలం కలిసిరావాలి (దాన్నే ఆస్తికులు అదృష్టం అంటారు) లేదా కష్టపడాలి. మనదెప్పుడూ "దరిద్రుడు చేపలు పట్టడానికి సముద్రానికి వెళితే చేపలు చెట్టెక్కి కూర్చున్నాయిట" సామెత లాంటి సంగతి. ఇంకా అదృష్టాన్ని ఏం నమ్ముకుంటాను లెద్దురూ. ఇక ప్రత్యామ్నాయం శ్రమించడం. ఎలా కష్టపడాలి. ఎలానో చెప్పేందుకై ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వున్నయ్. ఎలా ధనవంతులం కావచ్చో చెప్పే పుస్తకాలూ వున్నయ్. వాటిల్లో కొంత అరిచేతిలో వైకుంఠం చూపించినట్లు వుంటాయి కానీ చాలావరకు ఆ సూత్రాలు పనిచేస్తుండవచ్చు.

విజయం ఎందులోనయినా సాధించవచ్చు కానీ అర్జంటుగా ధనవంతుడిని అయిపోవాలి నేను. ఎందుకంటే నాతోటి వారితో పోలిస్తే అట్టడుగున వున్నా. కాస్త సంపాదించేకా మిగతా సంగతులు చూసుకోవచ్చు. రిచ్ ఫెల్లో అవడం సంగతి మీ దేవుడు ఎరుగు కానీ వున్న ఉద్యోగం కొన్ని నెలల్లో ఊడబోతోంది కాబట్టి ముందు కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. కొన్ని ఇంటర్యూలు అటెండ్ అయినా ఫలితం రాలేదు. కారణం వున్న ఉద్యోగంలో పని ఎక్కువ లేక సబ్జెక్టులల్లో బేసిక్స్ కూడా మరిచిపోయాను. వాటి దుమ్ము దులపాలి. విజయం సిద్ధించాలంటే లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. అటుపై దాని గురించి మన శక్తి యుక్తులన్నీ ధారపోయాలి. మహాభారతంలో 'అర్జునుడు - చెట్టుమీద చిలక' సన్నివేశం గుర్తుకు వుంది కదా. లక్ష్యం కోసం ఎలా ఏకాగ్రతగా వుండాలో అది నాకు ఉదాహరణగా వుంటుంది. ఇతర వ్యాపకాలు అన్నీ తగ్గించాను. మనస్సు మారేందుకై, సంసిద్ధం అయ్యేందుకై వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదివేస్తున్నాను. మనస్సు, శరీరం చురుకుగా వుంచుకునేందుకై  వ్యాయామం కొనసాగిస్తున్నాను. అయితే రోజుకి కాస్సేపయినా మెడిటేషన్ కానీ సెల్ఫ్ హిప్నటిజం కానీ చాలా మంచిది కానీ ఆ విషయంలో విఫలం అవుతున్నాను. ఉదయమే లేచి ధ్యానం చేస్తే ఆరోజు అంతా ఎంతో ప్రశాంతంగా వుంటుంది కదా. ఉదయమే ఆఫీసుకి లేవాలంటేనే బద్దకం ఇంకా ధ్యానం కోసం ఏం లేస్తాను? కానీ ఇప్పుడు నేను వేరు అనుకుంటున్నా కాబట్టి ధ్యానాన్ని కూడా దారిలోకి తేవాలి. అసలయితే నాకు ఒక యోగిలాగా శ్రమపడాలని అనిపిస్తుంది.

ఈ బ్లాగింగ్ కూడా ఓ రకంగా సమయాన్ని వృధా చెయ్యడమే కానీ నేను దీన్ని నాకు అనుకూలంగా, ప్రయోజనకారిగా ఇలాంటి అవసరమయిన విషయాలు వ్రాస్తూ, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకుంటూ వుండాలనుకుంటున్నాను. ఇలా సక్సెస్ కు అవసరమయిన విషయాలు వ్రాస్తూవుంటే మరియు మీతో చర్చిస్తూ వుంటే అవి మనస్సులో బాగా సింక్ అవుతుంటాయి. అందుకని మీరు కూడా చురుకుగా ఈ విషయాలు నాతో చర్చించండి. 

3 comments:

  1. Good change bro.. even my life is broken in many ways ...because of indecisiveness and lack of courage in few crucial moments...the problem i feel is we all are born and brought up in middle class,, ie we are not sons of rich dads and poor dads..so our life just continues in the flat line and everyone (fathers,relatives and wife) don't like us to take any risk,,,they just want to play safe ,,like stable salary ,,and after some time,, invest in real estate in outer hyd or outer region of own towns,, although this is logical,, the frustration of mediocre growth pains every day in office and before sleep....

    https://www.youtube.com/watch?v=PSx7Pcbx0zw

    ReplyDelete
  2. @ అజ్ఞాత 10 మార్చి, 2015 11:06 [PM]
    మన పిల్లలు అయినా మనల్ని ఇలా విమర్శించకుండా చూసుకోవాలీ అంటే మనం ఎదగక తప్పదు. సంపాదించడం అన్నది ఓ ఆట. ఆ ఆటకు మనం రుచి మరిగితే ఇక తిరుగే వుండదు.

    వీడియో బావుంది :) హీరో, హీరోయిన్లూ బావున్నారు.

    ReplyDelete
  3. silent ipoyaaru?missing your kaburlu*.

    ReplyDelete