'రిచ్ డాడ్, పూర్ డాడ్' అనే పుస్తకం చదువుతున్నా. మొదటి అధ్యాయం కాస్త డ్రమటిక్కుగానూ, సుత్తిగానూ అనిపించినా తరువాతి ఛాప్టర్లు క్యాష్ ఫ్లో మొదలయినవి డయాగ్రమ్స్ ఇస్తూ వివరిస్తుంటే ఎంతో ఆసక్తిగా అనిపిస్తోంది. మన డబ్బులు ఎటెటు వెళతాయీ, ఎటు వైపు మళ్ళిస్తే మంచిదీ, అందులోని చిట్కాలూ, పద్ధతులూ తెలుసుకుంటుంటే భలే బావుంది. ఆర్ధికంగా విజయవంతం అయిన వారు ఇలాంటి పద్ధతులని ఉపయోగిస్తుంటారు. వ్యాపారస్తుని ఆదాయానికీ, సగటు ఉద్యోగస్తుని ఆదాయానికీ ఎలాంటి తేడాలు వున్నాయి అనేది అరటి పండు ఒలిచినంత సులభశైలిలో గ్రాఫికలుగా వివరిస్తుంటే నా కళ్ళు తెరచుకుంటూవున్నాయి. ఇన్నాళ్ళూ ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ లేకుండా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు ఎలా జీవితం నడిపించామా అనిపిస్తుంది.
ఇందులో చెప్పేవన్నీ సాధారణంగా వ్యాపారస్తులకు తెలిసినవే కానీ సగటు జనాలకు ఈ విషయాలు తెలియక, పాటించక 'Rat Race' లో కొట్టుమిట్టాడుతుంటారు. మీరు తెలవకుండానే ఈ సూత్రాలు ఒకవేళ పాటిస్తూ వున్నా ఈ పుస్తకం చదివితే ఇంకా స్పష్టత వస్తుంది. ఇది చదువుతుంటే సగటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని, బ్యాంకులనూ ఎంత బాగా మేపుతున్నానో, నా ఆదాయం ఆస్థులకు బదులుగా భారాలుగా మారుతున్నదో అర్ధం అవసాగింది. ఆర్ధిక భారాలను తగ్గిస్తూ ఆదాయాన్ని ఆస్థులుగా మలుచుకుంటూ ఆర్ధిక చక్రం ఎలా తిప్పాలో అర్ధం అయ్యింది అలా అలా ఎన్నో విషయాలు అవగతం అవుతున్నాయి. మీకు ఇప్పటికే ఆర్ధిక విజ్ఞానం వుంటే ఈ పుస్తకం పెద్దగా ఉపయోగపడకపొవచ్చును గానీ సాధారణ ఉద్యోగిగా బ్రతుకును దొర్లిస్తున్న నాలాంటి వారికి ఇది కనువిప్పు కలిగించగలదు. క్యాష్ ఫ్లో ఎలా సాధించాలో, దానికి వున్న ప్రాధాన్యత ఏంటో బాగా అర్ధం అవుతోంది.
అన్నట్టు మొన్న సాలరీ రాగానే అందులో 10% ఇండియాకు పంపించాను. మరీ పెద్ద మొత్తమేమీ కాదు లెండి. అది ఒక లక్ష రూపాయలు అవగానే అక్కడ మాకు బాగా నమ్మకస్తులయిన బంధువుకు 2% వడ్డీకి ఇవ్వలనుకుంటున్నాం. అలా ప్రతిసారీ లక్ష కాగానే వడ్డీకి ఇచ్చేస్తాం. చిన్న చిన్న అడుగులే అనుకోండీ కానీ ముందు అడుగు వెయ్యడమే సగం విజయం కదా. క్యాష్ ఫ్లో అంటూ మొదలయితే దానంతట అదే నెమ్మదిగా వేగం పుంజుకుంటుంది. కొంతమంది చిట్టీలకు ఇవ్వవచ్చు కదా అన్నారు కానీ ప్రస్తుతం నాకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చిట్టీల గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ నేను తెలుసుకున్న ప్రకారం అందులో మిగిలేది కూడా దాదాపుగా 2% వడ్డీకి సమానం అని. ఇలా కొన్ని లక్షలు సమకూరాక దాన్ని రియల్ ఎస్టేటులోకో మరోదాంట్లోకో మళ్ళించవచ్చును.
అయితే ఇంతకుముందు ఇలా డబ్బులు పంపించలేదా, పెట్టుబడులు పెట్టలేదా ఇలా పంపించడంలో విశేషం ఏముంది అని మీరు అనుకోవచ్చు. వుంది. ఈ పదిశాతం రిటైర్మెంట్ వచ్చేంతవరకూ తాకకూడదు. కేవలం పెట్టుబడి పెడుతూ పోవాలి. విశ్రాంతి రోజుల్లో కూడా అసలు అస్సలు ముట్టుకోకూడదు. దానిమీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే అనుభవించాలి. మరి మీరు ఇలా అనవచ్చు - మధ్యలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి వస్తేనో అని. దానికి నా దగ్గర ఒక సమాధానం వుంది. నా డబ్బులు నేనే బదులో లేదా అప్పో తీసుకొని కుదుటపడ్డాక ముందు దీన్ని తీర్చెయ్యాలి.
మనం వడ్డీకి డబ్బులిచ్చేవరకే భయ్యా అత్యంత నమ్మకస్థులు, ఆతరువాత తిరిగి తీసుకోగలిగితే మీరు గొప్పే. డబ్బు అప్పిచ్చి, తీసుకున్న వాళ్ళ చుట్టూ అడుక్కునే వాళ్ళకంటే హీనంగా తిరగాలి. అప్పు తీసుకున్న డబ్బుల్తో ఎలా ఎంజాయ్ చేస్తూ తిరిగివ్వడానికి లేవని చెప్తుంటే ఏడుపొక్కటే తక్కువ.
ReplyDeleteగట్టిగా అడిగామా, సంబంధాలు దెబ్బ తింటాయ్. సర్లే పోతే పొయినయ్ ఎధవ సంబంధాలు అనుకుని యింకా గట్టిగా అడిగామా, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లు... ప్చ్
Call me cynical, but I burned my hands so bad, I have promised myself never to loan money.
యెస్. ఉన్నారు. దగ్గరి బంధువులు. చాలా ఏళ్ళుగా వాళ్ళు చిట్టీల వ్యాపారం మరియు డబ్బులు వడ్డీకి తీసుకొని వేరే పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఇన్నేళ్ళుగా మా బంధువులు ఎంతో మంది వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టారు. ఏ రిమార్కూ వినలేదు. సో, అసలే రిస్క్ వుండదని ఎప్పుడూ అనలేము కానీ చాలా తక్కువ. కాలుక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి వెనకాడితే ఎలాంటి స్టెప్పూ వెయ్యలేము.
ReplyDeleteమీరు పేర్కొన్న అనుభవాలు నేను పలువురికి చేబదులు ఇచ్చినప్పుడు జరిగాయి. బదుళ్ళు కాబట్టి మరీ ఎక్కువ మొత్తం డబ్బులు కాదులెండి. అవన్నీ కూడితే అది వేరే విషయం :|