కొంతకాలం ... విరామం

తీరిక, ఓపిక మరియు ఆసక్తి తక్కువయ్యి ఈ మధ్య బ్లాగు వ్రాయడం లేదు. అందుకే కొంతకాలం విరామం ఇస్తున్నా. అలా అని మళ్ళీ రేపో, కొద్దిరోజులకో వ్రాస్తే విరామం అన్నారుగా అని అనకండేం.

చదువుతున్నా... Failure is not an option


నాకు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్  ఇష్టం. అందుకే చంద్ర గ్రహ యాత్రలు గట్రా చదివేస్తుంటాను. ఈమధ్య గ్రంధాలయానికి వెళ్ళి చూస్తే Failure Is Not an Option: Mission Control From Mercury to Apollo 13 and Beyond పుస్తకం కనపడింది. దీన్ని జీన్ క్రంజ్ అనే ఫ్లయిట్ డైరెక్టర్ వ్రాసారు. అమెరికా అంతరిక్ష పరిశోధనల తొలిరోజులు చదవడం ఎంతో బావుంది. ప్రస్తుతం అంతరిక్షం లోకి అమెరికా వారు పంపిస్తున్న అమెరికా తొలి మానవుడిని గురించిన ఘట్టం చదివేస్తున్నాను. చంద్ర గ్రహం దాకా ఇంకా వెళ్ళలా. పుస్తకం ఆసక్తి కరంగానే వుంది. ఈ విషయాల గురించి ఎవరు ఏం వ్రాసినా నాకు ఆసక్తి గానే వుంటాయి లెండి.  

http://www.amazon.com/Failure-Is-Not-Option-Mission/dp/1439148813



కేంపింగ్‌కెళ్ళొచ్చాం

శనివారం సాయంత్రం ఒక గృహప్రవేశం వుండటం వల్ల ఆదివారం ఉదయం బయల్దేరి మిషిగన్ లో వున్న సిల్వర్ లేక్ డ్యూన్స్ (ఇసుక తిన్నెలు)  కి వెళ్ళాం. మాతో పాటు ఇంకో మూడు కుటుంబాలు జత కలిసాయి.   మా దగ్గరి నుండి 4 గంటల ప్రయాణం. 2000 ఎకరాల ఇసుక తిన్నెలు అవి. అందులోకి రైడ్ తీసుకున్నాం. ఒక మోటారు బగ్గీలో 45 నిమిషాలు తిప్పి చూపించారు. చాలా బావుంది రైడ్. ఆ విశాలమయిన ఇసుక తిన్నెల్లో  ఎత్తుపల్లాల మీద వేగంగా ప్రయాణిస్తుంటే ఎంతో సరదాగా అనిపించింది. అటు తరువాత ఎంతో ఎత్తయిన, విశాలమయిన ఆ ఇసుక తిన్నెల మీద నడుస్తూ, దూకుతూ, దొర్లుతూ, జారుతూ సిల్వర్ సరస్సు వద్దకు చేరి ఆ బీచ్ వద్ద కాసేపు ఆడుకున్నాం. 

 ఇహ చీకటి పడుతుందనగా కేంపింగ్ సైటుకి వెళ్ళి టెంట్లు వేసాం. ఫైర్ పిట్ లో మంట రాజేసి చలి కాచుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నాం. ఆ తరువాత ఆ మంట మీద గ్రిల్ వేసి బార్బెక్యూ చేసాం. పలువులు పలు ఆహార పదార్ధాలు తెచ్చారు కాబట్టి నుష్టుగా భుజించాం. అర్ధరాత్రికి ముచ్చట్లు చాలించి పడుకొని ఉదయం ఆరు తరువాత లేచాం. కాస్త చలిగా వుండటంతో మళ్ళీ మంట రాజేసాం. మంట కాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ అల్పాహారం ఘనంగా తీసుకున్నాం. పదింటికి మా క్యాంప్ సైటుకి ఆనుకునే వున్న బీచుకి వెళ్ళి రింగ్ బాల్, ఫ్రిస్బీ ఆడాం. వాలీబాల్ బీచ్ కి తీసుకెళ్ళడం మరిచాం. పిల్లలు ఇసుకలో ఆటలు ఆడారు. కేంపింగ్ సైటూ, బీచూ ఎంతో బావున్నాయి.

పదకొండున్నరకి కేంపుకి తిరిగివచ్చి స్నాక్స్ తినేసి మా గుడారాలు పీకేసాం. ఆ తరువాత అటునుండి బయల్దేరి మస్కెగాన్ పార్కుకి వెళ్ళాం కానీ అక్కడ వాతావరణం బావుండకపోవడంతో ఇంటికి బయల్దేరాం. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. అలా జరిగింది మెమోరియల్ లాంగ్ వీకెండ్.

ఇలాంటి ఆహారం తింటున్నా...

ఇంకా నాకు డయాబెటిస్ రాలేదు కానీ రాకుండా చూసుకోవాలి కదా. అందుకే ఈ మధ్య (మళ్ళీ) అహారంలో కొన్ని మార్పులు చేసాను. కార్బోహైడ్రేట్స్ కాస్త తగ్గించాలనేది నా లక్ష్యం. పళ్ళూ, కూరగాయలూ బాగా తినాలి. భేష్ కానీ కూరగాయలు, ఆకులూ తినాలంటే రుచి దొరకవే. సలాడ్ డ్రెస్సింగులో కూడా ఫ్యాట్ బాగా వుంటుంది. అవి వేసుకున్నా నాకు అంత రుచిగా అనిపించదు. రోజూ తినలేము.

కొన్ని సార్లు సూపులు గట్రా కొనుక్కువచ్చి ప్రయత్నించాను. కొన్ని రోజులు గ్రీన్ స్మూతీస్ ప్రయత్నించాను. కొన్ని కారణాల అవి కుదరలేదు. ఇక అలాక్కాదని కట్ చేసిన కూరగాయలు దొరుకుతాయి కదా. వాటితో పాటుగా ఇంట్లో వున్న నచ్చిన కూరను కలిపి కొన్ని నీళ్ళు కలిపి ఉడికిస్తున్నా. అలా చక్కటి వెజిటబుల్ సూప్ తయారవుతోంది. అందులో కలిపేది నాకు నచ్చిన కూరనే కాబట్టి రుచికరంగా వుంటోంది.  అప్పుడప్పుడు నాకు ఇష్టమయిన పచ్చడి కూడా కలిపేసి తింటాను. అలా ఒకటి రెండు రవుండ్లు లాగించాకా కొద్దిగా వరి అన్నం తీసుకుంటాను. ఉదాహరణకు నిన్న మా ఇంట్లో కంది పప్పు కూర చేసింది మా ఆవిడ. అదీ, ఆవకాయా కూరగాయ ముక్కలకు కలిపి నీళ్ళు పోసి మరిగించాను. చక్కటి సూప్ తయారయ్యింది. దీనికి ముందు ఇంకో పని చేస్తుంటాను. కట్ చేసిన ఆకుకూరలను ఒక రవుండ్ లాగిస్తుంటాను. వాటిని కూడా కూరతోనో, చట్నీతోనో నంజుకుతింటాను. 

ఇవాళ శుక్రవారం కనుక ఇంట్లో నాన్ వెజ్ కూర వుండి వుంటుంది. అదియునూ కూరగాయలతో కలిపి (నాన్) వెజ్ సూపు చేసుకోవాలి. ఈ వ్రాసినదంతా రాత్రి భోజనం గురించి. పనిరోజుల్లో మధ్యాహ్నం చపాతీలు, పళ్ళూ తింటాను.   ఉదయం స్నాకుగా మొలకెత్తిన లేదా నానబెట్టిన శనగలు తింటాను. ఇహ వారాంతాలు ఆహార నియంత్రణ పెద్దగా చెయ్యను.  అలా అని అతిగా కూడా తినను.

పిల్లలూ - పల్లెలూ

పట్నాల్లో వుంటున్న వారు తమ పిల్లలని ఏడాదికి ఒకసారయినా పల్లెలకు తీసుకొనివెళ్ళి కొన్నాళ్ళయినా గడుపుతున్నారో నాకు తెలియదు కానీ... మా పిల్లలు ఇండియా వెళ్ళినప్పుడు కొంతకాలం అయినా గ్రామాల్లో వుండి వచ్చేలా ప్రోత్సహిస్తుంటాను. అయితే మా ఆవిడకి పల్లెలంటే పరాకు అవడంతో అలా పిల్లలతో సహా వెళ్ళి ఇలా ఒక్క రోజులో వచ్చేస్తుంది. మా అత్తగారి ఊరు పల్లెటూరే లెండి. అలా పిల్లలకి పెద్దగా గ్రామ వాతావరణంతో పరిచయం కలగడం లేదు. నేను ఇండియా వెళ్ళినప్పుడు పిల్లలు నాతో పాటే వుంటే కనుక గ్రామాల్లో వున్న మా బంధుమిత్రుల ఇంటికి వారినీ తీసుకువెళుతుంటాను. 

అయినా అప్పటి గ్రామాల్లా ఇప్పటి గ్రామాలు వుండటం లేదనుకోండి కానీ గుడ్డి కంటే మెల్ల నయం కదా.

చీప్ అండ్ బెస్ట్ ఆశ్రమాలు సూచించండి

APలో కానీ ఇండియాలో కానీ చక్కని ప్రశాంతమయిన వాతావరణంలో వుండే ఆశ్రమం ఎక్కడుంది? స్వామి సత్యానందాశ్రమం లాంటి బాగా డబ్బులు గుంజే అశ్రమాలు నాకు చెప్పకండి బాబో. ఇదంతా ఎందుకు అని అడక్కండి. అది నా ప్లాన్ C లెండి.  ఏదో నా లెవలుకి తగ్గట్టుగా చవక అయిన ఆశ్రమాలు మీకు తెలిస్తే చెప్పండి. 

అంబానీకి Z భద్రత - భేష్

ఇండియా వెలిగిపోతోంది. ఎర్ర బుగ్గల గురించి సుప్రీం లబలబలాడుతూవుంటే ప్రభుత్వం ఏకంగా ప్రైవేటు వ్యక్తులకూ పైలట్ కార్లు సమకూర్చుతోంది.

పల్లె జీవనంకై పరుగులు పెడుతున్న నా మనస్సు

ఏంటో ఈ కృత్రిమ ప్రపంచం, కృత్రిమ బంధాలు చూసి చూసి విసుగొస్తోంది. నేను చిన్నప్పుడు పెరిగిన పల్లె జీవనం రారామ్మంటోంది. అలా అని అప్పుడున్న పెల్లె వాతావరణం ఇప్పుడు వుండకపోవచ్చు కానీ ఏదయినా మారుమూల పల్లె వెతుక్కోవాలేమో. చిన్నప్పుడు ఎంత బావుండేదీ. టివీలూ, నెట్టులూ లేక అంత బాగా ఆరుబయట అందరం రేడియో వింటో కబుర్లు చెప్పుకునేవారం. అలాంటి జ్ఞాపకలు ఎన్నెన్నో.

మా కజిన్ ఒకరు ఎంచక్కా తన కుటుంబాన్ని సిటీలో వుంచి తన పల్లెల్లో వ్యాపారాలు పెట్టాడు. కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, పాడి మొదలయినవి. అబ్బా, నాకయితే అక్కడికి రెక్కలు కట్టుకొని వాలాలని అనిపిస్తోంది. ఎప్పుడూ కంప్యూటర్ డబ్బా ముందు ముఖం వేలాడేసుకొని చేసే ఉద్యోగాలు చేసిచేసి విసుగొస్తోంది. అలా పల్లెలో పచ్చని పరిసరాల మధ్య, పెంపుడు జంతువుల మధ్య తిరిగుతూ శ్రమిస్తూ వుంటే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. 

నేనూ తన వ్యాపారంలో జత కలుస్తా అంటే సంతోషంగా తను ఆహ్వానించవచ్చు కానీ తీరా తట్టాబుట్టా సర్దుకొని వచ్చాకా అది నా వల్ల కాకపోతేనో? ఆ వ్యాపారం సరిగా నడవకపోతేనో? ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ఓ నెల రోజులు అక్కడ గడిపి ట్రయల్ చూడాలి.

మీ సలహా ఎంటి? మీ ఇంట్లో వారి అభిప్రాయం తెలుసుకోండి అనేటటువండి రొటీన్ సలహాలు ఇవ్వకండేం.

ఓకవేళ పూర్తిగా తరలి రావడానికి ప్రాక్టికల్ గా సాధ్యపడకపోతే ఏడాదికి ఒకసారయినా వచ్చి ఓ నెల రోజులయినా పల్లెల్లో గడిపి వెళ్ళాలనేది నా ప్లాన్ B.

ఏమీ వ్రాయాలన్పించడంలే...

...అందుకే వ్రాయట్లా.

నాకున్న కొద్ది మంది శ్రేయోభిలాషులు నా గురించి ఖంగారు పడకుండా వుండటానికి ఇలా తెలియపరుస్తున్నాను. 

మళ్ళీ వ్రాయాలనిపించినప్పుడు వ్రాసేద్దాం.

ఏంటో కానీ బ్లాగు లోకం (కూడా) బోర్ కొడుతోంది.