ఎందుకయినా మంచిదని ముందే కాల్చేస్తారుట

ఒక స్వాట్ టీం శిక్షకుడూ, ఒక స్వాట్ టీం మెంబరూ వచ్చి పోలీసులు పౌరులపై ఉపయోగించే బలప్రయోగం గురించి పౌర పోలీసు శిక్షణలో మాకు వివరించారు. విచక్షణారహితంగా పోలీసులు బలప్రయోగం చేసారనీ లేదా కాల్చారనీ లేదా కాల్చి చంపారనీ పలు వార్తలు వస్తుంటాయి కదా. వాటి వెనుక ఇతర నిజాలు ఎలా వుండటానికి అవకాశం వుందో వీడియోల ద్వారా వివరించారు.   ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులు బలప్రయోగం ఉపయోగిస్తారో ప్రదర్శిస్తూ చెప్పారు. అందుకు ఆబ్జెక్టుగా నన్ను కూడా వాడుకున్నారు. నన్ను నిజంగా దెబ్బలు కొట్టలేదు లెండి.

కొన్ని నిజాలు తెలిస్తే వళ్ళు గగుర్పొడిచింది. ఇక్కడి పోలీసులు మనల్ని కాల్చడానికి మన దగ్గర నిజంగా ఏ ఆయుధమో వుండక్కరలేదు - వున్నట్లు అనిపిస్తే చాలుట. ఉదాహరణకు పోలీసులు చేతులు వెనకపెట్టమని ఆదేశించినప్పుడు పొరపాటున మీకు గోక్కోవాలనిపించి తొడ మీది చేతులు పోనిచ్చినా మీరు గన్ను తీస్తున్నారేమో అని వాళ్లనుకునే అవకాశం వుంది. అనుకుంటే పర్లేదు కానీ ఎందుకయినా మంచిదని వాళ్ళు  కాల్చేస్తారుట. పోనీ అలా కాకపోయినా పోలీసులు ఐడి అడుగుతున్నారనుకొని పర్సు తియ్యబోయినా మనము ఆయుధం తీస్తున్నారని వాళ్ళు అనుకొని కాల్చేసే ప్రమాదం వుంది. అంచేతా నాకు అర్ధమయ్యిందేమిటంటే ఇక్కడి పోలీసులు అతి జాగ్రత్తపరులు కాబట్టీ, ఎందుకయినా మంచిదని మనల్ని ముందుగానే కాల్చేసే ప్రమాదం వుంది కాబట్టి వాళ్ళు తటస్థించినప్పుడు బుద్ధిగా చెప్పినట్లు చెయ్యడం బెటర్. ఎందుకయినా వాళ్ళు మనల్ని అరెస్టు చేస్తున్నామంటే మారు మాట్లాడకుండా చేతులు వెనక్కి పెట్టి నిలబడటం మంచిది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి తరువాత తీరిగ్గా  తేల్చుకోవచ్చు కానీ ముందు ముందు తాపీగా మనం విచారించకుండా ఉపయొగపడుతుంది. ఇది నేను ఇస్తున్న బోడి సలహా కాదు లెండి - వాళ్ళే క్లాసులో అలా చెప్పారు.

మాకు ఒక నిజమయిన సంఘటన గురించిన వీడియో చూపించారు. అందులో ఒక యువకుడిని ఇద్దరు పోలీసులు టపటపా కాల్చేస్తారు. అది చూస్తే అయ్యో పాపం ఎందుకు అలా టపటపా కాల్చేస్తున్నారు అని అనిపించింది. అదే సంఘటణది ఇంకో వీడియో చూపించారు. అందులో పోలీసులు అరెస్టు చేస్తుంటే ఆ యువకుడు ప్రతిఘటిస్తూ గన్నుతో బెదిరిస్తుంటాడు. ఇంకేం వీళ్ళు టపటపలాడిస్తారు. తప్పదు కదా మరి. అదే సంఘటణకి చెందిన మరో వీడియో కూడా చూపించారు. అందులో పోలీసులు గన్ను అనుకున్నది అతగాడి సెల్ ఫోన్. అప్పట్లో సెల్ ఫోనులు పెద్దవిగా వుండేవి లెండి. ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు? ఆ యువకుడు గన్నుతో బెదిరించకపోయినా కూడా పోలీసులకు మాత్రం అది గన్నులాగే అనిపించి ఆత్మరక్షణ కోసం కాల్చారు కాబట్టి వాళ్ళ తప్పేమే లేదని కోర్టు అందిట. మరి మీరేమంటారు?

ఇక ఒక దుండగుడు ఆయుధంతో సంచరిస్తూ హడావిడి చేస్తున్నాడు అనుకోండి. పోలీసులు వచ్చి గన్ను డ్రాప్ చెయ్యి అని వార్నింగులు గట్రా ఇవ్వరంట. అవతలివాడు అది వదిలెయ్యకుండా తిరగబడి వాళ్ళని కానీ, చుట్టుపక్కల వున్నవారిని కాల్చేస్తే? అందుకే ఎందుకయినా మంచిదని చడీచప్పుడు లేకుండా ముందే కాల్చేస్తారుట. వాళ్లకి గానీ, చుట్టు పక్కల వున్న పౌరులకు గానీ ఏమాత్రం ఇబ్బంది లేదనుకున్నప్పుడు మాత్రమే హెచ్చరిక చేస్తారంట. 

మరోసారి పోలీసులు ఉపయొగించే టేజర్ గన్నుల గురించి చెప్పుకుందాం. అవునూ ఇండియా పోలీసులు టేజర్స్ ఉపయోగిస్తున్నారా?

ఇక్కడి పోలీసులతో పూసుకు తిరగడం వల్ల...

... నష్టాలు ఏమయినా వుంటాయేమో ఇంకా అనుభవానికి రాలేదు కానీ ప్రస్థుతానికయితే  కాస్తో కూస్తో ఆ పరిచయాలు ఉపయోగపడుతున్నాయి. ఎన్నడూ లేనిది ఈమధ్యే నాకు వారి అవసరం కలిగింది. కలిగిందీ అంటే కలగదూ మరి. దానికో ఫ్లాష్ బ్యాక్ వుంది మరీ.  సోమవారం రాత్రి 8 గంటల వేళ హాయిగా సోఫాలొ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ టివి చూస్తున్నా. జనాలు నన్ను అంత విశ్రాంతిగా వుండనిస్తారా? తలుపులూ, కిటికీలూ బిగించుకున్నా కూడా వీధి బయటి నుండి ముందు స్క్రీచ్ మనీ ఆ తరువాత దఢేళ్ మనీ శబ్దాలు వినిపించాయి.  రెండు కార్లు గుద్దుకున్నాయి అని అర్ధమయ్యింది. అంతలా ఆ శబ్దాలు వినిపించాక కూడా తొంగిచూడకపోతే ఆత్మ ఘోషిస్తుందని వెళ్ళి బ్లయిండ్స్ తొలగించి ఎదురుగా చూసా ఏమీ కనిపించలేదు. కళ్ళు చిట్లించి కాస్త దూరంలో వున్న ఇంటర్‌సెక్షన్ వైపు చూసి ఉలిక్కి పడ్డా. అక్కడో కారు రోడ్డుకి అడ్డంగా వుంది. ఆ శాల్తీ దిగి కారు చూసుకుంటోంది.  ఆ శాల్తీ ఎవరో కాదు - మా ఆవిడే! ఆ కారు నాదే!!

మా ఆవిడ మా ఇంటికి రావడానికని లెఫ్ట్ టర్న్ తీసుకుంటుండగా మరో కారు వచ్చి గుద్దింది. మాది SUV - అతగాడిది కారు అవడం వల్ల మా కారు గిల్లకి కాస్త దెబ్బ తగిలింది కానీ అతగాడి కారు మాత్రం ముందు వైపు ఎడమపక్క బాగా సొట్ట పోయింది. మా ఆవిడ సహజంగానే ఎదుటివాడిని గద్దించింది. వాడు బుద్దిగా పోలీసులకు ఫోను చేసాడు. నేను నెమ్మదిగా నెగోషియేట్ చెద్దామనుకున్నా కానీ మా ఆవిడ నన్ను గదమాయించడంతో నోరు మూసుకుక్కూర్చున్నా.  ఇంతలోకే పోలీసు ఆఫీసర్ వచ్చాడు. ఇంకా మన చేతిలో ఏముంటుంది.  తగుదునమ్మా అంటూ ఆ చీకట్లో  జరిగిన ఈ ప్రమాదానికి ఓ పాదాచారి సాక్షిగా కూడా వుంది. జరిగిందేంటో ఆఫీసరుకి చెప్పింది. రిపోర్ట్ తీసుకొని మా ఆవిడకి ట్రాఫిక్ టికెట్ ఇచ్చి ఐ-బాండ్ మీద అనితను రిలీజ్ చేసాడు. వచ్చే నెల కోర్టుకి వచ్చి చెప్పుకోమన్నాడు. 

ఏంటీ కోర్టులో వాదించేదీ? గ్రీన్ లైటు మీద  లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత అలా టర్న్ తీసుకున్నవారిదే అవుతుంది.  అందువల్ల అక్కడ నెగ్గలేం కానీ కోర్టుకి ఎక్కడం ఇదే మొదటిసారి అవడం వల్ల కొన్ని వివరాలు కావాల్సివచ్చాయి. ఉదాహరణకు ఎదుటి వ్యక్తి కోర్టుకి రాకున్నా అనిత తన తప్పుని ఒప్పుకోవాలా లాంటి సందేహాలు ఎవరిని అడిగినా, నెట్టులో చూసినా దొరకలేదు. నిన్న పౌర పోలీసు శిక్షణకి వెళ్ళినప్పుడు అక్కడ తోటి వారిని అడిగాను. వారికీ స్పష్టంగా తెలియదు. మా శిక్షణను పర్యవేక్షించే అధికారినే ఎంచక్కా అడగవచ్చని చెప్పారు. ఆ అధికారి చాలా మంచి వ్యక్తి, స్నేహ శీలి. విషయం చెప్పి సలహా అడిగాను. చాలావరకు ఎదుటివారు కోర్టుకి రారనీ, అలాంటప్పుడు ఎవరిది తప్పు అనే ప్రశ్నే రాదనీ, కేస్ డిస్మిస్ చేస్తారనీ చెప్పాడు. ఇక అతను కోర్టుకి రాగూడదంటూ  మా ఆవిడ తన దేవుడిని ప్రార్ధించాలి. వస్తే ఫైన్లూ, లైసెన్స్ పాయింట్లు పోవడమూ  వుంటాయి.  అందువల్ల ముందు ముందు వాహన భీమా పెరుగుతుంది. 

కొత్త కారు రిపేరుకి ఇచ్చాం. ఎదుటి కారు రిపేర్ ఖర్చులు కూడా మా వాహన భీమా మీదనే పడుతుందనుకుంటాను. వెరసి మొత్తమ్మీద వచ్చే రెన్యూవలులో వాహన భీమా పెరగడం ఖాయం. మా కారు రిపేరుకి ఎంతవుతుందో ఇంకా తెలియదు కానీ ముందు వెయ్యి డాలర్లు మేము కట్టుకోవాలి - మిగతాది భీమా భరిస్తుంది కానీ ఆతరువాత ఎంచక్కా భీమా పెంచేసి ఇచ్చిన డబ్బులు నెమ్మది నెమ్మదిగా గుంజేస్తుంది.  ఇంకో సమస్యేంటంటే ఇంకో ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా మేమందరం కార్లు నడపాలి.  రెండో ప్రమాదం ఎప్పుడు జరిగినా (బహుశా మూడేళ్ళలో అనుకుంటా) భీమా తారాజువ్వలా పెరిగిపోతుంది. అందుకని చచ్చినట్లు ఒళ్ళు  దగ్గరపెట్టుకొని కారు నడుపుతున్నా.  ఇహ మా ఇంట్లోని మిగతావారు ఎలా నడుపుతారో ఏమో చూడాలి.

ఇన్ని నెలలుగా మ ఆవిడ కారు నడుపుతుంటే ఇంకా ప్రమాదాలు జరగట్లేదే అని ఈమధ్యనే బాగా ముక్కు మీద వేలేసుకున్నా. నా అంచనా ప్రకారం ఇప్పటికి మూడు ఘోరమయిన ప్రమాదాలయినా జరిగివుండాలి కానీ ఓ ఏడాది తరువాత చిన్న ప్రమాదంతో సరిపుచ్చినందుకు సంతోషంగానే వుంది. ఎవరికీ ఏమీ కాలేదు. కారులో అమ్మలు కూడా వుంది అప్పుడు.  కారు నడపడం అంటే ఆట కాదని, అది ఒక బాధ్యత అని ఇప్పటికయినా తనకి భయం ఏర్పడితే అదే పదివేల డాలర్లు. ఆ భయం ఏర్పడటం కోసమే ఇన్నాళ్ళుగా వేచివున్నా.  

ఇక్కడ తాగి కారెక్కితే...(పౌర పోలీసు శిక్షణ నుండి వివరాలు)

షికాగోకి వచ్చిన తొలిరోజుల్లో ఒక రాత్రి పూట రెండు గంటల ప్రాంతంలొ మా ఇంటి ముందు వీధిలో ఫ్లాషింగ్ పోలీసు లైట్లు వెలుగుతుతూవుంటే ఏం జరుగుతోందా అని నేను చీకట్లోనే వుండి నిశ్శబ్దంగా కిటికీలకు వున్న బ్లైండ్స్ కొద్దిగా తొలగించి చూసాను. ఒక కారు వెనకాల పోలీసు కారు వుంది. అందులోని ఓ అమ్మాయిని కిందికి దిగమని ఆదేశించాడు ఆ పోలీసు అధికారి. ఆ తరువాత ఆమెను రకరకాల విన్యాసాలు చెయ్యమని అదేశించాడు. పోలీసులు అలా కూడా చేస్తారని అప్పటిదాకా నాకు తెలియదు కాబట్టి ఆశ్చర్యపడుతూ అలాగే గమనిస్తూ వెళ్ళాను. నెమ్మదిగా అర్ధమయ్యింది ఆ పరీక్షలన్నీ ఆమె బాగా తాగి వుందో లేదో తెలుసుకోవడం కోసమని.

డ్రైవింగ్ అండర్ ఇంఫ్లుయెన్స్ (DUI) గురించి చెబుతూ బాగా తాగిన వారిని ఎలా గుర్తిస్తారో, ఎలాంటి పరీక్షలు చేస్తారో, వాటి పర్యవసనాలు ఏంటో చెబుతూవుంటే నాకు వణుకు పుట్టింది. ఎందుకంటే ఒకసారి అందుకు అరెస్టు అయితే బయటకి రావడానికి కనీసం 6,500 డాలర్లు అవుతాయిట. వాళ్లు చెప్పినదంతా విని ఎంత తాగిన తరువాత కారు ఎక్కకూడదు, ఎక్కువయ్యిందని ఎలా తెలియాలి అని అడిగాను. తాగిన తరువాత కారు తోలకపొవడమే మంచిదని చెప్పారు. తాగని వారినెవరినన్నా డ్రైవ్ చెయ్యమని చెప్పాలని సలహా ఇచ్చారు. లేదా అక్కడే పడుకోవాలి లేదా టాక్సీ తెప్పించుకోవాలి.   ఎందుకంటే మన శరీరం మీద మందు ప్రభావం లెక్క కట్టడం క్లిష్టమయిన లెక్క. ఎంత తాగాం, ఎప్పుడు తాగాం, ఎప్పుడు తిన్నాం, మన మెటబాలిజం, మన వంట్లోని కొవ్వు, బరువు , మన వంట్లోని మిగిలిన చెత్తా చెదారం అన్నీ ప్రభావం చూపిస్తాయి. ఏదో అనుకొని లెక్క తప్పితే పోలీసు కారు వెనకాలే లైట్లు వేసుకుంటూ వస్తే అప్పుడు చచ్చింది గొర్రె అనుకోవాలి. పర్యవసనాలు  కఠినంగా వుంటాయి.

ఉదాహరణకి వంట్లో ఎంత కొవ్వు ఎక్కువుంటే అంతగా మన శరీరం మందుని హరాయించుకోదు. గంటకి ఒక ఆల్కాహాల్ సెర్వింగ్ చొప్పున మన శరీరం జీర్ణం చేసుకుంటుందిట. ఎన్ని సెర్వింగులు తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాం దాన్ని బట్టి కూడా వుంటుంది. తాగినవాడు స్టెడీగానే వున్నాననుకోవచ్చు కానీ బయటివాడికి తెలుస్తుంది ఆ తూలుడు. ఇంట్లో తూలితే ఫర్వాలేదు - రోడ్డు మీద మన కారు తూలితేనే వుంటుంది తమాషా.

ఓ మూడేళ్ళ క్రితం మాత్రం బాగా తాగి కారు నడిపాను. మా ఇంటి దగ్గరి మిత్రుడి ఇంట్లో పార్టీకి వెళ్ళి బాగా మందు పుచ్చుకున్నాను. దగ్గరేగా, ఫర్వాలేదులే అని కారు తోలుకుంటూ వచ్చాను. అలాంటప్పుడు పొరపాటున పోలీసులు పసిగట్టి ఆపితే జరిగే పర్యవసానాలు తెలిస్తే అంత పని చెయ్యకపోదును. ఈమధ్య కూడా ఒ రెండు సార్లు తాగి నడిపాను కానీ అంత ఎక్కువ తాగలేదు లెండి. అయితే నేను తక్కువ తాగాననుకున్నది పోలీసులకు ఎక్కువగా అనిపించవచ్చు. అప్పుడు వస్తుంది చిక్కు.

మరీ పెద్ద టపా వ్రాసే ఉద్దేశ్యం లేదు కాబట్టి తాగి పట్టుబడితే జరిగే పర్యవసనాలు వివరంగా వ్రాయలేదు. ఆసక్తి వున్న వారు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. అందుచేత మందు బాబులూ - బహుపరాక్!

మా ఊర్లో గ్యాంగ్ వార్లు

మొన్నటి వారం పౌర పోలీసు శిక్షణలో గ్యాంగుల గురించి చెప్పారు. వాళ్ళు ఎలా వుంటారు వారి మనస్థత్వం ఏంటి, ఎలాంటి ఆయుధాలు వాడుతారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, ఎలాంటి ఆభరణాలు ధరిస్తారు, ఎలాంటి చట్ట వ్యతిరేకమయిన కార్యక్రమాలు చేపడుతారు అనేవి అన్నీ ప్రదర్శన వస్తువుల ద్వారా, పోస్టర్ల ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఇదివరలో నగర వీధుల్లోని గోడల మీద అడ్దదిడ్డమయిన వ్రాతలు చూసి కుర్రాళ్ళు పెంకిగా వ్రాసే గ్రాఫిటీ అనుకునేవాడిని. గ్యాంగులు కూడా తమ తమ టెరిటరీలను ప్రకటిస్తూ తమ గ్యాంగు యొక్క చిహ్నాలను, ఉద్దేశ్యాలను అలా గోడల మీద ప్రకటిస్తారుట. మోడర్న్ ఆర్టులా ఆ వ్రాతలు, చిత్రాలు మనకు గ్యాంగుల గురించి తెలిస్తే తప్ప బోధపడవు. అయినా అవి వాళ్ళు వ్రాసేవి సామాన్య జనాన్ని ఉద్దేశ్యించి కాదు లెండి - ఇతర గ్యాంగులకు అర్ధమవాలని అలా వ్రాస్తారు. 

పోలీసులు ఆయా గ్యాంగులను ఏరిపారేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతారు అయినా ఆ సమస్య ఇంకా మా పట్టణంలో కూడా ఇంకా ఎందుకు వుంది అనేటటువంటి వివరాలు చెప్పారు.  మా టవునులో వున్న గ్యాంగుల పేర్లు, వాటి పనులు చెప్పారు. గ్యాంగ్‌స్టర్స్  ముఖ్యంగా మత్తుమందుల అమ్మకం చేస్తారు.    వారు మత్తుమందులకు అలవాటు పడి వుంటారు కనుక వాటికి కావాలసిన డబ్బు కోసం కూడా దొంగతనాలూ, దోపిడీలూ చేస్తారు. హైస్కూలులో చదువుతున్నప్పటి నుండే గ్యాంగుల్లో రిక్రూట్మెంట్లు జరుగుతాయని, పాఠశాలల్లొ కూడా కుర్ర గ్యాంగు మెంబర్లు వుంటారని తెలిసి ఆశ్చర్యం అనిపించింది. గ్యాంగు సభ్యుల సంజ్ఞలు, సంకేతాలు ఎలా వుంటాయో తెలిసింది. వాళ్ళు పరస్పరం ఎలా సమాచారం అందించుకుంటారో చెప్పారు.  

గ్యాంగుల మధ్య ఎలా యుద్ధాలు జరుగుతాయి, ఎలా వాళ్లు చంపుకుంటారు, ఎలా ఒకరి ప్రాంతపై ఇంకొక ప్రాంతం వారు ఆధిపత్యం ఎలా చెయాయించాలని చూస్తారు అనే వివరాలు కొన్ని సినిమా బిట్స్, మరికొన్ని వీడియో బిట్స్ చూపిస్తూ వివరించారు. మా ఊర్లో జరిగే గ్యాంగ్ యుద్ధాల గురించి కూడా చెప్పారు. మా పక్క కమ్యూనిటిలో గత ఏడాది అనుకుంటా జరిగిన కాల్పుల్లో ఒక అమాయక ప్రాణి బలయ్యాడు అని చెప్పారు. గ్యాంగ్ వార్ జరుగుతుంటే మధ్యలో అతగాడు బలయ్యాడంట. మా పక్క కమ్యూనిటీలో ఆరుగురు మెక్సికన్ గ్యాంగ్‌స్టర్స్(SGD gang) వున్నారని చెప్పడంతో కాస్త అనీజీగా అనిపించింది. అదే కమ్యూనిటీలో నా క్లోజ్ ఫ్రెండ్ వుంటుంటాడు, వారి ఇంటికి తరచుగా వెళుతుంటాం మరి.  సామాన్య జనం జోలికి వారు అంతగా రారు అని తెలియడంతో కాస్త ఊరట అనిపించింది కానీ దొంగతనాలు, దోపిడీలు మాత్రం అన్ని ఇళ్ళల్లో, కార్లల్లో చేస్తూనేవుంటారు కదా. 32 వేల మంది వుండే మా పట్టణంలో సరాసరిన రోజుకో దొంగతనం జరుగుతూవుంటుందిట. 

తెలుగు బ్లాగుల్లో గ్యాంగుల గురించి నేను వారికి ఎదురు బోధిద్దామనుకొని మిన్నకున్నాను.

ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ శిక్షణ వుంది. ఈ రోజు ట్రాఫిక్ పోలీసింగ్ గురించి చెబుతారట. ఈరోజు మమ్మల్ని పోలీసు కార్లల్లో తిప్పుతారని అనుకుంటున్నాం. స్క్వాడ్ కార్లలో వెళుతూ ఆఫీసర్ల విధులు మేము గమనిస్తుండాలనుకుంటా.

అక్షర కూడా సినిమాల్లోకి వస్తే బావుండును

కమల్ హసన్ పెద్ద కూతురు శృతి హసన్ ఫోటోలు చూసినా ఆమె సినిమా కొంతకాలం వరకు చూడకపోవడంతో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. ఆ మధ్య అనగనగా ఒక ధీరుడు సినిమా కొంత సేపు చూసాను. అందులో ఆమె నచ్చింది. నటన కూడ బాగనిపించింది. బాగానే వుందే అనుకున్నా.   ఈమె 1986 లో పుట్టింది. 

ఆ మధ్య ఓ సందర్భంలో కమల్ హసన్ చిన్న కూతురు అక్షర హసన్ ఫోటోలు చూసి ఎంత బావుందో ఈ అమ్మాయి అనుకున్నా. సినిమాల్లోకి వస్తే బావుండును. ఇంకా చదువుకుంటోందిట. మరి సినిమాల్లోకి ముందుముందు అయినా వస్తుందో రాదో తెలియడం లేదు. ఈమె 1991 లో పుట్టింది.

ఈ అమ్మాయి మీకు కూడ నచ్చిందా లేదా? 

మేమూ దూకేసాంగా

నిన్న దూకుడు సినిమాకి వెళ్ళాం. మహేశూ, సమంతా ఇద్దరూ ఇష్టమయిన వాళ్ళు కావడంతో సినిమాకు వెళ్ళక తప్పలేదు. సమంతా ఇంకాస్త లావుంటే బావుండేది. ఈ సినిమా గురించి ఇప్పటికి చాలామంది చాలా చెప్పేసారు కాబట్టి పెద్దగా నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. కానీ ఒకట్రెండు విషయాలు. సినిమా అంటే చెవుల్లో  పూలే అని తెలిసే  వెళతాము కానీ అలా అని మరీ క్యాబేజీ పూలు పెడితేనే చిరాకు వస్తుంది. ఈ సినిమాలో పెద్దాయనకు బయటి ప్రపంచం తెలియకుండా అన్నేళ్ళు అందరూ అలా నాటకాలాడుతూనే వుండటం అనే విషయం నాకంతంగా జీర్ణమయ్యింది కాదు.  ఆ కథా లోపం వున్నా కూడా సినిమాలో మిగతావన్నీ మంచిగా కుదిరాయి కాబట్టి ఆ దూకుడులో ఆ లోటు కొట్టుకుపోతుంది కాబట్టి సినిమా అబవ్ ఏవరేజిగా మిగిలిపోయింది. అలాంటి కొన్ని పొరపాట్లూ సవరించుకొని వుంటే పోకిరీకి దీటుగా దూకేదేమో.

ఈ సారి బాగానే నేను చదివినంత వరకు వెబ్ సైట్లు కానీ, బ్లాగర్లు కానీ కథలోని ముఖ్యమయిన మలుపులు బయటపెట్టలేదు. ఒక వెబ్సైటులో ఒక ట్విస్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదిలారు. అదేంటా అనుకుంటూ ఉత్సుకత పడుతూ వుంటే a2z డ్రీంస్ గారు తమ డోంట్ క్లిక్ బ్లాగులో ఎంచక్కా  అది చెప్పెయ్యడంతో నా ఉత్సుకత నీరు కారిపోయింది. సినిమా చూసిన అత్యుత్సాహంలొ అలా చెప్పేసి వుంటారు కానీ చెప్పకపోయివుంటే బావుండేది. ఆ విషయం సినిమా చూస్తూ తెలుసుకుంటే కాస్త సంభ్రమంగా వుండేది. ప్చ్.  

అందుకే అందరికీ ఓ విన్నపం. సినిమాలు చూడండి - ఎలా వుందో చెప్పండి కానీ ముఖ్యమయిన ట్విస్టులన్నీ విప్పదీసి మాకు చూపకండి. నగ్నమయిన సినిమాను చూసేందుకు ఇంకేం మిగిలివుంటుంది?  విశ్లేషకులకు, రంధ్రాన్వేషకులకు  ఇంకా ఎనలైజ్ చెయ్యాలని వుంటుండొచ్చు కానీ మాలాంటి మామూలు జనాలకు కాస్త కాస్త తెలుస్తుంటేనే చూడబుద్ధి అవుతూ వుంటుంది. కదూ. ప్లీజ్.

మాంసాహారంతో మనస్థత్వంలో మహా తేడా :)

అసలే మనకు ఆత్మాభిమానం ఎక్కువ. అన్నిచోట్లా కాదులెండి - అనువైన చోట. హి హీ. ఆ మధ్య వళ్ళు దగ్గరుంచుకొని బ్రతకడం బెటరు కదా బ్రదర్ అనుకొని ఆరోగ్యం చక్కా వుండాలని చాలావరకు ఆకులూ, అలములూ, దుంపలూ, పళ్ళూ, కూరగాయలు తింటూ బ్రతికాను. ఆకులెలా తింటావన్నా అని అప్పుడప్పుడు ఆప్పారావు లాంటివారు ఆశ్చర్యపోతూనే వుండేవారు.

ఈమధ్య జిమ్ములో బరువు లెత్తుతున్నా కదా - కేలరీలు సరిపోవడం లేదని  సాత్వికాహారానికి నమస్తే చెప్పి జనజీవన స్రవంతిలో కలిసేసా. అన్నీ ఫుల్లుగా లాగించేస్తున్నా. బరువు పెరగాలని తిండి ఇంకా దట్టంగా దూర్చేస్తున్నా కానీ అంతగా బరువు పెరగట్లేదనుకోండి. అయితే జిమ్ము చేస్తున్నందువల్లనో లేక సాత్వికాహారం మానివేసినందువల్లనో  కానీ నాలో సాత్విక లక్షణాలు తగ్గి పౌరుషం పొంగుకువస్తోంది. ఇందుకు కైరోప్రాక్టిక్ కూడా కొంత కారణమేమో. చూసి చూసి ఇహ లాభం లేదని  కొంత కాలం FLR ప్రయత్నించిన వాడినల్లా దాన్ని గిరవాటు వేసాను. అలా అలా నా ఆలోచనా రీతుల్లో కొన్ని మార్పులు గమనిస్తున్నాను. ఈ ఉత్సాహం ఎక్కడికి దారితీస్తుందో ఏమో చూడాలి :)

ఇద్దరి మనసులు కలిస్తే...కూడా ఇబ్బందే

చాలామంది పెళ్ళి అయిన జంటలని పరిశీలిస్తే అనిపిస్తూవుంటుంది... దంపతుల్లో ఇద్దరి మనస్థత్వాలు కొన్ని విషయాలలో అయినా మరీ ఒక్కటే అయినా ఇబ్బందే అని. ఆయా విషయాలపై ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే అయినప్పుడు భిన్న కోణాలు స్పృశించే అవకాశం అంతగా వుండదు. ప్రతి దానికీ ప్రతిపక్షం లేకపోతే దూకుడు ఎక్కువవుతుంది. అది మరీ ఎక్కువయినప్పుడు బోల్తా పడొచ్చు. కొన్ని సార్లు బోల్తా పడుతున్నా అర్ధం కాకపోవచ్చు.  ఎందుకంటే బయటి వారు ఎంతమంది వున్నా అలారం బెల్స్ మ్రోగించే పార్ట్నర్ లేకపోతే గుడ్డెద్దు చేలో పడినట్లే వుంటుంది వ్యవహారం.  జత ఎద్దులలో ఒక ఎద్దు గుడ్డిదయినా మరొక ఎద్దుకయినా చూపు సరిగ్గా వుంటే వ్యవహారం బ్యాలన్స్ అవుతుంది. 

మా ఇంట్లో మా నాన్నగారు నాస్తికులుగా వుండేవారు, అమ్మ ఆస్తికురాలు. ఇద్దరూ నన్ను చెరో వైపుకి లాగుతూ 'బ్యాలన్స్' చేస్తుండేవారు! రెండూ తగినంతగా చూసాక మా నాన్న వైపే మొగ్గాననుకోండి. మా నాన్నకి మానవత్వం ఎక్కువ వుండేది. అందువల్ల ఉదారంగా కాస్త దానధర్మాలు చేస్తుండేవారు. అలాంటి వాటిని మా అమ్మ నిగ్రహిస్తుండేది. అలా అమ్మ ఆజమాయిషీ లేకపోతే మా కొద్ది ఆస్థీ హారతి కర్పూరం అయివుండేదేమో.

ఇప్పుడు మా ఇంట్లో మా ఇద్దరికీ అంతగా ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ లేకపోయినదువల్ల ఆస్థి అంతగా కూడబెట్టలేకపోయాము. ఆ తెలివి కాస్తో కూస్తో తెచ్చుకుంటున్నా కూడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతూనేవున్నాయ్.  ఇద్దరమూ అలాంటి విషయాల్లో దద్దమ్మలము అవడం మూలాన ఇలాంటి ఇబ్బందులు వుంటాయి. నాకు లోకజ్ఞానం అంతో ఇంతో వున్నా అసలు విషయంలో అంతగా లేకపోయేసరికి ఆస్థులు అంతగా పెరగట్లేదు.   నాకు లేకపోయినా మా ఆవిడకు అయినా ఆ తెలివి వుంటే ఆ లోటుపాట్లు సవరించుకునేది. అంటే ఏదో అప్పుల్లో వున్నామనో, ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నామనో కాదు గానీ ఇతరులతో పొల్చుకుంటే మాత్రం ఎక్కడో వున్నట్లుగా వుంటుంది. ఎవరితో పోల్చుకోకుండా వుంటే బాగానే వుంటుంది :)  మాకు క్రెడిట్ కార్డ్ బ్యాలన్సులు కూడా లేవండీ.     మరీ ఎక్కువ కాకపోయినా నా నెట్ సంపాదనలో  నెలకి  ఇరవై శాతానికి అటో ఇటో అయినా వెనకేస్తున్నా అనుకోండి.  (దాదాపుగా) ఒక్కడి సంపాదనతో ఒక్కత్తే పెళ్ళాం, ఇద్దరు పిల్లలు, రెండు కార్లూ, రెండు చేపలు గట్రా నిభాయించుకువస్తూ ఎక్కువగా పొదుపు చెయ్యాలంటే అవస్థగానే వుంది సుమండీ. ఇంకా నయ్యం ఇంకా నాకు చిన్నిల్లు లేదు :)) ఆ ఒక్కటి కూడా వుంటే మూలిగే నక్క మీద తాటి పండులా వుండేది. సర్లెండి, జస్ట్ కిడ్డింగ్.

కొన్ని కుటుంబాలలో ఇద్దరి మెంటాలిటీలు ఒక్కటే అవటం మూలాన ఇతర సమస్యలు కనిపిస్తుంటాయి. చదువు, విజ్ఞానంతో అతి జాగ్రతా అబ్బి అవి తమ పిల్లల మీద చూపిస్తుంటారు. అలా దంపతులిద్దరూ తమ పిల్లలని మరీ సుకుమారంగా ప్రతి దానికీ హెచ్చరిస్తూ, ప్రతి దానికీ ఖంగారు పడుతూ పెంచేస్తుంటారు. ప్రతీ సారి ఆర్ యు ఆల్రైట్ అని కనుక్కుంటుంటారు. పిల్లలు తప్పటడులు వెయ్యడం సాధారణం, నడక నేర్చుకోవాలంటే ముందు పడిపోక తప్పదు కదా. వీళ్ళ అతి ఎలా వుంటుందంటే ఎక్కడ పడిపోతాడో అని అవి కూడా వెయ్యనివ్వరు. పిల్లలు పెరుగెత్తొద్దు, ఎగరవద్దు, దుమకవద్దు, ఆడుకోవద్దు. ఏం చెయ్యాలి? పెద్దల్లా బుద్ధిగా ఏ టివినో, వీడియో గేమ్సో ఆడుతూ   గడిపెయ్యాలి. అప్పుడు పిల్లలు ఎంచక్కా స్క్రాచ్ ఫ్రీ గా పెరుగుతారు. 

మా ఆవిడ కూడా మా పిల్లలని అతి సుకుమారంగా పెంచాలని మొదట్లో చూసేది కానీ నేను కుదరనిచ్చేవాడిని కాదు. అలా ఆ విషయం బ్యాలన్స్ అయిపోయేది. మన దేశీ తల్లుల్లాగానే  మా పిల్లలు క్లాసుల్లో ఫస్ట్ రావాలని కాస్త తాపత్రయ పడుతుంటుంది కానీ నేను అది బ్యాలన్స్ చేసేస్తుంటాను. మొదటి శ్రేణి కోసం ప్రోత్సహిస్తుంటాను కానీ మొదటగా వుండాలని పట్టుబట్టను. ఎందులోనయినా, తమకు ఇష్టం వచ్చిన ఒక విషయంలో మాత్రం ప్రతిభలో మొదటగా వుండాలని సూచిస్తుంటాను.  పెద్దమ్మాయికి అనైం ఆర్టులో మంచి ప్రతిభ చూపిస్తుంటుంది. తీరిక వున్నప్పుడల్లా  ఆర్ట్ గీస్తుంటుంది. చిన్నమ్మాయి విశేషమయిన ప్రతిభ ఇంకా ఎందులోనూ చూపించడం లేదు కానీ అందుకు తొందరేమీ లేదు.

ఇక కొన్ని విషయాల్లో నావి విప్లవాత్మక భావాలు, ఆమెవి సాంప్రదాయ భావాలు కాబట్టి ఇంట్లో అవి ఆమె బ్యాలన్స్ చేసేస్తుంది. నావి నాస్తిక భావాలు, ఆమెవి ఆస్తిక భావాలు కాబట్టి మా పెద్ద అమ్మాయి ప్రస్తుతానికి అగ్నోస్టిక్కుగా మిగిలిపోయింది. కొన్ని కుంటుబాలలో దంపతులిద్దరికీ మూఢభక్తి వుండటం గమనిస్తుంటాను. అలాంటప్పుడు వారి పిల్లలకి మరో విధంగా ఆలోచించే అవకాశం అంతగా వుండదు. వారితో పాటు వీరూ అస్థమానం పూజలు, పునస్కారాల్లో మునిగితేలుతుంటారు.  మా ఇంట్లో పరస్పర భావాలు వుంటాయి. అంతే కాకుండా మా పిల్లలకి తమకు నచ్చిన జీవన విధానాన్ని ఎంచుకునే స్వేఛ్ఛ కూడా వయస్సుకి, చట్టానికి తగ్గట్టుగా వుంటుంది.

స్వేఛ్ఛ అంటే ఒకటి గుర్తుకు వచ్చింది. ఈమధ్య మా పెద్దమ్మాయి ఇంట్లో  ఆల్కహాల్ వుందా అని అడిగింది. బీర్ వుంది అని చెప్పాను. నేను వాడవచ్చా అని అడిగింది. నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదేంటి ఇలా హఠాత్తుగా మందు తాగుతా అంటోంది అని హాశ్చర్యపడిపోయాను.  చట్ట ప్రకారం పిల్లలు అల్కహాల్ సేవించడం ఇక్కడ నేరం అని చెప్పాను. అప్పుడు చెప్పింది - తాగడం కోసం కాదని. అదేదో ముందే చెప్పొచ్చుగా. ఆల్కహాల్, నెయిల్ పెయింట్ కలిపి గోర్ల మీద ఏదో చిన్న ప్రయోగం చెయ్యడానికిట. రక్షించింది.

భార్యాభర్తల మనస్థత్వాల మధ్య మరీ ఎక్కువగా తేడాలున్నా ఇబ్బందే, మరీ ఎక్కువగా కలిసినా కూడా ఇబ్బందే. 60 నుండి 80 శాతం మనస్సులు కలిస్తే మంచిది అనుకుంటా. అంతకంటే ఎక్కువ కలిసినా ఇంట్లోనూ, ఆలోచనల్లోనూ వైవిధ్యానికి ఆస్కారం వుండదు. మరీ ఎక్కువగా తేడాలుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలిసిందే. కొంతమంది తెలివయిన వారు ఇంట్లో బ్యాలన్స్ లేకపోతే మరో చోట అనగా చిన్నిల్లు మరీ పెట్టి బ్యాలన్స్ చేసేస్తుంటారు :) అంటే ఇంట్లో వైవిధ్యం తక్కువయితే అక్కడ వెతుక్కుంటారు. ఇంట్లో ఆ వైవిధ్యమే ఎక్కువయితే అక్కడ తగ్గించి కానీ, తక్కువ వున్న వారిని చూసుకొని గానీ తృప్తిపడుతారు. అంచేత నేను చెప్పేడి ఏంటంటే ఇంట్లో బ్యాలన్స్ మెయింటెయిన్ చెయ్యడం అవసరం అని ;)

ఇంటి నుండి పని!

కొంతమంది ప్రతి రోజూ వర్క్ ఫ్రం హోం చేస్తుంటారు. వారిని చూస్తే నాకు బోలెడు జాలేస్తుంది. హాయిగా ఆఫీసుకి వెళ్ళి కాలక్షేపం చెయ్యకుండా అస్తమానం ఇంట్లో ఎలా వుండబుద్ధవుతుందా అని అనుమానం వేస్తుంటుంది. కొత్తగా పెళ్ళయిన వారయితే భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు  కొంతకాలం వుండలేరు కాబట్టి అర్ధం చేసుకోవచ్చు. కానీ పెళ్ళయిన సీనీయర్లూ అలా చెయ్యడం అంటే నాకు నమ్మ బుద్ధెయ్యదు. ఇంటికీ, ఆఫీసుకీ తేడా లేకుండా అలా ఇంట్లో పడి ఎలా వుంటారబ్బా! ఆఫీసు పని కోసం ఇంట్లో బేసుమెంటులోనో, పై అంతస్థులోనో ప్రత్యేకమయిన గది ఏర్పాటు చేసుకున్నా కూడా  అహబ్బే నా వల్ల కాదు బాస్.

ఆఫీసుకి వెళితే అదో ఆనందం. కోలీగ్స్ కలుస్తారు, అవో ఇవో విశేషాలు మాట్లాడుకుంటాం. అలా లోకజ్ఞానం అబ్బుతుంది. అస్తమానం పెళ్ళాంతో హస్కు వేసుకుంటే ఏమొస్తుంది? మహా అయితే అత్తోరింటి వైపు రాజకీయాలు మహా బాగా అర్ధమవుతాయేమో. ఇంట్లోంచి పని చేస్తున్నా కూడా కోలీగ్స్ తో ఫోనులోనో, చాటింగులోనో మాట్లాడుతూనే వుంటంగా అని మీరనవచ్చు. అబ్బే, ఆఫీసు కిచెను దగ్గరో, కాఫీ మెషిన్ దగ్గరో బాసులతోనో, తోటి వర్కర్ బీలతోనో జరిగే ముచ్చట్లకి అవి సాటి అవుతాయటండీ.  ఆఫీసుకి వెళితే ఎంత రిలీఫుగా వుంటుంది. ఇంటి యొక్క, ఇంతి యొక్క ఈతి బాధలు హాయిగా మరచిపోవచ్చు. ఇల్లు కన్నా ఆఫీసు పదిలం అనుకోవచ్చు. కాదూ? 

మీ సంగతేమో గానీ, నా సంగతి ఓ సారి సీన్ వేసుకుని చూసుకుందాం. నేనే గనుక అస్తమానం ఇంటి నుండి పని చేసినట్లయితే ఇలా వుంటుంది.

ఏం చేస్తున్నారు?
పని చేస్తున్నా.
చాల్లెండి. సంబడం. ఇంట్లో పాలు అయిపోయాయి. డొమినిక్సుకు వెళ్ళి కాస్త తెచ్చి పెడుదురూ.
పనే.
అబ్బ జోకులు.
?!
(ఇంట్లో అంతటి గౌరవ వాచకాలు ఏమీ వుండవు లెండి కానీ తేడా తెలియడం కోసం అలా పెట్టా ) 

అదే ఆఫీసులో అయితే నన్ను అడిగే వాడు వుండడు. పని చేస్తున్నా అంటే గౌరవిస్తారు, డిస్ట్రబ్ చెయ్యకుండా దూరం జరుగుతారు కానీ ఇలా నవ్వి పడెయ్యరు.

పిల్లలు పెందరాళే ఇంటికి వస్తారు కదా.

డాడీ, డాడీ.
ఏమ్మా.
అక్క గిచ్చింది.
అమ్మతో చెప్పు.
అమ్మ టివి సీరియల్లుతో బాగా బ్యుజీట. నీకే చెప్పమంది.
పనిలో వున్నా కదా.
అక్క గిచ్చింది.
పనిలో...
అక్క....
ప...
అ...

మీ సలహా నాకు తెలుసు. పని చేసేటప్పుడు గది తలుపులు వేసుకొమ్మంటారు కదూ. అలా అయితే తలుపులు బాదుతారే. అయినా తియ్యకపోతే సెల్లుకి ఫోను చేస్తారే.    ఆఫీసులో అయితే నా గది తలుపులేసుకొని పని చేసుకుంటున్నా ఎవరూ అంతరాయం కలిగించరు. ఎప్పుడో ఒకరోజు అంటే ఏమో గానీ అస్తమానం ఇంటి నుండి పని అంటే నా వల్ల కాదండి బాబూ. కాదు.

వర్కింగ్ ఫ్రం హోం గురించి టొరొంటో స్టార్ ఆర్టికల్:
http://www.thestar.com/business/article/1057487--are-you-reading-this-in-your-pyjamas?bn=1

సమ్మెల వల్ల సకల లాభాలు

నాయకత్వ లక్షణాలు: ఊరకే ఎవడి పని వాడు చేసుకుంటూపోతే వారిలో వున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బయటపడుతాయి? సమ్మెల్లో విధ్వంసం చెయ్యడానికి చాలా మందికి నేతృత్వం వహించాల్సి వుంటుంది. ఎన్ని షట్టర్లు ధ్వంసం చేస్తే, ఎన్ని బస్సులు కాల్చివేస్తే అంత గొప్ప నాయకుడు అన్నమాట. ఇలా సమ్మెలలో నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాక బాగా ఎదిగిపోయి రాజకీయనాయకుడు అయిపోయి దేశానికి ఎంచక్కా సేవ చెయ్యొచ్చు.

విశ్రాంతి: కొందరు పొట్ట గడవడం కోసమో, అధిక ఆదాయం కోసం కుటుంబ సమయాన్ని వీలయినంతగా త్యాగం చేసేసి మరీ పనిలోనికి వెళుతుంటారు. ఇలాంటివారికీ, అందరికీ పెళ్ళాం, పిల్లలతో మరియు బంధు మిత్రులతో బాగా  సమయం గడపడానికి అవకాశం చిక్కుతుంది.

ఒత్తిడి నుండి విముక్తి: చాలామందికి తమ ఆగ్రహావేశాలను బయటికి ప్రకటించి తమలోని ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం వస్తుంది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు చాలా పిరికి వారు. వారికి ప్రభుత్వం మీద కోపం వస్తే సాధారణంగా రోడ్డు  మీదకి ఎక్కి ఆందోళనలు చెయ్యరు. ఎవరికివారు ఆనందంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చూరుకుంటారు.  మనవారికి అంత అగత్యం లేదు. ప్రభుత్వం మీద కోపం వస్తే పక్కనే వున్న బస్సు అద్దాలు పగలగొట్టి మన ఆగ్రహాన్ని తీర్చుకుంటాం.

వైవిధ్యం: అన్ని రోజులూ ఒకేలా వుంటే ఏం బావుంటుంది. మాలాగా ప్రతి పని రోజూ కాళ్ళీడ్చుకుంటూ పనికి వెళితే ఏం ఆనందం వుంటుంది? అప్పుడో ఇప్పుడో బందులో, సమ్మెలో జరిగితే ఆ మోనాటనీ పోతుంది. అందువల్ల మనలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. సమయం లేక ఎన్నాళ్ళ నుండో వాయిదా వేసుకున్న పనులు చక్కపెట్టుకోవడానికి వీలు కుదురుతుంది.

ఇలా సమ్మెల వల్ల ఇంకెన్నో ప్రయోజనాలు వుంటుండవచ్చు. మిగతావి మీరు అందించండి. అయితే నాదో సందేహం. ఎన్నడన్నా ఒకరోజు సమ్మె అంటే బాగానే వుంటుంది కానీ ప్రతి రోజూ సమ్మె రోజు అయితే కూడా బాగానే వుంటుందంటారా?