అవార్డ్ వాలే భాగో భాగో


(Edited)


ఈ మధ్య తమకు తాము క్లాసు అనుకొనే జనాలకు మాస్ అంటే చాలా లోకువ అయిపోయింది. బ్లాగ్లోకంలో ఎక్కడ చూసినా మా లాంటి మాసోళ్ళ మీద చులకనగా మాట్లాడేస్తున్నారు.  వాళ్లకు నచ్చినట్లుగా రిక్షా పుల్లర్లూ, ఆటో ద్రైవర్లు  మరియు నా బాపతు లాంటి మాస్ జనాలందరూ కూడా అవార్డ్ సినిమాలే చూడాలంట. కాస్తంత వినోదం కోసం ఐటెం సాంగులు చూస్తే అది సెక్స్ కి మొఖం వాచి చూసినట్లట. ఇదివరకటి రోజులే బావుండేవేమో. ఎంచక్కా ఊర్లల్లో భోగం మేళాల డ్యాన్సులూ, రికార్డింగ్ డ్యాన్సులూ, మధ్యలో కేతిగాడి కవ్వింపులూ ఏ మేధావులూ కనుచూపుమేరలో లేకుండా హాయిగా, మనస్ఫూర్తిగా పెద్దలూ, పిన్నలూ ఆనందించేవారు.  

ఇప్పుడవన్నీ పోయినాయి పోనీ కనీసం సినిమాల్లో కూడా అలాంటి ఐటెం సాంగులు చూడొద్దంటున్నారు (Edited). ఇప్పటికీ తెలుగు ఛానళ్ళలో ఒద్దున అంతా భక్తి కార్యక్రమాలతొ చావగొడుతున్నారు. రోజంతా అవే వుండాలనీ లేదా రోజంతా అవార్డ్ సినిమాలూ, అవార్డ్ గీతాలు మాత్రమే వుండాలని (edited) అభిప్రాయమేమో. 'రింగా రింగా' . 'ఆకలెస్తే అన్నం పెడతా' లాంటి మాస్ పాటలని, సినిమాలని నిషేధించి కేవలం క్లాస్ సినిమాలనే ప్రజలు చూసేట్టుగా చేయాలనీ దాదాపుగా తీర్మానించేస్తారులాగుంది. మన అదృష్టం బావుండి వీళ్ళ చేతిలో సినిమా రంగం లేదు గానీ వుంటే ఓ ఫత్వా అర్జంటుగా పాస్ చేద్దురు వీళ్ళంతా. 

మాస్ కూ మనస్సు వుంటుంది, దానికి వినోదం కావాలి అని కాలం గారు ఎన్నడో చెప్పారు. ఈ కాలం ఎవ్వర్ అని మధ్యలో కుశంకలు తీయకండి. నేను ఇటు క్లాసు, అటు మాసు. నేను సమైక్యవాదిని. నా మనో భావాలు అర్జంటుగా గాయపడ్డాయి. నాలో ఆత్మన్యూనత ఎక్కువయ్యింది. నాకు అర్జంటుగా ఓదార్పు, సానుభూతి కావాలి. ప్లీజ్.    

ఈ బ్లాగ్లోకంలో అందరూ తెగ చదివినవారే ఎక్కువకావడంతో మేధావులతో పాటు మేతావులు కూడా చాలా మందే వుంటుండటంతో మాస్ కి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. అందుకే అఖిలాంధ్ర మాస్ జనాల పక్షాన నేను ఒక సంస్థను స్థాపించి అధ్యక్షుల వారిగా ప్రకటించేసుకుంటున్నాను. దానిపేరు మాస్ ప్రజా హక్కుల సమితి. మాస్ అన్నా ప్రజలే కదా మళ్ళీ ఆ పేరులో ప్రజలెందుకు అని చొప్పదంటు ప్రశ్నలేయకండి. ఏ పేరులోనయినా ప్రజా అనేది వుంటేనే ప్రజలకి కిక్కు, కక్కు వస్తుంది. అనగా భావోద్వేగాలు బాగా పుడతాయన్నమాట. 

మాలాంటి మాస్ జనాల మీద అవాకులూ, చవాకులూ వ్రాస్తే బ్లాగుల్లో టపాలు కత్తిరిస్తాం (నాలుకలు కత్తిరిస్తాం అన్న టైపులో చదువుకోవాలని మనవి). ఏంటో ఇంకా నాకు కే సీ ఆర్ స్టైల్ బూతులు అలవాటు పడలేదు. 'తెలంగాణా బూతులు ఫర్ ఇడియట్స్' అన్న పుస్తకం చదివి ప్రాక్టీసు చేసి త్వరలో మీమీదకి వదులుతా. 

మా MPHS (మాస్ ప్రజా హక్కుల సమితి) తరఫున కొన్ని ఫత్వాలని జారీ చేస్తున్నాను:
- అవార్డ్ సినిమాలను నిషేధించాలి ( అంటే నాకు వ్యక్తిగతంగా అవార్డ్ సినిమాలు, క్లాస్ సినిమాలు అంటే ఇష్టం లేదని కాదు గానీ చంద్రబాబు లాగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాను. అలా వుండకపోతే నేనూ అవార్డువాదినని మాసువాదులు నా తోకలు కత్తిరిచ్చేస్తారు - అధ్యక్షులవారిని అని కూడా చూడకుండా. ష్! ) 
- ప్రొద్దుటే భక్తి కార్యక్రమాలకు బదులుగా మాస్ సినిమాలు ప్రసారం చేయాలి. లేకపోతే కేబుల్ వైర్లు కట్.
- మాస్ కు అంతటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి. మరీ క్లాస్ వాళ్ళని పాకీస్థాన్ పంపించివేయాలి.
- గట్రా, గట్రా, గట్రా.... 

అవెటారం 'అనుభవించు' రాజా!


నేను నాస్తికుడినే కానీ జీవితంలో మహా బాగా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆదేవదేవుని వేడుకుంటూవుంటాను. అలాంటి మహా కష్టం ఇప్పుడొకటి వచ్చి పడింది. వచ్చే ఆదివారం అవెటార్ (అవతార్ అందామంటే మా చిన్న పాప ఒప్పుకోవడం లేదు) సినిమా చూడాలని డెసైడ్ చేసాం. IMAX 3D కి అడ్వాన్సుడ్ టికెట్లు కూడా బుక్ చేసాం. ఇంకేదిరా భై హాయిగా చూడుర భై అంటున్నారు కదా భాయ్ సాబ్. అక్కడె వచ్చింది చిక్కు. ఎలా చూడాలి ఈ సినిమాను? చూడాలా అనుభవించాలా? చూస్తే రంధ్రాన్వేషణ చేస్తూ విమర్శకుడిలా చూడాలా లేక సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూస్తూ కళ్ళు తేలవేయాలా? మెసేజీ కోసం చూడాలా మాస్ సినిమా చూసినట్లు చూడాలా? సినిమా చూసిన ఒక్కొక్కరు తమ తమ అమూల్యమయిన అభిప్రాయాలను సెలవిచ్చారు. ఇప్పుడు నేను ఏ అభిప్రాయంతో చూడాలి? కొంతమంది అయితే ఎంచక్కా కథ అంతా చెప్పెసారు. కొంతమంది కథే లేదు పొమ్మన్నారు. కొంతమంది మెసేజ్ లేదన్నారు, కొంతమంది ఏలియన్స్ అంటారు కానీ అవి కాదన్నారు. కొంతమంది  హీరోవి తారక రత్న హావభావాలు అన్నారు. అసలెవరూ హీరోయిన్ను గురించి మాట్లాడలా. అసలు ఈరోయిన్ను వుందాలేదా? ఈరోయిన్ను లేకపోతే ఇంకా సినిమా ఎందుకు చూడటం?


కొంతమంది ఆ ఏముంది మన పురాణాలూ, మన నీలి కిష్టుడే గదో అన్నారు. మన తోకల కోతులే - వానర సైన్యం అన్నారు. ఇంకా ఎవరెవరో చిత్రాన్ని అనుభవించకుండా మేధావితనం మహా బాగుగా పెట్టి మరీ 'చూసి' రంధ్రాన్వేషణ బాగానే చేసారు. ఇన్ని అభిప్రాయాలు చదివి ఇన్ని కుశంకలతో సినిమాకి వెళ్ళి నా మొఖం ఇంకా నేను అనుభవించేదేమిటి? సున్నా నేమో. సినిమా చూడటం అనే కళ ఏమాత్రం తెలియని వారు సినిమాలు చూసి సినిమాలోని లోపాలు మహా గొప్పగా విశదీకరించారు. ఇవన్నీ మనస్సులోకి రాకుండా మానసిక నిగ్రహంతో ఈ సినిమా చూడటం ఎలా గబ్బా. ఇంకో చిన్న ఇబ్బందీ వుంది. ఎలాంటి రివ్యూలూ, అభిప్రాయాలూ చూడని, చదవని నా భార్య సినిమాను 'అనుభవిస్తుంటే' నాకు మాత్రం సినిమా 'చూడాల్సిన' అగత్యం పడుతుందేమోనని నాకు యమ కుళ్ళుగా వుంది. నోరు తెరచుకొని మా ఆవిడగారు సినిమా చూస్తుంటే నోరు మూసుకొని సినిమాను చూడాల్సిన ఖర్మ పట్టదు కదా అనేది నా బెంగ.

అందుకే అదేదో సినిమాలో భోజనానికి ముందు వెంకటేష్ దైవ ప్రార్ధన చేసినట్లు ఈ నా ఘోర కష్టాన్ని తీర్చవలసిందిగా సినిమా ప్రారంభానికి ముందు ఆ దేవదేవుని ప్రార్ధించదలచుకున్నాను. నా ప్రార్ధన డ్రాఫ్ట్ ఇదీ. దయచేసి ఈ ప్రార్ధనకు మెరుగులు దిద్దండి. ఈ సినిమాను నేను అనుభవించే మాహాద్భాగ్యం నాకు కలిగేలా మీరూ తోడ్పడండి. మనకు ఇంకా ఈ ఆదివారం మధ్యాహ్నం  దాకా సమయం వుంది.

"ప్రభూ, సినిమా చూసేటప్పుడు కేవలం మంచి విషయాల మీదే  నా మనస్సు నిలిచేలా చూడు ప్రభూ. మేతావితనం కానీ, మేధావితనం గానీ సినిమా చూసేంత సేపూ నా మనస్సులోకి దరిచేరనీయకు స్వామీ. రంధ్రాన్వేషణ దురద నా మనస్సులోకి రానీయకుండా చూసే బాధ్యత మీదే ప్రభువా. అవార్డ్ సినిమలా కాకుండా మామూలు సినిమా అంచానాతో వెళుతూ సగటు ప్రేక్షకునిలా అబ్బురపడే అదృష్టం కలగనీయి స్వామీ. 'రంధ్రం ఎక్కడున్నదీ' అని నేను వెతుక్కోకుండా 'హృదయం ఎక్కడున్నదీ' అని సినిమాలో నా హృదయం పెట్టి చూడనీయి స్వామీ. తొక్కలో లాజిక్కులు నా మనస్సు దరిదాపులలొకి కూడా రాకుండా చూసి నన్ను సినిమాను అనుభవించనీ దేవా.  మా   ఆవిడ కంటే, పిల్లల కంటే చక్కగా ఈ సినిమాను చూసి అబ్బురపడే భాగ్యం కలిగించు స్వామీ.  సినిమా చూసింతతరువాత మహా మేధావి అయిన మా పెద్ద పాప నెగటివ్ కామెంట్స్ వేసి ఒక అద్భుతాన్ని చూసిన ఆనందాన్ని క్షణభంగురం కానీయకుండా చూసే బాధ్యత  కూడా మీదే దేవా! సినిమా పూర్తి అయిన తరువాత సినిమా ఎంత గ్రేట్గా వుందో అని చిన్న పాప అంటూ వుంటే నాకు అంత థ్రిల్లు కలగక బిక్క మొగం వేసుకునే పరిస్థితి రానీయకు దేవా. సినిమా ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసానో అని మా ఆవిడ వర్ణిస్తూ వుంటే ఆ సన్నివేశాలలో ఏమేం లోపాలు వున్నాయ్యో స్ఫురణకు వచ్చే దౌర్భాగ్యం కలగనీయకు ప్రభువా.

ఆమెన్" 


ఈ ప్రార్ధన అంత గొప్పగా రాలేదని నాకు తెలుసు. అందుకే దానిని మోడిఫై చేసే బాధ్యత మీకు ఇచ్చాను. అన్నట్లు ఈ సినిమా చూసే విషయంలో ప్రాంతీయ అభిమానం కూడా వుందండోయ్. దర్శకుడు జేమ్స్ కేమరూన్ మావాడే. కెనడియన్.  


మీటప్: అన్నట్లు ఇంకో విశేషం కూడా వుందండోయ్. ఈ మూవీకి మీటప్ సభ్యులతో కలిసి వెళుతున్నాం. మా మీటప్ గ్రూపులో మేము తప్ప అందరూ ఇక్కడి అమెరికన్సే. దాదాపు ఒక నలభై మంది ఈ సినిమా చూడటానికి రాబోతున్నారు. 12 గంటలకు సినిమా అయితే అందరూ 11 గంటలకే వచ్చేస్తారు. 11 నుండి లైనులో నిలబడి కబుర్లు చెప్పుకోబోతున్నాము. హాలులో అందరమూ ఒకదగ్గరే కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తాము. మూవీ అయిన తరువాత ఒక రెస్టారెంటుకి వెళ్ళి భోంచేస్తూ ఈ సినిమా అబ్బురాన్ని, అద్భుత క్షణాలనీ అందరం నెమరువేసుకోబోతున్నాము.      

O Shit! - మరోసారి


గమనిక: ఈ టపా తెలంగాణా ఆంశానిది కాదు.

కెనడా ఫోర్ట్ ఎరీ (నయాగరా ఫాల్స్) లో వుంటూ యు ఎస్ బఫెలో సిటీలో పని చేస్తున్న రోజులవి. రెండు దేశాల మధ్య ప్రయాణమే అయినా మా ఇంటినుండి ఆఫీసుకి కారు ద్వారా 5 నిమిషాల దూరం. అలా నాలుగేళ్ళు పని చేస్తూ ప్రతి పని రోజూ బోర్డర్ దాటుతుండేవాడిని. బోర్డర్ మామలతో, ఆంటీలతో అనగా అఫీసర్స్ తో కొన్ని గుర్తుంచుకోదగ్గ స్మృతులు వున్నాయి. వాటినన్నింటినీ మరోసారి పంచుకుంటాను కానీ ఒక సంఘటన మాత్రం ఇప్పుడు చెబుతా. 

ఎప్పుడన్నా అక్కడెక్కడో ఏ లాడేనో తుమ్మితే ఇక్కడ అమ్రికాలో జలుబుచేస్తుంది కదా. అప్పుడు బోర్డర్ ఆఫీసర్సుకి పూనకం వస్తుంది. కుక్కలని పట్టుకొని కార్లలో చిచ్చుబుడ్లలాంటి మందుగుండు సామాగ్రి ఏమయినా వుందా అని వాసన చూస్తుంటారు. ఓ సారి కుక్క ఆఫీసర్ నా కార్లోకి ఎక్కింది. ఎంతకూ ఆ కుక్క దిగి వెళ్ళిపోదే! ఎదో వాసన తెగ చూస్తోంది. ఆ కుక్క గారిని వదిలిన ఆఫీసర్లేమో ఎంచక్కా ముచ్చట్లు పెట్టుకుంటూ దీని విషయమే మరిచారు. నా మినీ వ్యానులో అది ఏం వాసన చూస్తూ తన్మయత్వం చెందుతుందో నాకు కనపడక నా గుండెల్లో రైల్లు పరిగెత్తాయి.  కొంపదీసి నేను ఇలా రోజూ బోర్డర్ దాటుతానని తెలిసిన ఏ తీవ్రవాదన్నా నా కార్లో ఏమన్నా పెట్టలేదు కదా?

కుక్క గారు ఎంతసేపటికీ బయటకి రాకుండా, మొరగకుండా అక్కడే వాసన చూస్తూ వుండటంతో బయట నిలబడి వున్న ఆఫీసర్సుకి చిరాకేసి బయటకి రమ్మని అదిలిస్తే గానీ ఆ కుక్క గారు కారు దిగి క్రిందికి వెళ్ళలేదు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆఫీసుకి వచ్చి కార్ పార్క్ చేసి ఆ కుక్కగారు అంతగా ఏం వాసన చూసి వుంటుందా అని సీట్ల క్రింద పరిశీలించాను. చిన్న పాప వాడేసిన డయపర్ వుందక్కడ! 

తెరాస సిద్ధతకర్తలాగా కొద్దిగా అగుపించే బ్లాగర్




మన తెలుగు బ్లాగర్లలో ఒకరు కొద్దిగా తెరాస సిద్ధతకర్త జయశంకర్ లాగా అనిపిస్తారు. వీరికంటే జయశంకర్ కొద్దిగా ఎత్తు, బక్క. ఎవరో చెప్పుకోండి చూద్దాం. మీరెవరూ చెప్పలేకపోతే కొద్దికొద్దిగా క్లూలు ఇస్తుంటాను.  

బ్లా.బ్లా..బ్లా...బ్లాగుల్లో నా తొలిరోజులు


దాదాపుగా రెండు ఏళ్ళ క్రితం నేనూ వున్నానంటూ బయల్దేరి నా బ్లాగింపు మొదలెట్టి బ్లాగు సాంప్రదాయ పూర్వకంగా కూడలిలో కలిపి...ఆ విషయం మరిచేపోయాను. టెస్టింగ్ కోసమని కొన్ని పోస్టులు వేసాను. ఆహ్వానం అంటూ ఓ రెండు, మూడు  కామెంట్లు వచ్చాయి. అందులో ఒకటి జ్యోతి గారిదనుకుంటా. అబ్బో మన బ్లాగు చూడటమే కాకుండా ప్రోత్సాహం కూడానా ఇక వీరి పని పట్టాలి అనుకుని మన పైత్యపు భావాలు కొన్ని వెల్లగక్కుకున్నాను. మళ్ళీ కామెంట్లు వస్తే ఒట్టు. తిట్లను కూడా కామెంట్లు అనుకుంటే అవి వచ్చినట్టే. నా వ్రాతలు చూసి కిక్కు సినిమాలో రవితేజను చూసి జయప్రకాశ్ రెడ్డి అనుకున్నట్లుగా లేదా ఈ రోజుల్లో మార్తాండని చూసి చాలా మంది అనుకుంటున్నట్లుగా 'ఎవడబ్బా వీడు' అని చాలామంది బుర్రలు గోక్కునే వుంటారు. 

సరే అని కాస్త ఛేంజ్ కోసమని మా చిన్న పాప ఫోటో వేసుకున్నాను. క్యూట్ గా వుందని ఒకటి రెండు కామెంట్లు వచ్చాయి. ఎంతయినా ఇది మన బ్లాగు మన ఇష్టమే కదా అనుకుని మా దంపతుల ఫోటో వేసేసాను. నెటిజెన్ నుండి అనుకుంటా 'మీ ఆవిడ అనుమతి తీసుకున్నారా ' అని క్వెషన్ వచ్చింది. నా బుర్ర తిరిగిపోయింది. నా బ్లాగులో మా ఫోటో వేసుకోవడం కోసం కూడా అనుమతులు కావాలా అని సందేహం వచ్చింది. మా ఆవిడ యాహూ ఫోటోస్ లోనూ, ఫ్లికర్ లోనూ మా అందరి ఫోటోలు ఎక్కిస్తుంది. ఎన్నడయినా నా పర్మిషన్ అడిగిందా అని బుర్ర గోక్కున్నాను. లే. మా ఆవిడను అడిగాను 'నా అనుమతి లేకుండా నా ఫోటోలు ఆ సైట్లలో ఎందుకు పెట్టావూ? ' అని. నన్నో విచిత్ర జంతువు ను చూసినట్లు ఎగాదిగా చూసింది. ఆమె నన్ను అలా చూడటం తరచుగా జరుగుతుంటుంది లెండి.     

ఆ కామెంటుకి ' అవసరమా?' అని స్పందించాను. ఎవరినుండో మరో వ్యాఖ్య వచ్చింది కొంతకాలానికి. 'ఫోటో వెయ్యడమే కాకుండా మళ్ళీ అనుమతి అవసరమా అని అడుగుతావురా ' అని. ఇదేదో తకరారుగా వుందని ఎందుకయినా మంచిదని ఆ ఫోటో తీసివేసాను.

మొదట్లో కొద్ది రోజులు నా బ్లాగు వున్నట్లు ఎవరికి తెలుస్తుందిలె, ఎవరు చూస్తారులే అబ్బా అనుకుని ఏదో కాలక్షేపానికి ఏవో వ్రాసుకుంటే, ఫోటోలు వేసుకుంటే ఇంతమంది ఇలా ఎలా తిడుతున్నారబ్బా అని విస్మయం చెందాను. కొద్ది రోజుల తరువాత కూడలి ఎందుకో చూస్తే నా టపా కనపడి ఉలిక్కిపడ్డాను. ఇదన్న మాట సంగతీ అని అర్ధమయ్యి అప్పటినుండి విజృంభించాను... కానీ ఏం లాభం?

అలా అలా అప్పటిదాకా మన బ్లాగ్ అంటే ఏమయినా వ్రాసుకోవచ్చనీ, ఏమయినా వేసుకోవచ్చని అనుకుంటున్న నా కళ్ళు త్వరగానే తెరచుకున్నాయి. హిపోక్రాట్ గా వుండాలని, మన గురించి అన్నీ గొప్పలే చెప్పుకోవాలని, ఎప్పుడూ ఇతరుల లోని లోపాలనే ఎత్తిచూపాలని అర్ధమయ్యింది.  మన ఆనందాలే వెల్లడించుకోవాలి గానీ మన బలహీనతలు, కష్టాల ఊసు ఎత్తవద్దనీ, ఎవరి మనోభావాలూ గాయపడకుండా కాలక్షేపం బఠాణ్ణీలాగున బ్లాగుతూ వుండాలని బోధపడింది.  బ్లాగుబన్ (బ్లాగు తాలిబాన్) ల గురించి కూడా బోధపడింది. మిగతా నా బ్లాగు చరిత్ర మీలో చాలా మందికి తెలిసిందే. 

మరి బ్లాగుల్లో మన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకునే స్వేఛ్ఛ, మార్గం లేదా? వుంది. అది 'స్వయంతృప్తి' లాంటిది!    అలాంటి తుత్తి బ్లాగు నాకొకటి వుంది.

పులి రాజు

విజయవాడ V K కంప్యూటర్స్ లో విద్యార్ధిగానూ, బోధకుడిగానూ పనిచేస్తున్న పద్దెనిమిది ఏళ్ళ క్రితం రోజులవి. ఒక రోజు దినపత్రికలో విజయవాడలో 'పులి రాజు' అనే వ్యక్తి చేసిన ఘనకార్యాల గురించి కథనం వచ్చింది. అతని చేష్టలూ, నా భావాలూ ఒకే రకం కావడంతో అక్కడి మిత్రులూ, స్టాఫూ ఆడ, మగా అందరూ నాకు పులి రాజు అని పేరు పెట్టేసారు. క్రమంగా అక్కడి పరిస్థితి ఎలా అయ్యిందంటే అందరూ నా అసలు పేరు పక్కన పెట్టి పులి రాజు అని సంబోధించడం మొదలెట్టారు.   

కట్ చేస్తే కొన్ని ఏళ్ళయ్యాక పూనేలో పి జి చేయడానికి వచ్చాను. అక్కడి మిత్రులకి ఎలాగో నా నిక్ నేం తెలిసిపోయి పులి పులి అనడం మొదలెట్టారు. మా మిత్రులు అలా పిలుస్తున్నందుకు కొద్ది రోజులు ఛాతి విరుచుకొని తిరిగినా తరువాత అలా వాళ్ళు పిలవడం వెనుక వున్న మరో ద్వందార్ధం తెలిసిపోయి వుడుక్కున్నాను.
  
అందరూ నన్ను పులి పులి అని ఎందుకు అంటున్నారో అర్ధం కాని తోటి తెలుగు విద్యార్ధిని (క్లోజ్ ఫ్రెండ్ లెండి) నన్ను అడగనే అడిగింది 'ఎందుకు నిన్ను అలా పిలుస్తున్నారూ ' అని. మింగలేక కక్కలేక ఎలాగోలా వాళ్ళు పిలుస్తున్న అర్ధం చెప్పేసాను. తానూ పులి పులి అని పిలవడం ప్రారంభించింది. "మరి నువ్వేమన్నా ఓవెన్ ఫ్రెష్ నా?" అని సరదాగా ద్వందార్ధంలో తిరిగి వెక్కిరించాను. అంతటితో ఆమె నన్ను అలా పిలవడం మానివేసింది. 

కట్ చేస్తే పన్నెండేళ్ళ క్రితం కెనడా వచ్చేసాను. ఆ తరువాత ఒక ఏడాదికి విజయవాడ నుండి యు ఎస్ కి ఒక మిత్రుడు వచ్చేసాడు. కెనడాలోని మా గదికి ఫోన్ చేసాడు. మా రూమ్మేట్స్ "ఎవరు కావాలండీ" అని అడిగారు. 
"పులి .. పులి రాజు వున్నాడా" అని అడిగాడు.
నా కెనడా రూం మేట్స్ కి నా ఘనచరిత్ర అంతగా తెలియదు కాబట్టి నాకు అలాంటి పేరు ఒకటి వుందని తెలియక కంగారు పడ్డారు. "పులి రాజా? అలాంటి వారెవరూ ఇక్కడ లేరే!" అని సమాధానం ఇచ్చారు. 
నా విజయవాడ మిత్రుడికి నా అసలు పేరు అస్సలు గుర్తుకురాక ఖంగారు పడ్డాడు. "అదేనండి పులి.. పులిరాజు.." అంటూ నసిగాడు.
మా మిత్రులకి ఎందుకో సందేహం వచ్చి "శరతా?" అని అడిగారు.
"ఆ. ఆ. అవును. అవును"

అప్పుడు నేను గదిలో లేను. నేను వచ్చాక నా రూం మేట్స్ పొర్లి పొర్లి నవ్వుతూ ఈ విషయం చెప్పారు.

కట్ చేస్తే కొన్ని ఏళ్ళ తరువాత ఇండియా చూడటానికి వచ్చాను. ఈలోగా ఎయిడ్స్ ప్రకటనల పుణ్యమా అని పులి రాజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందాడు. నాకు పులి రాజు అన్న పేరు వుంది అని తెలుసున్న బంధుమిత్రులంతా "పులి రాజుకి ఎయిడ్స్ వచ్చిందా?" అని అడగసాగారు. దానితో నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాక ఆ తరువాత మళ్ళీ ఎవరికీ నాకు అలాంటి నిక్ నేం వుందని చెప్పుకోలేదు. మళ్ళీ మీకే చెప్పడం. ష్. ష్.. ష్...!     

ఎందువలన అంటే...ఇందువలన...

ఈమధ్య నా బ్లాగులో వ్రాయడం లేదని ఆలి, నెలబాలుడు, మరికొంత మంది మిత్రులు కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వివరణ. 

ఆఫీసులో: నాకు ఇంట్లో తీరిక వుండదు - ఆఫీసులో తీరిక వుండకపోవడం అంటూ వుండదు. రోజుకి సరాసరి అయిదు నిమిషాల పనితో, నా ఆఫీసు గదిలో గోళ్ళు లేదా ఇంటర్నెట్ గోక్కుంటూ కూర్చుంటాను.   ఆఫీసు పాలిట్రిక్స్ చేయడానికి + ఎంజాయ్ చేయడానికి దేశీ లెవరూ మా ఆఫీసులో లేరు మరియు మిగతావాళ్ళందరూ చాలా మంచాళ్ళు! నా టెక్నాలజీలో పనిచేసేది నేనొక్కడినే కావడంతో ఇతర వుద్యోగులతో ఇంటరాక్షన్ పెద్దగా అవసరం లేక నాది సాలిటరీ కన్ఫయిన్మెంట్ అనిపిస్తూవుంటుంది.  అఫీసులో కూర్చుని బ్లాగులు చదవడం అయితే ఓక్కె గానీ మరీ బ్లాగులు వ్రాయడం అన్నది బావుండదేమో అన్న నైతిక (?) సందేహం వచ్చి ఆపేసాను. అసలు విషయం ఏమిటంటే గబుక్కున మా మేనేజర్ వచ్చి చూస్తే నా బ్లాగింపు కనపడ్డం బావుండదు కదా అని.

ఇంట్లో: నా ల్యాప్టాప్ (బాగుపడలేనంతగా) ఖరాబు అయ్యింది. ఇంకో ల్యాప్టాప్ మా పెద్దమ్మాయి ఎవరికీ ఇవ్వదు. మరింకో లాప్టాప్ మాయింట్లో వాళ్ళని బ్రతిమలాడితే కొద్దిసేపు నాకు పడేస్తారు. ఆ కొద్ది సేపట్లో ఏం బ్లాగగలం? ఆ సిస్టం ను మా ఆవిడ, చిన్న పాప, మా మాంగోరు వన్ బై వన్ ఉపయోగిస్తుంటారు - నేను అడిగితే చిరాకు పడతారు :( అలా నాకు కంప్యూటర్ గతిలేక నాలోని బ్లాగాగ్నిని ఇప్పటివరకూ శాంతపరుస్తూ వస్తున్నాను.

ఇహ లాభం లేదని మొన్ననే ఓ నెట్ బుక్ + మొబయిల్ బ్రాడ్ బ్యాండ్ ఆర్డర్ చేసాను.  కొరియర్ లో ఇవాళ రావాల్సి వుంది. దానిని మా ఇంట్లో ఎవ్వరికీ ఇవ్వొద్దని కంకణం కట్టుకున్నాను! ఇక రేపటి నుండి మళ్ళీ నా బ్లాగింగ్ దడదడ లాడిస్తానేమో. ఈ బ్లాగు ఏమో గానీ నా ఇంకో బ్లాగు వుంది చూసారూ - అందులో చాలా వ్రాయాల్సి వుంది. ఓ బుక్కు మొదలెట్టాను కదా అది ముగించవలసి వుంది.

అజ్ఞాతంగా: బహిరంగంగా బ్లాగింగు చేయడం నాకు సౌకర్యంగా లేదు. ఏదయినా వ్రాయవలసి వస్తే ఎవరినీ నొప్పించకుండా. మన వ్యక్తిగత విషయాలు, భావాలూ ప్రకటించుకోకుండా చాణుక్య నీతితొ వ్రాయాల్సి వస్తోంది. అజ్ఞాతంగా వ్రాసే వారి స్వేఛ్ఛ చూస్తే నాకు అసూయ కలుగుతోంది. త్వరలో అజ్ఞాతంగా కూడా ఓ బ్లాగు మొదలెడతానేమో. నా శైలిని బట్టి ఎవరయినా కనిపెట్టినా గమ్మున వుండండేం!

ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం

పరిస్థితులు ఏవయినా సరే ఒక జంట ప్రేమలో వున్నారనుకోండి - వారి మధ్య చాలావరకు అన్నీ బాగానే వున్నట్లు అనిపిస్తాయి. ఒకరిలోని లోపాలు మరొకరికి ఆ మత్తులో తెలిసిరావు - తెలిసినా అవి అంత పెద్ద విషయంగా అనిపించవు.  కానీ ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కంటే చాలా బెటర్. దీనిలో కొంత అయినా ఒకరి మీద ఒకరికి అవగాహన ఏర్పడుతుంది.  నిశ్చయం నుండి పెళ్ళి నిశ్చయింప బడ్డ జంట మధ్య వుండేది కూడా ప్రేమ, అనురాగం అనే అనుకోవాలి. కాబోయే భర్త/భార్య మీద చాలా మమకారం వుండటం సహజమే కదా.

డేటింగ్ వల్ల కూడా అంత లాభం లేదు. అయితే దానివల్ల పరస్పరం మరికొన్ని విషయాలు తెలుస్తాయి కానీ మనిషి మీద పూర్తి అవగాహన రాదు. మనిషి ఎక్కువగా తెలియకపోతే తను కాస్త నచ్చాక సాధారణంగా అన్నీ బాగానే అనిపిస్తాయి. మనిషి బాగా తెలిస్తే మాత్రమే అసలు మనిషి బయటపడుతాడు. 


అసలు వ్యక్తిత్వం ప్రేమ లోనూ, డేటింగ్ లోనూ తెలియదు. సహజీవనంలోనో లేదా  పెళ్ళి అయాకనో బోధపడ్తుంది. వీటిల్లో కూడా వెంటనే బయటపడవు - వీటిల్లోని తొలి మాధుర్యం కరిగిపోయాక, మబ్బులు విచ్చుకున్నాక పెళ్ళాం/మొగుడు పాత చింతకాయ పచ్చడి అయ్యాక అసలు రంగులు ఒకరికి ఒకరివి తెలుస్తుంటాయి. ప్రేమికులు ఇద్దరూ సహజీవనం చేస్తున్నా ఇది వర్తిస్తుంది.

కొన్నేళ్ళు పెళ్ళి అయాక లేదా కొన్ని ఏళ్ళు సహజీవనం  చేసాక కూడా వారిలో అనురాగం వెల్లివిరుస్తూవుంటేనే అది నిజమయిన ప్రేమగా భావించవచ్చు. అంతేగాని ప్రేయసి ప్రియులు రోజుకొకసారి గంటకొకసారి తియ్యటి ఊసులు మాట్లాడుకున్నంత మాత్రాన అది నిజమయిన ప్రేమ అవ్వదు. తమది నిజమయిన ప్రేమ అనే భ్రమలో వుంటారు ఆ జంట. అందుకే ప్రేమించి పెళ్ళిచేసుకున్న కొన్ని జంటలు  భ్రమలు కరిగిపోయి వాస్తవ వ్యక్తిత్వాలు బయటపడ్డాక విడిఫోతుంటాయి.  ఒకసారి వెడ్‌లాక్ అయ్యాక ఇక వాళ్ళు జీవితాంతం లాక్ అయినట్లే కాబట్టి పెద్దగా చేసేదేమీ వుండదు. ధైర్యం వున్నవారు ఆ బంధం నుండి బయటపడుతారు - ధైర్యం లేని వారు తమ బంధాన్ని ఏదో రకంగా సమర్ధించుకుంటూ జీవితాలు ఏదోరకంగా లాగిస్తుంటారు.     
 
మరి దీనికి పరిష్కారం? అందరికీ సాధ్యపడదు ఇది కానీ సాధ్యపడినవారు, ఇష్టపడిన వారు, ధైర్యం వున్న జంటలు ఇలా చేయొచ్చు. అదే సహజీవనం.  కనీసం మూడు ఏళ్ళన్నా కలిసివుంటే అసలు వ్యక్తిత్వాలు బయటపడుతాయి. ఈ లోగానే మనస్సులు సరిపడవని బయటపడితే ఎంచక్కా విడిపోవచ్చు. ఓ మూడేళ్ళయాక కూడా వారిలో ఇంకా ప్రేమ వుంటే భేషుగ్గా పెళ్ళి చేసుకోవచ్చు. మరి ఆ తరువాత వారిలో విభేదాలు రావని గ్యారంటీ ఏమిటీ? నేను పెర్ఫెక్షనిస్టును కాను - ఇది గ్యారంటీ. మీరు కూడా పరెఫెక్షనిస్ట్ కాకండి - అదొక మానసిక జాడ్యం!  

జంటల మధ్య విభేదాలు రావడానికి అందులో ఇద్దరో ఒక్కరో దుర్మార్గులే కానక్కరలేదు. ఇద్దరు చాలా మంచివారయినంత మాత్రాన వారి మధ్య హార్మోనీ వుండాలని ఏమీలేదు - వైరుధ్యాలు రాకూడదనీ లేదు.  రెండు జంటలు నిలబడాలంటే వారి మధ్య ముఖ్యంగా వుండాల్సింది మానసిక సారూప్యత - మంచితనమో, లేక ఏదోరకంగా గొప్పతనమో కాదు.   ఒక జంటలో సారూప్యత వుందీ లేనిదీ తెలుసుకోవాలంటే దానికి అందుబాటులో వున్న పరిష్కారం సహజీవనమే కానీ ఇది చాలామంది ఒప్పుకోరు, అంగీకరించరు - దీనికంటే ఏదోలా బ్రతుకు లాగెయ్యడమే బెటర్ అంటారు. జావితాన్ని ఏదో ఒక విధంగా లాగించివేద్దాం అనుకునేవారికి ఇవన్నీ అవసరం లేదు - జీవితాన్ని జీవించేద్దాం అనుకునేవారు పెళ్ళి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్ళి చూపుల్లో ఓ గంట చూసి ఓ అరగంట మాట్లాడి అంతా అర్ధం అయ్యిందనుకుంటే మున్ముందు జీవితంలో వచ్చేది ఆనందం కాదు - అనర్ధం కూడా అవచ్చు. 

కెనడాలో ఒక ఫ్యామిలీ వుండేది. ఆ జంట కొన్ని ఏళ్ళుగా నాకు బాగా పరిచయం. వారిది ప్రేమ వివాహం (ఒకే కులం). వారికి టీనేజీ పిల్లలు వున్నారు. ఒక రోజు భర్త ఫోన్ చేసి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి నా సలహా అడిగాడు. పెళ్ళి అయి ఇన్నేళ్ళుగా మీలో సర్దుబాటు లేనప్పుడు ఇంకా ఈ దాంపత్యాన్ని పొడిగించడం అనవసరం - తటపటాయించకుండా విడాకులు తీసుకోండి అని చెప్పాను. అదే రోజు భార్య కూడా నాకు ఫోన్ చేసి అదే విషయంలో నా సలహా అడిగింది. ఆమెకూ తన భర్తకు ఇచ్చిన సలహానే ఇచ్చాను. మొత్తం మీద వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలకి తండ్రి అంటే ఇష్టం లేదు - తల్లి దగ్గరే వుంటున్నారు. అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. విడాకులు తీసుకోవడమే  మంచి పని అయిందని ఇప్పుడు హాయిగా జీవితం వెళ్ళదీస్తున్నామనీ వారిద్దరూ నాకు చెప్పేవారు.     

అసలు పెళ్ళే అవసరం లేదు - ఎంచక్కా సహజీవనం చేస్తూనే వుంటామనుకుంటే అది ఇంకా చక్కని విషయం. పెద్దగా బాదరబందీలు వుండవు. ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న సమస్యలు వుంటాయి కాబట్టి ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు.
సహజీవనంలో వీరికి పిల్లలు పుట్టాక విడిపోవాల్సి వస్తేనో? పిల్లల సంక్షేమం  దృష్ట్యా ఎవరి దగ్గర వుంటే బావుంటుందో వారు ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు భరణం రూపేనా ఇద్దరూ భరించాలి. ఎలాగూ సహజీవనం చేస్తూ విడిపోయారు కాబట్టి  భార్యకు ఇవ్వాల్సిన భరణం వుండదు.  ఇద్దరిలో పిల్లలు ఒకరి దగ్గర వున్నప్పుడు మరొకరు పిల్లల భరణం చెల్లించాలి.  

పెళ్ళిచేసుకున్నాక... ఓ అయిదేళ్ళాగండి

మీరు పెళ్ళిచేసుకోవాలనుకుంటున్న వారు అయినా లేక ఈమధ్యనే పెళ్ళి అయిన వారు అయినా పిల్లలని కనడానికి ఓ అయిదు ఏళ్ళు వ్యవధి ఇస్తే బావుంటుంది. అయిదేళ్ళు ఎక్కువనిపిస్తే కనీసం మూడేళ్ళు అన్నా వ్యవధి ఇవ్వడం మంచిది.  పిల్లలు పుడితే మీ దంపతుల శ్రద్ధ పిల్లలమీదే వుండి మీలో ఒకరిమీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోతుంది.    

అలా గ్యాప్ ఇస్తే పిల్లలు పుట్టేలోగా ఒకరి మనస్సులు ఒకరికి బాగా అర్ధమవుతాయి. ఒకవేళ ఆలోగా దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో వారికి పొసగలేదనుకోండి - ఎంచక్కా విడాకులు తీసుకోవచ్చు. పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవాలంటే వ్యవహారం కుడితిలో పడ్డ ఎలుకలా అవుతుంది. పిల్లల మీద ప్రేమ - పార్ట్నర్ మీద ద్వేషంతో ఎటూ వీలుకాని పరిస్థితిలో వుండిపోతారు. పిల్లల కోసమయినా ఆ సంసారాన్ని లాగించాల్సివస్తుంది. బలవంతపు సంసారం ఎలా వుంటుందో చెప్పనక్కరలేదు.

కొన్ని ఏళ్ళ క్రితం మా ఫ్రెండు ఒకతను విడాకులు తీసుకున్నాడు. అప్పటికే ఆ దంపతులకి ఓ మూడేళ్ళ పాప వుంది. ఆ పాపను కాదు అనుకొని ఎలా విడాకులు ఇవ్వగలిగాడో నాకు అయితే అర్ధం కాదు. నాకు దగ్గరి మిత్రుడు కాకపోవడంతో వివరాలు తెలియవు. పిల్లల మీద అంతగా మమకారం లేకపోతే పిల్లలు పుట్టిన తరువాత కూడా బాగా మనస్పర్ధలు వస్తే విడిపోవచ్చేమో!   

ఒక్కోక్కప్పుడు పిల్లలు వున్నారని మనసు చంపుకొని బలవంతంగా కలిసివుండి ఇంట్లో అశాంతి, గృహ హింస పాలిట పడేదానికన్నా దంపతులు విడాకులు తీసుకుంటేనే పిల్లలు ఎవరిదగ్గరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వుండవచ్చు.   

అసలు విడాకుల విషయమే పెద్ద సంక్లిష్ట వ్యవహారం అంటే పిల్లలు వుంటే పరిస్థితి ఇంకా క్లిష్టంగా  అవుతుంది. వ్యవహారం ఇక సులభంగా తెగదు - ముడివడదు. అందుకే ఇన్ని చిక్కులు రాకుండా వుండాలంటే పెళ్ళి అయాక వెంటనే పిల్లలని కనేసేయకుండా ఒక అయిదు లేదా మూడు ఏళ్ళన్నా ఆగితే ఆలోగా భార్యాభర్తలలో ఒకరి సంగతి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుంది. వారిలో ఏవయినా తేడాలు వచ్చి అస్సలే సర్దుకోలేకపోతే హాయిగా విడాకులు ఇచ్చేసుకోవడమే మంచిది. అలాచేయకుండా బలవంతంగా కలిసివుంటే రోజూ ముసుగులో గుద్దులాటలు తప్పవు.

రోజూ పోట్లాడుకుంటూవున్నా జంట కలిసేవుండాలనే చాదస్తుల, సనాతనుల మాటలు పట్టించుకోకండి.