మా ఆవిడ కారు షాకు ఇస్తుందేమో అనుకుంటే ఖజానా షాకు ఇచ్చింది. మొన్న ఆదివారం అరోరాలోని షికాగో ప్రీమియల్ అవుట్లెట్స్ ప్లాజాకి వెళ్ళాం. కోచ్ వానిటీ బ్యాగు డీలులో చాలా చవకగా వస్తున్నదనీ $300 బ్యాగు $100 కే వస్తోందనీ హైవేమీది నుండి వెళ్ళాలి కాబట్టి హైవే మీద కారు ప్రాక్టీసు చేసినట్లు వుంటుందనీ తోడుగా నన్ను పట్టుకెళ్ళింది. మాతో పిల్లలు రాలేదు. అంత బ్రాండెడ్ వానిటీ బ్యాగులు మనకు అవసరమా అని అడిగాను కానీ వద్దనలేదు. తన డబ్బులతో కొనుక్కుంటోంది కాబట్టి వద్దనే అధికారం నాకు అంతగా లేదు కదా. మనం సంపాదించిన డబ్బులమీద వాళ్ళకు సర్వహక్కులు వుంటాయి కానీ వారి డబ్బుల మీద మనకు ఏమాత్రం హక్కు, అధికారం వుండవు కదా. అందుకే ఆమె డబ్బులతో ఆమె ఏం చేస్తుందనేది పెద్దగా పట్టించుకోను కానీ ఉపయోగకరమయిన వాటిని కొనుక్కోమని చెబుతుంటాను. నగలు, నట్రాలేవో కొనుక్కుంటూవుంటుంది.
అక్కడ తన (పాత) వానిటీ బ్యాగులోనుండి ఎవరో డబ్బులు, బంగారం కొట్టేసారు. ఎలా కొట్టేసారో, ఎక్కడ కొట్టేసారో తెలియదు గానీ అవి మాత్రం మాయం అయిపోయాయి. ఒకే ఒక్క అనుమానాస్పద విషయం ఆమె రెస్టురూములో వున్నప్పుడు జరిగిందంట. ఆ గదిలో టాయిలెట్ సీటు మీద పేపర్ పరిచేందుకై ఒకసారి వేరేవైపుకు తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి కొక్కేనికి తగిలించిన బ్యాగు కిందపడివుందంట. అంతకుమించి ఏమీ ఆమెకు అర్ధం కావడం లేదు. బ్యాగు కోసిలేదు, తెరచిలేదు! ఆ దొంగ ఎవరో కానీ చాలా పద్ధతిగా తన కళని ప్రదర్శించినట్లుంది. ఏమాత్రం అనుమానం రాకుండా దోచుకుపోయారు. వాతావరణం కాస్త బాగుండటంతో ఆ రోజు అసలే ఆ ప్లాజాకి జనాలు బాగా వచ్చారు. పావుగంట వరకు మాకు పార్కింగే దొరకలేదు.
ఎన్ని డబ్బులు, ఎంత బంగారం పోయుంటుందో ఊహించండి చూద్దాం. ఏదో 50, 60 డాలర్లు, కొద్దిగా బంగారం పోయుంటుందనుకుంటున్నారా! నేనూ అలాగే అనుకున్నా. వెధవాయిని. డబ్బులు సుమారుగా $300 మరియు పలు ఆభరణాలు కలిపి చుట్టుపక్కల $2500 పోయాయి. ఆమె పోయిన ఆభరణాల లిస్టు చదువుతుంటే ఇవన్నీ ఇంట్లోనో, సేఫు డిపాజిట్ బాక్సులోనో పెట్టుకోక బ్యాగులో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావూ అని బోల్డంత ఆశ్చర్యపోయా. పదేళ్ళనుండి ఇలాగే పెట్టుకొని తిరుగుతున్నా, ఎవడన్నా దోచాడా అని నన్నే నిలదీసింది. అంటే పదేళ్ళనుండీ చేసిన పొరపాటునే చేస్తూవస్తున్నావన్నమన్నమాట అని బేర్ మన్నాను. ఆమె బేబీ సిట్టింగు చేసి సంపాదించిన డబ్బులు, బంగారం కొన్ని ఇలా పొగొట్టుకుంది. అందులో నా సంపాదన మీద కొనుక్కున్నవి కూడా వుండొచ్చు కానీ నాకు ఆ బంగారం లెక్కలు తెలియదు లెండి.
ఆ ప్లాజా సెక్యూరిటీ వాడికి ఫిర్యాదు చేసాం. సిసి కెమెరాల్లో ఏమన్నా కనిపిస్తుందేమో చూడరా బాబూ అంటే కేఫిటేరియాలో నెలకొల్పిన వాళ్ళ టివిలు ఎత్తుకుపోకుండా గమనించడానికి మాత్రమే ఆ కెమెరాలు పెట్టామనీ, మిగతా ప్రదేశాలు అవి కవర్ చేయవనీ సెలవిచ్చాడు. ఇలా ఖజానాలు బ్యాగుల్లో పెట్టుకురావద్దని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు కానీ మా ఆవిడకి తెలియదురోయ్ అని బావురుమన్నాను. ఇలాంటి దొంగతనాలు మీ ప్లాజాలొ జరుగుతంటాయట్రా అని అడిగాను. ఆహా భేషుగ్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయని చెప్పాడు. అతని సలహా మీద పోలీసు స్టేషనుకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాము. అమ్మా, ఇదండీ అంగతి. మీరు షాపింగుకి వెళ్ళినప్పుడు నగానట్రా బ్యాగుల్లో వేసుకొని వూరేగకుండా ఇంట్లోనో, బ్యాంకులోనో దాచుకోండి తల్లీ. మా ఆవిడ వానిటీ బ్యాగు ఒక మహాసముద్రం కాబట్టి ఆమె బ్యాగు జోలికి ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల అందులో నగానట్రాలు కూడా వుంటాయని నాకు మొన్నటిదాకా తెలీలా. తెలిసివుంటే తను విన్నా వినకపోయినా నా బాధ్యతగా నేను హెచ్చరించి వుండేవాడిని.
మరి మనకు బ్యాంకు సేఫ్ డిపాజిట్ బాక్సు ఎందుకూ, ఎంచక్కా అందులోవి అన్నీ కూడా బ్యాగులో పెట్టుకురాకపోయావా అని మా ఆవిడని విసుక్కున్నాను. మా ఆవిడని ఊరడించాలో, తిట్టాలో అర్ధం కాక మధ్యస్థంగా హితబోధలు చేస్తూ గులిగాను. మా ఆవిడ నిన్న మధ్యాహ్నం అంతా ఏడ్చుకుంటూ, ఆహారం తీసుకోకుండానే వుందని ఇంటికి వెళ్ళాక తెలిసింది. బాధ పడ్డంత వరకు చాల్లే, అంతా ఒకసారే బాధపడితే మరి ముందు ముందు సందర్భాల్లో ఎలా అని ఊరడించాను. నేను పోగొట్టుకున్న వాటితో పోలిస్తే నువ్వు పోగొట్టుకున్నది ఎంత అని జోకులేసాను. శనివారం రాత్రి బావగారూ, బాగున్నారా సినిమా చూసాము లెండి. అందులో కోట డైలాగు అది. అందులో తన కొడుకు శ్రీహరితో ఆ డైలాగు పదేపదే అంటుంటాడు. బాధలో, లాసులో వున్నా కాబట్టి వచ్చేవారం న్యూయార్క్ ట్రిప్పుకి రానంది. సంపాదన ఎలాగయితే జీవితంలో భాగమో అలాగే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లూ, పోగొట్టుకోవడాలూ జీవితంలో భాగమేనని చెప్పేసి నచ్చచెప్పాను.
నేను ఓ జీవితమే పోగొట్టుకున్నాను. దానితో పోలిస్తే మా ఆవిడ పోగొట్టుకున్నది ఎంత లెండి. లైట్ :)










