ఖలేజా ఫస్ట్ రిపోర్ట్

... గ్రేట్ ఆంధ్రాలో వచ్చింది. నిజమో కాదో గానీ స్టొరీ లైన్ కొంతవరకు అవతార్ లా వుంది.
 
http://greatandhra.com/ganews/viewnews.php?id=24078&cat=1&scat=4

వీవెనుడి నవ్వందం

నవ్వు + అందం = నవ్వందం - సువర్ణ దీర్ఘ సంధి.
నిజానికి 'స'వర్ణదీర్ఘ సంధి వుంటుంది కానీ 'సు'వర్ణదీర్ఘ సంధి అంటూవుండదు. 8,9 తరగతుల్లో సంధులు చెప్పమంటే పొరపాటున మా క్లాసుమేటు పేరు సువర్ణ కలిపి అలా చెబితే క్లాసు అంతా ఘొల్లున నవ్వేది. సంధుల మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ప్రతీదాన్నీ సువర్ణదీర్ఘ సంధి అంటుంటాను. పైది కూడా అలాంటిదే. 

సరే అసలు విషయానికి వద్దాం. కూడలి నిర్వాహకులు వీవెన్ అందరికీ సుపరిచితమే కదా. వారి ఫోటో తొలిసారి ఏదో పత్రికలో చూసాననుకుంటా. ఆ ఫోటో అంత బావోలేదు. ఆదిమ మానవుడికి దగ్గర్లో వున్నారు ఆ ఫోటోలో. ఆ తరువాత కూడా వేరే ఫోటో లేనట్లు అదే ఫోటో మళ్ళీ పత్రికల్లో రిపీట్ అయ్యింది. ఈ-తెలుగు గ్రూపు ఫోటోల్లో చూస్తుండేవాడిని కానీ గుంపులో గొవిందాలాగా వుండేవారు.

కొంతకాలం తరువాత ఒకసారి వారికి ఫోను చేసి మాట్లాడాను. కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లుగా ముక్తసరిగా, పొడిపొడిగా మాట్లాడారు. కూడలి నిర్వాహకులు కదా బాగానే అనర్గళంగా మాట్లాడుతారేమో అనుకున్న నాకు అసంతృప్తి కలిగింది. అలా మాట్లాడేవారితో ఎక్కువసేపు ఏం మాట్లాడుతాం. మాట్లాడాల్సింది మాట్లాడి ఫోన్ పెట్టేసాను. కొన్ని సార్లు మామధ్య ఈమెయిళ్ళు నడిచినా అవికూడా క్లుప్తంగానే వుంటుండేవి. 

ఇండియాలో జరిగిన తెలుగుబాట కార్యక్రమంలో వారిని కలిసే అవకాశం దొరికింది. బాగానే వున్నారే, ఫోటోల్లో అలా పడ్డారేంటీ అనుకున్నాను. ఈ-తెలుగు వారి కొత్త తెల్ల టీషర్ట్ వేసుకొని వున్నారు కాబట్టి కూడా ఫోటోల్లోకంటే చక్కగా అనిపించారు. వారిది ఫోటోజెనిక్ ఫేస్ అయ్యుండకపోవచ్చు అని అనుకున్నాను. వారితో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆ కార్యక్రమంలో అక్కడక్కడా క్లుప్తంగానే  మాట్లాడుకోగలిగినా ఆ కాస్సేపూ చక్కగా మాట్లాడుకున్నాం.   వారి నవ్వు నచ్చింది నాకు. చక్కగా నవ్వుతారు వారు. అంటే వారు నవ్వితే వచ్చే ధ్వని బావుంటుంది. వారితో ఎక్కువసేపు మాట్లాడ లేకపోయాను కాబట్టి, వేరే విశేషాలు ఏమీ లేవు కాబట్టి వారి గురించి ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను. 

తలనొప్పిగా వుంది బాస్

నిన్న సాయంత్రం ఒక  మీటప్ కి వెళ్ళాను. అక్కడ సెర్వర్ డ్రింక్స్ ఏమయినా కావాలా అని అడిగితే ఫ్రూట్ జ్యూస్ ఏమున్నాయి అని అడిగాను. నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి నాకేసి విచిత్రంగా చూసినట్లు అనిపించింది. ఓ, అలా పళ్ళ రసాలు తాగడం ఈ మీటింగుల్లో సభ్యత కాదేమోనని ఎందుకయినా మంచిదని ఓ హనికెన్ బీర్ అర్డర్ చేసాను. అది తాగినప్పుడు బాగానే వుంది కానీ ఇంటికి వచ్చాక తలనొప్పి పట్టుకుంది.

ఇదివరలో గజతాగుబోతును కాకపోయినా చిరుతాగుబోతుగా వుండేవాడిని. ఇప్పుడు బీర్ కూడా హరాయించుకోలేకపోతున్నానా అనిపిస్తోంది. బహుశా నేను వాడే మెడిసిన్ కీ, ఆల్కాహాలుకీ పడక తలనొప్పి వచ్చి వుంటుంది. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరం కాకపోయినా వాడకపోవడం మంచిది అని సూచన వుంటుంది.

ఇంకా తలనొప్పి పూర్తిగా తగ్గలేదు కానీ నెమ్మదిగా తగ్గుతున్నట్లుంది. ఇవాళ జయ, మధు మరియు సుమంత్ మాట్లాడి వారి వ్యవహారం సెటిల్ చెయ్యాల్సివుంది కానీ ఈ తలనొప్పితో వాళ్లతో ఏం మాట్లాడగలను? అసలే మా సుమంత్ చెప్పిందే చెప్పి, సాగదీసి, సాగదీసి బేజా ఫ్రై చేస్తాడు. ఇవాళ ఒక ప్రత్యేకమయిన టపా వ్రాయాల్సివుంది కానీ అదీ వాయిదా వేస్తాను.

నాది మామూలు తలనొప్పేకానీ నాకేం సంతాప సందేశాలు పంపించకండి, ఏం.

ఆ కథ ఈ మలుపు తిరిగింది

రియాలిటీ బ్లాగింగ్ ఈ సమస్య మీద చేస్తూ ఎప్పటికప్పుడు మీకు తాజా వివరాలు అందిస్తూవుంటాను.

ముందు ఇది చదవండి, తరువాత ఇది చదవండి.

జయ భర్త పేరు మధు అనుకుందాం. నిన్న మధు నాకు ఇండియా నుండి ఫోన్ చేసాడు. అతని దగ్గరి నుండి ఫోన్ రావడం ఊహించలేదు నేను. తను నాకు ఫోను చెయ్యడం ఇదే ప్రధమం.  తన బావమరిది మరణించాడు కదా, దాని గురించి అయివుంటుంది అనుకున్నాను కానీ కాదు. సుమంతుతో విసిగిపోయాననీ, వాళ్ళిద్దరూ బయట యధేఛ్ఛగా తిరుగుతుంటే పరువు మంట కలుస్తున్నదనీ, ఇంతవరకూ ఆగాను కానీ ఇక ఓపిక పట్టననీ చెప్పుకువచ్చాడు. అతడి పరువునూ బజారుకి ఈడుస్తాననీ ఇంకా ఏవేవో చెప్పుకువచ్చాడు. 2GB ల ఫోను మాటలు రికార్డు చేసాననీ అవన్నీ బయటపెట్టి సర్వ నాశనం చేస్తాననీ చెప్పాడు. చివరి సారిగా మీతో ఈ ప్రయత్నం చేస్తున్నాననీ ఇప్పుడు కూడా ఇక వినకపోతే తాను చచ్చినా బ్రతికినా అవన్నీ బయటపెట్టే ఏర్పాట్లు చేసాననీ చెప్పాడు. భార్య జయతో కూడా మాట్లాడించాడు. సమస్యలు ఉధృతమవుతున్నాయి కనుక సుమంతుని ఇక కలవద్దని చెప్పమంది. అసలే తమ్ముడు చనిపోయిన బాధలో వుంటే మళ్ళీ ఈ సమస్యలు భరించలేను అంది. సుమంతుతో మాట్లాడి చెబుతానని, అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాననీ చెప్పాను.
 
ఇవాళ సుమంతుతో మాట్లాడాను. మధు బెదిరింపులన్నీ చెబుతూ నీకు తీవ్ర సమస్యలు ఎదురయ్యే అయ్యే పరిస్థితి వుందని హెచ్చరించాను. మధు అలా చేస్తే నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటా అని డాంబికాలు పలికినా నెమ్మదిగా పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో జయ విడాకులు తీసుకొని ఆ ఇంట్లోంచి బయటపడటమే ఉత్తమమని చెబితే అతను కూడా కన్విన్స్ అయ్యాడు. తమని మధుని అర్ధం చేసుకోవాల్సిందిగా వీలయినంతవరకు ఒప్పించమనీ, అది కుదరకపోతే అతనితో జయ విడాకులు తీసుకోవడమే దారి అని నాకు చెప్పాడు.

మధు మనస్సు ఎందుకు ఇంతగా అకస్మాత్తుగా విరిగిందో చెప్పాడు. శ్రీను భౌతిక కాయాన్ని మేము వచ్చేంతవరకు ఆగకుండా 12 గంటలలోపే మధు దహనం చేయించాడని, వస్తూ, వస్తూ ఎన్నిసార్లు ఫోను చేసినా మధు ఎత్తలేదనీ చెప్పాడు. అక్కడికి వెళ్ళాక శవదహనం వాళ్ళకోసం ఆపనందుకు మధుతో గొడవపడ్డాడంట. శ్రీను చివరి ఘడియల్లో ఎంతో సహాయం చేసాననీ, దగ్గర వుండి చూసుకున్నా అనీ, మధు ఏ విధంగానూ సహాయపడలేదనీ, అతని వల్ల ఇప్పుడు దహనం ముందు మిత్రుడిని చూసుకోకుండా అయ్యిందని నా దగ్గర వాపోయాడు.

మళ్ళీ మధుకి ఫోన్ చేసి సుమంత్ స్టాండ్ చెప్పాను. సుమంతుకి ఏది వీలయితే అది చేసుకొమ్మనమని చెప్పాడు. తాను మాత్రం తగ్గేది లేదన్నాడు. అంతదూరం ఈ కొట్లాటలు, గొడవలు ఎందుకుగానీ వారిద్దరినీ కొద్దిగా అర్ధం చేసుకొని వదిలెయ్యండీ అని చెప్పాగానీ ససేమిరా కుదరదన్నాడు. మరి జయ మీకు విడాకులు ఇస్తే ఓకేనా అని అడిగాను. విడాకులు కావాలంటే ఇస్తాననీ, అదే పద్ధతిగా వుంటుందని అన్నాడు. సుమంత్ మీద అంత ఇష్టం వున్నప్పుడు జయ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పాడు. 

జయతో మాట్లాడాను. మొగుడూ, లవరూ ఇద్దరూ తగ్గేట్లుగా లేరనీ, సమస్యలు ఉధృతమయేటట్లు వున్నాయనీ ఇద్దరం అవగాహనకు వచ్చాం. అలాంటప్పుడు తను పద్ధతిగా విడాకులు తీసుకొని బయటకి వెళ్ళడమే ఉత్తమమని చెప్పాను. అంత ధైర్యం తాను చెయ్యలేనన్నది. పిరికివారికి ప్రేమించే హక్కు వుండదన్నాను. తాను పిరికిదానినే అని తన ఇబ్బందులు చెప్పుకువచ్చింది. తను బయటకి వస్తే సమస్యలు ఇంకా ఎక్కువవుతాయనీ, సుమంత్ కుటుంబం, అతని ఇద్దరు ఆడపిల్లలూ ఇబ్బందులు పడతారనీ చెప్పింది. ఇప్పుడు తమ్ముడు శ్రీను యొక్క ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల బాధ్యత కూడా తన మీదే పడ్డదనీ చెప్పింది. అలాగే తన ఇద్దరు అబ్బాయిలు కూడా ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఇంతమందికి ఇబ్బంది పెట్టి, ఈ వయసులో అంత సాహసం చేయలేననీ, తన ఆరోగ్యం కూడా బావుండటం లేదనీ, దానికి బదులుగా సుమంత్ మీద వున్న తన ప్రేమని చంపేసుకుంటాననీ చెప్పింది. 

తాను భర్తతో ఎందుకు నాకు ఫోన్ చేయించిందో కూడా చెప్పింది. కొన్ని నెలల క్రితం ఆమెతో ఫోనులో నేను మాట్లాడినప్పుడు ఇటు భర్త వినకా, అటు లవరూ వినకా ఈ మనోవేదనతో చావాలనిపిస్తోందని చెప్పుకువచ్చింది.  మరీ పరిస్థితి అంత దూరం వెళితే నాకు చెప్పకుండా ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పి మాట తీసుకున్నాను. ఆ మాట ఇప్పుడు గుర్తుకుచేసి అందుకే మీతో మాట్లాడాలనుకున్నాననీ, పరిస్థితులు బాగా విషమించాయనీ,  ఇప్పుడు సుమంతు నేను విడిపోవాల్సిందేననీ,  మీ ఫ్రెండు మీరు చెబితే వింటాడనీ, ఎలాగయినా సుమంతుని ఇక తనతో కాంటాక్ట్స్ పెట్టుకోకుండా కన్విన్స్ చేయమనీ ప్రాధేయపూర్వకంగా చెప్పింది.

రేపు సుమంతుకి ఫోన్ చేసి, పరిస్థితిని అంతా అర్ధం చేయించి ఇక మీకు దూరంగా వుండమని, మీ ప్రేమని దూరం చేసుకొమ్మని వీలయినంతగా కన్విన్స్ చేస్తాననీ జయకు హామీ ఇచ్చాను. రేపు సుమంతుతో మాట్లాడి మళ్ళీ అప్‌డేట్ ఇస్తా అన్నాను.

పిరికివారికి ప్రేమించే హక్కు లేదు. ఆ సంగతి జయ బాగానే అర్ధం చేసుకున్నది కాబట్టి ఇక సుమంతుకి కూడా నచ్చజెప్పి వారిద్దరిని దూరం చెయ్యడమే నా ముందున్న కర్తవ్యం. మరి నేను చెప్పింది వింటాడా వినడా, విన్నా ఎన్ని రోజులు వింటాడు, వినకపోతే తదుపరి పర్యవసనాలు ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం. మీకు ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ ఇస్తూనేవుంటాను.  

ఓ మిత్రుడి మరణం

తను కుర్రాడుగా వున్నప్పటి నుండీ అతను పరిచయం. వాళ్ళక్కయ్య పెళ్ళికి వారి ఊరు వెళ్ళాం. అక్కడ పరిచయం. తన చిన్నక్కని నా మిత్రుడొకడు ప్రేమిస్తుండేవాడు. వాళ్ళ ప్రేమకి ఇతను సహకరిస్తూవుండేవాడు. సూర్యాపేటకి వచ్చినప్పుడల్లా ఇతను నన్ను కలుస్తుండటంతో మా మధ్య మంచి స్నేహం కుదిరింది. వాళ్ళ అక్క పెళ్ళి మా స్నేహితునితో కాకుండా వేరే అతనితో జరిగిపోవడంతో మా స్నేహంలో గ్యాప్ వచ్చింది. ఆ తరువాత నేను పై చదువుల కోసమని పూణే వెళ్లడం, ఆ తరువాత కెనడా వచ్చేయడంతో ఆ తరువాత అతనిని కలవలేదు.

అతని పేరు శ్రీనివాసు. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు శ్రీనివాస్ కలిసాడని నా మిత్రుడు చెప్పాడు. అప్పుడతను ఖమ్మంలో వుంటుండేవాడు. ఖమ్మం వెళ్ళినప్పుడు ముగ్గురం అక్కడ కలుసుకొన్నాం. ఎంతో పెద్దయిపోయాడు తను. అప్పట్లో కుర్రాడిలా వుండేవాడు. ఇప్పుడు చూస్తే పెద్ద శరీరం, బట్టతల, ముదురు మొఖం, దర్జా, డాబుసరీ, ఓ కొత్త కారూనూ. అతడిని చూసి అతనేనని నమ్మలేకపోయాను. రియల్ ఎస్టేటులో వున్నాడంట, బాగా సంపాదించానని చెప్పాడు. చాలా కాలం తరువాత కలిసాము కాబట్టి చాలా సంతోషంగా పాత రోజులను గుర్తుకుతెచ్చుకున్నాము.  

అయితే తరువాత మాటల ద్వారా తెలిసిందేమిటంటే డబ్బుతో పాటూ చెక్కెర వ్యాధి కూడా బాగానే కూడబెట్టాడని. నాకు వాటి అంకెలు సరిగ్గా తెలియవు కానీ 450 అనుకుంటా. దానికోసం రోజూ ఇంజెక్షన్లు వేసుకుంటానని చెప్పాడు. మాకంటే చిన్నవాడికి ఈ ఇబ్బంది ఏమిటా అనుకున్నాను. పార్టీలో మందు బాగానే లాగించాడు. ఆరోగ్యానికి మంచిది కాదు కదా అంటే అది అదే, ఇది ఇదే అన్నాడు. హ్మ్ అనుకున్నాను.  ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇద్దరు కూతుర్లని మాకు పరిచయం చేసాడు. పిల్లలు ఇద్దరూ ముద్దుగా వున్నారు. వారిద్దరికీ చాలా చక్కటి పేర్లు పెట్టాడు. శర్మిష్ఠ అనుకుంటా పెద్దమ్మాయి పేరు, చిన్నమ్మాయి పేరు గుర్తుకులేదు. అప్పట్లో నేను నవలలు వ్రాసేవాడిని కాబట్టి పేర్లు భలే బావున్నాయని, నా నవలల్లో వాడొచ్చని నోట్ చేసుకున్నాను.    అప్పుడు వాళ్ళు 6, 7 తరగతులు చదువుతున్నారనుకుంటాను. 

ఇండియా నుండి నేను తిరిగివచ్చాక శ్రీను గురించి సుమంత్ అప్‌డేట్స్ ఇస్తూవుండేవాడు. తను సూర్యాపేటకే ఇల్లు మార్చాడనీ, రియల్ ఎస్టేటులో దివాళా తీసాడనీ, అప్పుల పాలయ్యాడనీ, మందు తాగడం ఎక్కువయ్యిందనీ తెలుస్తుండేది. నాలుగేళ్ళ తరువాత మొన్నటిసారి మళ్ళీ ఇండియా వెళ్ళాను కదా. సూర్యాపేటకి ఒక రోజు వెళ్ళాను. సుమంత్ సమస్య ఒకటి మాట్లాడటానికి శ్రీను ఇంటికే వెళ్ళాము. శ్రీను బయటకి వెళ్ళాడంట. అతని భార్య వుంది. ఆమెతో కొన్ని సార్లు ఫోనులో మాట్లాడినా చూడటం అదే ప్రధమం. జయ అప్పటికే అక్కడికి వచ్చేసి వుంది. అక్కడ నేను వెలగబెట్టిన పెద్దరికం మీరు చదివేవుంటారు. చదవకపోతే ఇక్కడ చదవండి.
 
అ రోజు రాఖీ రోజు. శ్రీను భార్య నాకు రాఖీ కట్టాలనుకుంటోంది కానీ తటపటాయిస్తోందని జయ చెప్పింది. నేను నాస్తికుడిని కాబట్టి ఈ సాంప్రదాయాలు నాకు ఇష్టం వుండకపోవచ్చునని వారి సందేహం. మా ఇంట్లో మాకు ఆ ఆచారం లేదు. నాకూ ధర్మసంకటమే ఎదురాయింది కానీ ఫర్వాలేదు అని చెప్పాను. ఆమె వచ్చి నాకూ, సుమంతుకీ రాఖీ కట్టింది. ఆ విధంగా ఆమెతొ నాకు చెల్లిలాంటి అనుబంధం ఏర్పడింది. మొదటినుండీ ఆమె ముఖంలో దైన్యాన్ని గమనిస్తూనే వున్నాను. తమ కుటుంబం, భర్తా అలా అయిపోతుంటే విచారం వుండదా మరి. ఎలా ఆమె సమస్యలని దూరం చేయాలో నాకు అంత అర్ధం కాలేదు కానీ ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలని అనిపించింది. 
 
శ్రీనివాస్ తరువాత మాకు బయట కలిసాడు. మనిషి దుక్కలా అలాగే వున్నాడు. ఇంత తాగుతున్నా, అంత శుగర్ వ్యాధీ, అన్నన్ని అప్పులు వున్నా మనిషి బాగానే నిభాయించుకువస్తున్నాడే అనుకున్నాను. శ్రీనుకీ, మా దూరపు చుట్టమయిన ఒక ఫ్రెండుకీ ఒక అడ్డా వుందిట. పొద్దున లేస్తే రాత్రి పడుకునేవరకు తాగడమే వారిద్దరి రోజువారీ ముఖ్యకర్తవ్యం అట. శ్రీను కాస్త తొణక్కుండా వున్నాడు కానీ మా చుట్టం ఓ ఊగిపోతూ నామీద ఎనలేని ఆప్యాయతా, గౌరవం కుమ్మరించాడు.   శ్రీనుని టవునుకు దూరంగా పచ్చని చేల మధ్యకు తీసుకువెళ్ళి ముచ్చటించాము. ఎలాగోలా అందరం కలిసి కొంత డబ్బు సర్దుబాటు చేస్తామనీ, ఆ డబ్బుతో అతని ఆర్ధిక సమస్యలనుండి ఎలాగ బయటపడేస్తామో చెప్పాము. మందు తాగడం తగ్గించి ఇకనయినా కుటుంబం పట్లా, ఎదిగిన పిల్లల పట్లా శ్రద్ధ చూపమని కోరాము. నేను సుమంత్ కొసమని తెచ్చిన జానీ వాకర్ విస్కీ తను గటగటా తాగేస్తూ సరే అన్నాడు!
 
అప్పుడు మాతో అమ్మలు కూడా వుంది. తనను చక్కగా ఆడించాడు. కథలూ, కబుర్లూ చెప్పాడు. పెసరకాయలు కావాలంటే చేనులోకి వెళ్ళి తెంపుకొనివచ్చి గింజలు వలిచి అమ్మలుకి తినిపించాడు. మళ్ళీ తనకి హితబోధ చేసి, అతనిని ఇంటి దగ్గర దింపేసి వీడ్కోలు తీసుకున్నాము. సుమంత్, నేను కలిసి అతనిని ఆ కష్టాలలోని ఎలా బయటపడెయ్యాలో స్కెచ్ వేసాము. ఇహనయినా తాగుడు తగ్గించి కుంటుంబం మీద శ్రద్ధపెడితే సహాయం చెయ్యొచ్చు కానీ ఇచ్చిన డబ్బులు మళ్ళీ తాగుడికే పెడితే ఎలాగబ్బా అనుకున్నాము. అలా కాకుండా డబ్బులు సరాసరి అప్పుల వాళ్ళకే ఇవ్వాలని అనుకున్నాము. అలా అలా అతని మంచికోసం కొన్ని వ్యూహాలు పన్నాము. 
 
నేను US కి వచ్చాక శ్రీనుకి చేస్తున్న సహాయ కార్యక్రమాలపై సుమంత్ నాకు అప్డేట్ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయని ఇద్దరం సంతోషపడ్డాము.  కొన్ని వారాలుగా సుమంత్ కి ఫోను చెయ్యలేకపోయాను. శ్రీను నిన్న మరణించేడని ఇవాళ సుమత్ ఫోన్ చేసి చెప్పాడు. తాగుడు వ్యసనం మరియు హెచ్చు డయాబెటిస్ వల్ల ఆరోగ్యం విషమించిందంట. కామినేని హాస్పిటలుకి తీసుకువెళ్ళినా మా మిత్రుడు దక్కలేదంట. ఇప్పుడు అతని భార్యా, పిల్లల సంగతి ఎలానో ఏమో. అప్పులు తప్ప ఏమీ మిగిలించలేదు. డబ్బులు వెనకేసేబదులు తాగుడు వ్యసనంతో డబ్బులు ముందేసాడు. పెద్దమ్మాయి హైదరాబాదులో హాస్టల్లో వుండి ఇంటర్ మొదటి ఏడు చదువుతోంది. చిన్నమ్మాయి 10వ తరగతి అనుకుంటాను.    
 
మా మిత్రుడి మరణంపై రొటీన్ సంతాప వ్యాఖ్యలు వద్దు కానీ ఏదయినా ఇంకా చర్చించాలనుకుంటే వ్యాఖ్యానించండి.

నేను ముందుగా చూసే వెబ్‌సైట్లు

మీరు ఏ వరుసలో వెబ్‌సైట్లు చూస్తారో మీరు కూడా చెప్పండేం. నేను ఏవయినా మంచివి మిస్సయితే మీనుండి తెలుసుకుంటాను. నేను అయితే సాధారణంగా హాట్‌మెయిల్ ఓపెన్ చేసి ఈమెయిల్స్ వచ్చాయేమో చూసుకుంటాను. నా పర్సనల్ సిస్టంలో అయితే హారం సంకలిని హోం పేజీగా వుంటుంది కాబట్టి ముందు అది ప్రత్యక్షం అవుతుంది. కానీ అది పక్కన పెట్టేసి మెయిల్స్ చూసుకొని మళ్ళీ హారంకి వస్తాను. ఆసక్తి, తీరిక వుంటే అప్పుడే హారం వ్యాఖ్యలని కూడా చూస్తాను.

ఆ తరువాత గ్రేట్ఆంధ్రా. అది అంత గొప్ప సైటు కాదుగానీ తెలుగులో అంతకంటే వేరే పోర్టల్ నాకు నచ్చదు కాబట్టి అందులొనే నాకు నచ్చినవి ఏరుకొని చూస్తుంటాను. ఆ తరువాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, CNN, BBC, Toronto Star వార్తల సైట్లు చూస్తాను. ఇవన్నీ అయిపోయాక కూడా తీరిక వుంటే మరియు నేను ఇంటిదగ్గరే వుంటే నాకు నచ్చే ఆ, ఆ టైపు సైట్లు కొన్ని చూస్తాను.   

ఇహ మీ లిస్టు చెప్పండి మరి.

ఈ మంగళవారం నాది

ఈ మంగళవారం సాయంత్రం ఓ కొత్త జీవన శైలి తలుపులు తట్టబోతున్నాను. ఆ శైలి గురించి గత దశాబ్దంగా తెలిసివున్నా కేవలం దానిపై మరింత సమాచారం తవ్వడం, వర్చ్యువలుగా ఆనందించడమే జరిగింది కానీ ప్రాక్టికలుగా ఎప్పుడూ పాల్గొనలేదు. రకరకాల కారణాల వల్ల ఇప్పుడు నిజ జీవితంలో ఆ లైంగిక విధానాలకు, ఆ లైంగిక జీవన శైలికి దాసోహం కావాలని నిర్ణయించుకున్నాను.

నేను అనుకున్నట్టుగా ఈ జీవితం కొనసాగితే నాకు ఆ పరంగా రెండో ఇన్నింగ్స్ మొదలయినట్లే. అయితే కొంతకాలం క్రితం ఎల్జిబిటీ సమావేశాలకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అనుకున్నాను కానీ అలా జరగలేదు. మనం వంద అనుకుంటాం - అనుకున్నవన్నీ అవుతాయా ఏంటీ? లైట్ తీసుకోవాలి, మరో దాని వెంట పడాలి. ఈ బిడిఎస్సెం కూడా అలాగే ట్రై చెయ్యబోతున్నాను కానీ ఎంతవరకు కొసకు వెళ్ళుతుందో ఇప్పుడే చెప్పలేము కదా. ఒక విషయం మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఏదయినా ప్రయత్నించేవాడే విఫలుడవుతాడు. ఏమీ ప్రయత్నించని వాడికి విజయాలూ వుండవు, అపజయాలూ వుండవు.

ఏదేమయినా ఈ మంగళవారం సమావేశం ఉత్సాహంగానే వుంటుంది. అక్కడ జరిగేవి మాటలే తప్ప చేతలు వుండవు కానీ అందులో ఓ వెరయిటీ వుంది. ఆ కలయికకు కొంతమంది కింకీ స్త్రీలు కూడా వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో నాకు తెలుసు కాబట్టి వారి ప్రొఫయిల్ అంతా రిసెర్చ్ చేసేసా. అందులో వారి యొక్క ఫోటోలు కూడా చూసేసా. ఫోటోలు అంటే మామూలు ఫోటోలు కావులెండి ;) అలా వచ్చే వారిలో ఎవరయినా నచ్చితే నాకు మెంటర్ గా వుండమని కోరుతాను. అలా ఎవరయినా అంగీకరిస్తే నా చెయ్యి పట్టుకొని ఆ జీవన శైలిలోకి నడిపించుకువెళ్ళే బాధ్యత వారి మీదే పెట్టేస్తాను. మరింతగా నచ్చితే వారికి ఓ సబ్మిసివుగా దాసోహం అవుతాను. వాళ్ళూ నా ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే నా పప్పులుడుకుతాయిలెండి. చూద్దాం ఆ మీటింగ్ తుస్సుమంటుందో లేక బుస్సు బుస్సు మంటుందో.  

మొదటిసారి ఇలాంటి సమావేశానికి వస్తున్నాను అని వారికి సమాచారం ఇస్తే వారి నుండి వచ్చిన తిరుగు సమాచారం ఇదీ. దీని భావమేమి? నేనేమయినా వళ్ళు దగ్గరపెట్టుకొని వెళ్ళాలా ఏంటీ!  హ?!

The first time going to one of these is a little scary but you have nothing to fear. Everything is kept in public bounds. The conversation is a little out there but if you have any problem ask me or Steve and we will deal with any problem. Any other questions just ask....I am looking forward to meeting you.

తరువాత ... ఇలా జరుగుతుందేమో!

రామ జన్మ భూమి విషయంలో హైకోర్టు తీర్పు ప్రకారం లేదా సుప్రీ కోర్టుకు వెళ్ళినా కూడా ఇదే తీర్పుని సమర్ధించిందనుకోండి. అప్పుడేం జరుగుతుంది? భారత దేశంలోకెల్లా ఉత్తమమయిన రామాలయం హిందువులు కట్టేస్తారు. ముస్లిం దేశాలలోకెల్లా మంచి మస్జిద్‌ను ముస్లిములు కట్టిస్తారు. ఇహ అటువైపు నిహారీలు మాంఛి ఆశ్రమాన్ని కట్టించుకుంటారు. అందరూ సోదర భావంతో మెలగుతూ ఎవరి ప్రార్ధనలు వాళ్ళు చేసుకుంటారు. కదూ.

అలా అని నేననుకోను. ఒకవైపు మస్జిదులో అల్లాహో అక్బర్ అని ప్రార్ధనలు వినపడుతుంటాయి. మరో వైపు రాముడిని స్తుతిస్తూ భజనలు జరుగుతూవుంటాయి. ఇక నిహరీల ఆశ్రమంలో ఏవన్నా పూజలు జరుగుతూ వేద మంత్రాలు పఠిస్తుండవచ్చు. అల్లా ప్రార్ధనలు విని హిందువులకు, రెండు చెవుల్లో జోరీగల్లాగా ఒక వైపు రాముని భజనలు మరో వైపు పూజా మంత్రాలు వినపడి ముస్లిములూ ఆగ్రహం తెచ్చుకుంటారు. అలా శబ్దాలు వినపడకుండా వుండటానికి అవేమయినా సౌండు ప్రూఫ్ భవనాలా ఏంటీ?

అసలు ఆ గుడులు,మస్జిదులూ కట్టేటెప్పుడే లేదా భూమిని పంచేటప్పుడే ఎన్ని సమస్యలు వస్తాయో. ఇక నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఇహ ఎకరాల గురించి తన్నులాట కాకుండా ఇంచుల గురించి తన్నులాటలు జరగవచ్చు. స్థలం హద్దులు దాటి పక్కకు వచ్చారని చెప్పి వాళ్ళో వీళ్ళొ కెలుక్కోకమానరు. అలా చిన్న మనస్పర్ధలు పెద్దగా అవుతూ మళ్ళీ అప్పుడు మతకలహాలకు దారితియ్యవచ్చు. అలాంటి స్థితిలో ఏమాత్రం ప్రశాంతంగా ఆ ప్రార్ధనా మందిరాల్లో ప్రజలు గడుపుతారనేది ఆసక్తికరమయిన విషయమే.

ఇప్పటికిప్పటికి మత కలహాలు జరగకుండా నీళ్ళూ జల్లే తీర్పు ఇచ్చి జడ్జిలు తమ బాధ్యత తీర్చేసుకున్నారు కానీ అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిదని మంచో చెడో ఎవరికో ఒకరికి ఆ స్థలం పూర్తిగా చెందేట్టుగా తీర్పు ఇస్తే బావుండేదేమో. నిరాశా వాదంతో ఆలోచిస్తే ఇదీ సీను. ఆశావాదంతో ఆలోచిస్తే ఈ తీర్పు వచ్చినప్పుడు అయితే ఎలాగా సంయమనంతో వున్నారో అలాగే అందరూ భాయి భాయి అని సుహృద్భావంతో మెలగుతారేమో. చూద్దాం.

BBC: Tamil star's blockbuster set to break box office record

India's priciest film is released

ఈ క్రింది సైటుకి వెళ్ళి మధ్యలోని ఎంటర్టైన్మెంట్ సెక్షన్ చూడండి లేదా క్రింద వున్న మరో లింక్ క్లిక్ చెయ్యండి.
http://www.bbc.co.uk/news/


http://www.bbc.co.uk/news/world-south-asia-11454565

మరీ మూడుముక్కలేనా?

రామ జన్మభూమి తీర్పు చూసాక అసంతృప్తి కలిగింది. కొద్దిగానయినా లౌకికతత్వం లేదే అందులో. హెచ్చు సంఖ్యలో వున్న హిందువులు రెండు ముక్కలూ, మైనారిటీ ముస్లిములూ ఒక ముక్కా పంచుకుంటే న్యాయం జరిగినట్టేనా? మరి మిగతా వారి సంగతేంటి? కిరస్తానీయుల మాటేమిటి? వారికో ముక్క పడేస్తే బావుండేది  కదా. ఇలా ఇలా హిందువులూ, ముస్లిములూ భాయీ, భాయీ అని పక్కపక్కనే గుడులూ, మసీదులూ కట్టుకుంటూపోతే అది లౌకికతత్వం ఎలా అవుతుందేమిటీ? వాటితో పాటూ చర్చిలూ, బుద్ధ, జైన మందిరాలూ కడితేనే కదా సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరిసేదీ? ఆయా మతాల సంగతి ఆ మతాల వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ సంగతులు నాస్తికుడివి నీకెందుకయ్యా అంటున్నారా? వచ్చేస్తున్నా, అక్కడికే వచ్చేస్తున్నా కదా.

ఆ అయోధ్య భూమిని కోర్టు ఏ మతానికీ ఇవ్వకుండా ఎంచక్కా ఏ స్కూలుకో, హాస్పిటలుకో లేక గ్రంధాలయానికో, క్రికెట్టు కోర్టుకో ఇచ్చేస్తుందేమోనని ఒక లౌకిక భావాలున్న వ్యక్తిగా దింపుడుగళ్ళం ఆశ పడ్డాను లెండి. అది జరగలేదు సరే. మూడు ముక్కలు చేసి ఇచ్చారు. కొంతలో కొంత అది బాగానే వుంది. కానీ... మైనారిటీల్లో మైనారిటీలయిన పౌరహక్కులవారికీ, హేతు(టు)వాదులకూ, దళితవాదులకూ మరియు నాబోటి నాస్తిక మతాల వారి సంగతేంటి? మాకొద్దా భూమి? మా మనోభావాలు మనోభావాలు కావా ఏంటీ? ఇంకొన్ని ముక్కలు చేసి మాకూ కొన్ని ముక్కలు పడేస్తే మేమూ నోరుమూసుకొని ఇలా భౌ భౌమనకుండా పండగచేసుకునేవారం కదా. ఇప్పుడు చెప్పండి ఆ తీర్పులో ఎంత లౌకికతత్వం వుందో? మా భూమి మాకిస్తే మా అమరవీరులకు ఓ స్థూపమో, ఓ వేదికో, ఓ అంబేడ్కర్ విగ్రహమో, నాస్తిక సువార్త సభలకు ఓ ప్రాంగణమో నిర్మించుకునేవారం కదా. అటు ముస్లిముల, ఇటు హిందువుల మధ్య చేరి ఏ గొడవలూ రాకుండా చూసుకునేవారం కదా. మరి కోర్టు విశాలమయిన, ఉన్నతమయిన తీర్పు ఇచ్చింది అంటే మమ్మల్నెలా నమ్మమంటారూ?   

సరే ఈ వాదులందరినీ పక్కకుపెడదాం. మరి తెలంగాణా సంగతేంటి? మా తెలంగాణాకి 42% కాపోయినా ఓ 4% ముక్క అయినా ఇచ్చారా? మరీ మోకాలుకీ, బోడిగుండుకీ ముడేస్తున్నావు, తెలంగాణా వారికి అక్కడ స్థలం ఎందుకు చెప్పు అంటున్నారు మీరు. అవునా. అంటే అయోధ్య రాముడిని చూడటానికి ఆంద్రవాళ్ళు మాత్రమే వెళతారా? తెలంగాణా వాళ్ళు వెళ్ళరా? అక్కడ తెలంగానా వాళ్లు ఎవరూ తరతరాలుగా నివసించడం లేదా? వాళ్ళంతా ఎవరు - మావాళ్ళే. మరి మాజాగ మాకు కావాలా వద్దా? ఏదో గింత ముక్క పడేస్తే అందులో అక్కడికి వచ్చే తెలంగాణా యాత్రికుల కోసం లాడ్జి కట్టిస్తాము.  అందులో మూడు గదులు పార్టీ ఆఫీసుకు, తలో రెండు గదులు కేసీఅరుకి, విజయశాంతికీ, తలో ఒక గది కేటీఆరుకీ, కవితమ్మకీ, హరీశ్రావుకీ కెటాయించి మిగిలిన గదులేమన్నా వుంటే యాత్రికులకు కెటాయిస్తాము కదా. 

మరి ఎస్సీ, ఎస్టీ వర్గాల సంగతేంటి? వారికి చట్టబద్దంగా అన్నింటిలోనూ రిజర్వేషను వున్నప్పుడు ఇందులో మాత్రం ఎందుకు మినహాయింపూ?   మీ ప్రశ్న నాకు అర్ధమయ్యింది. హిందువులూ, ముస్లిములూ అందులోకక్షిదారులు కాబట్టి ముక్కలిచ్చారని. వాళ్ళు ఆ భూమి ఎవరిదో చెప్పండి మహాప్రభో అని కోర్టుని వేడుకున్నారు అంతే కానీ ఇలా ముక్కలు చేసివ్వమని ఏనాడయినా, ఎక్కడయినా కోరారా? సరే కోర్టు ఏదో ఒక అడుగు ముందుకువేసి ఎవరి మనస్సూ నొప్పించకుండా అలాంటి తీర్పు ఇచ్చింది. బాగానే వుంది కానీ ఇంకో రెండడుగులు ముందుకు వేసి పైన లిస్టు ఇచ్చిన వారందరికీ తలా ఓ ముక్క ఇచ్చేస్తే కోర్టు సొమ్మేం పోయేదో. అందుకే ఆ తీర్పుని నేను ఖండిస్తున్నాను. అ తీర్పులో లైకికతత్వం అన్నది మేడిపండు వంటిదేననని ఈ సందర్భంగా మీ అందరికీ వినయంగా విన్నవించుకుంటున్నాను.