ఓ మిత్రుడి మరణం

తను కుర్రాడుగా వున్నప్పటి నుండీ అతను పరిచయం. వాళ్ళక్కయ్య పెళ్ళికి వారి ఊరు వెళ్ళాం. అక్కడ పరిచయం. తన చిన్నక్కని నా మిత్రుడొకడు ప్రేమిస్తుండేవాడు. వాళ్ళ ప్రేమకి ఇతను సహకరిస్తూవుండేవాడు. సూర్యాపేటకి వచ్చినప్పుడల్లా ఇతను నన్ను కలుస్తుండటంతో మా మధ్య మంచి స్నేహం కుదిరింది. వాళ్ళ అక్క పెళ్ళి మా స్నేహితునితో కాకుండా వేరే అతనితో జరిగిపోవడంతో మా స్నేహంలో గ్యాప్ వచ్చింది. ఆ తరువాత నేను పై చదువుల కోసమని పూణే వెళ్లడం, ఆ తరువాత కెనడా వచ్చేయడంతో ఆ తరువాత అతనిని కలవలేదు.

అతని పేరు శ్రీనివాసు. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు శ్రీనివాస్ కలిసాడని నా మిత్రుడు చెప్పాడు. అప్పుడతను ఖమ్మంలో వుంటుండేవాడు. ఖమ్మం వెళ్ళినప్పుడు ముగ్గురం అక్కడ కలుసుకొన్నాం. ఎంతో పెద్దయిపోయాడు తను. అప్పట్లో కుర్రాడిలా వుండేవాడు. ఇప్పుడు చూస్తే పెద్ద శరీరం, బట్టతల, ముదురు మొఖం, దర్జా, డాబుసరీ, ఓ కొత్త కారూనూ. అతడిని చూసి అతనేనని నమ్మలేకపోయాను. రియల్ ఎస్టేటులో వున్నాడంట, బాగా సంపాదించానని చెప్పాడు. చాలా కాలం తరువాత కలిసాము కాబట్టి చాలా సంతోషంగా పాత రోజులను గుర్తుకుతెచ్చుకున్నాము.  

అయితే తరువాత మాటల ద్వారా తెలిసిందేమిటంటే డబ్బుతో పాటూ చెక్కెర వ్యాధి కూడా బాగానే కూడబెట్టాడని. నాకు వాటి అంకెలు సరిగ్గా తెలియవు కానీ 450 అనుకుంటా. దానికోసం రోజూ ఇంజెక్షన్లు వేసుకుంటానని చెప్పాడు. మాకంటే చిన్నవాడికి ఈ ఇబ్బంది ఏమిటా అనుకున్నాను. పార్టీలో మందు బాగానే లాగించాడు. ఆరోగ్యానికి మంచిది కాదు కదా అంటే అది అదే, ఇది ఇదే అన్నాడు. హ్మ్ అనుకున్నాను.  ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇద్దరు కూతుర్లని మాకు పరిచయం చేసాడు. పిల్లలు ఇద్దరూ ముద్దుగా వున్నారు. వారిద్దరికీ చాలా చక్కటి పేర్లు పెట్టాడు. శర్మిష్ఠ అనుకుంటా పెద్దమ్మాయి పేరు, చిన్నమ్మాయి పేరు గుర్తుకులేదు. అప్పట్లో నేను నవలలు వ్రాసేవాడిని కాబట్టి పేర్లు భలే బావున్నాయని, నా నవలల్లో వాడొచ్చని నోట్ చేసుకున్నాను.    అప్పుడు వాళ్ళు 6, 7 తరగతులు చదువుతున్నారనుకుంటాను. 

ఇండియా నుండి నేను తిరిగివచ్చాక శ్రీను గురించి సుమంత్ అప్‌డేట్స్ ఇస్తూవుండేవాడు. తను సూర్యాపేటకే ఇల్లు మార్చాడనీ, రియల్ ఎస్టేటులో దివాళా తీసాడనీ, అప్పుల పాలయ్యాడనీ, మందు తాగడం ఎక్కువయ్యిందనీ తెలుస్తుండేది. నాలుగేళ్ళ తరువాత మొన్నటిసారి మళ్ళీ ఇండియా వెళ్ళాను కదా. సూర్యాపేటకి ఒక రోజు వెళ్ళాను. సుమంత్ సమస్య ఒకటి మాట్లాడటానికి శ్రీను ఇంటికే వెళ్ళాము. శ్రీను బయటకి వెళ్ళాడంట. అతని భార్య వుంది. ఆమెతో కొన్ని సార్లు ఫోనులో మాట్లాడినా చూడటం అదే ప్రధమం. జయ అప్పటికే అక్కడికి వచ్చేసి వుంది. అక్కడ నేను వెలగబెట్టిన పెద్దరికం మీరు చదివేవుంటారు. చదవకపోతే ఇక్కడ చదవండి.
 
అ రోజు రాఖీ రోజు. శ్రీను భార్య నాకు రాఖీ కట్టాలనుకుంటోంది కానీ తటపటాయిస్తోందని జయ చెప్పింది. నేను నాస్తికుడిని కాబట్టి ఈ సాంప్రదాయాలు నాకు ఇష్టం వుండకపోవచ్చునని వారి సందేహం. మా ఇంట్లో మాకు ఆ ఆచారం లేదు. నాకూ ధర్మసంకటమే ఎదురాయింది కానీ ఫర్వాలేదు అని చెప్పాను. ఆమె వచ్చి నాకూ, సుమంతుకీ రాఖీ కట్టింది. ఆ విధంగా ఆమెతొ నాకు చెల్లిలాంటి అనుబంధం ఏర్పడింది. మొదటినుండీ ఆమె ముఖంలో దైన్యాన్ని గమనిస్తూనే వున్నాను. తమ కుటుంబం, భర్తా అలా అయిపోతుంటే విచారం వుండదా మరి. ఎలా ఆమె సమస్యలని దూరం చేయాలో నాకు అంత అర్ధం కాలేదు కానీ ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలని అనిపించింది. 
 
శ్రీనివాస్ తరువాత మాకు బయట కలిసాడు. మనిషి దుక్కలా అలాగే వున్నాడు. ఇంత తాగుతున్నా, అంత శుగర్ వ్యాధీ, అన్నన్ని అప్పులు వున్నా మనిషి బాగానే నిభాయించుకువస్తున్నాడే అనుకున్నాను. శ్రీనుకీ, మా దూరపు చుట్టమయిన ఒక ఫ్రెండుకీ ఒక అడ్డా వుందిట. పొద్దున లేస్తే రాత్రి పడుకునేవరకు తాగడమే వారిద్దరి రోజువారీ ముఖ్యకర్తవ్యం అట. శ్రీను కాస్త తొణక్కుండా వున్నాడు కానీ మా చుట్టం ఓ ఊగిపోతూ నామీద ఎనలేని ఆప్యాయతా, గౌరవం కుమ్మరించాడు.   శ్రీనుని టవునుకు దూరంగా పచ్చని చేల మధ్యకు తీసుకువెళ్ళి ముచ్చటించాము. ఎలాగోలా అందరం కలిసి కొంత డబ్బు సర్దుబాటు చేస్తామనీ, ఆ డబ్బుతో అతని ఆర్ధిక సమస్యలనుండి ఎలాగ బయటపడేస్తామో చెప్పాము. మందు తాగడం తగ్గించి ఇకనయినా కుటుంబం పట్లా, ఎదిగిన పిల్లల పట్లా శ్రద్ధ చూపమని కోరాము. నేను సుమంత్ కొసమని తెచ్చిన జానీ వాకర్ విస్కీ తను గటగటా తాగేస్తూ సరే అన్నాడు!
 
అప్పుడు మాతో అమ్మలు కూడా వుంది. తనను చక్కగా ఆడించాడు. కథలూ, కబుర్లూ చెప్పాడు. పెసరకాయలు కావాలంటే చేనులోకి వెళ్ళి తెంపుకొనివచ్చి గింజలు వలిచి అమ్మలుకి తినిపించాడు. మళ్ళీ తనకి హితబోధ చేసి, అతనిని ఇంటి దగ్గర దింపేసి వీడ్కోలు తీసుకున్నాము. సుమంత్, నేను కలిసి అతనిని ఆ కష్టాలలోని ఎలా బయటపడెయ్యాలో స్కెచ్ వేసాము. ఇహనయినా తాగుడు తగ్గించి కుంటుంబం మీద శ్రద్ధపెడితే సహాయం చెయ్యొచ్చు కానీ ఇచ్చిన డబ్బులు మళ్ళీ తాగుడికే పెడితే ఎలాగబ్బా అనుకున్నాము. అలా కాకుండా డబ్బులు సరాసరి అప్పుల వాళ్ళకే ఇవ్వాలని అనుకున్నాము. అలా అలా అతని మంచికోసం కొన్ని వ్యూహాలు పన్నాము. 
 
నేను US కి వచ్చాక శ్రీనుకి చేస్తున్న సహాయ కార్యక్రమాలపై సుమంత్ నాకు అప్డేట్ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయని ఇద్దరం సంతోషపడ్డాము.  కొన్ని వారాలుగా సుమంత్ కి ఫోను చెయ్యలేకపోయాను. శ్రీను నిన్న మరణించేడని ఇవాళ సుమత్ ఫోన్ చేసి చెప్పాడు. తాగుడు వ్యసనం మరియు హెచ్చు డయాబెటిస్ వల్ల ఆరోగ్యం విషమించిందంట. కామినేని హాస్పిటలుకి తీసుకువెళ్ళినా మా మిత్రుడు దక్కలేదంట. ఇప్పుడు అతని భార్యా, పిల్లల సంగతి ఎలానో ఏమో. అప్పులు తప్ప ఏమీ మిగిలించలేదు. డబ్బులు వెనకేసేబదులు తాగుడు వ్యసనంతో డబ్బులు ముందేసాడు. పెద్దమ్మాయి హైదరాబాదులో హాస్టల్లో వుండి ఇంటర్ మొదటి ఏడు చదువుతోంది. చిన్నమ్మాయి 10వ తరగతి అనుకుంటాను.    
 
మా మిత్రుడి మరణంపై రొటీన్ సంతాప వ్యాఖ్యలు వద్దు కానీ ఏదయినా ఇంకా చర్చించాలనుకుంటే వ్యాఖ్యానించండి.

12 comments:

 1. మీరెప్పుడు పోతారా అని చూస్తున్నాము

  ReplyDelete
 2. @ పండు
  పాపి చిరాయువు అని మీకు తెలియదా?

  నాకు కూడా ఈ లైఫు సెడ్డ సిరాగ్గానే వుంది లెండి, పోయేటప్పుడు అందరికీ చెప్పే వెళతాలెండి.

  ReplyDelete
 3. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మనచేతిలో పనే. మీ మితృడు చనిపోయాడంటే, అది అతను చేజేతులా చేసుకున్నదే అని నా అభిప్రాయం. అతని మృత్యువు మిగతా జనలాకి కనీసం కనువిప్పు కావాలని కోఱుకుంటా. అంతేకాక, డబ్బు జీవిత విధానాన్ని మార్చకూడదూ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా ఆశిస్తా.

  ReplyDelete
 4. పండుగారూ!స్నేహితుని మరణంతో బాధపడేవారితో ఇలాంటి మీవ్యాఖ్య చాలా శోచనీయం.

  ReplyDelete
 5. I personally feel you can help his daughters' studies

  ReplyDelete
 6. హ్మ్ ఇది అందరికీ ఒక పాఠమవ్వాలి. మీకు వీలైతే వాళ్ళ ఆవిడకి, పిల్లలకి ఏదైనా సహాయం చెయ్యగలరేమో ఆలోచించండి. కనీసం వాళ్ళ పిల్లల చదువులయినా అయితే బాగుంటుంది కదా, sad!

  ReplyDelete
 7. రోజుకి పది పోస్ట్లు వ్రాసిపడేస్తున్నావ్, ఇక్కడ మేము చదవలేక పోతున్నాం

  ReplyDelete
 8. @ బ్లేజ్‌వాడ రౌడీ
  అన్ని వ్యాఖ్యలకు స్పందించలేకపోతున్నాను. కామెంటేసిన వారు ఏమనుకుంటున్నారో ఏంటో. మరి నా బాధ ఎవరికి చెప్పుకోనూ?

  ReplyDelete
 9. జగన్ సూర్యపేట రాలేదని భాధతో తాగి తాగి పోయాడని కొండా సురేఖకు చెబితే, ఓ లచ్చ వస్తుంది కదా?
  అదే తెలంగాన రాలేదని మనస్తాపంతో పోయాడని తెరాసకు చెబితే? అమరవీరుని కిందో లచ్చ, ఏదో ఆలోచించున్రి.

  ReplyDelete
 10. మీ మిత్రుడి గురించి నాకంతగా తెలియదుగానీ, ఇట్లాంటి పరిస్థితుల్లో వున్న వాళ్ళు ఒక రకంగా పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి, ఇక ఏదైతే అదవుతుందనే నిరాశతో కొద్దిగా నెమ్మదిగా చేసుకునే ఆత్మహత్య తో సమానమైన పద్దతుల్ని పాటిస్తారనిపిస్తుంది.

  ఇకముందు ఇటువంటి సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నించేటప్పుడు, కేవలం మీరు ఏవిధంగా సహాయ పడగలరొ, లేక వాళ్ళు ఎలా సమస్యలని అధిగమించొచ్చో మాత్రమే కాకుండా, వారికి జీవితం మీదా, భవిష్యత్తు మీదా ఆశ కలిగేలా ఇన్ స్పైర్ చేసే అవకాశం ఉంటే ప్రయత్నించండి. ముందు వారికి ఆశ కల్పించగలిగితే అప్పుడు మీరు చేసే సహాయాలు నమ్మకాన్ని పెంచడానికి ఉపయొగపడవచ్చు.

  I am not expressing any condolences and sympathies since I beleive you are beyond those.

  ReplyDelete
 11. @ భా రా రా
  అవునండీ. తను చేజేతులా చేసుకున్నదే. ఇప్పుడు ఇబ్బంది మాత్రం కుటుంబ సభ్యులకు వచ్చింది.
  @ అజ్ఞాత, సౌమ్య
  దిన కర్మలు అయిపోయాక అక్కడి మిత్రులతో కలిసి ఈ కుటుంబానికి మేము ఏ విధంగా సహాయపడగలము అన్నది ఆలోచిస్తాము.
  @ అజ్ఞాత
  ఈ ఆలోచన బాగానే వుందే
  @ వీకెండ్ పొలిటీషియన్
  వ్యసనపరులని మార్చడం, అదీ దూరంగా నేను ఇక్కడ వుండి మార్చడం కష్టమయిన పనే. నా బాధ్యతగా నేను వారికి బోరు కొట్టనంతమేరకు చెబుతూనేవుంటాను కానీ అంతతేలిగ్గా వింటే అది వ్యసనం ఎందుకవుతుంది. ఇలాంటి వ్యసనంతోనే మా ఇంకో మిత్రుడు కూడా లైనులో వున్నాడు. ఇది చూసి అయినా బుద్ధి తెచ్చుకొని ప్రాణాలు కాపాడుకుంటాడేమో చూడాలి.

  ReplyDelete
 12. చాలా కుటుంబాలు తాగుడు వ్యసనానికి బలయిపోతున్నాయండీ..కంట్రోల్ లో వుండడం అంత సామాన్యమయిన విషయం కాదు..

  ReplyDelete