My Yukon Show - యుకాన్‌లో కరోనా

 My Yukon Show పేరిట ఇక్కడి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి వుంటే చదవండి - లేకపొతే లైట్ తీస్కోండేం.

యూకాన్ అనేది కెనడాలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతాలు ఈ దేశంలో మరో రెండు వున్నాయి. ప్రాంతం పెద్దదే కానీ జనాబా తక్కువ. సులభంగా వుండేందుకై ఈ ప్రాంతాన్ని రాష్ట్రంగా వ్రాస్తాను. ఈ రాష్ట్ర జనాభా 44 వేలు వుంటుంది. అందులో రాజధాని వైట్‌హార్స్ (తెల్ల గుర్రం) జనాభా 33 వేలు. నేను ఈ రాజధానిలోనే వుంటాను. ఈ రాష్ట్రం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే కాశ్మీర్ అంత అందంగా వుంటుంది. ఇప్పుడు సమయం రాత్రి 11. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోంది. అదేంటీ ఇంత ఆలస్యంగానా అని మీ అనుమానం కదూ. హహ. ఇంకో రెండు నెలలు అయితే వేసవిలో మేము అర్ధరాత్రి కూడా ఎంచక్కా సూర్యుడిని చూడొచ్చు. అప్పుడు రాత్రి రెండు మూడు గంటలు వుంటుంది అంతే. ఎందుకంటే ఇది ధ్రువానికి దగ్గర్లో వుంటుంది కాబట్టి.
ఇంటిపైకప్పునుండి బయట గోడపక్కగా నీటి ధార కారుతోంది. సన్నగా వర్షం పడుతోంది. దానికి తోడు ఇంటికప్పు మీద వున్న మంచు కూడా కరుగుతోంది. చిటపట చినుకుల శబ్దం ఆహ్లాదంగా వినపడుతోంది.
ఇక కరోనా సంగతికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఏక్టివ్ కేసులే లేవు. దాదాపు 65 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్ పూర్తి అయ్యింది. వారం క్రిందటే నేను రెండో డోసు వాక్సిన్ వేయించుకున్నాను. ఈ రాష్ట్రం దాటి ఎటు వెళ్ళి వచ్చినా లేదా బయటి నుండి ఈ రాష్ట్రానికి ఎవరు వచ్చినా రెండు వారాలు ఐసోలేషనులో వుండాలి. ఇండోర్ ప్లేసుల్లో మాస్క్ పెట్టుకోవాలని తప్ప వేరే పెద్దగా నిబంధనలు ఏమీ లేవు కాబట్టి హాయిగా ఆఫీసుకి వెళ్ళివస్తుంటాము, కలుస్తుంటాము, తిరుగుతుంటాము. కెనడాలో ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కరోనా ప్రకారంగా అత్యంత సురక్షితమయిన ప్రాంతాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. అందుకే ఐసోలేషన్ గురించి ప్రసక్తి వస్తే మా స్థానిక మిత్రుడు రాజీవ్ అంటాడూ - మనం ఎలాగూ ఐసోలేటెడ్ నే కదా - ఇంకా వేరే ఎందుకూ? అని. అవును మరీ. ఈ ప్రాతం నార్త్ పోల్‌కి నియర్లో వుంటుంది. ప్రకృతి సౌందర్యం మీద మక్కువ వుంటే తప్ప ఇక్కడ ఇలా దూరంగా వుండలేం. ఇక్కడి గాలి, నీరు 98 శాతం స్వఛ్ఛంగా వుంటాయి.
మరిన్ని విశేషాలతో మరోసారి కలుద్దాం. ఇంకో రెండు వారాల్లో చాలా అవుట్ డోర్ ఏక్టివిటీస్ మొదలెట్టాల్సి వుంది. ఆ కబుర్లూ మీతో పంచుకుంటాను.

పొద్దుపోని ముచ్చట్లు - 1

ఈమధ్య నా బ్లాగులో సిటిజెన్ అని ఒకరు అడిగారు - కరోనా డైరీస్ వ్రాయమని. ఇప్పటికే దాని గురించి తెగ వింటున్నాం, చూస్తున్నాం. వ్రాయాలంటే ఇంకా ఎక్కువ ఆలోచించాలి కదా - ఎందుకు లెద్దూ అనుకున్నా కానీ పొద్దు పోవడం కోసమైనా సరే వ్రాసి చూస్తే పోలా అని ఇప్పుడు అనుకుంటున్నాను.

కరోనా మా దగ్గర  ఇలా వుందీ: కెనడాలోని మా రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే కొద్దిగానే వుంది. అదీ తగ్గుముఖం పడుతోంది. 246 cases. 4 deaths. లాక్ డవున్ ఏమీ లేదు కానీ వీలయినంతవరకూ ఇంటిదగ్గరే వుండమనీ, పది మంది కంటే ఎక్కువ గుమికూడవద్దనీ, రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలనీ ఆర్డర్స్ వున్నాయి. వాతావరణం బావున్నప్పుడు మా ఇంటికి దగ్గర్లో వున్న యూవివర్సిటీ గ్రవుండ్స్ లో నడకకి వెళుతూ వుంటాను. ఇక పరుగు ప్రారంభించాల్సిందే  అనుకుంటూ వుంటాను కానీ పెద్ద సెల్ ఫోన్, సైన్‌ఫీల్డ్  సిరీస్‌లో జార్జ్ దగ్గర వుండేటువంటి పెద్ద వాలెట్ పెట్టుకొని ఎలా పరుగెత్తడం చెప్మా?

చాలామందిలాగే నేనూ ఇంట్లోంచి పనిచేస్తున్నా. నాకు ఇంట్లోంచి పని అంతగా ఇష్టం వుండదు. అస్తమానం పెళ్ళాం పిల్లల ముఖాలు మాత్రమే చూస్తూ వుండటం ఏం బావుంటుంది కానీ కష్టమయినా కొన్ని నెలలు తప్పేట్లుగా లేదు కదా.

ఇకపోతే మా నగరం లోని ఒకే ఒక్క డ్రైవ్ థ్రూ కరోనా టెస్టింగ్ సెంటర్ మా అపార్ట్మెంట్ ఎదురుగ్గానే వుంటుంది. మా ఇంట్లోంచి కూర్చున్నా, నిలుచున్నా క్లియర్‌గా కనపడుతూ వుంటుంది. ఎన్ని కార్లు వస్తున్నాయి, వెళుతున్నాయి చూడటం ఒక ఆబ్సెషన్‌లా అయిపోయింది. మూడువారాల క్రితం కార్లు బాగా కనపడ్డాయి. ఆ తరువాత బాగా తగ్గాయి. గత వారం రెండుమూడు రోజులకు ఒకసారి ఒకటీ రెండూ కనపడ్డాయి. ఇవాళ చూస్తే ఇంతవరకూ ఒక్క కారూ కనపడలేదు.

అమెరికా, ఇండియా లాంటి చాలా దేశాల్లాగానే మా ప్రభుత్వం కూడా ఆలస్యంగా విదేశీ ప్రయాణాలని కట్టడి చేసింది. అందువల్ల అప్పటికే కరోనా దేశంలోకి వచ్చేసింది. మన ప్రభుత్వాల అసమర్ధత వల్ల మనం అందరమూ కష్టాలని అనుభవిస్తున్నాం. కొద్ది దేశాలు ఎంచక్కా ముందే జాగ్రత్త పడ్డాయి. గ్జెనోఫోబియా అనుకుటారేమో అని సంకోచంతో మా ప్రధాని ఆలస్యం చేసినట్లుంది. లో రిస్క్, లో రిస్క్ అని చెబుతూ కరోనాకి తలుపులు చాలా వారాల పాటూ తెరిచే వుంచారు. 'ఓ కరోనా రేపు రా!' అని తలుపులు మూసేసి తాళం వెయ్యలేదు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో తప్ప మిగతా వాటిల్లో సమస్య తగ్గుతూ వుండటంతో సంతోషిస్తున్నాం. క్విబెక్ అనే రాష్ట్రంలోదక్షిణ కొరియాలోకి మల్లే ఒక క్రిస్టియన్ కల్ట్  నిబంధనలు పాటించక తెగ పాకించేసారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే సగానికి పైగా కేసులు వున్నాయి. ఈ దేశంలో రాష్ట్రాలని ప్రొవిన్సులు అంటారు.

అప్పుడప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఇతర కుటుంబాలతో కలిసి కుటుంబ సమేతంగా పార్కులకు గట్రా వెళ్ళివస్తుంటాను. మా సిటీ మరీ అస్తామానం ఇంట్లోనే వుండండి అని ఏమీ చెప్పదు. పార్కులకు గట్రా వెళ్ళండి కానీ రెండు మీటర్ల దూరం పాటించమంటుంది. అలా పాటించకపోతే దాదాపుగా 500 డాలర్లు ఫైను. శారీరక మానసిక ఆరోగ్యాలూ ముఖ్యమే కాబట్టి మా కుటుంబాన్ని కూడా నడకకు వెళ్ళేందుకై ప్రోత్సహిస్తూ వుంటాను. ఈ వారం వాతావరణం బాగోలేదు కాబట్టి నడక సాగలేదు. వచ్చే వారం నుండి అంతా ప్లస్ లోనే (సెల్సియస్). అందువల్ల ఎంచక్కా ఇంట్లో పని అయ్యాకా, వారాంతాలలోనూ అలా అలా బయటకి వెళ్ళి రావొచ్చు. కావాలంటే లాంగ్ డ్రయివులకు కూడా వెళ్ళొచ్చు.

మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎలా గడుపుతున్నారు? మానసిక, శారీరక ఆరోగ్యాలు కాపాడుకునేందుకై మీరు ఏం చేస్తున్నారు?

మూడు రాజధానుల కంటే కూడా రిలే రాజధానులు లేదా సంచార రాజధానులు బావుంటాయి

మూడు రాజధానుల ఆలోచన అసలు అమలులోకి వస్తుందో లేదో తెలియదు కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఆ తరువాత మరీ మూడేనా అనిపించింది. కొందరు ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని ఇస్తే పోలా అన్నారు కానీ అందువల్ల ఖర్చు ఎక్కువవుతుంది. అలా కాకుండా నాకు మరో ఆలోచన వచ్చింది. అదే రిలే రాజధానులు. హిప్పీలు మొదలయిన సంచార జాతుల వారు ఒక దగ్గర వుండకుండా తమ నివాస స్థలాలని మారుస్తూ వుంటారు. అదే విధంగా రాజధానిని కూడా ఎప్పుడూ ఒకే చోట వుంచకుండా నెలకి ఒక జిల్లాకి మారిస్తే ఎలా వుంటుంది? ఇలాంటి సంచార రాజధాని వల్ల చాలా లాభాలు వున్నాయి. శాశ్వత భవనాలు, వగైరా ఖర్చులు వుండవు. ఎంచక్కా అప్పటికే వున్న R&B భవనాలో, PWD గెస్ట్ హవుజుల ముందటో టెంట్లు వేసుకొని నడిపించేయవచ్చు.

ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయా భవనాల్లో ఆ నెల పాటూ నివసిస్తే సరి.  మిగతా సెక్రటెరియట్, హైకోర్ట్, అసెంబ్లీ, శాఖలు మొదలయినవి పెద్ద పెద్ద టెంట్లు, షామియానాలు వేసి లాగించొచ్చు. కానీ అలా ఒక్కో జిల్లాలో అలా అన్నీ ఒక్కో నెలా తిష్ఠ వేసుకొని కూర్చుంటే మిగతా జిల్లాల వారికి కోపం రావొచ్చు. అలాంటప్పుడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు విడివిడిగా ఒక్కో జిల్లాకి మారుస్తూ వుండాలి. అయితే ఇందులో కూడా ఒక సమస్య వుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక్కో జిల్లాకి వరుసగా ఇవి మారుస్తూ వుంటే చివరి జిల్లాల వారు అసహనం చెందవచ్చు. ఆ ఇబ్బంది లేకుండా లాటరీ పద్ధతిలో ర్యాండమ్‌గా ఒక్కో జిల్లాకి ఇవన్నీ మారుస్తూ వుంటే గనుక ఎవరికీ ఏ ఇబ్బందీ అనిపించదు. అన్ని జిల్లాల వారు, అన్ని ప్రాంతాల వారు తమకి తగిన ప్రాధాన్యం లభించిందని ఆనందపడిపొవొచ్చు.

మరీ సంచార జాతుల వలె టెంట్లు ఏం బావుంటాయని మీరు అనుకుంటే గనక దానికి పరిష్కారం వుంది. టెంట్లకు బదులుగా కారవాన్లు, మొబయిల్ హోమ్‌లు లేదా రిక్రియేషన్ వెహికల్స్ (RV) వినియోగిస్తే సరీ.

గమనిక: నేను ఏ పార్టీ లేదా ఏ హీరో అభిమానిని కాదు. ఇది జస్ట్ నాకు వచ్చిన ఆలోచన మాత్రమే.

ఇదో దిక్కుమాలిన పోస్ట్ - Don’t read :))

చాలా వరకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ ...డబ్బు విషయాల్లో మాత్రం ఇంకా కలిసిరావడం లేదు ఎందుకనో. నేను Law of Attraction నమ్ముతూ వుంటాను అని మీకు తెలిసిందే. నిజంగా జరుగుతుంటాయో లేక Selective Thinking వల్ల అలా అనిపిస్తుందో కానీ ఎన్నో ఎన్నెన్నో బహు చిత్రంగా కలిసివస్తున్నాయి. కానీ... ఒక్క సంపాదన విషయంలో మాత్రం కలిసిరాకపోగా - డబ్బు వెనక వెయ్యకపోగా...ముందు వెయ్యడం జరుగుతోంది. ఎందుకని చెప్మా?! సెలెక్టివ్ థింకింగ్ వల్ల అయినా కానీ అందులో కలిసి వస్తున్నట్లు కనీసం భ్రమ అయినా కలగాలి కదా. అదీ లేదు, పైగా ఎన్నో ఎన్నెన్నో ఖర్చులు, అవసరాలు మాత్రం అన్ని విధాలుగా బహు బాహ్గా కలిసివస్తున్నాయి. వా...! :(

నా మొఖం. నేను ఇలా ఆలోచిస్తూ వుంటే, ఇంట్లో వాళ్ళూ ఇంతకంటే దరిద్రంగా ఆలోచిస్తూ వుంటే ఇలాగే వుంటుంది లెండి. లెక్క ప్రకారం ఇలాంటి వ్రాతలు వ్రాయకూడదు కానీ ఎప్పటినుండో ఇది కూడా మీతో పంచుకోవాలనే దిక్కుమాలిన ఆలోచన వుంటోంది. ఆ పనేదో చేస్తేనన్నా పీడా వదుల్తుందేమోననీ ఇదీ వ్రాయడం!

All is well. Don't worry. అప్పుడప్పుడూ నా బ్లాగుని ఇలా నా మనోస్ఖలనం కోసం ఉపయోగించుకుంటూంటా అని మీకు తెలుసును కదా :)) సర్లెండి - ప్రతి కుక్కకీ ఓ సమయం వస్తుంది కదా. మనం చెయ్యాల్సిందెల్లా ఆ సమయాన్ని ఫీల్ అవుతూ ఆ సమయం కోసం వేచివుండటమే. మనం అనుకున్నది 'ఎలా?' అవిష్కారం అవుతుందీ అన్నది మన సమస్య కాదు - అది విశ్వ సమస్య! ఆ సమయం ఆసన్నమయినప్పుడు అలా అలా అలవోకగా, అద్భుతంగా అవిష్కారం అవుతాయి అన్నీనూ. కంగారేమీ లేదు మిత్రమా.

హహ్! ఇన్నాళ్ళకి కామసూత్ర!

మొన్న ఒక ముప్పయి అయిదేళ్ళ పెళ్ళికాని మిత్రుడొకరు ఊరు మారుతున్నా అంటే సహాయం చెయ్యడానికి వెళ్ళాను. తను పుస్తకాల బరువు తగ్గించుకోవాలనుకుంటున్నాడు. Fifty Shades of Grey సిరీస్ వుంది కావాలా అడిగాడు. ఎగిరి గంతేసినంత పన్జేసి ఓ య్యెస్ అన్నా. ఎందుకో ఆ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్  లో వున్నా ఇంతవరకూ చూడలేదు - తెలిసిన సబ్జెక్ట్ నే కదా అన్న ఉదాసీనత. సో, మనోడికి BDSM కాన్సెప్ట్స్ బాహ్గా తెలుసునేమో మనస్సులో అనేసుకొని నాకో Dom వుందబ్బా అని ఉత్సాహంగా అనేసా. మనవాడు తెల్లముఖం వేసేసాడు. దాంతో మనవాడికి అసలు ఆ  కాన్సెప్ట్స్ తెలుసా అని ఆ పుస్తకాలలో వున్న మెయిన్ థీమ్ ఏంటి చెప్పూ అని అడిగా.  ఏదేదో చెప్పాడు. అవేమీ కాదని BDSM అని చెప్పా. ఆ విషయాలేవీ అతనికి తెలియదు. ఆ సిరీస్ చదివి కూడా ఆయా విషయాలు తెలియకపోవడం ఆశ్చర్యం అనిపించింది. 

అటుపై కామసూత్ర పుస్తకం వుంది కావాలా అని అడిగాడు. మళ్ళీ ఎగిరి గంతేసినంత పనిచేసాను. వాత్సాయనుడు ఏదో చిన్న పుస్తకం వ్రాసేడనుకున్నా కానీ పెద్ద పుస్తకమే. ఇంగ్లీషు అనువాదం లెండి. పుట్టుకతో ఒక భారతీయుడనై వుండి ఇన్నేళ్ళుగా ఆ పుస్తకం చదవలేకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. చదవడం మొదలెట్టాను - ఉపోద్ఘాతం వరకే అయ్యింది ఈరోజుకి. కామసూత్రని అందించిన మనదేశం ఈరోజున శృంగారాన్ని ఎంత రోతగా చూస్తోందో అని ఆ విదేశీ అనువాదకుడితో పాటు నేనూ నిస్పృహ చెందేను. 

మీలో ఎవరయినా ఆ రెండు పుస్తకాలు కానీ ఒకటి కానీ చదివిన వాళ్ళు వుంటే మీ అభిప్రాయాలు పంచుకోండేం. 

telugu.telugupost.com సమీక్ష

http://telugu.telugupost.com/


       తెలుగు్‌పోస్ట్ నిర్వాహకులు తమ తెలుగు పోర్టల్ మీద సమీక్ష కోరినప్పుడు సహజంగానే నేను రోజూ చూసే ఒక 'గొప్ప' తెలుగు పోర్టలుతో తారతమ్యాలు ఏంటా అని పరిశీలించాను. దాన్ని వదిలి ఇది చూడాల్సినంత గొప్పదనం కానీ, ఆవశ్యకత కానీ ఏముందా అని పరిశీలించాను.  అందులో కొన్ని వార్తలు చికాకు కలిగిస్తుంటాయి. వార్తా ప్రాధాన్యత లేని వాటిని కూడా హిట్స్ కోసం ఏవేవో వ్రాస్తూ అసహనం కలిగిస్తున్నా, ఇంకా కొన్ని లోపాలున్నా కూడా కొన్ని గొప్పదనాలు వున్నయ్ కాబట్టి ఆ పోర్టలు రోజుకి ఒకసారి చూడనిదే నాకు నిద్రపట్టదు. ముఖ్యంగా అందులో ఒకరు వ్రాసే ఆర్టికల్స్ అరటిపండు ఒలిచిపెట్టినంత సులభంగా, ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా, సరదాగా  వుంటాయి. అవే కాకుండా వారి మోబయిల్ వెబ్సైట్ ఫాంట్ కానీ, అమరిక కానీ చాలా చక్కగా వుంటుంది కానీ వ్యాపార ప్రకటనలు ఎక్కువయ్యి మనం చదవాల్సిందెక్కడా అని ఆ పోర్టలులో వెతుక్కోవాల్సివస్తుంటుంది. 

     తెలుగుపోస్ట్ చూసినప్పుడు అలాంటి చెత్త పోస్టులు, రాతలు లేకుండా వ్యాసాలు పద్ధతిగా, హుందాగా, బ్యాలన్సుడుగా వున్నాయి. విశ్లేషణాత్మకంగా వ్యాసాలు వున్నాయి కానీ అంతా సీరియస్సుగానే వున్నాయి. అందులో కొన్నిటిలోనన్నా హాస్యం కనపడుతుందేమో అని చూసా కానీ అబ్బే లేదు. జనాలకి సమాచారం ఒక్కటే కాకుండా, వినోదం ఒక్కటే కాకుండా రెండింటినీ కలిపి ఇస్తే ఆ వ్యాసాలు ఇంఫొటైన్మెంటుతో ఆసక్తికరంగా, ఉపయోగకరంగా వుంటయ్. ఆ విషయాన్ని నిర్వాహకులు గుర్తించినట్లు లేరు. అలాంటివి కొన్ని అయినా ఇందులో వస్తుంటేనే బావుంటుంది. ఇందులో ఆర్టికల్స్ అన్నీ బావున్నప్పటికీ అన్నిటినీ ఒకరే వ్రాసేరా అన్నంతగా మూస పద్ధతిలో వున్నయ్. రచనా శైలిలో పెద్దగా వైవిధ్యం నాకు అయితే కనపడలేదు మరి. ఆ లోపాన్ని వీరు సరిచేసుకోవాల్సి వుంది.

     ఇకపోతే ఇందులో కేవలం రాజకీయాలు, సినిమాలు మాత్రమే వున్నాయి. వేరే ఆంశాల మీద పెద్దగా వ్యాసాలు లేవు. ఈ రాజకీయాలూ, సినిమాలూ అన్ని పోర్టల్స్ లో, టివిల్లో, పత్రికల్లో వుండేవే కదా. అవి దాటుకొని నాబోటి వాడు ఈ వెబ్‌సైటుకి రావాలంటే కొత్తదనం కనిపించాలి మరి. వెబ్సైట్ ఫాంట్, అమరిక బాగానే వున్నప్పటికీ నాలాంటివారు ఎక్కువగా చూసే మొబయిల్ సైటులో ఫాంట్ కానీ, అమరిక కానీ అంత ఆహ్లాదంగా అనిపించలేదు. ప్రస్తుతానికయితే వ్యాపార ప్రకటనలు లేకుండా, ఆ ప్రకటనల మధ్య అసలు విషయం ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హాయిగా వుంది ఈ తెలుగు పోస్ట్ చూస్తూ వుంటే.  

ఈ సైటు చూస్తూ వుంటే క్వాలిటీ కంటెంట్ నిజాయితీగా, నిష్పక్షపాతంగా, హుందాగా చదువరులకు అందించాలనే తపన కనపడుతోంది. ఈ సైటు ఇంకా కొత్తదే కనుక మున్ముందు ఈ కమిట్మెంటుతో పాటుగా కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని, ఇంఫొటైన్మెంటును వీరు అందించగలగితే మనకో చక్కని తెలుగు వెబ్ పోర్టల్ దక్కినట్లే. 

ప్రస్థుతానికి అయితే పాస్ మార్కులే వేస్తున్నా ఈ సైటుకి.  

http://telugu.telugupost.com/


మీరూ ఈ సైటు ని ఒక లుక్కేసి మీకెలా అనిపించిందో, నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారో లేదో చెబుదురూ.   

ఒక దీర్ఘకాల సమస్య తీరిపోయిందోచ్!

లాక్టోజ్ ఇంటోలరెన్సుతో ( Lactose Intolerance) నా యుక్తవయస్సు నుండీ అవస్థ పడుతున్నాను. అసలు విషయం అదని తెలియక ఇండియాలో వున్నప్పుడు ఎంతోమంది దద్దమ్మ డాక్టర్లకు నా సమస్య మొరపెట్టుకున్నాను. అదన్నారు, ఇదన్నారు కానీ ఒక్కడన్నా అది అయివుండొచ్చునేమో అని సూచనప్రాయంగా కూడా అనుమానం వెలిబుచ్చలేదు ఆ మా గొప్ప వైద్యులు. కెనడాకి వచ్చాక లాక్టోజ్ ఫ్రీ మిల్క్ చూసి అదేంటొ ఎయిడ్స్ ఫ్రీ మిల్క్ తరహాలో అనుకొని మనకెందుకులే అది అని పట్టించుకోలేదు. అలా గ్రోసరీకి వెళ్ళినప్పుడల్లా ఆ పాలు చూసి, చూసి ఆసక్తి పుట్టి నెట్టులో వెతికాను. అప్పుడర్ధమయ్యింది - నా లక్షణాలు అవేననీ, మన భారతీయులకే ఈ సమస్య ఎక్కువ వుంటుందనీనూ.  ఆ పాలు తెచ్చుకొని పరీక్షించా - నా సమస్యకి తాత్కాలిక పద్ధతుల్లో పరిష్కారం లభించింది. కానీ ఆ పాలకి ధర ఎక్కువ. ఇంట్లో పెరుగు అందరికీ ఆ పాలతొ చెయ్యాలన్నా, లేక ఏ ఇతర పాల పదార్ధాలు తిన్నా ఇన్నేళ్ళుగా ఇబ్బందిగానే వుండేది. ఎంత నెట్టులో పరిష్కారం కోసం వెతికినా పాలు పక్కన పెట్టమనే కానీ ఓ పరిష్కారం దొరకలేదు. ఇక లాభం లేదని ఈమధ్య లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రయోగించా.
   
అద్భుతః! ఒక దేశీ హెయి కటింగ్ సెలూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేశీ హోమియో డాక్టర్ కార్డ్ కనపడింది. పట్టుకొని వచ్చి ఫోన్ చేసి కలుసుకొని నా సమస్యలన్నీ మొరపెట్టుకున్నా. ఒక్క పాలే కాకుండా ఇంకా ఏవేవో ఫుడ్ ఇంటోలరెన్సులు కూడా వున్నయ్ నాకు. లాక్టోజ్ ఇంటోలరెన్సుతో సహా వాటిల్లో చాలా వాటికి పరిష్కారం లభించింది. హాయిగా పాలు పెరుగుతో పాటు నాకు ఇష్టం అయిన అహారం అంతా ఎంచక్కా తినగలుగుతున్నాను కానీ గోంగూర మాత్రం ఇంకా పడట్లేదు. అది తిన్న రోజు దగ్గు, జలుబు వగైరాలతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది కూడా తీరితే బావుండును - ఎందుకంటే నాకు గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం మరీ. 

మీలో ఎవరికయినా లాక్టోజ్ ఇంటోలరెన్సు కానీ, ఫుడ్ ఇంటోలరెన్సులు కానీ, ఆస్మా లాంటివి కానీ వుంటే హోమియో మందులు వాడి చూడండి - మీకూ నయమై పోవొచ్చును.   

నిజమో లేక నా భ్రమో కానీ ఇలా ఒక్కొక్క సమస్యా LOAతో తీరిపోతూవుంటే, అన్నీ ఒక దాని తరువాత ఒకటి కలిసివస్తుంటే జీవితం భ్రహ్మాండంగా సాగిపోదూ? ఇంకో ముఖ్యమయిన సమస్య తీరడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం వుంది. నా బ్లాగు మొదట్నుండీ చదువుతూవున్న వాళ్ళు అదేంటో అర్ధం చేసుకోవొచ్చు ;) బయటకి ఎందుకులెండి చెప్పుకోవడం - మీరే చూస్తారుగా మున్ముందూ :))  

కొవ్వు ఎక్కడ కరిగింది చెప్మా?

నాకు చిన్నప్పటి నుండీ వ్యాయామం అంటే వ్యామోహమే కానీ నా బాడీ తట్టుకోక తేలిగ్గా ఓవర్ట్రైనింగ్ సిండ్రోం (Overtraining Syndrome)  వచ్చేది. అసలు అది వస్తోందని కూడా తెలియక దాంతో చాలా అవస్థలు పడ్డాలెండి. ఆఖరుకి దానికి సరి అయిన పరిష్కారం ఈమధ్యే అర్ధమయ్యింది. వెయిట్స్ చేసాకా  ప్రోటీనుతో పాటూ కార్బోహైడ్రేట్స్ కూడా బాగా తీసుకోవాలని. బిక్కుబిక్కుమంటూ వెయిట్స్ చేస్తూ అలా కార్బోహైడ్రేట్స్ తో ప్రయొగాలు చేసా. ఫర్వాలేదు - ఫలించాయి. హమ్మయ్య ఇక భేషుగ్గా వెయిట్స్ చెయ్యొచ్చు కానీ వ్యాయామం వారాంతాలలో ఖచ్చితంగా ఆ రెండు రోజులూ చెయ్యగలుగుతున్నా కానీ వివిధ కారణాల వల్ల ఇతర వారం రోజుల్లో పెద్దగా కుదరడం లేదు. ఆ విషయాన్ని నేను సరి చెయ్యాల్సి వుంది.

వెయిట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ చెయ్యాలనే అత్యాశలేమీ లేవు కానీ ఫ్యామిలీ ప్యాక్ తగ్గించుకోవాలన్న ఉబలాటం మాత్రం వుంది.  నా బరువు సమస్య లేదు - ఎంత కావాలంటే అంత పెంచగలనూ - తగ్గించగలనూ. కాకపోతే బుల్లి బొజ్జ మాత్రం వుందండొయ్. తస్సాదియ్యా ఎంత ప్రయత్నించినా అది మాత్రం పోలేదు. సో, దానిమీద పడ్డా ఇకా. ఆ బుల్లి బొజ్జ రావడానికి ఓ కథ వుందిలెండి. నా యుక్త వయస్సులో బాహ్గా బక్కగా వుండేవాడిని. అలా లాభం లేదని చెప్పి బరువు, లావు పెరగాలనీ బాగా బీర్లు లాగించడమే కాక పెరుగులో నెయ్యి వడ్డించుకొని మరీ భోజనం చేసేవోడిని. అలా బరువు సంగతేమో కానీ బుల్లి బొజ్జ మాత్రం పెరిగిందండీ - మళ్ళీ తగ్గలేదు.

అయితే ఈమధ్య కాలంలో వారాంతాలో క్రమం తప్పకుండా వెయిట్స్ చేస్తూ దాని మీద దృష్టి పెట్టాను.  రోజూ ఉదయమే నా బరువూ, నా బాడీ ఫ్యాట్ % చూసుకుంటూ వుంటా. ఆ ప్రకారం నా శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతోంది కానీ... కానీ.. బొజ్జ మాత్రం పెరగసాగింది. వా...! ఎక్కడ వుంది లోపం అని చూసా. వెయిట్స్ చేసినప్పుడు పలు కారణాల తాత్కాలికంగా బొజ్జ పెరగొచ్చు. ఓక్కే. అది సరే కానీ మరి కొవ్వు ఎక్కడ తగ్గుతోంది చెప్మా? జీన్స్ వగైరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో ప్రదేశంలో ముందు తగ్గొచ్చు. మరి నాకు ఎక్కాడ? త్వరలోనే అర్ధమయ్యింది - జతొజడల్లో అని - ఐ మీన్ తోడల్లో. కండలు క్రమంగా బయటపడుతున్నాయి. సర్లెండి. ఎక్కడో చోట మొదలయ్యింది కదా, అదే సంతోషం. నెమ్మదిగా టమ్మీ ఫ్లాట్ అవుతుంది లెండి. మొత్తం కొన్ని వారాల్లో 1.5% బాడీ ఫ్యాట్ తగ్గించా. నా ఏజికి, గేజికి 13% నుండి 22% వుంటే సాధారణం. నాకు 21% వుండేది. ఈరోజు 19.5% వుంది. నా లక్ష్యం ప్రస్థుతానికి సరాసరిన 17.5%. నెమ్మదిగా బెల్లీ కూడా తగ్గుతున్నట్లుగానే వుంది. ఇవాళ ఒక బెల్ట్ రంధ్రం తగ్గించా మరి. 

మిగతా వారం రోజుల్లో కూడా చేస్తే ఇంకా మెరుగుదల బాగా వుండొచ్చు - ప్రయత్నిద్దాం. శని ఆది వారాల్లో ఉదయమే వెళ్ళి వస్తుంటారు. దగ్గర్లో వుండే యూనివర్సిటీ జిం చాలా బావుంటుంది - అలాంటి పెద్ద, మంచి జిం ఇంతవరకూ చూడలేదు. వారాంతాలల్లో ఉదయం 8 గంటలకి తెరుస్తారు. వెళ్ళి ఒక పదినిమిషాలు వార్మప్ కోసం ఏరోబిక్స్ చేసి, ఇక 50 నిమిషాలు ఎనరోబిక్స్ మీద పడుతాను. అలా గంట చేసేకా కొంత సమయం సానా (Sauna) లో గడిపి సేదతీరి ఇంటికి వచ్చి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ పడేస్తుంటాను.  అటుపై కూడా ప్రోటీన్ పై శ్రద్ధ పెట్టి తగిన ఆహారం తీసుకుంటూవుంటాను. అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది - సంతోషం కాదూ.

ఎవరయినా బిట్‌కాయిన్ (భవిష్యత్) బిలియనీర్లు వున్నారా ఇక్కాడ?

ఈమధ్య సెలవులకి US వెళ్ళాను. (ప్రస్తుతం కెనడాలో వుంటున్నా లెండి). ఒక గృహప్రవేశానికీ వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. పక్కనే వున్న మిత్రుడు ఒకరు నాతో అన్నాడిలా 'నేను కనుక బిట్‌కాయిన్ బిలియనీర్ అయితే కనుక నేనూ సత్యనారాయణ వ్రతం చేయిస్తా!'.  నేనన్నాను 'సత్యనారాయణ స్వామికి అలా లంచం పడేస్తున్నారా ఏంటీ?!'
అతనన్నాడూ 'తప్పేముందీ? అందరు ధనవంతులూ దేవుడికి ఇలా లంచాలు ఇస్తూనే వుంటారు కదా'. ఈస్నేహితుడు రిటైర్మెంట్స్ సేవింగ్స్ అన్నీ తీసి అందులో పెట్టాడు. అతను కొన్నప్పుడు బిట్‌కాయిన్ $4,000 వుండేది. మూడువారాల క్రితం అది దాదాపుగా $20,000 దాకా పెరిగి మళ్ళీ ఇప్పుడు $16,000 చుట్టుపక్కల వుంటోంది. ధర ఒకేసారి బాగా తగ్గినప్పుడు గుండె పట్టుకున్నాడు.

నేను US లో వ్యక్తిగతంగా కలిసిన మిత్రులందరూ బిట్‌కాయిన్స్ లో గానీ లేదా అలాంటి ఆల్ట్‌కాయిన్స్ (అన్నింటినీ కలిపి క్రిప్టోకరెన్సీ అనొచ్చు) లలో పెట్టుబడిపెడుతున్నారు లేదా పెట్టాలనుకుంటున్నారు. ఒక  నాకు తెలిసిన రెసిడెన్సీ చేస్తున్న డాక్టర్ తన ఆదాయాన్నంతా అందులోనే పెట్టేస్తున్నాడు. ఆ మిత్రులని అడిగి కొన్ని సందేహాలు తీర్చుకొని దీని సంగతేంటా అని రెసెర్చ్ మొదలెట్టా.

ఇప్పటిదాకా ఏదో వార్తల్లో చదవడమే కానీ మన బోటివాళ్ళు కూడా ఇలా వీటిల్లో పెట్టుబడి పెట్టొచ్చని నాకు తెలియదు. అన్ని రకాల సలహాలు పరిశీలించాను. వీటిల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి మనం కూడబెట్టుకున్న డబ్బు అంతా తీసికెళ్ళి పెట్టడం మూర్ఖత్వం అంటున్నారు. కానీ అసలే ఇందులో పెట్టుబడి పెట్టకపోవడం కూడా మూర్ఖత్వమే అంటున్నారు మరి. అంచేతా... నేనూ ఓ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారును అవుదాం అనుకుంటున్నా. మార్కెట్ అధ్యయనం చేస్తున్నా. బిట్‌కాయిన్ లాంటివి వందల కొద్దీ వున్నాయి. ఇక్కడి యువతలో మూడొంతులు వీటిల్లోనే పెట్టుబడులు పెడుతున్నారంట. నాకు బిట్‌కాయిన్ మీద ఆసక్తి లేదు. నాకు ఇథేరియం - Ethereum  (ఇథ్ కాయిన్ - Eth) ఆసక్తికరంగా అనిపిస్తోంది. ముందయితే అందులో పెట్టుబడి పెట్టి చూస్తా. మరీ ఎక్కువ కాదులెండి. నా నెట్ ఎర్నింగ్స్ లో 10%. రిస్క్ వుంది నాకు తెలుసు - ఈ మాత్రం పెట్టుబడి నేను కోల్పోయినా భరించేయగలను.    ఈ రిస్క్ కూడా తగ్గించుకోవడానికి నా ప్లాన్లు నాకు వున్నాయి.

నాకు స్టాక్స్ అర్ధం కావు కానీ ఇది ఆసక్తికరంగా వుండటంతో కాస్తంత అర్ధం అవుతోంది. మొత్తం మీద ఇది ఒక వ్యసనం లాంటిది అని అర్ధం అయ్యింది. ఈ అంటువ్యాధి తగిలితే కనుక వదలడం కష్టం. అందుకే మీకూ ఎక్కించాలని చూస్తున్నా :)) మీలో ఎవరికయినా ఈ వ్యాధి ఇప్పటికే అంటివుంటే వ్యాఖ్యల్లో చర్చిద్దాం రండి.

అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతున్నాయ్

ఏదయినా సృజనాత్మకంగా పని చేస్తూ అందరినీ కలుపుకుపోతూ బ్యుజీ బ్యుజీ వుండాలనుకునేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నిస్తున్నాం కదా. అందరూ ఉత్సాహంగా వున్నారు. అన్నా అన్నా అంటూ అందరూ తోడు నిలుస్తున్నారు. అయితే నటన తప్ప అన్ని విషయాలు నేనే చూసుకోవాల్సి రావడం వల్ల మా ప్రొడక్షన్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అన్నిటిమీద మంచి అవగాహన కలుగుతోంది. మంచి అనుభవం వస్తోంది. ప్రస్తుతం ఇంకా ప్రాక్టీసు చేస్తూనే వున్నాం.  పగ అనే రెవెంజ్ స్టొరీ ని తీసుకున్నాం. అందులో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నయ్ కానీ వాటిల్లోంచే ఎంతో నేర్చుకుంటున్నాం. ఆ ఫిల్మ్ ఇంకా రెండు వారాల్లో పూర్తి అవుతుంది. వ్యవధి 20 నిమిషాలు.  అయితే మీకు కానీ, పబ్లిక్ కి కానీ అది షేర్ చేసే వుద్దేశ్యం లేదు - ఎందుకంటే మా సిల్లీ మిస్టేక్స్ చూసి మీరంతా నవ్వేస్తారు :))

అటుపై సరాసరిన వారానికి ఒక 10 నిమిషాల లఘు చిత్రం నిర్మించాలనుకుంటున్నాం.   

సీతా కాలమ్!

నా బ్లాగులో ఒక టపా కోసమని గూగుల్ చేస్తుంటే అప్పట్లో వచ్చిన ఈ బ్లాగ్ తటస్తించింది. మళ్ళీ అన్ని పోస్టులూ, కామెంట్లూ చదివేసా. మీరూ చూడండి.


http://seeta-kaalam.blogspot.ca/

రెండు గంటలు - లఘు చిత్రం షూటింగ్ విశేషాలు

- షూటింగ్ చక్కగా, సరదాగా జరిగింది. మా అందరికీ ఎంతో అనుభవం వచ్చేసింది.
- రెండే పాత్రలు. హీరో నటనలో ఇబ్బంది పడటం వల్ల బాగా స్లో అయ్యి కొంత మాత్రమే చిత్రీకరించగలిగాము.
- కథ బావున్నప్పటికీ సీరియస్ సబ్జెక్ట్ అవడం వల్ల కష్టపడి తీసినా రిపీటెడ్ ప్రేక్షకులు వుండరేమో అనే అనుమానంతో ఈ చిత్రీకరణ అటకెక్కించేసాం.
- తదుపరి చిత్రం కోసం కథ వ్రాస్తున్నాను.  ప్లాట్ డిపర్సనలైజేషన్ డిజార్డర్. ఇంఫోటైన్మెంట్.
- ఈ లఘుచిత్రాల పనుల వల్ల తీరికలేక వ్యాఖ్యలకు ప్రతిస్పందించడంలోనూ, పోస్టులు వ్రాయడంలోనూ బాగా జాప్యం జరుగుతోంది. మన్నించండి.

ప్రాణం (Working Title) - Short Story Draft Part - 1

(ఈ ఆదివారం చిత్రీకరణ కోసం కాస్త హడావిడిగా వ్రాసిన, వ్రాస్తున్న కథ కాబట్టి అంత బాగా రాకపోతుండవచ్చు. దీనిని ఇంకా బాగా ఫైన్ ట్యూన్ చెయ్యాల్సివుంది.)

"రండి." అని సుదీప్ ని ఆహ్వానించాడు
"మీరు చాలా ప్రొఫెషనల్ గా అగుపిస్తున్నారే" లొపలికి వస్తూ అన్నాడు సుదీప్.
"నేను ప్రొఫెషనల్ నే కదా" సన్నగా నవ్వాడు
"మీ గొంతు ఫోనులో బొంగురుగా వుంది కాని ఇప్పుడు నార్మల్ గానే వుందే!"
"అవును. ఫోన్ మీద కర్చీఫ్ పెట్టుకొని పెట్టుకొని మాట్లాడా అప్పుడు నన్ను మీరు గుర్తుపట్టకుండా"
"నిజమా!"
"కాదు. జోకు"
"జోకా?"
"కాదు నిజం"
సుదీప్ కి ఫక్కున నవ్వొచ్చింది. "వెరీ ఫన్నీ" అని గలగలా నవ్వాడు
"కదా"
  ----
"చెప్పండి. ఎందుకు చావాలనుకుంటున్నారు?" అని అడిగాడు రతన్.
సుదీప్ ఇబ్బందిగా కుర్చీలో నుసిలాడు. "ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు అవసరమా? నేను అడిగిన పని చేసిపెట్టండి చాలు"
"అవసరమే. నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఏ కేసూ తీసుకోను"
సుదీప్ దీర్ఘంగా నిట్టూర్చాడు. "హ్మ్. ఏమో, అలా చావాలని అనిపిస్తుంది అంతే. పూర్తిగా నిరాశా నిస్పృహానూ."
"ఏం సమస్యలున్నాయి?"
"నిజానికి సమస్యలేమీ లేవు. ఏ సమస్యా లేకపోవడమే నా సమస్యేమో. చావాలనుకోనే ఆలోచనను ఆపుకోలేకపోవడమే నా సమస్య"
"నిజమే. జీవితం మరీ చక్కగా నడుస్తోంటే బుర్రకి పనిలేక చెత్తగా అవుతుంది. ఇదివరలో డాక్టర్లని కలిసారా?"
"లేదు. నాకు సాధారణంగా డాక్టర్లని కలవడం నచ్చదు. ఏమీ ఇంతవరకు కలవలేదు. బ్రతకాలని అనుకుంటే కలిసేవాడినేమో కానీ కాదు కదా. అందుకే మిమల్ని కలుస్తున్నా.
"మానసిక వైద్యంలో మందులు వుంటాయి. వాడి చూడండి. బ్రతకాలని అనిపించవచ్చు"
"నాకు బ్రతకాలాలని లేదు"
"అయితే మీకు మరణమే శరణ్యం"
"ఖచ్చితంగా"
"మరి మీ భార్యా పిల్లలు...?"
"ఏమో...తెలియదు. దూరం అవుతాను...తప్పదు"
"వాళ్ళంటే మీకు ప్రేమ లేదా?"
"వుంది" అని నిట్టూర్చి "బోలెడంత వుంది" అని పొడిగించాడు. అతని గొంతు గాద్గదికం అయ్యింది. "...కానీ ఏం చెయ్యను, నా మనస్సు నా ఆధీనంలో లేదు" అన్నాడు సుదీప్ బేలంగా
"అర్ధం అవుతోంది" తల పంకిస్తూ అన్నాడు రతన్. "అయితే మీ దుఖ్ఖానికి కారణం మీ భార్యా పిల్లలు కాదన్నమాట"
"అవును. ఎవరూ కాదు. కేవలం నేనే కారణం. నిజానికి నా భార్యాపిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, నేనూ వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాను. కానీ...నా పరిస్థితేంటో మీకు అర్ధమయ్యింది కదా"
తల పంకించాడు రతన్. "మీరు డిప్రెషనులో వున్నారు. దానికి ఏవో సమస్యలే కారణం కానక్కర లేదు. ఏ కారణం లేకుండా కూడా అది రావొచ్చును. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ యొక్క అసమతుల్యత వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది"
"అవునా. ఏ సమస్యలు లేకుండా కూడా మానసిక బాధలు రావొచ్చా! కొత్తగా వింటున్నా ఇది నేను"
"అది నిజం. అందుకే మీరు శుబ్బరంగా మీ మనోవ్యాకులత దూరం కావడానికి మందులు వాడండి, సరిపోతుంది"
"లేదు. నాకు అంత ఓపిక లేదు. నేను హాయిగా మరణించాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి తిరుగులేదు. నా ఆస్థి చాలా వరకు నా భర్యా పిల్లల మీద, కొంత నాధ శరణాలయాలకూ విల్లు వ్రాసేసాను. నేను పోయినా సరే వాళ్లకు ఏ కష్టమూ కలగకుండా అన్ని ఎర్పాట్లూ చేసేసాను"
"ఎన్ని ఏర్పాట్లు చేసినా మీరు లేనిలోటు ఎవరూ తీర్చలేరు కదా" అనునయంగా అన్నాడు రతన్.
సుదీప్ విసుగ్గా "మీరు అనవసరంగా నా మనస్సు మార్చడానికి ప్రయత్నించకండి. నేను అడిగిన పని చేసిపెట్టండి చాలు. మీరు కాదంటే నేను మరో వ్యక్తిని చూసుకుంటాను" అన్నాడు.
"మీరు అడిగిన పని చేసిపెట్టేముందు నా వంతు ప్రయత్నం నేను చేసా కానీ లాభం లేదు. మీరు గట్టి నిర్ణయంతో వున్నారు"
"అవును" అన్నాడు పరాకుగా ఏదో ఆలోచొస్తూ.
"అలాగే, మీరు చెప్పినట్లే చేద్దాం. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? ఎలాగూ చావబోతున్నారు కదా. మీ భార్యా పిల్లల్లూ, ఆస్థిపాస్థులూ ఏమయిపోతే మీకేం? మీరేమయినా మళ్ళీ చూడొస్తారా ఏంటీ? ఆ ఆస్థిపాస్థులు ఏవో నా పేరిట రాసివ్వ కూడదూ?"
"కుదరదు" అన్నాడు కరుకుగా. "అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వూ ఆ వ్యవహారాల్లో ఘటికుడివే అయినా మనిషిగా మంచివాడివి అని మధ్యవర్తి చెబితేనే ఇటు వచ్చా. ఇలా నా కుటుంబానికి చెందాల్సిన ఆస్థి మీదనే కన్నువేస్తావని అనుకోలేదు. నీకో నమస్కారం. నువ్వే పనీ నాకు చేసిపెట్టక్కర్లేదు".
"కంగారు పడకండి. మీ భార్యాపిల్లల మీద మీకు ఎంత ప్రేమ వుందో తెలుసుకుందామని అలా అన్నా అంతే. నిజానికి మీ భార్యాపిల్లలు అదృష్టవంతులు... ఇప్పటిదాకా. ఇకపై దురదృష్టవంతులు అవుతారు. ప్చ్!"
"హ్మ్" నిట్టూరుస్తూ తల పక్కకు తిప్పుకున్నాడు సుదీప్. అతని కళ్ళళ్ళొ నీళ్ళు.
కాస్సేపు మౌనం  రాజ్యం ఏలింది వాళ్ళ మధ్య.

"సరే. నేను చెప్పిన చోట డబ్బు జారవిడిచి వచ్చారు కదా"
"అవును. మనం అనుకున్న మొత్తం ఖచ్చితంగా జారవిడిచి వచ్చాను"
"సంతోషం. ఒక్క నిమిషం. మా వాళ్ళు ఆ డబ్బు తీసుకొని సరిగా వుందో చూసివుంటారు, కనుక్కుంటాను"
"నా మీద నమ్మకం లేదా? చావబోయేవాడిని అలా మోసం చేస్తానా?"
"మోసం చెయ్యాలనుకునేవారు ఎప్పుడయినా చేస్తారు. వాళ్ళకి చావుబ్రతుకులతో సంబంధం వుండదు. వారికి అది రక్తంలోనే వుంటుంది" అని సన్నగా నవ్వాడు రతన్. "మీ మీద నమ్మకం లేక కాదు కానీ ఒకసారి చూసుకోవాలి. ట్రస్ట్ బట్ వెరిఫై అని రోనాల్డ్ రీగన్ అన్నాడు"
"సరే మీ ఇష్టం"

"మా వాళ్ళు ధృవీకరించారు. సంతోషం. ఇక మనం ఒప్పందంలోకి వచ్చాం. నాకు కావాల్సింది మీరు ఇచ్చారు - ఇక మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఈ సందర్భంగా డ్రింక్స్ తీసుకుందాము. మీకోసం ఐస్ వైన్ సిద్ధంగా వుంచాను" రతన్ లేచి నిలబడుతూ అన్నాడు.
"హర్రే. నాకు ఐస్ వైన్ మాత్రమే ఇష్టం అని మీకు అలా తెలుసు??"
రతన్ మళ్ళీ సన్నగా నవ్వాడు. " నా క్లయింట్ గురించి వీలయినంతా తెలుసుకోవడం నా విద్యుక్త ధర్మం కదా. కాదా? ఇంకా మీ గురించి చాలా తెలుసు"
"నిజమా?!"
"మీరు ఇక్కడికి వచ్చేముందు మీ ఆవిడకి ఎన్ని ముద్దులు ఇచ్చారో కూడా తెలుసు"
"నిజమా?!"
"చూస్తారా?"
"ఆ!?"
"హహ. ఖంగారు పడకండి రికార్డ్ చెయ్యలేదు లెండి. మూడు. అవునా. ఇలా అన్నీ తెలుసుకుంటుంటామని మా క్లయింట్లకి సాధారణంగా చెప్పను కానీ మీరు ఎలాగూ త్వరలో చావబోతున్నారు కదా. సమస్య ఏమీ లేదు మీతో" అంటూ ఓపెన్ టాప్ టేబుల్ దగ్గరికి నడిచాడు. 
"ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు ఇంతధైర్యంగా ఈ హోటెల్ లో ఇలా?"
అతను అటువైపుగా వుండి ఒక పౌడర్ వైనులో కలుపుతూ "మా జాగ్రత్తలు మేము తీసుకుంటాము లెండి. ఇప్పుడు మీరు చూస్తున్న నా రూపం నిజం అనుకుంటున్నారా? మారు వేషం. మారు పేరుతో తీసుకున్నా ఇది. ఇలాగే ఇంకెన్నో జాగ్రత్తలు"
"మారువేషమా? గొప్పవారే?"
రతన్ గలగలా నవ్వుతూ వైన్ గ్లాస్ అందిస్తాడు. "నయాగరా ఆన్ ద లేక్ గ్రామ ద్రాక్షతోటల్లో మంచుతో ఘనీభవించిన ద్రాక్షతో చేసిన స్వఛ్ఛమయిన ఐస్ వైన్ ఇది. కానివ్వండి. ఛీర్స్ టు యువర్ డెత్"
'ఛీర్స్" గలగలా నవ్వుతూ అన్నాడతను. "రుచి అద్భుతంగా వుంది"
"ఇంకో రెండు గంటల్లో మీ జీవితం ఇంకా అద్భుతంగా వుంటుంది"
"అవును. ఈ మందుతో బాధలన్నీ మటుమాయం" గలగలా నవ్వుతూ
"నిజంగానే"
"నిజ్జంగానే?" సరదాగా నవ్వాడు సుదీప్.

మా కథ మీకు చెప్పాలా వద్దా?

రంగ్ దే బసంతి సినిమాలో అనుకుంటా ఒక పార్కులో మెట్ల మీద కూర్చొని నాటకం కోసం చర్చిస్తుంటారు. నిన్న నాకు అలాగే అనిపించింది. మా ఫిల్మ్ టీం మెంబర్లం కొంతమందిమి కలిసి మా సిటీలో వున్న గొప్ప పార్క్ లోని ఆమ్ఫిథియేటర్ మెట్ల మీద కూర్చొని కథా చర్చలు చేసేం. ఒక అయిదు నిమిషాల నిడివి గల లఘు చిత్రం కోసం కథ చర్చించాము. నేను ప్రతిపాదించిన వైవిధ్యమయిన కథాంశానికి అందరం కలిసి మెరుగులు దిద్దాం. రేపటి నుండి మా కుటుంబంతో కలిసి వెకేషనుకి వెళుతున్నాం. అందువల్ల దానికి ముందే ఒక కిక్ స్టార్ట్ మీటింగ్ పెడితే అందరూ ఈలోగా దాని గురించి ఆలోచిస్తుంటారు కదా అని సమావేశ పరిచాను. అనుకున్నవాళ్ళు అంతా రాలేకపోయారు కానీ సగం మంది అయినా వచ్చేసారు. సినీ శాఖల్లో ఒక్కొక్కరి బలాలు, బలహీనతలు చర్చించుకున్నాం.

మా టీమ్ మెంబర్లలో ఆయా విషయాలలో ఆసక్తి వుండటం గొప్ప విషయం అయితే ఎవరికీ కూడా థియరిటికల్ నాలెజ్ లేకపోవడం ప్రధానలోపం. అందుకే కేవలం సినిమాలు చూసి సంపాదించిన జ్ఞానమే కాకుండా ఆయా శాఖలపై పలు పుస్తకాలూ, వీడియోలూ చదివీ, చూసీ పలు విషయాల మీద అవగాహన పెంచుకోమని సూచించాను. ఉదహరణకు నటనపై ఆసక్తి, అనుభవం వున్నవారికి నటనలో పలు రకాల పద్ధతులు ఇంప్రొవైజేషన్, మెథడ్ ఏక్టింగ్ వగైరాలు తెలుసుకోమని చెప్పాను. మా వాళ్ళు అంతా కథని మెరుగుదిద్దడం కోసం విలువైన సూచనలు ఇచ్చారు. ఇంకా కథని ఫైన్ ట్యూన్ చేస్తూ వెళతాం. మాలో ఒకరికి స్క్రీన్ ప్లే అంటే ఇష్టం కావడం సంతోషంగా వుంది. అతగాడికి స్టోరీ బోర్డులు వేయడం కూడా వచ్చు. యే! అయితే మ్యూజిక్ మీద బాగా పట్టున్న వాళ్ళు మాకు లభించాల్సి వుంది.

అయితే మా కథ మీతో చర్చించాలా వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నా. మీతో చర్చిస్తే మీరూ విలువైన సూచనలు చెప్పవచ్చు. ఆ కథని మేము ఎలా తీస్తామా అనే ఆసక్తి మీలో కలగవచ్చు. అయితే కథ చెబితే మా ఫిల్మ్ మీద కాస్తో కూస్తో మీకు ఉండే ఆసక్తి కాస్తా తగ్గవచ్చు. సరే ప్రస్తుతానికి అయితే స్టొరీ లైన్ కాస్త చెప్పేస్తాను. ఒకవ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం లేక తనని హత్య చేయడానికి ఒక (షార్ప్) షూటర్ ని నియమించుకుంటాడు. అలాంటప్పుడు అది హత్య అవుతుందా లేక ఆత్మహత్య అవుతుందా? ఆ షూటర్ ఒకవైపు తనని చంపేస్తానని, చంపేస్తున్నానని చెబుతూనే అతగాడి మనసు మార్చేస్తాడు. ఇది ఒక సప్సెన్స్ ఫిల్మ్ లాగా తీర్చిదిద్దుతాము. కథ మొత్తం మీ ముందు వుంచినప్పుడు తెలుస్తుంది. అయిదు నిమిషాలలోనే సెంటిమెంట్, సప్సెన్స్, డ్రామా, ఏక్షన్, క్రైం, కామెడీ అన్నీ వుంటాయి.

ఇది ఇలా వుండగా తదుపరి ఫిల్మ్ కోసం కూడా ఆలోచనలు సాగుతున్నాయి. హరర్ కామెడీ. మాలో ఒక నటికి హరర్ సినిమాలు అంటే ఇష్టం వుండటం దీనికి ఒక అస్సెట్. దీనికి కథ ఇంకా సిద్ధం కాలేదు - ఆలోచిస్తున్నా - నా సినిమా అంటే వైవిధ్యమయిన కథాంశం వుండాలి మరి. అందరిలాంటి సినిమాలు నేనూ తీస్తే నా గొప్పదనం ఏం ఉంటుంది సార్? అటుపై కొత్త కాన్సెప్ట్ తో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్. ముద్దులకు అభ్యంతరం లేని నటీనటులు కావాలి దానికి - ఎందుకంటే ముద్దులే ముఖ్యం అందులో. ఆ కాన్సెప్ట్ అలాంటిది మరీ!  

మొదటగా లఘు చిత్రాల వైపు నా పయనం

 చిత్ర దర్శకుడిగా అయ్యే క్రమంలో షార్ట్ ఫిల్మ్ లు తియ్యబోతున్నాను. చాలా చాలా ఆలోచనలు వున్నయ్. ఒకదాని తరువాత మరొకటి చూద్దామేం. ఈమధ్య ఒక గొప్ప కథ కోసం ఆలోచించాను. నిన్న స్ఫురించింది. ఇన్నాళ్ల వరకూ నవల్స్ కోసం పెద్ద ప్లాట్స్ ఆలోచించడమే కానీ షార్ట్ ఫిల్మ్ కోసం ఆలోచనలు చెయ్యలేదు. అందువల్ల ఇది కాస్త కొత్తగా వుంది. నా నవల్స్, బ్లాగులు చదివిన వారికి నా రచనలు ఎంత ప్రత్యేకంగా, వైవిధ్యంగా వుంటాయో తెలిసిందే. అదే ముద్రని లఘు చిత్రాల్లో కూడా చూపిస్తాను. కనీసం వారానికి ఒక లఘు చిత్రం అయినా తీస్తూపోవాలని నా ప్రస్తుత సంకల్పం.

మీలో ఎవరికయినా లఘు చిత్రాల్లో ఆసక్తి కానీ అనుభవం కానీ వుంటే చెప్పండి. ఆలోచనలు పంచుకుందాం - వీలయితే కలిసి పనిచేద్దాం. పెద్ద పెద్ద చిత్రాలు అంటే ఇప్పట్లో నావల్ల కాదు కానీ కథని అందించి ఇండియాలో కూడా లఘు చిత్రాలని నిర్మింపజేసే ఆలోచన వుంది. అందువల్ల మీరు గనుక ఇండియాలో వుండి మీకు వీటిల్లో ఆసక్తి వుంటే చెప్పండి. వీలయితే కలిసి పనిచేద్దాం.

వచ్చేవారం ఒక పది రోజుల వెకేషన్ కోసం వెళుతున్నాం. ఓహ్, ఎన్నో ప్రదేశాలు, మానస సరోవరం లాంటి ప్రదేశాలు చూడబోతున్నాం. పనిలో పనిగా నా తదుపరి చిత్రాల కోసం లోకేషన్లూ చూసుకున్నట్టు అవుతుంది. తిరిగి వచ్చాక లఘు చిత్రాల సంగతి చూస్తా. ఔత్సాహిక నటులు, టెక్నీషియన్లూ ఇక్కడ వున్నారు. వాళ్ళ సహకారంతో పని కానిస్తాను.

Law Of Attraction (LOA) - ఇలా చేసి చూద్దాం

నేనో నాస్తికుడిని, హేతువాదిని కానీ లా ఆఫ్ ఎట్రాక్షన్ నమ్మేస్తుంటా. ఏంటో! నేను అనుకున్నవి నిజంగా జరిగినా జరగకపోయినా జరిగినట్టు అనిపిస్తుంటాయి. అందువల్ల జీవితం బాగానే నడుస్తోంది కాబట్టి అలా కానిచ్చేద్దాం.

కొన్నినెలల క్రితం పుస్తకాలు వ్రాద్దామనుకున్నా కానీ దానివల్ల లాభం లేదని త్వరలోనే అర్దం అయ్యింది. మరింకేదో వుంది. అదేంటి. కొన్నాళ్ళు అలా వదిలేసాక నా నవల్స్, స్టోరీ అయిడియాలూ తెలుగు సినీ పరిశ్రమకి అంటగడితే ఎలా వుంటుందా అన్న అలోచన వచ్చింది. ఇక అటువైపు అడుగులు వేయడం మొదలెట్టాను. సాధారణంగా అయితే ఇలాంటివి సాధ్యం కాకపోవొచ్చు కానీ LOAలో చిత్రంగా అన్నీ కలిసివస్తుంటాయి. మనం కొద్దిగా అటువైపు అడుగులు వేస్తుండాలి అంతే. మార్గం దానంతట అదే పరుచుకుపోతుంది. అలా అని చెప్పి తెగ హైరానా పడిపోకూడదు. లా ఆఫ్ డిటాచ్మెంట్ (LOD) కూడా ముఖ్యం. అట్రాక్షన్, డిటాచ్మెంట్ బ్యాలన్స్ చేసుకోవాలి - లేకపోతే ఫలితాలు రావు.

Ask, Beleive & Receive. ఇదీ LOA లో ముఖ్యమయిన థియరీ. నేనో గొప్ప సినీ రచయితగా/దర్శకుడిగా కావాలని ఆశిస్తున్నా, అలా అయ్యానని విశ్వసిస్తున్నా. ఇక తగిన సమయంలో అవకాశాలు వచ్చేస్తాయి లెండి. బాబ్బాబూ, నన్ను మీరు కూడా అలా భావించండీ.  ఇదేమన్నా జరిగేపనా కాదా అన్నది కొద్దిరోజుల్లో అర్ధం అవుతుంది లెండి. ఒకవేళ కాకపోతే మరో మంచి ప్రయత్నానికి ఇది దారితీస్తుంది. ఏదీ అనవసరం కాదు. తరచుగా ఏం జరుగుతోందీ, ఎంతవరకూ వచ్చిందీ తెలియజేస్తుంటాలెండి.

మీ సలహాలూ, సూచనలూ అందజేయండి. LOA మీద ఆసక్తి వుంటే గూగుల్ చెయ్యండి. The Secret పుస్తకం, వీడియో చూడండి. లాజిక్ పక్కన పెట్టి ప్రయత్నించి చూడండి. బావుంది అనిపిస్తే కొనసాగించండి. బాగోలేదు అనిపిస్తే పక్కకు పెట్టెయ్యండి. ప్రయత్నించి చూస్తే పోయేదేమి వుంది. నాకు అయితే హాయిగా వుంది, సరదాగా వుంది. ఎన్నెన్ని నా జీవితంలో అవిష్కరించుకున్నానూ...!  

సమయం లేదు మిత్రమా, అర్ధరాత్రి కావొస్తోంది  - ఇక పడుకోవాలి, మళ్ళీ కలుద్దామేం.

నాకు తెలిసిన ఒక సినీ మత్తు విషయం

కొన్నేళ్ళ క్రిందటి సంఘటణ ఇది. అయిదారేళ్ళకి పూర్వం జరిగింది. ఈ విషయం అప్పట్లో టూకీగా వ్రాసే వుంటాలెండి కానీ డ్రగ్స్ విషయం ప్రస్థావించకపోయి వుండకపోవొచ్చు. ఒక కత్తిలాంటి యువ స్నేహితురాలు ఫోనులో నాకు ఒక విషయం చెప్పింది - ఒక యువ హీరో తనతో కొంత సమయం గడిపేసాడనీ. నమ్మలేకపోయాను. అంత గొప్ప (నటనలో కాదులెండి)  యువ హీరో ఈమెతో గడపడం ఏంటా అని. కానీ ఆమె డైనమిజం బాగా తెలిసిన నేను ఆమె చెప్పింది నిజమయ్యే వుంటుందిలే అనుకున్నా. పనిగట్టుకొని నాకు అలా అబద్ధం చెప్పల్సిన అవసరం ఆమెకు లేదు. నేను అంటే ఆమెకు చాలా గౌరవం, అభిమానం. పైగా ఆ యువ హీరో అలాంటి టైపే. అలా అలా దొరికిన అమ్మాయిలనీ, హీరోయిన్లనీ అలా అలా వాడేస్తుంటాడు అనే రూమర్స్ వున్నాయి. . సో, అదంతా నిజమే అయివుంటుంది అనుకున్నా.

అతడి సమర్ధత గురించి పూసగుచ్చినట్లు వివరించింది. అతని సమర్ధత (ముఖ్యంగా సమయం) వెనుక కారణం డ్రగ్స్ అయివుంటుంది అని ఆమె సందేహించింది. ఈమె తాగి వుంది కనుక తట్టుకునేసిందిట అతగాడిని. డ్రగ్స్ తీసుకుంటే అలాంటి సమర్ధత పెరుగుతుందా లేదా అన్నది నాకు తెలియదు. ఆ యువ హీరో/విలన్ పేరు డ్రగ్స్ కేసు విషయంలో బయటకి రాకుండా పెద్దలు తొక్కిపట్టేసారని వార్తల్లో చూస్తుంటాను. నిజమే అనిపిస్తుంది మరి నేను విన్నదాని ప్రకారం.

ఆ తరువాత కొన్నేళ్ళకి ఆమె వ్యవహారాలు మరీ శృతిమించిపోతున్నాయని, నా హితోపదేశాలు వినడం లేదని దూరం పెట్టాను. తరువాత కొన్నేళ్ళకి ఆమె కూడా మత్తుమందులకు బానిస అయ్యిందని అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది. ప్చ్! నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. నా మాట వినే స్థితి ఆమె ఎప్పుడో దాటిపోయింది. అప్పుడో ఇప్పుడో ఆమె గురించి చూచాయగా తెలుస్తూవుంటుంది. తను హైదరబాదులోనే వుంటుంది. ఏవేవో చేస్తూవుంటుంది.

ఈ సమాచారం ఎక్కడ లభిస్తుంది?

తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన వారందరి కాంటాక్ట్ నంబర్లు ఎక్కడ లభిస్తాయి, ఎలా లభిస్తాయి? అలాంటి వివరాలు లభించే పుస్తకం కానీ వెబ్‌సైట్ కానీ ఏదయినా వుంటుందా? మా సంఘం వారిది ఏదయినా పుస్తకంలో అలాంటి సమాచారం దొరుకుతుందా? దయచేసి ఈ సమాచారం మీకు తెలిస్తే చెప్పండి.

ఎలా అని ఆలోచించకుండా వుండటం ఎలా? ఎలా?

నీళ్ళు ఎలా వున్నాయో పరీక్షించాకా (after testing waters) రచనల మీద ఒక అంచనాకి వచ్చేసా. వీడియోలు రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో రచనలు చేయడం కానీ చదువరులకు చదవడం కానీ కష్టం గానే వుంది. జనాభా, సాంకేతికతా ఒక వైపు వెళుతుంటే నేను తిరోగమిస్తున్నానా అనిపించింది. నా మటుకు రచనలు చేయడంలో ఆనందం వున్నా శ్రమ కూడా ఎక్కువే. చాలా ఓపికా, తీరికా కావాలి. ఇదివరలో అన్ని రచనలు ఎలా చేసేనా అని నాకే అనిపిస్తుంటుంది. రచనలు చదవడం వరకు ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా కాగితం పుస్తకాలు. అందులోనూ కొత్త పుస్తకాలు అయితే ఆ వాసన, అనుభూతే వేరు. అయితే ఈ కాలం జనభా చదవడం తగ్గించేస్తున్నారు.  

మరో వైపున నా యూట్యూబ్ ఛానల్ విషయంలో మంచి అభివృద్ధి వుంది. ఒక అల్లరి అమ్మాయీ, ఒక కత్తిలాంటి యువతీ నాతో కలిసి వీడియోలు ప్రెజెంట్ చెయ్యడానికి సిద్ధంగా వున్నారు. వచ్చే నెల నుండి అవి మొదలవుతాయి. ప్రస్తుతానికి నావే ట్రయల్ వీడియోలు వేస్తున్నా. చూద్దాం ఇది ఎలా కొనసాగుతుందో. చాలా ఆలోచనలు వున్నయ్. చూడాలి మరి. యూట్యూబ్ విషయంలో ఏదయినా కలిసి వస్తే బావుండును అనుకున్నా. ఆశ్చర్యకరంగా ఒక్కరేంటీ, ఇద్దరు రెడీ అయిపోయారు. సో ఫార్ సో గుడ్.

అబ్బో ఆ రకంగా చాలా కలిసి వస్తున్నాయి. మీకు ఓ ప్రశ్న అనిపించవచ్చు రచనల్లో కలిసిరాలేదేం అని. ఏదో రకంగా కలిసిరావాలని కోరుకున్నా అంతే. కేవలం రచనల్లోనే కలిసిరావాలని గిరిగీసుకోలేదు. అలా అనుకొని ఇక అది మరచిపోయి ఇటు కెలికెసా, అటు కలిసి వచ్చింది. ఎందుకో తెలుసా? కొన్ని నెలలుగా నేను నేర్చుకున్న గుణపాఠాలు ఏంటో తెలుసా? లా ఆఫ్  డిటాచ్మెంట్ ప్రాధాన్యత. ఏదన్నా మనకు జరిగిపోవాలని అనుకొవాలి కానీ ఆనీ ఒహటే తాపత్రయపడకూడదు. గట్టిగా అనుకొవాలి, వివరంగా వ్రాసిపెట్టుకోవాలీ, ఇక వదిలెయ్యాలి. అది మరచిపోయి హాయిగా గడిపెయ్యాలి. మనం అనుకున్నది తగిన సమయంలో జరిగిపోతుంది. నాకు అయితే సాధారణంగా రెండు మూడు నెలల్లో అవి సాక్షాత్కరిస్తాయి. ఒక రెండు ముఖ్యమయినవి దారిలో వున్నాయి. అవీ తగిన సమయంలో ప్రత్యక్షం అవుతాయి. నేను చెబుతున్నది మీకేమన్నా అర్ధం అవుతోందా? ఏదో లెండి - నా మనస్ఖలనం ఇది. వదిలేద్దురూ.

ఇంకా చాలా వాటిల్లో ఎలా జరుగుతుంది అనే ఆలోచన ఆపలేకుండా వున్నా. ఇన్నేళ్ళుగా ఏదయినా జరగాలి అనుకుంటే ఎలా ఎలా అని ప్రతి క్షణం ఆలోచించడం అలవాటయిన మనస్సుకి అలా ఎలా అని ఆలోచించకూడదూ, తడిగుడ్డ వేసుకొని పడుకోవాలీ అంటే నా మనస్సుకి అది సులభంగా లేదు. అందుకే ఈ పోస్ట్. ఆ విషయం నా మనస్సులో బాగా ఇమిడిపోవాలనీ. ఏదయినా మనకు కావాల్సింది జరిగిపోవాలని కోరుకోవాలి. జరిగిపోతున్నట్లే విశ్వసించాలి. ఫలితాలను అందుకోవాలి. అంతే కానీ ఎలా ఎలా అని ఆలోచించొద్దు.  అయితే ఇక్కడొ ట్రిక్ వుంది. మరీ తడిగుడ్ద వేసుకొని పడుకోవడం కాదు లెండి. తేలికపాటి చర్యలు తీసుకుంటూవుండాలి.

ఉదాహరణకు...ఇన్నింటిలో ఏ ఉదాహరణ ఇమ్మంటారూ? సరే, నా ఉద్యోగం. జనవరి 20, 2017 న నా ఉద్యోగం ఊడిపోతోందని తెలుసు. కొన్ని కారణాల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు.  ఎందుకు నేను అనుకున్న విధంగా రావట్లేదా అని పరిశోధించాను. అప్పుడు తెలిసిందీ లోపం. ఇంకా రాలేదేంటీ, ఇంకా రాలేదేంటీ, ఏ ఎంప్లాయారూ ఇంకా ఈమెయిల్ గానీ, కాల్ గానీ ఇవ్వలేదేంటీ అని హైరానా పడిపోవడం నా పొరపాటు అని అర్ధం అయ్యింది. అంతే ఇక ఆ బెంగ వదిలేసాను. సరి అయిన సమయంలో అదే వస్తుందిలే అని నమ్మేసి ఆల్రెడీ కొత్త ఉద్యోగం వచ్చేసినట్లుగానే భావించాను. ఈమెయిల్స్, కాల్స్ పదే పదే చెక్ చేయడం వదిలేసాను. అసలు కొద్ది వారాల్లో నాకు ఉద్యోగం ఊడుతుంది అన్న విషయమే మరచిపోయాను. ఏదో అదపాదడపా మాత్రం కొన్ని కొత్త ఉద్యోగాలకు అప్లయ్ చేసాను.                      

వారాలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి. గంటలూ గడిచిపోయాయి. నిమిషాలూ గడిచిపోయాయి.  ఆరోజు జనవరి 20 న ఆ సంస్థలో చివరి రోజు. ఒకవైపు ఒబామా దిగిపోతున్నాడు. మరోవైపు నేనూ దిగిపోతున్నా. అందరూ నాకు ఘనంగా వీడ్కోలు ఇస్తున్నారు. రేపటి నుండి ఉద్యోగం లేదు. బెంగ? నో ఛాన్స్. మరికొంతమంది కోలీగ్స్ ఆ రోజు లంచ్ కి తీసుకెళ్లారు. భోజనం మధ్యలో ఫోన్ కాల్. అదేంటో మీరు ఊహించుకోవొచ్చు.  ఎప్పుడు వస్తావూ అని అడిగారు. నెల తరువాత అన్నా. ఫిబ్రవరి 20న కొత్త ఉద్యోగంలో చేరాను. ఎలా వుంది ఇదీ?

ఇంకో తాజా ఉదాహరణ ఇమ్మంటారా? పూర్తి వివరాలు చెప్పలేను - వెరీ పర్సనల్ కాబట్టి. ఇరవైరెండు ఏళ్ళకు పైగా ఒక విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా. పరిష్కారం కావాలంటే అయిపోతుంది కానీ ఏదీ తగిన పరిష్కారం కాదు. అందుకే తటపటాయింపు. ఎగదీస్తే గోహత్యా, బిగదీస్తే బ్రాహ్మణహత్యా లాగా 22 ఏళ్ళపాటు కొట్టుమిట్టాడాను. అలా రెండూ కాకుండా మధ్యేరకంగా సూపర్ పరిష్కారం కావాలని రెండు నెలల క్రితం కోరుకున్నా కానీ పెద్దగా ఆ విషయం ఆలోచించకుండా వుండేందుకు ప్రయత్నించా. ఊహించని విధంగా చాలా తేలికపాటి గొప్ప పరిష్కారం నిన్న అనుకోకుండా లభించింది. ఓసోస్, ఇంత దానికోసం ఇరవై రెండు ఏళ్ళ నుండి కిందామీదా పడ్డానా సంభ్రమం చెందాను. అవి నాకు తెలియని విషయాలు కావు గానీ డాట్స్ కనెక్ట్ కాలేదు ఇప్పటివరకూ. అదండీ సంగతి. ఇలా అనుకుంటే అలా కలిసివస్తాయంతే. అంతే ఆ పరిష్కారం వెంటనే అమల్లో పెట్టేసేనోచ్ :) వావ్. వ్వాటె రిలీఫ్!

ఎన్ని ఉదాహరణలు వున్నా ఇంకా చాలా విషయాల్లో ఎలా అని నా మనస్సు బెంగపడుతూనే వుంటోంది. ఎలా అనే ఆలోచనను తగ్గించడం ఎలా? ఇదిగో ఇలానే. ఇలా వ్రాసుకుంటే క్లారిటీ వస్తుందీ, మనస్సులోకి విషయం బాగా సింక్ అవుతూంది. అద్గదీ సంగతి. ఇంక చాల్లెండి ఈ రోజుకి, మరీ ఎక్కువ కక్కేసుకున్నా బాగోదు! వెగటు కలుగుతుంది.

ఆ సమావేశంలో చివరికి మిగిలింది నేనొక్కడినే!

గత ఏడాది డెట్రాయిటులో జరిగిన తెలుగు మహాసభలకి వెళ్ళాం. అందులో సాహితీ సమావేశం జరపాలా వద్దా అన్న మీమాంస తరువాత మొత్తం మీద అది జరిగింది. సాహితీ సమావేశాల కంటే ముందు ఆ గదిలో పాటల రచయిత చంద్రబోస్ గారి కార్యక్రమం జరిగింది కాబట్టి దానికి వచ్చినవారు కొంతమంది ఇంకా అక్కడే వున్నారు. అందులో మా మిత్రుడి కుటుంబం, మా కుంటుంబం కూడా  వున్నారు. తరువాత సాహితీ సమావేశం అని విని మావాళ్ళూ, మా మిత్రుని కుటుంబం అక్కడి నుండి పారిపోయారు. ఇక మా మిత్రుడు, మా మామగారు, నేను ఇంకా వేళ్ళ మీద లెక్కబెట్టగలిగినంత మందిమి వున్నాం.

మొత్తం మీద వేదిక మీద వున్నవారి కంటే కింద వున్నవారే తక్కువ మంది వున్నారు. సమావేశాలు మొదలయ్యక మా మిత్రుడు జారుకున్నాడు. మా మామగారికి ఇలాంటివి కాస్త ఆసక్తే. వారు అయినా చివరంటా వుంటారేమో అనుకున్నా. వారూ కాస్సేపు విని తల విదిలించి వెళ్ళిపోయారు. మిగతావారూ వెళ్ళిపోయారు. మిగిలింది నేను ఒక్కడినే. ఫోటోలు తీసేపని నాదే, అందుకే :)) ఎందుకయినా సరే, చివరంటా వున్నా కాబట్టి కొత్తపాళీ గారు వేదిక నుండి దిగివచ్చి అందుకు గానూ నాకు అభినందనలు తెలియజేసారు!

(మా మిత్రుడి) ఇంటికి వెళ్లాక మా మామగారు తన అమూల్యాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు - సాహితీ సమావేశాలు అంత బోరింగ్ గా వున్నాయ్యేంటీ అని. విని నేను తల పంకించాను. కొత్తపాళీ గారి ఉపన్యాసం దాకా మీరు వుండాల్సింది - బావుంటుంది అన్నా. వారు చివరికి ఉపన్యసించారు లెండి. మా మామగారికి ముందు ఇద్దరి ఉపన్యాసాలు వినేసరికే అయిపోయింది - ఓపిక.

అసలే సాహితీ సమావేశాలు - వాటినీ మరీ చప్ప చప్పగా చేయడంలో మనాళ్ళు ఉద్దండులు. 'ఆ చెప్పేవేవో ఆసక్తి కరమయినవి చెప్పొచ్చు కదా, ఆసక్తికరంగా చెప్పొచ్చు కదా' అన్నారు మా మామ గారు. నిజవే.

Advertisement:

ARVY IT SolutionTraining  delivery options from public to in-company and distance learning. Courses: Hadoop, Anaplan, SAP Bods, SAP Bods, SAP HANA, SAP BI/Lumaira.