చార్లీ చాప్లిన్ సినిమా 'ది గ్రేట్ డిక్టేటర్' లో ఓ సన్నివేశం వుంటుంది. యుద్ధంలో ఒక సైనికుడిగా భీభత్సంగా పోరాటం చేస్తుంటాడు. కాస్త పొగ తగ్గిన తరువాత తీరిగ్గా చూసుకుంటే తాను శత్రు సైన్యంలో ఒకడిగా వుంటాడు. తమ సైన్యం మీదనే కాల్పులు జరుపుతూ వున్నానని గుర్తించి నాలుక కరచుకుంటాడు. నిన్న అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది యుద్ధంలో కాదు నాట్యంలో. ఆలస్యం అయిపోతోందని ఆఫీసునుండి పరుగుపరుగున వచ్చి మా జిమ్ములో నేర్పుతున్న జుంబా డ్యాన్సులో చేరి అందరితో పాటూ నేనూ చెయ్యసాగాను. కొద్దిసేపయ్యాక ఎందుకో అనుమానం వచ్చి చుట్టూ చూస్తే నేను తప్ప ఆ నాట్యంలో ఒక్క మగ పురుగూ లేడూ. ఇది బొత్తిగా ఆడోళ్ళ నాట్యం ఏమో అని అనుమానం వచ్చి ఆ డ్యాన్స్ నుండి పక్కకు వచ్చి ఆ ఆఫీసు వాళ్ళని అడిగాను. అదేం లేదు - భేషుగ్గా ఎవరయినా చెయ్యొచ్చన్నారు. మళ్ళీ వచ్చి మిగతావారితో పాటుగా స్టెప్స్ వెయ్యడం మొదలెట్టాను. 20 -25 మంది ఆడాళ్ళు వున్నారు కానీ ఏంటో కానీ చిత్రంగా ఒక్కళ్ళూ బాగోలేరు. టీచర్ కొద్దిగా నయ్యం - మెక్సికన్ సంతతి అనుకుంటా.
మిగతావాళ్ళంతా ఎన్ని వారాలనుండి ప్రాక్టీసు చేస్తున్నారో ఏమో బాగానే కష్టపడుతున్నారు. నా వల్ల 20 నిమిషాలకు మించి కాలేదు. ఈ రోజుకి చేసింది చాల్లే అనుకొని హైడ్రో మసాజ్ యంత్రం మీద పడుకున్నా. అది నన్ను వెనుక నుండి నీటి మర్దన చేస్తుండగా చిన్న కునుకు పట్టింది - అలసిపోయాను కదా. ఇంటికి వచ్చాకా సమయం ప్రకారమే నిద్రకు వెళ్ళినా ఎక్కువసేపు పట్టలేదు. వ్యాయామం సాయంత్రం చేస్తే వచ్చే ఇబ్బందే ఇది. మనస్సు బాగా ఉత్తేజితం అయి సరిగా నిద్రపోదు. సరే అని లేచి బాస్ ఎపిసోడ్ మరొకటి చూసి పడుకున్నా. అప్పుడు మొదలయ్యింది ఆ సమస్య. స్లీప్ అప్నియా. అలసిపోయి వున్నా కదా గొంతు కండరాలు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ శ్వాసకి అడ్డం పడుతున్నాయి. శ్వాస ఎగపోస్తూ చాలాసార్లు లేచి కూర్చున్నా. ఆప్నియాకు గాను చర్యలు తీసుకున్నా కానీ ఫలించలేదు. ఉదయం 6 గంటలప్పుడు వాడిన ఒక చర్య ఫలించింది. హాయిగా నిద్ర పట్టింది. 9 గంటలకు మెలుకువ వచ్చింది. ఆఫీసుకి ఆలస్యం అని ఈమెయిల్ ఇచ్చాను.
నేను వాడుతున్న ఒక మందు వల్ల నాకు
స్లీప్ ఆప్నియా (Sleep Apnea) సమస్య వస్తోంది. ఆ మందుకి కొందరిలో అది సైడ్
ఎఫెక్ట్ అని నాకు తెలుసు కానీ డాక్టరుకి తెలియదు. నేను చెప్పలేదు -
ఎందుకంటే ముందు ఈ మందు మానివెయ్యమనే ప్రమాదం వుంది. ఆ మెడిసిన్ నాకు చాలా
అవసరం. ఆప్నియాను దూరం చెయ్యడానికి కొన్ని తాత్కాలిక పద్ధతులు
ప్రయత్నిస్తున్నాను. అవి సఫలం కాకపోతే ఆ మెడిసిన్ మానివెయ్యడమో లేక నిద్రలో
శ్వాస సరిగా ఆడేందుకై అంతగా సౌకర్యంగా అనిపించని ఒక చిన్న యంత్రం వాడటమో
చెయ్యాలి. ఏంటో నాకు అన్నీ 'ఎగదీస్తే గోహత్యా - బిగదీస్తే బ్రహ్మహత్యా'
లంటి సమస్యలే వస్తుంటాయి. ఆ మధ్యలో ఈ జీవి కొట్టుమిట్టాడుతూవుంటుంది.
(నా సిస్టంలో వున్న చిన్న సమస్య వల్ల ఈ మధ్య పోస్టులకి ఫోటోలు జత చెయ్యలేకపోతున్నాను)