గతరాత్రి పన్నెండుగంటల తరువాత మా ఫోన్ మ్రోగసాగింది. ఎత్తాను. మా అమ్మాయితో మాట్లాడవచ్చా అని అటువైపునుండి ఓ మహిళ కంఠం. ఆదివారం రాత్రి అంత అర్జంటుగా ఏం మాట్లాడాలబ్బా అనుకుంటూ మీరు ఎవరు అని అడిగాను. "...పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మాయితో మాట్లాడాలి" అంది. ఇదేమన్నా ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను. గతంలో ఒకసారి కెనడాలో వున్నప్పుడు ఇలాగే అర్ధరాత్రి ఒక ప్రాంక్ కాల్ వచ్చిన విషయం గుర్తుకువచ్చింది. మా పాప పడుకుంది అని చెప్పాను. మీరు తన తండ్రా అని అడిగింది ఆమె. అవును అని చెప్పాను. "మీ పాప స్నేహితురాలు ... గతకొన్ని గంటల నుండి తప్పిపోయింది. వెతుకుతున్నాం. ఆ అమ్మాయి తరచుగా మీ పాపకి ఫోన్ చేస్తుంటుంది కాబట్టి మీ పాపకి ఏమయినా తెలుసేమో అని ఫోన్ చేస్తున్నాం" అని ఆ పోలీస్ ఆఫీసర్ అంది. మీ ఇంటికి ఈరోజు ఏమయినా వచ్చిందా అంటే రాలేదు అని చెప్పాను. ఏమయినా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషనుకి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి పెట్టేసింది.
ఆ అమ్మాయి ఆఫ్రికన్ అమెరికన్. వయస్సు పదకొండు లేదా పన్నెండు. మా పాపకి వున్న మంచి స్నేహితురాళ్లలో ఆమె ఒకరు. నన్ను చక్కగా మిస్టర్ అంటూ మా ఇంటి పేరుతో పిలుస్తుంటుంది. మా పాప పొద్దున లేచాక నిన్న ఏమయినా అమ్మాయి తనను కాంటాక్ట్ చేసిందేమో కనుక్కున్నా. లేదని చెప్పింది. విషయం క్లుప్తంగా చెప్పి స్కూల్ కి వెళ్ళాక ఆ అమ్మాయి వివరాలు ఏమయినా తెలుస్తాయేమో కనుక్కొమ్మని చెప్పాను. ఆ అమ్మాయి దొరికిందా లేదా అని కనుక్కోవడానికి ఆమె తల్లి ఫోన్ నంబర్ మా దగ్గర లేదు. తండ్రి విడాకులు తీసుకున్నాడు. ఎక్కడవుంటాడో మాకు తెలియదు.
ఆ అమ్మాయి క్షేమమేనని, దొరికేసివుంటుందని ఆశిద్దాం.