శనివారం సాయంత్రం ఒక గృహప్రవేశం వుండటం వల్ల ఆదివారం ఉదయం బయల్దేరి మిషిగన్ లో వున్న సిల్వర్ లేక్ డ్యూన్స్ (ఇసుక తిన్నెలు) కి వెళ్ళాం. మాతో పాటు ఇంకో మూడు కుటుంబాలు జత కలిసాయి. మా దగ్గరి నుండి 4 గంటల ప్రయాణం. 2000 ఎకరాల ఇసుక తిన్నెలు అవి. అందులోకి రైడ్ తీసుకున్నాం. ఒక మోటారు బగ్గీలో 45 నిమిషాలు తిప్పి చూపించారు. చాలా బావుంది రైడ్. ఆ విశాలమయిన ఇసుక తిన్నెల్లో ఎత్తుపల్లాల మీద వేగంగా ప్రయాణిస్తుంటే ఎంతో సరదాగా అనిపించింది. అటు తరువాత ఎంతో ఎత్తయిన, విశాలమయిన ఆ ఇసుక తిన్నెల మీద నడుస్తూ, దూకుతూ, దొర్లుతూ, జారుతూ సిల్వర్ సరస్సు వద్దకు చేరి ఆ బీచ్ వద్ద కాసేపు ఆడుకున్నాం.
ఇహ చీకటి పడుతుందనగా కేంపింగ్ సైటుకి వెళ్ళి టెంట్లు వేసాం. ఫైర్ పిట్ లో మంట రాజేసి చలి కాచుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నాం. ఆ తరువాత ఆ మంట మీద గ్రిల్ వేసి బార్బెక్యూ చేసాం. పలువులు పలు ఆహార పదార్ధాలు తెచ్చారు కాబట్టి నుష్టుగా భుజించాం. అర్ధరాత్రికి ముచ్చట్లు చాలించి పడుకొని ఉదయం ఆరు తరువాత లేచాం. కాస్త చలిగా వుండటంతో మళ్ళీ మంట రాజేసాం. మంట కాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ అల్పాహారం ఘనంగా తీసుకున్నాం. పదింటికి మా క్యాంప్ సైటుకి ఆనుకునే వున్న బీచుకి వెళ్ళి రింగ్ బాల్, ఫ్రిస్బీ ఆడాం. వాలీబాల్ బీచ్ కి తీసుకెళ్ళడం మరిచాం. పిల్లలు ఇసుకలో ఆటలు ఆడారు. కేంపింగ్ సైటూ, బీచూ ఎంతో బావున్నాయి.
పదకొండున్నరకి కేంపుకి తిరిగివచ్చి స్నాక్స్ తినేసి మా గుడారాలు పీకేసాం. ఆ తరువాత అటునుండి బయల్దేరి మస్కెగాన్ పార్కుకి వెళ్ళాం కానీ అక్కడ వాతావరణం బావుండకపోవడంతో ఇంటికి బయల్దేరాం. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. అలా జరిగింది మెమోరియల్ లాంగ్ వీకెండ్.