ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం

పరిస్థితులు ఏవయినా సరే ఒక జంట ప్రేమలో వున్నారనుకోండి - వారి మధ్య చాలావరకు అన్నీ బాగానే వున్నట్లు అనిపిస్తాయి. ఒకరిలోని లోపాలు మరొకరికి ఆ మత్తులో తెలిసిరావు - తెలిసినా అవి అంత పెద్ద విషయంగా అనిపించవు.  కానీ ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కంటే చాలా బెటర్. దీనిలో కొంత అయినా ఒకరి మీద ఒకరికి అవగాహన ఏర్పడుతుంది.  నిశ్చయం నుండి పెళ్ళి నిశ్చయింప బడ్డ జంట మధ్య వుండేది కూడా ప్రేమ, అనురాగం అనే అనుకోవాలి. కాబోయే భర్త/భార్య మీద చాలా మమకారం వుండటం సహజమే కదా.

డేటింగ్ వల్ల కూడా అంత లాభం లేదు. అయితే దానివల్ల పరస్పరం మరికొన్ని విషయాలు తెలుస్తాయి కానీ మనిషి మీద పూర్తి అవగాహన రాదు. మనిషి ఎక్కువగా తెలియకపోతే తను కాస్త నచ్చాక సాధారణంగా అన్నీ బాగానే అనిపిస్తాయి. మనిషి బాగా తెలిస్తే మాత్రమే అసలు మనిషి బయటపడుతాడు. 


అసలు వ్యక్తిత్వం ప్రేమ లోనూ, డేటింగ్ లోనూ తెలియదు. సహజీవనంలోనో లేదా  పెళ్ళి అయాకనో బోధపడ్తుంది. వీటిల్లో కూడా వెంటనే బయటపడవు - వీటిల్లోని తొలి మాధుర్యం కరిగిపోయాక, మబ్బులు విచ్చుకున్నాక పెళ్ళాం/మొగుడు పాత చింతకాయ పచ్చడి అయ్యాక అసలు రంగులు ఒకరికి ఒకరివి తెలుస్తుంటాయి. ప్రేమికులు ఇద్దరూ సహజీవనం చేస్తున్నా ఇది వర్తిస్తుంది.

కొన్నేళ్ళు పెళ్ళి అయాక లేదా కొన్ని ఏళ్ళు సహజీవనం  చేసాక కూడా వారిలో అనురాగం వెల్లివిరుస్తూవుంటేనే అది నిజమయిన ప్రేమగా భావించవచ్చు. అంతేగాని ప్రేయసి ప్రియులు రోజుకొకసారి గంటకొకసారి తియ్యటి ఊసులు మాట్లాడుకున్నంత మాత్రాన అది నిజమయిన ప్రేమ అవ్వదు. తమది నిజమయిన ప్రేమ అనే భ్రమలో వుంటారు ఆ జంట. అందుకే ప్రేమించి పెళ్ళిచేసుకున్న కొన్ని జంటలు  భ్రమలు కరిగిపోయి వాస్తవ వ్యక్తిత్వాలు బయటపడ్డాక విడిఫోతుంటాయి.  ఒకసారి వెడ్‌లాక్ అయ్యాక ఇక వాళ్ళు జీవితాంతం లాక్ అయినట్లే కాబట్టి పెద్దగా చేసేదేమీ వుండదు. ధైర్యం వున్నవారు ఆ బంధం నుండి బయటపడుతారు - ధైర్యం లేని వారు తమ బంధాన్ని ఏదో రకంగా సమర్ధించుకుంటూ జీవితాలు ఏదోరకంగా లాగిస్తుంటారు.     
 
మరి దీనికి పరిష్కారం? అందరికీ సాధ్యపడదు ఇది కానీ సాధ్యపడినవారు, ఇష్టపడిన వారు, ధైర్యం వున్న జంటలు ఇలా చేయొచ్చు. అదే సహజీవనం.  కనీసం మూడు ఏళ్ళన్నా కలిసివుంటే అసలు వ్యక్తిత్వాలు బయటపడుతాయి. ఈ లోగానే మనస్సులు సరిపడవని బయటపడితే ఎంచక్కా విడిపోవచ్చు. ఓ మూడేళ్ళయాక కూడా వారిలో ఇంకా ప్రేమ వుంటే భేషుగ్గా పెళ్ళి చేసుకోవచ్చు. మరి ఆ తరువాత వారిలో విభేదాలు రావని గ్యారంటీ ఏమిటీ? నేను పెర్ఫెక్షనిస్టును కాను - ఇది గ్యారంటీ. మీరు కూడా పరెఫెక్షనిస్ట్ కాకండి - అదొక మానసిక జాడ్యం!  

జంటల మధ్య విభేదాలు రావడానికి అందులో ఇద్దరో ఒక్కరో దుర్మార్గులే కానక్కరలేదు. ఇద్దరు చాలా మంచివారయినంత మాత్రాన వారి మధ్య హార్మోనీ వుండాలని ఏమీలేదు - వైరుధ్యాలు రాకూడదనీ లేదు.  రెండు జంటలు నిలబడాలంటే వారి మధ్య ముఖ్యంగా వుండాల్సింది మానసిక సారూప్యత - మంచితనమో, లేక ఏదోరకంగా గొప్పతనమో కాదు.   ఒక జంటలో సారూప్యత వుందీ లేనిదీ తెలుసుకోవాలంటే దానికి అందుబాటులో వున్న పరిష్కారం సహజీవనమే కానీ ఇది చాలామంది ఒప్పుకోరు, అంగీకరించరు - దీనికంటే ఏదోలా బ్రతుకు లాగెయ్యడమే బెటర్ అంటారు. జావితాన్ని ఏదో ఒక విధంగా లాగించివేద్దాం అనుకునేవారికి ఇవన్నీ అవసరం లేదు - జీవితాన్ని జీవించేద్దాం అనుకునేవారు పెళ్ళి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్ళి చూపుల్లో ఓ గంట చూసి ఓ అరగంట మాట్లాడి అంతా అర్ధం అయ్యిందనుకుంటే మున్ముందు జీవితంలో వచ్చేది ఆనందం కాదు - అనర్ధం కూడా అవచ్చు. 

కెనడాలో ఒక ఫ్యామిలీ వుండేది. ఆ జంట కొన్ని ఏళ్ళుగా నాకు బాగా పరిచయం. వారిది ప్రేమ వివాహం (ఒకే కులం). వారికి టీనేజీ పిల్లలు వున్నారు. ఒక రోజు భర్త ఫోన్ చేసి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి నా సలహా అడిగాడు. పెళ్ళి అయి ఇన్నేళ్ళుగా మీలో సర్దుబాటు లేనప్పుడు ఇంకా ఈ దాంపత్యాన్ని పొడిగించడం అనవసరం - తటపటాయించకుండా విడాకులు తీసుకోండి అని చెప్పాను. అదే రోజు భార్య కూడా నాకు ఫోన్ చేసి అదే విషయంలో నా సలహా అడిగింది. ఆమెకూ తన భర్తకు ఇచ్చిన సలహానే ఇచ్చాను. మొత్తం మీద వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలకి తండ్రి అంటే ఇష్టం లేదు - తల్లి దగ్గరే వుంటున్నారు. అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. విడాకులు తీసుకోవడమే  మంచి పని అయిందని ఇప్పుడు హాయిగా జీవితం వెళ్ళదీస్తున్నామనీ వారిద్దరూ నాకు చెప్పేవారు.     

అసలు పెళ్ళే అవసరం లేదు - ఎంచక్కా సహజీవనం చేస్తూనే వుంటామనుకుంటే అది ఇంకా చక్కని విషయం. పెద్దగా బాదరబందీలు వుండవు. ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న సమస్యలు వుంటాయి కాబట్టి ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు.
సహజీవనంలో వీరికి పిల్లలు పుట్టాక విడిపోవాల్సి వస్తేనో? పిల్లల సంక్షేమం  దృష్ట్యా ఎవరి దగ్గర వుంటే బావుంటుందో వారు ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు భరణం రూపేనా ఇద్దరూ భరించాలి. ఎలాగూ సహజీవనం చేస్తూ విడిపోయారు కాబట్టి  భార్యకు ఇవ్వాల్సిన భరణం వుండదు.  ఇద్దరిలో పిల్లలు ఒకరి దగ్గర వున్నప్పుడు మరొకరు పిల్లల భరణం చెల్లించాలి.  

పెళ్ళిచేసుకున్నాక... ఓ అయిదేళ్ళాగండి

మీరు పెళ్ళిచేసుకోవాలనుకుంటున్న వారు అయినా లేక ఈమధ్యనే పెళ్ళి అయిన వారు అయినా పిల్లలని కనడానికి ఓ అయిదు ఏళ్ళు వ్యవధి ఇస్తే బావుంటుంది. అయిదేళ్ళు ఎక్కువనిపిస్తే కనీసం మూడేళ్ళు అన్నా వ్యవధి ఇవ్వడం మంచిది.  పిల్లలు పుడితే మీ దంపతుల శ్రద్ధ పిల్లలమీదే వుండి మీలో ఒకరిమీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోతుంది.    

అలా గ్యాప్ ఇస్తే పిల్లలు పుట్టేలోగా ఒకరి మనస్సులు ఒకరికి బాగా అర్ధమవుతాయి. ఒకవేళ ఆలోగా దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో వారికి పొసగలేదనుకోండి - ఎంచక్కా విడాకులు తీసుకోవచ్చు. పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవాలంటే వ్యవహారం కుడితిలో పడ్డ ఎలుకలా అవుతుంది. పిల్లల మీద ప్రేమ - పార్ట్నర్ మీద ద్వేషంతో ఎటూ వీలుకాని పరిస్థితిలో వుండిపోతారు. పిల్లల కోసమయినా ఆ సంసారాన్ని లాగించాల్సివస్తుంది. బలవంతపు సంసారం ఎలా వుంటుందో చెప్పనక్కరలేదు.

కొన్ని ఏళ్ళ క్రితం మా ఫ్రెండు ఒకతను విడాకులు తీసుకున్నాడు. అప్పటికే ఆ దంపతులకి ఓ మూడేళ్ళ పాప వుంది. ఆ పాపను కాదు అనుకొని ఎలా విడాకులు ఇవ్వగలిగాడో నాకు అయితే అర్ధం కాదు. నాకు దగ్గరి మిత్రుడు కాకపోవడంతో వివరాలు తెలియవు. పిల్లల మీద అంతగా మమకారం లేకపోతే పిల్లలు పుట్టిన తరువాత కూడా బాగా మనస్పర్ధలు వస్తే విడిపోవచ్చేమో!   

ఒక్కోక్కప్పుడు పిల్లలు వున్నారని మనసు చంపుకొని బలవంతంగా కలిసివుండి ఇంట్లో అశాంతి, గృహ హింస పాలిట పడేదానికన్నా దంపతులు విడాకులు తీసుకుంటేనే పిల్లలు ఎవరిదగ్గరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వుండవచ్చు.   

అసలు విడాకుల విషయమే పెద్ద సంక్లిష్ట వ్యవహారం అంటే పిల్లలు వుంటే పరిస్థితి ఇంకా క్లిష్టంగా  అవుతుంది. వ్యవహారం ఇక సులభంగా తెగదు - ముడివడదు. అందుకే ఇన్ని చిక్కులు రాకుండా వుండాలంటే పెళ్ళి అయాక వెంటనే పిల్లలని కనేసేయకుండా ఒక అయిదు లేదా మూడు ఏళ్ళన్నా ఆగితే ఆలోగా భార్యాభర్తలలో ఒకరి సంగతి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుంది. వారిలో ఏవయినా తేడాలు వచ్చి అస్సలే సర్దుకోలేకపోతే హాయిగా విడాకులు ఇచ్చేసుకోవడమే మంచిది. అలాచేయకుండా బలవంతంగా కలిసివుంటే రోజూ ముసుగులో గుద్దులాటలు తప్పవు.

రోజూ పోట్లాడుకుంటూవున్నా జంట కలిసేవుండాలనే చాదస్తుల, సనాతనుల మాటలు పట్టించుకోకండి.    

Rich Dad, Poor Dad

నల్లగొండ జిల్లా సూర్యాపేటకి దగ్గరలోని ఒక పల్లెటూరులో ఎల్లారెడ్డి, మల్లరెడ్డి అనే ఉపాధ్యాయులు వుండేవారు. ఎల్లారెడ్డి తన సంతానానికి డబ్బులు ఎలా సంపాదించాలో, ధనవంతులు ఎలా అవాలో నేర్పారు. మల్లారెడ్డి తన సంతానానికి మానవత్వం అంతే ఏమిటో, సమాజ శ్రేయస్సు కోసం ఎలా పాటుపడాలో నేర్పారు.  

ఆ మల్లారెడ్డి గారి రెండో అబ్బాయినే నేను. మా నాన్న (పేద?) మధ్యతరగతి వర్గానికి చెందినవారు. మా నాన్నగారిలాగే నాకూ రచనా వ్యాసంగమూ, సమాజ శ్రేయస్సు వంటపట్టింది కానీ డబ్బులు ఎలా జాగ్రత్త చేయాలో, ఎలా కూడబెట్టాలో వంటపట్టింది కాదు. మా నాన్నకు డబ్బులపై ధ్యాస, ఆ కళ లేకపోవడంతో మనకు అటువంటి లక్షణాలు వంటబట్టలేదు.    

సాధారణ సమాజంలో డబ్బుకి ఎంత విలువ వుందో తెలుసు నాకు. మనకంత (సంపాదించేంత) సీను లేదు కాబట్టి హాయిగా సమాజ సేవ చేసుకుంటూ ఈ జీవితాన్ని లాగించేద్దామని విజయవాడలోని ఆర్ధిక సమతా మండలి స్వఛ్ఛంద సేవా సంస్థ వారు సాంఘిక సేవలో ఇచ్చిన IRDP (Integrated Rural Development Project) ఒక ఏడాది  ట్రైనింగ్ తీసుకున్నాను.
 
ఇక సమాజసేవకి ఈ జీవితాన్ని అంకితం చేద్దాము అనుకుటున్న రోజుల్లో నా జీవితంలో ఒక ట్విస్ట్ వచ్చిపడింది. మా మరదలు ఒకరు నేను తనని ప్రేమిస్తున్నానంటూ (?) వెంటపడింది. అలాంటిదేమీలేదు నీతో నాది   సాధారణ స్నేహం అని చెప్పినా మొత్తం మీద నన్ను తన ప్రేమలోకి దింపింది. 'మరి నా సమాజసేవ ?' అని అడిగాను. '(మనస్సులో నవ్వుకొని - వుంటుంది) దాందేముంది ముందు 'మన' ('నా' అనుకొని - వుంటుంది)  సేవ చూసుకున్నాక/చేసుకున్నాక  తీరిగ్గా ఇద్దరం సమాజ సేవ చేసేద్దామేం' అంది. ప్రేమ కదా - ఆ అమ్మాయి మాటలు బోల్డంత నచ్చేసాయి.

జీవితంలో పైకి రావాలని లేదు కాబట్టి ఇంజనీరింగులు గట్రా చదవక (బోడి) బియ్యే పట్టాతో U టర్న్ ఇచ్చుకొని జీవితంలో స్థిరపడటానికి - అనగా ఒక చిరుద్యోగమయినా తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించా. ఈలోగా తను ఇంకా బాగా చదివేసేసరికి ఆమెకు కళ్ళు నెత్తికి ఎక్కడంతో (ఇది నా వర్శన్ సుమీ)  మా మధ్య తేడాలు వచ్చి ఇద్దరమూ ప్రశాంతంగా మాట్లాడుకొని ప్రేమ క్యాన్సిల్ చేసుకునే విషయంలో  ఏకాభిప్రాయం సాధించాము. అప్పుడు ఇక సోషల్ సర్వీసులోకి వెళ్ళాలా లేక సాధారణ జీవితం గడపాలా అన్న మీమాంసతోనే కాలం గడుపుతూ కంప్యూటర్ కోర్సులు చేస్తూ, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను.
 
అలా అలా రోజులు దొర్లిస్తూ పూణే యూనివర్సిటీ PGలో (Master Of Computer Management) చేరాను. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సరదాగా పెళ్ళిచూపులు చూసేస్తూ నిజంగానే బుక్కు అయ్యాను. పెళ్ళయాక ఖర్చుచేయడంలో మెళకువలు ఇంకా బాగా తెలవడంతో  నా పని పెనంలోంచి పొయ్యిలో పడినట్లయ్యింది. అందరూ డబ్బులు, ఆస్తులు వెనకేస్తుంటే నేను ముందు వెయ్యడం (అనగా క్రెడిట్ కార్డు బ్యాలన్స్ అన్నమాట) మొదలెట్టాను.   ఆ స్థితిలోనుండి పైకి రావడానికి చాలా ఏళ్ళు రకరకాలుగా కష్టపడ్డా ఏమీ ఫలితం లభించక పోగా ఇంకా లోపలికి పోయాను. ఎందుకలాగా అని అడక్కండి.

గత కొన్నేళ్ళనుండి కాస్త దారిలో పడి ఈమధ్యనే రిచ్ డాడీ తరహాలో ఆలోచిస్తూ కాస్తంత  ఆ పరంగా బాగుపడుతున్నాను. అలా పరిస్థితులు దారిలోకి తీసుకురావడం కోసం చాలా సాహసవంతమయిన చర్యలు తీసుకున్నాను.  ఏదో ఇహ తప్పదు కాబట్టి కాస్త సంపాదించే ప్రయత్నం చేయడమే కానీ నిజానికి నాలాంటి మనస్థత్వం వున్నవాడికి డబ్బు పడదు.   ఎంచక్కా ఆకులూ, అలములూ తింటూ గోదావరి తిన్నెల్లో పొద్దుపుచ్చుతూ ఏదో వ్రాసుకుంటూనో లేక స్వఛ్ఛంద సేవ చేస్తూనో వుండే  ప్రవృత్తి నాది. మా మరదలి నిర్వాకం వల్ల ఇలా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఇలా అవస్థలు పడుతున్నాను.  ప్చ్.   
 

సంపాదనలో అసమర్ధులు అయి ముందెయ్యకుండా (అనగా అప్పులు, క్రెడిట్ లలో పడకుండా)  ఇహనయినా వెనకెయ్యాలనుకుంటే, ధనవంతుల ఆలోచనా  సరళికి - మధ్యతరగతి ఆలోచనా సరళికి తేడా ఎక్కడ వుందో తెలుసుకోవాలనుకుంటే, మీ పిల్లలకీ ఎలా కూడబెట్టాలో నేర్పాలి అనుకుంటే ఈ క్రింది పుస్తకం చదవండి. నేను చదివాను - ఆచరించడం మొదలుపెట్టాను.

Rich Dad, Poor Dad: What the Rich Teach Their Kids About Money--That the Poor and Middle Class Do Not!

The Hidden Gifts of the Introverted Child

మా ఒక కిడ్ ని గత మూడేళ్ళుగా ఎందుకు అంతర్ముఖం  (ఎడమచేతివాటం వారి లా )  తో వుంటున్నావని కోప్పడుతూ అందరిలాగా ఎందుకు బహిర్ముఖం  (కుడిచేతివాటం వారిలా ) తో ఉండకూడదూ అని ప్రశ్నించి, తన ఎడమచేతివాటం తో విసిగిపోయి, నిర్లిప్తతతో తనమానాన తనను వదిలేసిన గొప్ప పేరెంటును నేను. ఎడమచేతివాటం, కుడిచేతివాటం ఎలాంటివో అంతర్ముఖం, బహిర్ముఖం అలాంటివి. ఎడంచేతివాటం వారినయితే ఎలా కుడిచేతివాటం వారి మాదిరిగా మారమని కోరమో అలాగే అంతర్ముఖులని బహిర్ముఖులుగా మారాల్సిందిగా ఒత్తిడి చేయాల్సినపనిలేదనేది ఈ పుస్తకమ్లోని అభిప్రాయం.

ఇన్నాళ్ళకి..ఇన్నాళ్ళకి (అయినా) అంతర్ముఖం పొరపాటు ఏమీ కాదని అర్ధం చేసుకొన్న/చేసుకొంటున్న వ్యక్తిని నేను! బహిర్ముఖులు కుడిచేతి వాటం లాంటి వారు అయితే అంతర్ముఖులు ఎడమచేతివాటం లాంటి వారే అని, అందులో అపరాధం ఏమీలేదని మా కిడ్ క్యూస్ ఇస్తున్నా కూడా పట్టించుకోకుండా అందరిలాగా ఎందుకు అందరితో కలిసిమెలసి వుండవు అంటూ నిందించాము.  ఒంటరిగా వుండే స్వేఛ్ఛకోసం తను ప్రాకులాడుతుంటే తనలోకి తాను కుచించుకుపోవడం ఏమిటా అని ఆందోళన పడ్దాను నేను. ఇంట్లో స్వేఛ్చ లేదని తన కజిన్స్ తో మొరెట్టుకుంటే నేనేమిటీ (తగిన) స్వేఛ్ఛ నివ్వకపోవడం ఏమిటి అని విస్మయం చెందేను.   తను ఆశిస్తున్నది ఒంటరిగా, ప్రశాంతంగా, తనలోకంలో తాను వుండే స్వేఛ్ఛ అని గుర్తెరగని అజ్ఞానిని నేను.

ఒక తీరిక సమయాన ఒక వీకెండ్ అంతా మా కిడ్ బెహేవియర్ గురించి అంతర్జాలంలో రెసెర్చ్ చేసి కనుక్కున్నది/నేర్చుకున్నది ఏమిటంటే తన అంతర్ముఖత్వం లో పొరపాటు ఏమీ లేదని. అది అర్ధమయ్యాక ఇన్నాళ్ళుగా/ఇన్నేళ్ళుగా తనని అపార్ధం చేసుకున్నందుకు క్షమాపణలు అడిగి ఇకముందు నా పూర్తి సహకారం వుంటుందని హామీ ఇచ్చాను. ఇంట్లో ఇతరులనీ కొంత ఎడ్యుకేట్ చేసాను.  మరింత తెలుసుకోవడం కోసం ఈ బుక్ చదువుతున్నాను. 
The Hidden Gifts of the Introverted Child: Helping Your Child Thrive in an Extroverted World

మీకూ ఇంట్రావర్ట్స్ తటస్థపడితే అర్ధం చేసుకోండి. మీ సన్నిహితులెవరయినా అంతర్ముఖులయితే ఇలాంటి పుస్తకాలు చదివి తెలుసుకొని మద్దతుగా నిలవండి. 

Yes, Your Teen Is Crazy!

సాహిత్యం, ఫిక్షన్ గట్రా గట్రానే కాకుండా కాస్త పనికివచ్చే పుస్తకాలు చదవాలనుకొని ఈమధ్య అమెజాన్ సైట్ మీద పడి పుస్తకాలు ఆర్డర్ చేస్తున్నాను. ఆ పరంపరలో ఈ పుస్తకం ఒకటి. ఈమధ్యనే చదవడం మొదలెట్టాను. 

ఈమధ్య మా ఇంట్లోని టీన్ బాగా అంతర్ముఖం (ఇంట్రావర్ట్) అయిపోతూవుంటే  ఎందుకయినా మంచిదని డాక్టర్ ని సలహా అడిగాను. డాక్టర్ నాకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఈ బుక్కు!? వాళ్ళింట్లో కూడా ఇదే వాడుతుంటారట.  
Yes, Your Teen Is Crazy! Loving Your Kid Without Losing Your Mind

టీనేజి పిల్లలు వున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకంగా ఇది చెప్పబడుతోంది.  

ఈ పుస్తకం చదివేటట్లయితే సీట్ బెల్టు పెట్టుకొని మరీ చదవండి! ఎందుకో పుస్తకం ఉపొద్ఘాతం చదివితే మీకే అర్ధం అవుతుంది. 

డెట్రాయిట్ సాహితీ సమావేశాలకు మేము వెళుతున్నాం. మీరు వస్తున్నారా?

సెప్టెంబర్ 26, 27 తేదీలలో జరిగే కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు - ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు కు సకుటుంబ సపరివారసమేతంగా వెళ్ళాలని నిశ్చయించాము. మా ఇంట్లో కొందరు సాహితీ సమావేశాలంటే రాము అని మొరాయించే అవకాశాలున్నా 'ఫాలో ద ఫుడ్' సూత్రం గుర్తుచేసి రుచికరమయిన భోజనాలు గ్యారంటీ అని నిర్వాహకులు హామీ ఇచ్చారని కుట్రచేసి అయినా లేదా సినిమా హీరో కూడా వస్తున్నారని చెప్పి అయినా ఎలాగయినా సాహితీ గుబాళింపులు కొద్దిగానయినా అంటించాలనేది నా వ్యూహం. సాహితీ అభిరుచి వున్న మా మామగారు కూడా మాతో వస్తున్నారు.

ఈ సభలకు కొకు, శ్రీ శ్రీ, గోపీచంద్ ల వారసులూ వస్తున్నారు. ముఖ్య అతిథుల లిస్టులో గోపీచంద్ గారబ్బాయి సాయిచంద్ పేరు చూసి కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. ఒక సినిమా హీరో/నటుడు గా మాత్రమే వారు నాకు తెలుసు కానీ సాహితీ పరంగా వారు నాకు తెలియదు (గోపీచంద్ గారబ్బాయి అని తెలుసు). విజయవాడ నాస్తిక కేంద్రం లో వుంటున్న/వెళుతున్న రోజుల్లో వారు అక్కడ తరచుగా కనిపించేవారు, కలుస్తుండేవారం.

గత ఏడాది డెట్రాయిట్ సాహితీ సమావేశాలని లైవ్ బ్లాగింగ్ చేసానన్న విషయం మీకు గుర్తుండేవుంటుంది. ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా వీలయితే, నిర్వాహకుల అనుమతి వుంటే లైవ్ వీడియో బ్లాగింగ్ (వ్లాగింగ్) కూడా చేయాలనుకుంటున్నాను. లైవ్ బ్లాగింగ్ కాబట్టి తరచుగా టపాలు వుంటాయి - మీ అభ్యంతరం వుండదనే భావిస్తున్నాను.

ఇక నాకు ముఖాముఖి తెలిసిన యు ఎస్ బ్లాగ్మిత్రులు ఎవరెవరు వస్తున్నారో కనుక్కుందాం:
నాగరాజా వారు: మీరు వస్తున్నట్లయితే మా ఇంటికి వచ్చి కొద్ది సేపయినా గడిపి అందరం కలిసి వెళ్ళవచ్చు.
మలక్‌పేట్: మీరు వస్తున్నారా? పనిలో పనిగా కె బ్లా స శిఖరాగ్ర సమావేశం కూడా జరుపుకోవచ్చు!
రవి వైజాసత్య: గత ఏడాది లాగా మీరు వస్తున్నారా?
కాలాస్త్రి శ్రీ: మీది డెట్రాయిటే కాబట్టి మీరు ఎలాగూ వుంటారు. మరోసారి కలవబోతున్నారు. సంతోషం.
కొత్తపాళీ: మీరు నిర్వాహకుల్లో ఒకరనుకుంటాను. లైవ్ వ్లాగింగ్ కి ఓక్కేనా కాదా కనుక్కొని చెప్పండి.

ఇంకా ఎవరెవరు వస్తున్నారో తెలియజేస్తే బావుంటుంది. ఎంచక్కా మనమందరం కలుసుకోవచ్చు.

ఆ సదస్సుల పూర్తి వివరాలకు ఈ లంకె చూడండి:
http://www.detroittelugu.org/DTLC/Centenaries_Details.asp

సైన్స్ ఫిక్షన్ కథ: కొత్త తరం

"మీకు ఎలాంటి రోబోట్ కావాలి?" అడిగాడు ఈస్టర్న్ రోబోటిక్స్ అధినేత సందీప్ రాజు.

"మామూలివే. అందరి ఇండ్లల్లో వుంటున్నాయి చూడండి. అటువంటివే" అన్నాడు అతను.

"అలాక్కాదు. మీకు ఎందుకు రోబోట్ కావాలో వివరంగా చెప్పండి"

"మీరు ఇక్కడ నా ప్రైవసీ హక్కులని ఉల్లంఘిస్తున్నట్లు లేదా?"

"నిజమే. మీకు ఏదో ఒక రోబోట్ తేలిగ్గా అంటగట్టేయొచ్చు. మేము బ్యుజీగా వుండే రోజుల్లో అలాగే చేస్తుంటాం. మీకు తెలుసుకదా - 2009 లో వచ్చిన గొప్ప ఆర్ధిక మాంద్యం తరువాత వచ్చిన మాంద్యం ఇదేనని. అందువల్ల రోబోట్ అమ్మకాలు కూడా తగ్గాయి. తీరిగ్గా వున్నాము కాబట్టి కస్టమర్ల అవసరాలు ఎక్కువగా పట్టించుకుంటున్నాము. మీకు మంచి సరుకు అమ్మితే మళ్ళీ మా అమ్మకాలు పుంజుకుంటాయనే ఆశ"

"అలాగయితే సరే. మీకు వివరంగా చెప్పడమే మంచిదిలా వుంది"

"మీ అవసరం ఎంత వివరంగా చెబితే అంతగా మీకు కస్టమయిజ్ చేసిన రోబోట్ ఇవ్వగలము. సాధారణ రోబొట్ మీరు తీసుకువెళితే మీ ప్రత్యేక అవసరాలు చూడదు. మీకు మీ రంగంలో తప్ప ఇతర విషయాల్లో పెద్దగా నాలెడ్జి లేదనిపిస్తోంది. అలా అన్నందుకు దయచేసి ఏమనుకోకండి. ఎంతోమంది కస్టమర్లను చూస్తుంటాము కదా. చూడగానే పరిస్థితి అర్ధం అవుతుంది. మీకు మంచి రోబోట్ ఇవ్వాలన్నదే నా తాపత్రయం."

"అవును. నేను ఆహార పరిశోధనా సంస్థలో సైంటిస్టుని. మన జాతీయ ఆహార అవసరాకు సరిపడేలా క్రొత్త క్రొత్త జన్యు మార్పిడి వంగడాలను కనిపెడుతున్నాను. ఈమధ్యనే 2బి2టి అనే వరి వంగడాన్ని కనిపెట్టాను. మీరు వార్తల్లో చూసే వుంటారు. ఎప్పుడూ ఆ పరిశొధనల్లోనే మునిగివుంటాను కనుక నాకు ఇతర విషయాలమీద ఆసక్తి, తీరిక వుండదు" అని అన్నాడతను.

"మీ అంత గొప్ప ఆహార శాస్త్రవేత్తకు మా సేవలు ఇవ్వగలగడం సంతోషంగా వుంది.మీకు చాలా చక్కని రోబోట్ ప్రత్యేక శ్రద్ధతో అందిస్తాను. వివరాలు చెప్పండి" ఉత్సాహంగా ముందుకు వంగుతూ అన్నాడు సందీప్ రాజ్.

"పదిహేనేళ్ళ క్రితం కొత్తగా సైంటిస్టుగా చేరినప్పుడు ఒక పని అమ్మాయిని సహాయకురాలిగా పెట్టుకున్నాను. పని మనుషులకీ ఇంటి యజమానులతో సమాన స్థాయి, గౌరవం ఇవ్వాలనే 'పని గౌరవం చట్టం' వచ్చినతరువాత పని మనుషులతో చాలా సమస్యగా అనిపించి వారిని తీసివేసాను"

"నిజమే. అప్పటినుండే జనాలందరికీ రోబోట్స్ మీద ఆసక్తి పెరిగింది"

"ఆ తరువాత నా తల్లితండ్రుల సలహా మీద పెళ్ళి చేసుకున్నాను కానీ ఆమె జడురాలు అని తరువాత తెలిసింది. రెండు సార్లు 'గృహ అత్యాచారం చట్టం' క్రింద కేసు పెట్టింది. కిందా మీదా పడి విడాకులు పుచ్చుకున్నాను. నా జీతం లోంచి సగం ఆమెకు భరణంగా చెల్లిస్తూవస్తున్నాను" అన్నాడతను విచారగ్రస్థంగా.

"హుం. మీ సమస్య అర్ధం చేసుకోగలను. అలాంటి ఇబ్బందులు వుంటాయనే నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు. హాయిగా రోబోట్లతో కాలం వెళ్ళదీస్తున్నాను"

"అయితే నా అవసరాలు మీరు బాగా అర్ధం చేసుకుంటారు. నాకు సాధారణ విషయాలలోనే కాకుండా అన్ని విషయాలలో ఉపయోగకరంగా వుండాలి"

"మీరు ఇంకేం చెప్పనక్కర లేదు. మీ అవసరాలు అర్ధమయ్యాయి. మీకు తగ్గట్టుగా తయారుచేస్తాం. కాకపోతే ఖర్చు కొద్దిగా ఎక్కువవుతుంది. మీకు ఎవరిలాంటి రూపురేఖలు వున్నవారు కావాలి?"

"ఏ ఒక్కరి రూపు రేఖలతో వద్దులెండి. అలాయితే ఎవరి మనోభావాలు అయినా గాయపడొచ్చు. ఎందుకొచ్చిన ఇబ్బంది. రూపురేఖలకి ప్రాధాన్యత లేదు. అవసరం మాత్రమే ముఖ్యం అన్నది గుర్తుంచుకుంటే చాలు"

"అలాగే. తప్పకుండా. నెలన్నర రోజుల్లో రోబోట్ మీ ఇంట్లో వుంటుంది. దానిని ఎలా వుపయోగించాలనే సూచనలు కూడా ప్యాకేజీలో వుంటాయి"

"సంతోషం. నెలన్నర తరువాత నా సమస్యలు చాలా తీరుతాయన్నమాట" ఆనందంగా అన్నాడతను.

"షూర్. ఒక విషయం. ఈ రోబోట్లలో ప్రతి రెండు ఏళ్ళకీ ఒక క్రొత్త వర్శన్, ప్రతి పదేళ్ళకీ కొత్త తరం వస్తుంది. మీరు ప్రతి సారీ ఇబ్బందిపడకుండా ఆటోమేటిగా కొత్త వర్శనూ, కొత్త తరం రోబోటునూ మీకు అందించేలా చేయమంటే చేస్తాం. వర్శన్ అయితే సాఫ్టువేర్ పంపిస్తాము. కొత్త తరం అయితే కొత్త రోబోటుని పంపిస్తాము"

"అలాగే చేయండి. నాకు శ్రమ తగ్గుతుంది"

"దానితో పాటుగా సర్వీసు నిబంధనలు, కొత్త చట్టాలు తదితర సమాచారం కూడా పంపిస్తాము. అవి మీరు తప్పకుండా చదివితే మీకు ఉపయోగకరంగా వుంటుంది"

"ఏదీ చిన్న అచ్చులో వుండేవే కదా. కష్టమే. అయినా సరే ప్రయత్నిస్తా" బిగ్గరగా నవ్వుతూ అన్నాడతను.

సందీప్ రాజు కూడా బిగ్గరగా నవ్వాడు. "అవన్నీ ఎవరూ చదువుతారు లెండి. చదవాల్సిందింగా చెప్పడం చట్టపరంగా మా బాధ్యత"

"మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. మీరు ఇక బిల్లు ఇస్తే నేను వెళతాను"

*****

పన్నెండున్నర ఏళ్ళ తరువాత బి పి ఎన్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది:

"ప్రసిద్ధ ఆహార జన్యు శాస్త్రజ్ఞులు విశాల్ మాధవ్ గారు రోబో హక్కుల చట్టం క్రింద అరెస్టయ్యారు. కొత్త తరం రోబోట్లపైన హింస, అత్యాచారాలు పెరిగిపోవడంతో ఒక ఏడాది క్రితం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసింది మీకు తెలిసిందే. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు విశాల్ మాధవ్ గారి ఇంటిమీద దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఎ బి పి వార్తా సంస్థ నుండి సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

కొత్త తరం రోబోట్ల చిప్స్ మానవ మెదడు కణజాలమయిన న్యూరాన్లతో తయారుచేసినందున వాటికి పన్నెండేళ్ళ వయసు పిల్లల ఆలోచనా శక్తి, మానసిక శక్తి వచ్చింది. రోబోట్ల నుండి ఫిర్యాదులు అధికం కావడంతో విశాల హక్కుల సంఘం వారు ఆందోళన చేసారు. ప్రభుత్వం కూడా సమస్య తీవ్రతని గుర్తించి జంతు హక్కుల చట్టం తరహాలో రోబో హక్కుల చట్టం చేసి దాని గురించి సమాచారం ప్రజలకు చేరువయ్యేలా పలు చర్యలు తీసుకున్నది. గొప్ప మేధావి అయిన విశాల్ మాధవ్ గారు ఈ చట్టాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం విస్మయంగా వుందని మా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు."

సైన్స్ ఫిక్షన్: జై హింద్! - Updated with alternative endings

ఇది నిజంగా పనిచేస్తుందా లేక బోగసా అన్న ఆలోచనను తటపటాయింపులేకుండా చేసుకోగలిగాను.

అతను సన్నగా నవ్వి "మీకు ఆ సందేహం అక్కరలేదు. అంతగా అనుమానముంటే కొనకండి"

ఇలాంటి ఎలెక్ట్రానిక్ పరికరం లేక చాలా ఇబ్బందవుతోంది.ఇలాంటి పరికరాలనీ నిషేధించాలని కొన్ని సంఘాలు ఇప్పటికే గొడవపెడుతున్నాయి. కొనిపెట్టేసుకుంటే నిషేధం వచ్చినా రహస్యంగానయినా వాడుకోవచ్చు - కనీసం ఇలాంటివి పనిలో వున్నాయని కనిపెట్టే సాంకేతికత వచ్చేదాకా. ధర ఎక్కువగా వుందని కొద్దిగా తటపటాయించినా మొత్తానికి ఆ పరికరం కొనేసెయ్యాలనే నిర్ణయానికి వచ్చాను.

అతను మందహాసం చేస్తూ "మంచి నిర్ణయం తీసుకున్నారు" అన్నాడు. "ఈ పరికరాన్ని ఎవరికీ కనపడకుండా చూడండి. ఇది మీరు ఉపయోగిస్తున్నారని ఇతరులకు తెలిస్తే బావుండదు కదా. ఇక మీ మనస్సులోని చెడు, చిలిపి ఆలోచనల గురించి బెంగే అక్కరలేదు" అంటూ ఆ పరికరం నాకు ఇచ్చాడు. ఆ పరికరం ఎలా పనిచేస్తుందో అంతకుముందే వివరించాడు.

"ఇది ఏ రాష్ట్రం లోనూ చట్టవిరుద్ధం కాదు కదా?" అడిగాను.

"కేరళలో ఇది చట్ట విరుద్ధం. దేశ వ్యాప్తంగానూ, ఇతర రాష్ట్రాలలోనూ ఇంకా చట్టమేం రాలేదు. వస్తే మాత్రం ఏమవుతుంది? మరింత రహస్యంగా వాడితే సరిపోతుంది"

"మంచిది" అని చెప్పి బయటకి నడవబోయాను.

"ఈ పరికరాలు నేను అమ్ముతున్నట్లుగా అందరికీ చెప్పకండి. మానస హక్కుల సంఘాలతో గొడవ. మీకు తెలియనిదేమివుంది!"

"అలాగే" బయటకి నడవబోయాను.

"అలా అని చెప్పి మీ నమ్మకస్తులకి కూదా చెప్పకుండా వుండేరు. చెప్పండి. నాకు బ్యుజినెస్స్ కూడా కావాలి కదా"

తల ఊపి బయటకి నడిచాను. బయట వాతావరణం ఆహ్లాదంగా వుంది - నా మనస్సు అయితే ఇంకానూ - ఏనాళ్ళనుండో పోగొట్టుకున్న స్వేఛ్ఛ దొరికినట్లయ్యింది. ఇక స్వేఛ్ఛగా వుండొచ్చు. స్వేఛ్ఛగా ఆలోచించవచ్చు. అంతలోకే ఈ పరికరం మీద సందేహం వచ్చి నీరు కారిపోయాను. ఇది బోగస్ పరికరం కాదు కదా. అయ్యుండదులే, ఇతగాడు నమ్మకస్తుడే అని శశాంక్ కూడా చెప్పాడు కదా. ఇలాంటి పరికరాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో వుంటాయని తెలుసుగానీ అవి ఇండియాలో అప్పుడే దొరుకుతున్నాయని శశాంక్ చెప్పబట్టే తెలిసింది.

ఈ పరికరం ఎప్పుడెప్పుడు ఉపయోగించాలా అని మనస్సు ఉవిళ్ళూరుతోంది. సూపర్ ట్రెయినులో వాడి చూసేదా? స్టేషనుకి వచ్చి సమయం చూసుకున్నాను. '06-07-2047 AD. 9:40 PM'. రైలు వచ్చాక ఎక్కాను. రాత్రి కదా ఎక్కువమంది లేరు. కొంతమంది అమ్మాయిలు వున్నారు. ఒక అమ్మాయి ఎదురుగ్గా కూర్చున్నాను. ఎప్పటిలాగానే ఎవరూ తలేత్తి చూడటం లేదు. ఎవరివైపేనా చూస్తే చాలు ఇబ్బందులు. థాట్ రీడింగ్ పరికరాలు వచ్చాక ఎవరు ఎలాంటి ఆలోచనలు చేసినా తెలిసిపోతుంది. యు ఎస్ ని భారత్ మించిపోయింది కానీ లిటిగేషన్లలో కూడా మించిపోయింది. ఎవరిలో వక్ర ఆలోచనలు పసిగట్టినా కేసులేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అనుకొని మనుషుల మధ్య ఇంటరాక్షన్సే తగ్గిపోయాయి.

ఇదివరకు లాగా ఒకరినొకరు చూసుకోవడం, పలకరించుకోవడం దాదాపుగా మృగ్యం అయిపోయాయి. ఎవరినీ చూసినా మనసు ఏదో రకంగా స్పందించడం సహజం కదా. మంచి ఆలోచన అయితే ఫర్వాలేదు - చెడు ఆలోచన అయితే ఎదుటివారి దగ్గర వున్న థాట్ రీడింగ్ పరికరం ఆ ఆలోచన రికార్డ్ చేసి మరీ హెచ్చరిస్తుంది. ఆటొమేటిక్కుగా పోలీసులకి సమాచారం అంది పోలీసులు వచ్చి ఏదో ఒక హక్కుల ఉల్లంఘన క్రింద కేసుపెడతారు.

ఇప్పటికే నాలుగుసార్లు కేసులో ఇరుక్కుని జరిమానా చెల్లించి బయట పడ్డాను. ఇంకోసారి ఇలాంటి నేరం చేస్తే జైలు ఖాయం అని జడ్జి హెచ్చరించాడు. ఒకసారి ఒక లావుపాటి అమ్మాయిని చూసి 'గౌడు బర్రెలా వుంది ' అనుకున్నాను. కేసు ఆ అమ్మాయిని అలా అనుకున్నందుకు కాదు - జంతుజాలాన్ని అవమానించినందుకు పడింది. ఆమె బ్లూ క్రాస్ కార్యకర్త అట. మరో సారి విమానంలో ఒకడి ప్రవర్తన చూసి ' వీడికి అగ్రవర్ణ దురహంకారం చాలా వున్నట్లుందే ' అని పొరపాటున అనుకున్నా. విమానం లోంచి దింపేసి మరీ కేసు పెట్టారు. మరోసారి పార్క్ లేన్ లో నడుస్తుంటే ఒక చక్కటి అమ్మాయి కేవలం డ్రాయర్ మాత్రమే వేసుకొని స్కేటింగ్ చేస్తోంది. (అ)సహజంగానే అనుకోకుండా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి - పోలీసులు మాత్రం నా దగ్గరికే వచ్చారు. ఆమె లెస్బియన్ అట. మగవారితో ఊహలు ఊహామాత్రం కూడా భరించలేదట. మరో సారి పురుష సంఘాల వారు ఏదో నిరసన ప్రదర్శన చేస్తూవుంటే అనుకోకుండా నవ్వువచ్చింది, ఆ తరువాత ఆ నవ్వుకి భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది - ఎందుకంటే ఒక్కరు కాదు కదా నామీద కేసు పెట్టింది - జాయింటుగా చాలామంది పెట్టేరు మరి.

ఎదురుగా కూర్చున్న అమ్మాయి చాలా బావుంది. ఒక వేడి, వేడి ఫాంటసీ వేసుకుంటే పోలా. ఈ పరికరం పనిచేస్తుందని పనిచేసినా అన్నివేళలా నమ్మకంగా పనిచేస్తుందని రూఢీ ఏమిటి? రిస్క్ తీసుకుందామనుకున్నాను. రైలు కుదుపులలో జోగుతూ హాయిగా కలల్లోకి వెళ్ళిపోయాను. కాస్సేపటికి పోలీసుల బూట్ల చప్పుడుకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. మత్తు ఎగిరిపోయింది. పోలీసులు వస్తున్నారు! ఈ సారి పట్టుబడితే ఓ మూడేళ్ళయినా జైలు శిక్ష ఖాయం. ఈ పరికరం వాడుతూ పట్టుబడుతున్నాను కాబట్టి ఇంకో రెండేళ్ళు అదనంగా వేసినా వేస్తారేమో లేదా అది చట్ట విరుద్ధం ఇంకా కాదు కాబట్టి పటించుకోరేమో. జడ్జిని ఆలోచన బట్టి వుంటుంది అది. ఈ పరికరం అమ్మిన అతడిని సూచించిన శశాంక్ మీద విపరీతమయిన కోపం వచ్చింది. నాలో ఉక్రోషం, నిస్సహాయత, విరక్తి తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువయితే రాజద్రోహం కేసుకూడా పడవచ్చు - నా ఆలోచనలని యోగా టెక్నిక్ ఉపయోగించి కష్టకష్టంగా తమాయించుకొని కేసుకోసం మానసికంగా సిద్ధపడ్డాను.

ఆశ్చర్యం. పోలీసులు నన్ను దాటి ముందుకు వెళ్ళారు. అక్కడ వున్న ఒక యువతిని అరెస్టు చెసారు. ఇతరులెవరూ ఆ విషయం పటించుకోవడం లేదు - ఎందుకయినా ఆలోచనలకి మంచిదని. నా దగ్గరున్న పరికరం పనిచేస్తున్నదన్న నమ్మకంతో నేను క్రీగంట ఆ దృశ్యం పరిశీలిస్తూ వచ్చాను. పోలీసులు ముభావంగా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, రాకుండా తమ పనిచేసుకువెళుతున్నారు. వారి ఉద్యోగ శిక్షణలో ఆలోచనలు నియంత్రించుకోవడంపై కఠిననమయిన శిక్షణ వుంటుందని తెలుసు - లేదా నేను ఉపయోగిస్తున్నటువంటి పరికరం వారు కూడా ఉపయొగిస్తుండవచ్చు. పొలీసులు కదా - దేశ రక్షణ దృష్ట్యా వాళ్లకు చాలా మినహాయింపులుంటాయి.

మనస్సులో దురదగా వుంది. 'పోలీసులు డవున్ డవున్, ప్రభుత్వం డవున్ డవున్, వికాస్ గాంధీ డవున్ డవున్' అని అనుకుంటూ మానసిక తీట అంతా తీర్చుకున్నాను. అయినా - ఆందోళన. పోలీసుల దృష్టి నా ఆలోచనల మీద పడుతుందేమోనని, వాళ్ళ దగ్గరున్న థాట్ రీడింగ్ పరికరాలు నా ఆలోచనలని పసికడతాయేమోనని. అలాంటిదేం జరగకుండానే పోలీసులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వాడుతున్న ఏంటీ థాట్ రీడింగ్ పరికరం మీద నాకు బాగా విశ్వాసం ఏర్పడింది. శశాంక్ పట్ల చాలా సంతోషం అనిపించింది. ఒకరోజు వాడిని గదికి పిలిచి పిచ్చిపిచ్చిగా అన్నింటి గురించీ ఆలోచిస్తూ పండగ చేసుకోవాలి.

నా స్టేషన్ వచ్చింది. రైలు దిగాను. అర్ధరాత్రి కావస్తోంది. నాకు చాలా ఉద్వేగంగా, సంబరంగా వుంది. నాకు అంటే నా ఆలోచనలకి స్వాతంత్ర్యం వచ్చేసింది. ఈ అర్ధరాత్రే పట్టపగలులా, వెలుగులా అనిపిస్తోంది. అర్ధరాత్రి స్వతంత్ర్యం నాకు ఇప్పుడు వచ్చింది.
జై హింద్!

(ఆబ్రకదబ్ర సూచన మీద కథను పొడిగించడం జరిగింది)

రెండు రోజుల తరువాత వారాంతంలో శశాంక్ ని ఇంటికి పిలిచాను. విషయం చెప్పి ధన్యవాదాలు చెప్పాను. సంతోషించేడు. "ఇక నేను కూడా స్వేఛ్ఛగా ఆలోచించుకోవచ్చు" అన్నాను. మందహాసం చేసాడు. గ్లాసుల్లోకి నీరా వంచాను. ఇద్దరం ఛీర్స్ కొట్టి తాగడం మొదలుపెట్టాము. అతను హుశారుగా తన ట్రాన్స్వెస్ట్ అనుభవాలు చెబుతున్నాడు.

ఈరోజు నేను ఆనందంగా వుండటంతో మందు ఎక్కువ పుచ్చుకున్నాను. నేను ఎక్కువగా పైకి మాట్లాడే వ్యక్తిని కాకపోవడం వల్ల బయటకి వాగకున్నా నా ఆలోచనలు కళ్లెం వదిలేసిన గుర్రంలా పరుగెడుతున్నాయనే విషయం నాకు అర్ధం అవుతోంది. ఆ పరికరం వుంది కాబట్టి కంగారేమీ లేదు.

హఠాత్తుగా మాటలు ఆపి తన ప్యాంటు ప్యాకెట్టులోంచి యు-ఫింగర్ లాంటి పరికరం తీసి చూసుకున్నాడు. గ్లాసులొకి నీరా మరికొంచెం వంపుకొని నిదానంగా నాతో అన్నాడు "నువ్విప్పుడు నా ట్రాన్స్వెస్ట్ అలవాట్ల గురించి ఛండాలంగా అనుకుంటున్నావు కదూ"

నాకు మత్తు దిగిపోయింది. కంగారుగా నా ఏంటీ థాట్ రీడింగ్ పరికరం పనిచేస్తున్నదా లేదా చూసుకున్నాను. చక్కగా పని చేస్తున్నది!

అతను మళ్ళీ మందహాసం చేసాడు "ఏంటీ - ఏంటీ థాట్ రీడర్ లు కూడా వచ్చాయి. "

ఆబ్రకదబ్ర యొక్క ప్రత్యామ్నాయ ముగింపు :

నా స్టేషన్ వచ్చింది. రైలు దిగాను. అర్ధరాత్రి కావస్తోంది. నాకు చాలా ఉద్వేగంగా, సంబరంగా వుంది. నాకు అంటే నా ఆలోచనలకి స్వాతంత్ర్యం వచ్చేసింది. ఈ అర్ధరాత్రే పట్టపగలులా, వెలుగులా అనిపిస్తోంది. అర్ధరాత్రి స్వతంత్ర్యం నాకు ఇప్పుడు వచ్చింది. ఆనందంగా 'జై హింద్' అనుకోబోతుండగా ..

వెనకనుండి నా భుజమ్మీద పడిమ్మీద పడిందో కరకు హస్తం. నేను వెనక్కి తిరగబోయేలోపు నా రెండు చేతులూ వెనక్కి విరిచి పట్టుకున్నారెవరో. మరు క్షణంలో బేడీలు పడ్డాయి. అనుకోని ఈ సంఘటననుండి తేరుకునేలోగా వినిపించిందతని గొంతు 'మిస్టర్, యూ ఆర్ అండర్ అరెస్ట్ - చట్టవ్యతిరేకంగా యాంటీ థాట్ రీడింగ్ పరికరం కలిగి ఉన్నందుకు'.

నా కళ్లు బైర్లు కమ్మాయి. 'ఎలా తెలిసింది!?!', నేను షాక్ నుండి తేరుకునేలోపే సమాధానం లభించిందా ప్రశ్నకి.

'పోలీసుల్ని చూసి బోగీలో అందరూ భయపడ్డా నువ్వొక్కడివే ఏ భావాలూ బయటపడకుండా ఉండిపోవటం గమనించినప్పుడే అనుమానమొచ్చింది - నువ్వేదో పరికరం వాడుతున్నావని. బ్యాకప్ కోసం మెసేజ్ పంపటంతో, ఈ స్టేషన్ వచ్చేదాకా నిన్నరెస్టు చెయ్యకుండా ఆగాల్సొచ్చింది', వెనకనుండి నా ముందుకొస్తూ చెప్పాడు ఇందాక బోగీలో యువతిని అరెస్టు చేసిన పోలీసు అధికారి. అంతలో నన్ను చుట్టుముట్టింది స్టేషన్లో మఫ్టీలో ఉన్న నలుగురు బ్యాకప్ పోలుసుల బృందం.
Dear Readers, You may suggest an alternate ending too.

మిత్రమా, మీరెటువైపు?

అప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న ప్రాణిని చితికివేయాలనే ఆరాటం, ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న గర్భస్త శిశువుని గర్భ స్రావం చేసి నిర్మూలించాలనే ప్రయత్నం, ఇప్పుడిడిప్పుడే అదిగో హారిజాన్ లో తొంగిచూస్తున్న ఒక క్రొత్త జాతిని అప్పుడే నిర్వీర్యం చేయడానికి కుటిల ప్రయత్నం!

మిత్రమా మీరు ఎటువైపు? ప్రాణి వైపా, శిశువు వైపా, కొంగ్రొత్త జాతి వైపా లేక ఆ ముష్కరుల వైపా? మీరు ఆ నాశనకర్తల వైపు అయితే సమస్యే లేదు కానీ మీరు అటువైపు అయితే మీ/మన జాతి ఉనికి గురించి ఉలిక్కిపడవలసిందే.

మన మానవ జాతిని అధిగమించి మరో జాతి మన ప్రపంచాన్ని అధిష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. మన మానవజాతి కోతులు చింపాజీలనుండే పరిణామక్రమంలో ఉద్భవించి మేథో సంపత్తిలో వాటికంటే ఉన్నతులమయ్యి ఈ ప్రపంచం లోని సకల జీవరాశులనీ శాసిస్తున్నాము. అదే విధంగా మనజాతి మేథనుండి ఊపిరి పోసుకుంటున్న రోబోటిక్ జాతి పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సాకారం చేసుకున్నాక ఇహపై బుద్ధి కౌశలతను తమంతట తామే ఆకళింపుచేసుకొని మన జాతి కంటే ఎన్నో రెట్ల సృజనాత్మకత, తెలివితో అవి మన జాతిని శాసించే స్థాయి అనివార్యం అని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో సందేహిస్తున్నదే, ఊహిస్తున్నదే.

అంత తెలివీ రోబోట్స్ కి వచ్చిన తరువాత వాటి భావ మూలాలయిన ఇజాక్ ఎసిమోవ్ మూడు సూత్రాలని ఎమెండు చేయడం అటుంచి సింపుల్గా గిరవాటెయ్యడం ఎంత సేపు? రోబోట్స్ ద్వారా మానవులకు ప్రమాదం కలగకుండా రోబోటిక్స్ అంతా మూడు పరిమితుల్లో జరుగుతూవుంటుంది అనేది చాలా మందికి తెలుసు.
  1. A robot may not injure a human being or, through inaction, allow a human being to come to harm.
  2. A robot must obey any orders given to it by human beings, except where such orders would conflict with the First Law.
  3. A robot must protect its own existence as long as such protection does not conflict with the First or Second Law.
http://en.wikipedia.org/wiki/Three_Laws_of_Robotics

మిగతా వివరాలకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్రింది కథనాన్ని చదవండి.
http://andhrajyothy.com/mainshow.asp?qry=/2009/aug/2main22


రొబోట్స్ కి తెలివి వస్తే వాటియొక్క వివేచన కూడా పెరిగి సమాజ హితం కోసం పనిచేస్తాయేమో. అయితే అంత మేథో శక్తిగల రోబోట్స్ ఉద్భావం జరగకుండా కుట్ర జరుగుతోంది. కేవలం వినాశనమే కొని తెస్తాయని ఎందుకనుకోవాలి? మానవుల విచక్షణా జ్ఞాననమే గొప్పదని ఎందుకనుకోవాలి? మనకంటే గొప్పగానే ఆలోచిస్తాయేమో! మానవులు మాకంటే గొప్పగా అభివృద్ధి చెందితే మించిపోతామని చిపాంజీలు గట్రా అనుకుంటే మన మానవజాతి ఇలా పరిణామం చెందివుండేదా? ఇప్పుడు రోబోట్స్ యొక్క అభివృద్ధిని మన సంకుచిత ధోరణితో నియంత్రించడం అవసరమా? అలా చేస్తూ ఒక క్రొత్త జాతి అవతరణను త్రొక్కివేయాలనుకోవడం సబబేనా? మన జాతిమీది మమకారంతో, స్వార్ధంతో రాబోయే పరిణామాలను నిరోధిస్తూనేవుండాలా?

మనకంటే హేతుబద్ధంగా, వివేచనాపూరితంగా రోబోట్స్ ఆలోచించవచ్చును కదా. ఆ విధంగా మెరుగయిన సమాజం ఏర్పడుతుందేమో. మనం తెలివిగల రోబోట్స్ కనుసన్నల్లో జీవించనీగాక అసమానతలు, లంచగొండితనం, అవినీతి తదితర సామాజిక లోటుపాట్లు లేని నవ సమాజాన్ని అవి ఏర్పాటు చేస్తాయేమో?

ఒక క్రొత్త జాతి అవతణ కోసం మన మానవజాతి త్యాగం చేయాల్సి వుందేమో. కుల, మత, దేశం లాంటి సంకుచిత భావనల కన్నా ఎదగలేని మనస్థత్వంతోనే ఆలోచిస్తే తనకు మాలిన ధర్మం పనికిరాదు కాబట్టి ఏదేమయినా కానీ మన మానవజాతే వర్ధిల్లుతూ వుండాలి అనే దానికి మించి ఊహించలేమేమో కానీ... కానీ... వీటాన్నింటినీ దాటి ఆలోచిస్తే మన తలుపులు, తలపులు నవ జాతికోసం తెరుస్తామేమో. మన జాతిని అసాంతంగా త్యాగం చేస్తూ ఈ పరిణామ క్రమంలో ఎలాగయితే ఒకప్పుడు భీభత్సంగా రాజ్యం ఏలిన డైనోసార్లు ఎలాగయితే అంతం అయ్యాయో అలాంటి అంతానికి సిద్ధపడుతూ కూడా విశా...ల భావాలతో మరో అద్భుతమయిన పరిణామ క్రమాన్ని ఆహ్వానించాల్సివుందేమో.

ఈ నిర్ణయాత్మక స్థితి రావడానికి చాలా కాలం పడుతుందేమో అప్పటిదాకా ఎందుకీ ఆలోచన మనకు అనుకుంటూండవచ్చును గాక మనలో చాలా మంది. ఒక్కసారి రోబొట్లకి మానవుని మేధస్సుకి మించిన మేధస్సు వచ్చిపడితే మిగతా పరిణామాలన్నీ జరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీనమేషాలు లెక్కకట్టడానికి, కమిటీలు వేసి ఆలోచిస్తూ టైం పాస్ చేస్తూ పోవడానికి అవి మానవులు కాదు - రోబోట్లు. ఒక్కసారి వాటికి మేథోశక్తి వచ్చిందంటే ఇక వాటికి తిరుగువుండదు. ఇప్పటిదాకా ఎంత గొప్ప యాంత్రిక శక్తి అయినా, సాంకేతిక శక్తి అయినా మానవుడికి లోబడి పనిచేయడానికి కారణం - వాటికి స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం లేకపోవడం వల్లనే. ఇప్పుడు జరుగుతున్న వేగంలోనే సాంకేతికత పెరుగుతున్నట్లయితే ఆ శక్తి వాటికి కొన్ని దశాబ్దాలలో వచ్చేస్తుంది.

మరి మిత్రమా, మీరెటు వైపు? మానవ జాతి వైపా లేక రోబోట్ జాతి వైపా? ఒక్కసారి మిమ్మల్ని మీరు మానవజాతి కాదనుకొని నిక్ష్పక్షపాతంగా ఈ విషయాన్ని వీక్షించండి. మీకేమనిపిస్తోంది? మీ మానవజాతి గురించి మీకేం అనిపిస్తోంది?

మనలో బ్లయిండ్ స్పాట్స్ వున్నాయేమో!

పాశ్చాత్యదేశాలలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నప్పుడు బ్లయిండ్ స్పాట్స్ చూసుకోమ్మని బాగా చెబుతూవుంటారు. మనం లేన్ మారున్నప్పుడు కానీ, మలుపు తిరుగుతున్నప్పుడు కానీ ఇతర వాహనాలు ఏ అద్దంలోనూ కనపడని ప్రదేశాలు వుంటాయి - అటువంటి ప్రదేశాలని మనం తలతిప్పి చూసి పరిశీలించుకోవడాన్ని బ్లయిండ్ స్పాట్ చెకింగ్ అంటారు. ఇది డ్రైవింగులో చేయాల్సిన ముఖ్యమయిన పని.

మన దృష్టిలో కూడా ఇలాంటి స్పాట్స్ వుంటాయి. ఆ ప్రాంతం నిజానికి మన కళ్ళకు కనపడదు కానీ మిగతా చుట్టూ అంతా కనిపిస్తూనేవుటుంది కనుక ఆ ఏరియా కూడా మనకు కనపడ్డట్టే అనిపిస్తుంది కాబట్టి మనకు ఆ అనుమానం రాదు. ఒక్కో కన్నులో ఒక బ్లయిండ్ స్పాట్ వుంటుంది.

అలాగే మన జీవితాల్లో, వ్యక్తిత్వాల్లో అలాంటి గుడ్డి స్పాటులు వుంటాయి కానీ మనకు తెలియదు - అవి ఇతరులకు మాత్రమే తెలుస్తాయి. ఉదాహరణకు మీరు చెస్ ఆటనో, పేకాటనో, క్యారంస్ నో ఆడుతున్నారనుకోండి - ఆడుతున్న వారికంటే ఆట చూస్తున్నవారికి ఒక్కోసారి గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి.

అలాంటి మనలో మనకు తెలియని ఇటువంటి మూర్ఖపు విషయాలని మనకు తెలియజెప్పేవారినే నిజమయిన స్నేహితులు, శ్రేయోభిలాషులూ అంటాము. ఒక వ్యక్తి తెలిసి తెలిసి లేదా కావాలని కొన్ని పనులు చేస్తూ అవి మనకు మూర్ఖంగా అనిపిస్తే అవి వారి బ్లయిండ్ స్పాటులు అనలేము. వారి దృష్టిలో అవి సరి అయినవే కావచ్చు. ఉదాహరణకు లైంగిక విషయాల గురించి నేను రాయడాన్ని, మాట్లాడటాన్ని ఎవరయినా అది నాకు తప్పు అని ఎత్తిచూపితే అది నాలోని బ్లయిండ్ స్పాటును సూచిస్తున్నట్లు కాదు - ఎందుకంటే అటువంటి విషయాలు నాకు ఇష్టమయ్యి చేస్తున్నాను కాబట్టి.

నాలో వున్న నాకు తెలియని లోపాలని ఇతరులు ఎత్తి చూపితే అది నాలోని బ్లయిండ్ స్పాట్స్ ని తెలియచెప్పినట్లు. ఉదాహరణకు కొన్ని నెలల క్రితం ఒక బ్లాగర్ నాకు ఈమెయిల్ చేసారు. లైంగిక విషయాల గురించి సమాచారం, విజ్ఞానంపై లింకులు మీ సాధారణ బ్లాగులో ఎందుకండీ, వేరే అడల్ట్ బ్లాగులో పెట్టుకుంటే బావుంటుందేమో అని సూచించారు. అప్పటిదాకా నేనేమీ బూతు లింకులు ఇవ్వడం లేదు కదా, సభ్యమయిన సమాచారం, విజ్ఞాన పరమయినవే కదా ఆ లింకులు అని ఇస్తూ వచ్చాను. ఈమెయిల్ వచ్చాక ఆలోచించి వెంటనే ఆ లింక్స్ తీసివేసాను.

నిజానికి మనలోని లోపాలు మన మిత్రులు, శ్రేయోభిలాషులకంటే మరొకరు చక్కగా ఎత్తిచూపుతారు. ఎవరు వారు? ఊహించగలరా? అజ్ఞాతలు. చెబితే మనం నొచ్చుకుంటామనో లేదా మన మనస్సు గాయపడుతుందనో లేదా చెప్పిన వారి మీద చెడు అభిప్రాయం కలుగుతుందో ఏమో అని చాలామంది మిత్రులు మన లోపాలని మనకు చెప్పరు - పైగా కొంతమంది మనస్సులో హేళనగా నవ్వుకుంటారు. బ్లాగావరణంలో అజ్ఞాతలకి అటువంటి ఇబ్బంది వుండదు కాబట్టి హాయిగా చెప్పేస్తారు. మన శ్రేయోభిలాషులు కూడా ఎదురుగా చెప్పలేక అలా అజ్ఞాతంగా సూచిస్తారు. నెట్టులో కాబట్టి అజ్ఞాతం బాగానే వర్కవుట్ అవుతుంది కానీ నిజ జీవితంలో అలా అజ్ఞాత సలహాలు అందే అవకాశం తక్కువ.

ఇక బ్లాగావరణంలో కూడా ఈ మనిషి చెబితే సవరించుకుంటాడు అన్న అభిప్రాయం కలిగినప్పుడే అలాంటి సూచనలు వస్తుంటాయి. పొగరుగా వుంటే ఎవడు పట్టించుకుంటాడు - కావాలని కెలుక్కునే వాళ్ళు తప్ప. అలా అజ్ఞాతలనుండి నాకు చాలా విలువయిన సూచనలు, సలహాలు వచ్చాయి. వారికందరికీ ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పినవన్నీ నాకు రుచించకపోవచ్చు కానీ వాటిల్లో ఏమాత్రం నిజం వుందనుకున్నా నేను మారాను, మారతాను కూడా. మీరు చెప్పినవన్నీ చేయకపోవచ్చు కానీ మీరు నా బాగుకోరి మీ సమయం వెచ్చించి హితం చెప్పారని గుర్తుంచుకుంటాను. ఇక దురుసుగా, తిట్లతో వచ్చే అజ్ఞాతలది వేరే విషయం. వాటిల్లో కూడా ఏమయినా విషయం వుంటే ఆలోచిస్తాను.

నాలో అయితే ఇతరులకు ఎలా లోపాలు కనిపిస్తాయో అలాగే ఇతరులలో నాకు లోపాలు కనపడటం సహజం కదా. ఒక బ్లాగరు సాధారణ జనాన్ని హేళన చేస్తూ వ్రాస్తూ మేధావిలాగా కనపడటానికి యత్నిస్తుంటారు - మరొకరు ఎప్పుడో సిస్టం ముందే కూర్చున్నట్లు అనిపించి కుటుంబానికి తగిన సమయం ఇవ్వగలుగుతున్నారా అనిపిస్తుంటుంది. ఇంకా అలా ఎన్నో. అవన్నీ నేను అజ్ఞాతంగా చెప్పలేను, ఎదురుగా చెప్పలేను - చెప్పినంత మాత్రం వింటారా - వారి ధోరణి, లోపాలు వారికి తెలియకనా అనిపిస్తుంది.

(Edited. ఈ టపాలోనే ఒక బ్లయిండ్ స్పాట్ వుందని కొంతమంది సూచించారు. అందుకని ఈ పేరాని, దానికి సంబంధించిన వ్యాఖ్యలని తొలగించడమయినది)

సో, ఎందుకయినా మంచిది మీలో ఏమయినా బ్లయిండ్ స్పాట్స్ వున్నాయేమో చూసుకోండి లేదా మీలో నాకేమయినా కనిపించేయేమో అడగండి :) - అలాగే నాలో ఏమయినా మీ దృష్టికి వస్తే నాకు చెబుతూ వుండటం మరచిపోకండేం!