నాకు ఇద్దరూ ఇష్టమయినప్పటికీ క్రిష్ణుడంటే ఎక్కువ ఇష్టం. ఎందుకో మీకు చెప్పక్కరలేదు. కెనడాకి వెళుతూ డెట్రాయిటులో మిత్రుడి దగ్గర ఆగినప్పుడు ఆ ఆదివారం మా తెలుగు బడి చూపిస్తానంటూ ఆహ్వానించేడు. మా చిన్నమ్మాయీ, నేనూ వెళ్ళాం. తీరా చూస్తే అది ఇస్కాన్ వారి చిన్న ప్రార్ధనా మందిరం. పెద్ద గుడి డవున్ టవునులో వుంటుందిట. ఒక పాత ఇల్లు కొని ప్రార్ధనా మందిరంగా మార్చేసారు. అందులో పూజలూ, ప్రార్ధనలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ, తెలుగు పాఠాలూ జరుగుతుంటాయిట. నా స్నేహితుడు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంతో బాటుగా అందులో బోధిస్తుంటాడు.
హరే క్రిష్ణ, హరే రామ భావజాలం గురించి మా మిత్రుడు నాకు వివరించాడు. నేనూ కొన్ని సందేహాలు తీర్చుకున్నాను. నాకు దేవుడి మీద విశ్వాసం లేకపోయినా కూడా తెలుగు వారు అప్పుడప్పుడు అలా కలుసుకోవడం, పరస్పర గౌరవంతో, అంకిత భావంతో సామూహికంగా అలా గడపడం నాకు నచ్చింది. మా అమ్మాయి కూడా తోటి పిల్లలతో తెగ ఆడుకుంది. నాస్తికులు, హేతువాదులూ ఎవరయినా అలా సమిష్ఠిగా గడపగలిగే అవకాశం వుంటే ఇంకా నచ్చేదేమో. నా చిన్నప్పుడు మా నాన్నగారు నాస్తిక సభలకు, శిక్షణా తరగతులకూ తీసుకువెళ్ళేవారు. అలా చక్కగా గడిపేసేవాడిని. గోరా, లవణం, సమరం లాంటి వారి సాంగత్యంలో ఎన్నో విషయాలు ఆకళింపు చేసుకునేవాడిని. ఈ దేశాలకు వచ్చాక నాస్తికులు దొరక్కా, ఆస్తికులతో తిరక్కా మా కుటుంబమూ, నేనూ రెంటికి చెడ్డ రేవడి అయ్యాం.
ఇక్కడ తెలుగు లేదా దేశీ నాస్తిక కూటములు జరిగే అవకాశం ఇప్పట్లో కానరావడం లేదు కాబట్టి పైగా స్పిరుచువాలిటీ మీద కాస్తంత ఆసక్తి కలుగుతోంది కాబట్టి సత్సంగాల కోసం మనస్సు బార్లా తెరిచి ఎదురుచూస్తూవున్నాను. సహజ మార్గం లాంటివి కొన్ని పరిశీలించాను కానీ వాటి మీద ఆసక్తి కలగలేదు. ఒషో మార్గం మీద బాగా ఆసక్తి కలిగింది కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఆ సమావేశాలు జరగడం లేదు. దాంతో ఆధ్యాత్మిక ఆర్తి తీరడం లేదు. చిన్మయ మిషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కానీ అదంటే అంత ఆసక్తి లేదు, అయినా సరే ప్రయత్నించాను కానీ మా ప్రాతంలో ఎవరయినా సత్సంగాలు నిర్వహిస్తున్నారేమో తెలియడం లేదు. చికాగోలోని చిన్మయ కేంద్రం మాకు గంట దూరంలో వుంటుంది. ఓసారి వెళ్ళి మా వైపు వాళ్ళు ఎక్కడ సమావేశం అవుతున్నారో కనుక్కోవాలి.
మా స్నేహితుని దగ్గరి నుండి కొన్ని చికాగో ఇస్కాన్ కాంటక్ట్స్ తెచ్చాను. వారిని కనుక్కొని మా వైపు హరే క్రిష్ణ సంత్సంగాలు కనుక జరుగుతున్నట్లయితే వెళతాం. అయా సమావేశాలల్లో నాకు కావాల్సినంత మేరకే సంగ్రహించి మిగతా విషయాల్లో మౌనంగా వుంటాను. ఈ భావజాలాన్ని పరిశీలించినప్పుడు వారు రాముడిని తొక్కివేసి క్రిష్ణుడినే బాగా పైకి తెస్తున్నారని అనిపించి ఆశ్చర్యపడ్డాను. మా మిత్రుడిని వివరణ అడిగాను కానీ అతను చెప్పింది అర్ధం కాలేదు. ఇదివరలో హరే రామ, హరే క్రిష్ణ అనేవారుట కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఈ ఉద్యమ నామాన్ని హరే క్రిష్ణ, హరే రామగా మార్చేసారుట. రాముడికి ఎంత అవమానం అని అనిపించింది. ఆ రాముడి మనస్సు గాయపడిందో లేదో కానీ నా మనస్సుకయితే చివుక్కుమంది. పోనీలెండి, దేవుళ్ళందరూ ఒక్కటేనని ఆస్తికులు అంటుంటారు కదా.
అక్కడ ఒక మాతాజీతో మాట్లాడుతూ ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటోలో వున్నప్పుడు అక్కడి ఇస్కాన్ టెంపుల్ దర్శించేవాడినని చెప్పాను. అప్పుడు మా ఆవిడకి తోడుగా వెళ్ళేవాడిని లెండి. ఒక్కసారి క్రిష్ణ మందిరానికి వెళితే చాలు - ఆ కొంటె క్రిష్ణుడు ఎప్పటికయినా తనవయిపు లాక్కుంటాడని ఆమె చెప్పింది. నిజమా!? అందుకేనా ఇటువైపు నాకు మనస్సు మళ్ళింది? నాలో నేను నవ్వుకున్నాను. ఏమో. పోనిద్దురూ.
అక్కడ ఒక మాతాజీతో మాట్లాడుతూ ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటోలో వున్నప్పుడు అక్కడి ఇస్కాన్ టెంపుల్ దర్శించేవాడినని చెప్పాను. అప్పుడు మా ఆవిడకి తోడుగా వెళ్ళేవాడిని లెండి. ఒక్కసారి క్రిష్ణ మందిరానికి వెళితే చాలు - ఆ కొంటె క్రిష్ణుడు ఎప్పటికయినా తనవయిపు లాక్కుంటాడని ఆమె చెప్పింది. నిజమా!? అందుకేనా ఇటువైపు నాకు మనస్సు మళ్ళింది? నాలో నేను నవ్వుకున్నాను. ఏమో. పోనిద్దురూ.
క్రిష్ణుడి చిలిపితనం, కొంటెతనం, గోపికలతో సరసల్లాపాలు అంటే నాకు భలే ఇష్టం కానీ ఈ ఇస్కాన్ వారు క్రిష్ణుడి ప్రణయాన్ని కూడా కోడికి ఈకలు పీకినట్లు పీకి అవి కూడా ఆధ్యాత్మిక చేష్టలే అని వీలయినంతగా మార్చేసే వుంటారు. ఇంకా స్పష్టంగా తెలియదు. తెలుసుకోవాలి. పోనీలెండి. నాకు అవసరమయిన ఆధ్యాత్మికత నాకు దక్కితే చాలు. మా ఇస్కాన్ మిత్రుడూ అదే అన్నాడు. అంగడిలో అన్నీ వుంటాయి. అందులో మనకు కావాల్సినవి మనం ఏరుకొని తెచ్చుకోవాలి. భావజాలాల్లో అయినా అంతే. అన్నీ సమిష్టిగా ఒకే దగ్గర దొరకాలంటే కష్టమే మరి.
అన్నట్లు పిట్స్‌బర్గ్ కి గంటన్నర దూరంలోని ఇస్కాన్ వారి న్యూ బృందావనం చాలా బాగుంటుందిట కదా. చాలా మంది చెప్పారు. ఫోటోలూ చూసాను. నాకూ వెళ్ళి చూసి రావాలని వుంది కానీ మాదగ్గరి నుండి 9 గంటల ప్రయాణం. మీలో ఎవరయినా ఆ క్రిష్ణ మందిరానికి వెళ్ళివచ్చేరా?
http://newvrindaban.com/
అన్నట్లు పిట్స్‌బర్గ్ కి గంటన్నర దూరంలోని ఇస్కాన్ వారి న్యూ బృందావనం చాలా బాగుంటుందిట కదా. చాలా మంది చెప్పారు. ఫోటోలూ చూసాను. నాకూ వెళ్ళి చూసి రావాలని వుంది కానీ మాదగ్గరి నుండి 9 గంటల ప్రయాణం. మీలో ఎవరయినా ఆ క్రిష్ణ మందిరానికి వెళ్ళివచ్చేరా?
http://newvrindaban.com/
మా మిత్రుడు ఆ భావజాలంలో పడిపోయి అందుకు తగ్గట్టుగా పూర్తిగా మాంసాహారం మానివేసాడు. అలా బాగా శుష్కించిపోయాడు. మిగతా విధాలుగా అయినా ప్రొటీన్ తీసుకొమ్మని సూచించి వచ్చాను.








