మన ఆకారాలు ఆపిల్ పండులాగా వుండకూడదు. గంట గ్లాసు ఆకారంలో వుండాలి.
నా బొజ్జ భారతం గురించి అప్పుడప్పుడు టపాలు వేస్తుంటాను కాదా. నేను నా గురించి సిగ్గుపడే విషయాల్లో అది ఒకటి. అది కంట్రోల్లో వుంచుకుంటాను మళ్ళీ పెంచేస్తుంటాను. నా బుర్రలో తినగానే ఇహ తిన్నావు చాల్లే అని హెచ్చరించి మూసుకునే ఫ్లాగ్/స్విచ్చు సరిగ్గా పనిచెయ్యడం లేదనుకుంటా. అలాంటి ఫ్లాగ్ పనిచెయ్యని వారే ఎక్కువగా ఊబకాయులవుతారు. మనకి ఊబకాయం లేదు గానీ కొద్దిగా పొట్ట వుంది. దాని గురించి కిందా మీదా పడుతూ పెంచుతూ తగ్గిస్తూ వుంటాను. తగ్గించినప్పుడు రెండో బెల్టు రంధ్రం, పెంచినప్పుడు మూడో రంధ్రం వాడుతుంటాను. ఒకటో రంధ్రమే వాడాలనుకునే ఆ చిరు ఆశ ఇప్పటికింకా తీరనేలేదూ.
ప్రస్థుతం రెండో రంధ్రంలో వున్నాలెండి. పని దినాల్లో సాధారణంగా రెండోదే వుంటుంది. ఆఫీసులో వుంటాను కనుక మితాహారం అమితంగా మెయింటేన్ చేస్తుంటా. వారాంతం ఇంట్లో వుంటే మా ఆవిడ ప్రేమతో ఎన్నో పనికిమాలిన వంటలు నాతో తినిపిస్తుంది. బయట తిన్నా బంధువులు మరియు స్నేహితుల ఇళ్ళల్లో తిన్నా లేక వారొచ్చినా మేము పెట్టి వారితో తినేది అంత ఆరొగ్యకరమయిన ఆహారం కాదు కాబట్టి మండే వచ్చేసరికి మూడో రంధ్రానికి తక్కువగా, రెండో రంధ్రానికి ఎక్కువగా నా పరిస్థితి వుంటుంది. ఎవర్నీ తిట్టలేక నన్ను నేను తిట్టుకుంటూ వారమంతా మళ్ళీ నా కడుపు నేనే ఎండబెట్టుకుంటాను.
ఏం, ఆ తినే చెత్తేదో తక్కువ తినొచ్చు కదా అని మీరు అంటారు. అంతేనా? అలా తక్కువ తినాలని మీకు తెలుసు, నాకు తెలుసు. నా బుర్రకేం తెలుసు? కడుపు నిండింది మహా ప్రభో - ఇహ చాలించండి అని అది గాఠ్ఠిగా మొత్తుకోవాలా? ముచ్చట్లలో పడి మొత్తంగా లాగించడమే కానీ దాని మెత్త మెత్తని మొత్తుకోళ్ళు నేను వినేదేమయినా వుందా?
అందుకే ఇలాక్కాదని నా బుర్రలో వుండే తిండి సిగ్నలును సరి చేసే ప్రయత్నాలు చేసాను. కొద్దిగా సైకాలజీ మరియు సైకియాట్రీ ల మీద అవగాహన వుంది కాబట్టి నా మనస్సు మీద నేను కొన్ని ప్రయోగాలు చేస్తుంటాను. అలాగే ఫుడ్డు సిగ్నలు మీద ఈమధ్య ఫోకస్ చేసి చూస్తున్నాను. ఆ ప్రయోగాలు ఏవో కాస్త ఫలిస్తున్నట్లే వున్నయ్. చాలా మంది ఆహార నియంత్రణ మీదనే ఫోకస్ చేసి నానా పాట్లు పడుతుంటారు కానీ ఆ ఆహార నియంత్రణ ఎందుకు సాధ్యపడటం లేదో ఆలోచించరు. మీరు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎక్కువగానే తిండి తినేస్తున్నారంటే బహుశా అది మీ మీ స్వీయ మానసిక నియంత్రణ లోపం కాకపోవచ్చు. ఎంత ఆహారం తింటున్నాము మరియు కడుపు నిండిందా లేదా అని మానిటర్ చేసి చెప్పే మెదడులోని వ్యవస్థ సరిగ్గా పని చేస్తూవుండకపోవచ్చు. ఊరకే మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా ఆ దిశగా కూడా దృష్టి సారించి చూడండి. అవి సరిచేసుకోవడానికి సులభమయిన మార్గాలు వున్నాయి. కొద్దిగా తినగానే ఇహ చాల్లేరా బాబూ అనిపిస్తాయి. చూస్తుంటే నేను మొదటి రంధ్రానికి వెళ్ళే రోజులు దగ్గర్లో, చాలా దగ్గర్లోనే వున్నట్టున్నాయి. బహుశా వచ్చే వారం ఆ మైలు రాయి దాటేస్తా అనుకుంటా.
మొత్తం మీద నేను ఇన్నాళ్ళూ నా పొట్ట గురించీ, బరువు గురించీ కిందా మీదా పడుతూనే అయినా మొదటి బెల్టు రంధ్రానికి వెళ్ళలేకపోయినా రెండో రంధ్రం దగ్గరే ఆగేసి మళ్ళీ వెనక్కు వస్తున్నా. మూడో దానికయితే ఇంతవరకు చేరుకోలేదు - అదీ నా సంతోషం. మీది కూడా ఏ రంధ్రమో చెప్పేసెయ్యండి మరీ. నో చీటింగ్! నాది చాలా చిన్న పర్సనాలిటీ. పిట్ట ప్రాణం అన్నమాట. నా ఎత్తు 5' 3'' మాత్రమే. మా ఆవిడ ఎత్తు 5' 1''. ఈ విషయంలో నాకు తగ్గ పెళ్ళాన్ని చూసుకున్నాలెండీ. నా ప్రస్థుత బరువు 53 కిలోలు. నేను కనీసం 52 వుండాలి, 58 కి పెరగకుండా వుండాలి. 55 సరాసరి. నా సరాసరి బరువు కంటే తక్కువే వున్నా కూడా నాలోని బరువు కొంత బొజ్జలో వుండిపోయింది. అది అలా వుంటే మధుమేహం, గుండె జబ్బులు వగైరాలు మనం వెల్కం చెప్పకున్నా వచ్చేసి తిష్ఠవేసే అవకాశాలు మెండు.
అందుకే నా పనిదినాల బరువు 50 కి తగ్గించేస్తే వారాంతం అయిపోయేలోగా 51 కి ఎక్కినా ఫర్వాలేదు. మరీ ప్రత్యేక సందర్బల్లో 52 అయినా ఆందోళన వుండదు. మన వయస్సు పెరుగుతున్నా కొద్దీ మెటబాలిజం తగ్గుతుంది కాబట్టీ, ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ కాలం జీవిస్తాము కాబట్టీ నేను కంట్రోల్డుగా బరువు తగ్గుతున్నా కాబట్టీ నా వయస్సు, ఎత్తుకి 52 కనీసం వుండాలి కానీ 50 కి దిగినా ఫరవాలేదు అనుకుంటున్నా. ఆ తరువాత 50 - 52 మధ్య ఫ్లక్చువేటు అయినా ఫర్వాలేదు కదా. ఏమంటారు?
గత కొన్నేళ్ళుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా బరువు 52 కి దిగలేదు. అందుకే మూల కారణాన్ని గుర్తించి దానిపై పడుతున్నాను. ఈ నా సోది అంతా ఎందుకు చెబుతున్నా అంటే నాలాగా కష్టపడేవారికి ఉపయోగకరంగా వుంటుందనీ. అలాగే నాలో నాకు స్పష్టత (క్లారిటీ) వస్తుందనీ, నాకు మోటివేటింగుగా వుంటుందని కూడా ఇలాంటివి వ్రాసుకుంటూవుంటాను.
నాది చివరి నుంచి రెండో రంధ్రం :) ఇక బరువంటే పొద్దునీడి ఓ రకంగా రాత్రి కూడు తిన్నాక ఓ రకంగా ఉంటుందిలేండి :-)
ReplyDelete@ భారారే
ReplyDelete(నాలాగే (!)) పెద్ద సైజు బెల్టు తెచ్చుకోండి. అప్పుడు ఇటునుండి రెండోది పెట్టుకోవచ్చు :)
ha ha ..:-)
ReplyDeletegood one.