మా ఊరి జ్ఞాపకాలు: వీరయ్య

జ్ఞాపకాలు అనగానే అలాంటివే అనుకోకండి. ఇది కాదు. మా ఇంటి జీతగాడుగా వుండేవాడు. గొల్లతను. అందుకే గొల్ల వీరయ్య అని పిలిచేవారం. చాలా ఏళ్ళుగా మా ఇంట్లో పనిచేస్తుండేవాడు. అమాయకుడు. భోళా శంకరుడు. మంచివాడు. చెప్పిన పనులన్నీ బుద్ధిగా చేస్తూ నమ్మకంగా పనిచేసేవాడు. అందుకే మాఇంటి వారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.

అప్పట్లో అతని పెళ్ళయ్యింది. పెళ్ళాం ఏమాత్రం బావుండేది కాదు. కాస్త బావున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని. ఏదయినా పని బడి వారి ఇంటికి వెళితే కూర్చో బాబూ అని మంచం వాల్చేవాడు.  మా వ్యవసాయం పనులు కూడా ఇతర జీతగాళ్ళతో కలిసి శ్రద్ధగా చూసేవాడు. మా పొలాలు, చేల దగ్గరికి పని చెయ్యడానికి వచ్చినప్పుడు ఇంటినుండి జొన్న గటక, మామిడికాయ పచ్చడి చద్ది కట్టుకొనివచ్చేవాడు (నోరూరుతోందండీ బాబూ) . అతను అది తింటూవుంటే ఆరు బయట గాలి కూడా తోడయ్యి నాకు బాగా ఆకలి వేసేది.

అది నా చిన్నప్పుడు కాబట్టి సిగ్గుపడకుండా అతని చద్ది నేనూ తింటానని మారాం చేసేవాడిని. ఛీ జీతగాడి బువ్వ నువ్వు తింటావా అని మా నాన్నగారు నన్ను ... కోప్పడకుండా సరే అనేవారు. అతను చిరునవ్వుతో, ప్రేమతో, శ్రద్ధగా అతని చద్ది నాకు వడ్డించేవాడు. చక్కటి రుచితో వుండే ఆ గటకా, మజ్జిగా రంగరించీ మామిడికాయ ముక్కను చీకుతూ వుంటే నా సామిరంగా... ఇహ నేను వర్ణించలేనండీ బాబూ.   చక్కటి ఆహ్లాదకరమయిన వ్యవసాయ వాతావరణంలో అది లొట్టలు వేసుకుంటూ లాగించేవోడిని. అలా అతని చద్ది చాలా సార్లు నేనూ లాగించాను.  వీరయ్యా, అన్నదాతా సుఖీభవా!

కొన్నేళ్ళకి మేము వ్యవసాయం తగ్గించడంతో అతను మా దగ్గర పని మానివెయ్యాల్సివచ్చింది. మేము భువనగిరికి మారాము. తాతయ్య, అమ్మమ్మలు మాత్రం ఊర్లోనే వుండేవారు. ఎప్పుడయినా ఊరికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద బస్సు స్టాండులో తనూ బస్సు కోసం వేచిచూస్తూనో లేక ఊర్లోనో  కనిపించేవాడు. ఆత్మీయంగా పలకరించుకునేవారం. మా కుటుంబం యోగక్షేమాలు శ్రద్ధగా కనుక్కునేవాడు. ఈమధ్య నేను ఇండియాకి వెళ్లడమూ, అందునా మా స్వస్థలానికి వెళ్లడమూ తక్కువయ్యింది కాబట్టి అతన్ని చూడక చాలా ఏళ్ళవుతుంది. ఎలావున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ వున్నాడో తెలియదు. ఈసారి మా అమ్మగారితో మాట్లాడినప్పుడు అతని వివరం కనుక్కోవాలి. వీలయితే ఈసారి వెళ్ళినప్పుడు కలిసి ఏదయినా చక్కటి బహుమతి ఇవ్వాలి.

అతని భోళత్వానికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకసారి మా అన్నయ్య మా ఊరి బస్సుస్టాండులో  బస్సుకోసం ఎదురుచూస్తూ ఒక మూటని గమనిస్తూ వుండమని వీరయ్యకి చెప్పి దగ్గర్లో ఎక్కడికో వెళ్ళాడంట. వెళ్ళి వచ్చి చూసేసరికి మూటమీదినుండి ఒక ఎడ్ల బండి వెళ్ళినట్లుగా కనపడిందంట. ఏంటి వీరయ్యా నువ్వు అది గమనించలేదా అని మా అన్నయ్య అడిగితే గమనిస్తూనే వున్నాను కదా సార్ అని అన్నాడంట.  అతని జవాబు విని మా అన్నయ్యకి కోపం రాకపోగా బిగ్గరగా నవ్వేసేడంట. ఈ విషయం విని మేమందరమూ నవ్వుకున్నాం. ఇలాంటిది ఏదో కథలో విన్నప్పుడు నిజంగా కూడా అలాంటి అమాయకులు వుంటారనుకోలేదు.

16 comments:

  1. అబ్బా..., నాకు వేడి వేడి అన్నం లో ముద్దా పప్పు, ఆవకాయ, కాస్త నెయ్యి వేసుకుని తినాలనిపిస్తోంది... అర్జెంట్ గా...

    ReplyDelete
  2. మా ఊళ్ళో కూడా ఓ పనోడు ఉన్నాడు. అప్పుడప్పుడూ వాడిపేరునీ నా పేరునీ కన్ప్యూసు అవుతుంటారు జనాలు. వాణ్ణి పతోడనీ నన్ను పనోడనీ అంటుంటారు.

    వెలమకన్ని పతోడు

    ReplyDelete
  3. పెళ్ళాం ఏమాత్రం బావుండేది కాదు. కాస్త బావున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని.

    పాపం మీరే ఉద్దేశ్యం తో అన్నారో కానీ.. ఏమో మిమ్మల్ని ఎలా నమ్మగలం... మీరసలే.. దొంగ నా__ కిటికీ...(హై హై నాయకా సినిమా జోక్)

    నేను ఒక సారి ఒక మంగలి వాడికి. పెళ్ళి మైల ప్రోలు కిచ్చిన మూట మొటార్ సైకిల్ పై తీసుక పోతుంటే బండీ ఆగి .. నెట్టాల్సి వచ్చినప్పుడు.. మధ్యలో మా నాన్న చూసి... ఇంటికొచ్చాక.. మంగలోడి మూట మోస్తావా(మాది రెడ్డి కులం లెండి) అని అందరి ముందు కొట్ట బోతే.. పుస్తకాలకి.. రియాలిటీ కి ఎంత తేడా ఉంది అనుకున్నా...

    కాకపోతే కులతత్వాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నా... దాని లాభాలు దానివి..

    ReplyDelete
  4. @ మిర్చి
    మీ పేరు చూసినా నోరు ఊరుతుందండీ బాబూ.

    @ (వెలమకన్ని) పతోడు
    పతోడూ, వెలమకన్ని పతోడూ వేరు వేరా?

    @ కాయ
    ఇదో మీరు నా (మానసిక) శీలాన్ని శంకిస్తున్నారు!

    కులతత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? బావుంది. మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. పెళ్ళయ్యాక మా వదిన గారి ప్రభావం ఎక్కువై మీలాగే సమర్ధించుకొని కులం పేరు చెప్పుకోవడం మొదలెట్టారు.

    ReplyDelete
  5. "మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. పెళ్ళయ్యాక మా వదిన గారి ప్రభావం ఎక్కువై మీలాగే సమర్ధించుకొని కులం పేరు చెప్పుకోవడం మొదలెట్టారు."

    శరత్ గారు మీరు అక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మీరు కులం లేదు అన్న ఒక్క మాటపై నిలబడగలిగారు. కాని అదే ఇక్కడ ఉంటే కష్టమే... హెచ్చు తగ్గుల గోల.. లేకపొతే పిల్లల చదువులకోసం, ఎదో ఒక కారణానికంటూ మన కులం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకులం చెప్పను అని మడి కట్టుకుని కూర్చుంటే కుదిరేది కాదు.. పోని నాకంటూ ఈ విషయంలో కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలు ఉన్నాయి అని గిరి గీసుకుని ఉన్నామనుకొండి మన ఇగో ని ప్రశ్నించేదాకా వెళ్తారు, అవహేళనతోటో... అతితెలివితోటో.. నిన్న మొన్నటిదాకా ఇవన్ని అనుభవించినదానినే నేను. అందుకే అవతలి వాళ్ళు అంత కుల వివక్షతో మాట్లాడుతున్నప్పుడు.. మనకంటూ ఒక కులాన్ని ఇచ్చిన మన పెద్దవాళ్ళ పెద్దరికాన్నో లేదా ఆ కులాన్నో నిలబెట్టడానికి తప్పదనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనిషిని కులాన్ని బట్టే అంచనా వేస్తారు లెండి.. రాతలో చదువులో పనికిరావు.. :-)

    ReplyDelete
  6. @ రమణి

    మీ బ్రాహ్మిణ్ టపా చదివాను :)

    మీరు ఒక్క కులం చెప్పుకోనందుకే అన్ని కష్టాలు వచ్చిపడుతున్నయ్యంటే నా 'స్వ' కులం చెప్పుకుంటూ నేను ఎన్ని కష్టాలు పడవచ్చో ఊహించగలరా?! అవేవీ నేను ఇబ్బందులు అనుకోను. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా నా నిబద్దత, ఆత్మ విశ్వాసం పెరుగుతుందే కానీ నేను పలాయనం చిత్తగించను. కొన్ని సిద్ధాంతాలకు, భావాలకు కట్టుబడి వుండాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం మిగతావారికీ, మనకీ తేడా చూపించగలిగేది. నేనయితే పనికిమాలిన విమర్శలు, ఇబ్బందులు పట్టించుకోనే పట్టించుకోను. వాటికి విలువ ఇస్తూ పోతే అవి మనల్ని మార్చేస్తూ పోతాయి. మనం మరో రకంగా సమర్ధించుకుంటూ మన ఉన్నత ఉద్దేశ్యాలని చులకన చేసుకుంటున్నామూ అనుకుంటే మనలో ఆత్మ విశ్వాసం తగ్గుతున్నట్టే అర్ధం. మన జీవితం ఇతరుల కోసమా లేక మన కోసమా అన్నది చూసుకోవాలి. నలుగురితో కలిసి నారాయణా అనడానికీ, పది మందితో కలిసి గోవిందా అనడానికీ మనలో పెద్ద పెద్ద వ్యక్తిత్వాలు అవసరం లేదు. సగటు మనస్థత్వాలు చాలు.

    నేను ఇండియాలో ముప్పయి మూడేళ్ళకు పైగానే వున్నాను. తరచుగా భారత్ వస్తుంటాను. నాకెప్పుడూ కులం విషయమై ఇబ్బందులు ఎదురుకాలేదు. నా పిల్లలకూ కాలేదు. బహుశా నేనూ సమర్ధించుకోవడం మొదలుపెడితే అప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవేమో. బహుశా నాకో కులం వుండేదని నేను మరచిపోయినందువల్ల కావచ్చు - ఆ కోణాలు నేను పట్టించుకోలేదనుకుంటా. రాజీపడటం మొదలెడితే ప్రతి విషయంలో రాజీ పడుతూ ఎంచక్కా సగటు మనుషులం అయిపోవచ్చు. అందులో సందేహం లేదు. అప్పుడు మనకంటూ స్వంత వ్యక్తిత్వం అవసరంలేదు.

    ఎప్పుడన్నా సరదాగా, లైటర్ వెయినులో నా మాజీ కులం కులం గురించి చెప్పివుండవచ్చు, ఇతర కులాల గురించి వ్రాసివుండవచ్చు కానీ సీరియస్సుగా నాకెప్పుడూ అది ఒక సమస్య కాలేదు. ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను. ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి కాబట్టి మీ అభిప్రాయన్నీ గౌరవిస్తున్నాను.

    ReplyDelete
  7. గురువు గారు,
    రమణి గారు చెప్పినట్లు కాకుండా,
    ఏ కులం వాడు అయినా పైకి వచ్చిన వాడిని అందరూ గౌరవిస్తారు.. కాక పోతే ఉన్నత కులపు(ఉన్నత అని ఎందుకు అనాలి.. ఇంగ్లిష్ లో ముందు బడిన కులం అనుకుందాం) వాడు పైకి రాక పోయినా కొంత మంది అయినా గౌరవిస్తారు.

    ఇప్పుడు కులతత్వం పెంచుకోవటం ఎందుకు అంటే.. కావల్సిన వాళ్ళు అంతా ఎవరి లోకం లో వాళ్ళు ఉన్నారు... అప్పుడప్పుడూ మీటింగు లు పెట్టుకోవటానికి.. మళ్ళీ దగ్గరవటానికి.. అంతే.. ఏదో గొప్ప ఫీల్ అవటానికి కాదు....

    టాంక్స్

    ReplyDelete
  8. శరత్, ఇంతకు మునుపు కూడా మీరిలాంటి చిన్నప్పటి పల్లెటూరి జ్ఞాపకాలు రాస్తే చదివిన గుర్తు. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసిన గుర్తు. మీరు మీ జ్ఞాపకాలౌ తుట్టెని అప్పుడప్పుడూ కదులుస్తూ మరిన్ని ఇటువంటి జ్ఞాపకాలు రాయమని మనవి. వీరయ్య బోళాతనం (బోళాత్వం??) చూస్తే చిన్నప్పుడు బొమ్మరిల్లు పత్రికలో వెర్రి వెంగళప్ప కథలని వచ్చేవి - అది గుర్తొచ్చింది.

    @ కాయ .. పెళ్ళి మైల ప్రోలు అంటే వివరించ గలరు.

    @ రమణి .. భలేవారే! అమెరికా తెలుగువారిలో కుల ప్రస్తావన ఎక్కువే.

    ReplyDelete
  9. :-) శరత్ గారు : నేను రాసిన టపాలోనే చూడండి నేను వెళ్ళినచోట్ల చాలా మందికి అసలు నేనెవరో కూడా తెలీదు.. "మీరు మనవాళ్ళా?" అని అడిగారని.. :-) నేను పుట్టినప్పటినుండి ఉన్నది ఇక్కడే.. ఈ ఊర్లోనే.. బాల్యం, చదువు, పెళ్ళి అన్ని ఇక్కడే.. అలాంటిది నాతోపాటు ముఖపరిచయమయినా సరే.. ఇన్నేళ్ళు ఉన్నవాళ్ళు ఇలా అడిగారంటేనే అర్థం చేసుకొండి నెనెంత కఛ్చితంగా ఉండేదాన్నో.. ఇప్పటికి నా తోటివారికి చాలామందికి తెలీదు నేను ఫలనా అని.. (ఇప్పుడు లోకమంతటికి తెలిసింది లెండి నా బ్లాగు ద్వారా)

    సమర్థించుకోడం కాదండి.. పరిస్థితులు మన వ్యక్తిత్వానికి కులం అడ్డుగోడలా కట్టేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కులం ఉనికిని చాటడం.. మీరు ఇండియాలో 33 యేళ్ళు ఉన్నా మీకా పరిస్థితి రాలేదు అంటున్నారు.. నాణేనికి ఇంకోవైపునుండి రండి.. బహుశా మీ శ్రీమతిగారి ద్వారా తెలుసుకుని మీ దగ్గర మౌనంగా ఉండొచ్చు కదా మీ అభిప్రాయాలకి కట్టుబడి.. (ఇది నా ఊహ మాత్రమే).. నలుగుర్లో నారయణ పదిమందిలో గోవిందా.. :-) సర్దుకుపోవాల్సి వచ్చినప్పుడు సగటు మనిషి మసస్థత్వం అలవర్చుకోడం తప్పదు శరత్గారు. ఎప్పుడో ఒకసారి సర్దుకుపోడానికో , రాజి పడడానికో స్వంత వ్యక్తివాలు కుదవ పెట్టాల్సిన అవరం లేదు లెండి.. నేను సర్దుకుపోతున్నాను అన్న విషయం ఎవరివల్ల జరిగిందో వాళ్ళు అర్థం చేసుకుంటే నా వ్యక్తిత్వం ఇంకొంచం పరిపక్వత చెందుతుంది కాదంటారా?

    నాతో ఏకీభవించకపోయినా.. నా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నందుకు థాంక్స్.. నా ఈ అభిప్రాయం ఎవరిని ఇబ్బంది పెట్టనంతవరకే .. ఈ కులం ఉనికి అనేది ఇబ్బంది పెడ్తుంది అంటే మారిపోతుంది కూడా.. సప్తపది సినిమాకి సంబంధించి నేను రాసిన పోస్ట్ చదివారా? అది కులానికి సంబంధించే.. మార్పు అనేది కూకటి వేళ్ళనుండి రావాలి కాని కొమ్మలనుండో, ఆకులనుండో వస్తే వేర్లనుండి మళ్ళీ మళ్ళీ వచ్చేవే ఈ కులాలు, అచారాలు.. :-)

    http://sumamala.blogspot.com/2008/07/blog-post_21.html

    ప్రేమ వివాహం, కులం విషయంలో నా అభిప్రాయాలు ఇందులో కొంతవరకే చెప్పాను.

    ReplyDelete
  10. @ కాయ, రమణి
    పోనీలెండి. మనస్సుల్లో మానవత్వం అంటూ వుండాలే కానీ అది వున్నప్పుడు ఏది వున్నా లేకున్నా ఒక్కటే. పాత కులాలు పోతే కొత్త కులాలు పుట్టుకొస్తాయి. బ్లాగుల్లో కూడా కొత్త కులాలు పుట్టుకొచ్చాయి కదా. అవే ప్రమదావనం, ప్రమాదవనం, ప్రమోదవనం.

    @ కొత్తపాళీ
    భోళాత్వం నేను చేసిన ప్రయోగం లెండి :)

    ఎన్నో వ్రాస్తూ వుండాలనుకుంటాను కనుక ర్యాండంగా అప్పుడప్పుడు ఇవీ వచ్చేస్తుంటాయి. ఉదాహరణకు బోర్డర్ కతలు (కథలు) పేరిట నా బొర్డర్ దాటింగు (క్రాసింగు) అనుభవాలు వ్రాయాలని ఎన్నాళ్లనుండో అనుకుంటూనేవున్నా. కొన్ని చక్కని అనుభవాలు వున్నయ్.

    మా దగ్గరి పెళ్ళిళ్లల్లొ కూడా మైల ప్రోలు పాటించేవారు కానీ గుర్తుకులేదు. కాయ చెబుతారేమో చూద్దాం.

    ReplyDelete
  11. కొత్త పాళీ,
    అంటే. నా చిన్న బ్రెయిన్ కి .. గుర్తున్నదేమి టంటే... పెళ్ళికి ముందు .. పెళ్ళి కూతురిని తమకు తెలిసిన వారిలో ఉన్న పెద్ద మనుషులతో అంటే కొంచెం వయసు పై బడిన వారితో పెళ్ళి లాంటి తతంగం చేస్తారు... దాన్నే మైల ప్రోలు అంటారని నాకు గుర్తు... ఇంకొంచెం చేరిస్తే... పెళ్ళికి ముందు పెళ్ళి కూతురు వేసిన వెధవ్వేశాలని ముసలోడి తో చిన్న తతంగం లాంటి కార్య క్రమం ద్వారా అంటిన మైల ( మలినత్వం ?) ని పోగొట్టటం అని నా అభిప్రాయం...

    ReplyDelete
  12. @ కాయ

    మాదాంట్లో అలా ముసలాడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడం చూళ్ళేదు కానీ నాకు గుర్తుకువచ్చినదేమంటే ఒక పెద్ద కర్రకి (మైల్ కర్రకి) ఇచ్చి పెళ్ళి చేస్తారనుకుంటా.

    ReplyDelete
  13. గారు మిస్ అయ్యింది .. పై కామెంట్ సంబోధనలలో .. ఏమనుకోకుండా గౌరవించి నట్లే భావించగలరు

    ReplyDelete
  14. పెళ్ళి కాదు... చిన్న తతంగం అంతే...

    ReplyDelete
  15. @కాయ, శరత్ .. నెనర్లు. నేనెక్కడా ఈ విషయం వినలేదు, చదవలేదు. పూర్వకాలం ఐదురోజులు చేస్తుండిన పెళ్ళిళ్ళలో ప్రోలు అని ఒక భాగం ఉండేది, కానీ దాంట్లో ఏమి జరుగుతుందో కూడా ఐడియా లేదు.

    @ శరత్ .. బోళాత్వం :) ఈ మధ్య నా బ్లాగులో ఎవరో వ్యాఖ్య రాశారు "అందత్వం" అని రాశారు, సౌందర్యం అనే అర్ధంలో.

    ReplyDelete