"యండమూరి, మల్లాది, సూర్యదేవర మొదలయిన వారంతా ప్రొఫెషనల్ రచయితలు" అన్నాడు కుమార్ తన గ్లాసులోని విస్కీని ఓ గుటక మింగి నాలుక చప్పరిస్తూ. కుమార్ ఓ చిన్న రచయిత. అడపాదడపా అతని కథలు పత్రికల్లో పడుతుంటాయి. అతని కథల మీద చర్చ నడుస్తోందిప్పుడు.
ప్లేటులో వున్న కోడి తొడ ముక్కకు మరింత శోర్వా అద్దుకొని తీసుకుంటూ "ప్రొఫెషనల్ రచయితలకూ, మామూలు రచయితలకూ తేడా ఏంటో" అని అడిగాడు శంకరం. అతగాడికి ప్రతీదానిమీదా చిరు ఆసక్తి. అందుకే ఆసక్తిగా చిరు ప్రశ్నలు వేస్తుంటాడు.
నిమ్మకాయ ముక్కను కోడికూర మీద పిండుతూ శంకరానికి బదులిచ్చాడు కుమార్. "ప్రొఫెషనల్ రచయితలు అంటే డబ్బు సంపాదనే ముఖ్యంగా వ్రాసేవారు అనేది ఒక నిర్వచనంగా చెప్పుకోవచ్చు. చాలామంది రచయితలు తమ ఆత్మ సంతృప్తికోసమనో, గుర్తింపు కోసమనో ముఖ్యంగా రచనలు చేస్తుంటారు"
"రచనల మీద డబ్బు సంపాదించడం చేతగాని రచయితలు అందరూ తమ ఆత్మ సంతృప్తి కోసం వ్రాస్తుంటామని చెప్పుకుంటారనుకుంటా" భళ్ళున నవ్వుతూ ఎన్నడూ ఏ రచనా చదవని చంద్రారెడ్డి అన్నాడు. చూడబోతే అతనికి కొద్దిగా మందు ఎక్కిందిలాగానే వుంది.
అతని మాటలని పట్టించుకోకుండా కుమార్ తన వివరణ కొనసాగించాడు. "ఇంకో తేడా కూడా వుంది. వీరు తమ మానసిక సంసిద్ధత అంటే మూడ్ గురించి పట్టించుకోకుండా వ్రాయగలిగిన వారయి వుంటారు"
చంద్రారెడ్డి గ్లాసులోకి విస్కీ వంపుతూ హోస్టు అయిన గిరి "మాంఛి రచన చెయ్యాలంటే మందు, విందూ ముందు వుండాలంటారు కదా" అన్నాడు సన్నగా నవ్వుతూ.
"అలాంటివి ప్రొఫెషనల్ రైటర్స్ పెట్టుకుంటే పని కాదు. వారు ఎలాంటి మూడ్ లో వున్నా రాబోయే సంచిక కోసం సీరియల్ భాగం వ్రాస్తూపోవలిసిందే"
"నిజంగానా! హ్మ్. ఎంత కష్టం. మనస్సులో ఏం జరుగుతున్నా మరుగున పెట్టి, మరిచేసి పాఠకుల కోసం అంతగా సృజించాల్సిన అవసరం వుందంటారా? ఒక రచయితగా దీనికి సమాధానం మీరే చెప్పాలి" అన్నాడు నిమ్మబద్ద నోట్లో పెట్టుకొని పీల్చుతూ శంకరం.
సన్నగా నవ్వాడు కుమార్. "అంతే కాదు, ప్రొఫెషనల్ రైటర్ అన్నవాడు ఎప్పుడయినా, ఏ పరిస్థితిలోనుండి అయినా అయినా, ఉన్నపళంగానయినా ఒక కథ సృష్టించగలిగిన వాడయి వుంటాడు"
గ్లాసులోని విస్కీనంతా సిప్ చేసి గ్లాసు బల్లమీద పెట్టాడు చంద్రారెడ్డి. "నేను నమ్మను. నేను కథలూ, సీరియల్ళు చదవకున్నా రచయితలు ఎలా వ్రాస్తారో నాకు తెలుసు. ముందు స్టొరీ లైన్ ఆలోచించుకోవాలి, దాన్ని డెవెలప్ చెయ్యాలి, దాంట్లో ట్విస్టులు పెట్టాలీ ఇలా ఎంతో వుంటుంది. ఉన్నపళంగా కథ వ్రాసెయ్యమంటే ఎలా కుదురుతుంది. కుదరదు" అతని మాటలు కొద్దిగా ముద్దముద్దగా వస్తున్నాయి.
"అప్పటికప్పుడే కథలు సృష్టించగలగడమా! ఏదీ శూన్యం లోనుండి విభూతి సృష్టించినట్లా?" సన్నగా నవ్వాడు గిరి.
"అంటే ఇప్పుడు ఈ మందు పార్టీ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు దీనిమీద కూడా ఒక కథ క్రియేట్ చెయ్యొచ్చా?" ఆసక్తిగా ముందుకు వంగుతూ అడిగాడు శంకరం.
"ప్రొఫెషనల్ రైటరుకి అలాంటి సామర్ధ్యం వుండే తీరుతుంది"
"వాళ్ల సంగతి పక్కన పెట్టండి. మీరూ రచయితేగా. ఇప్పటికిప్పుడు మనమీద ఒక కథ చెప్పండి చూద్దాం." అని గద్దింపుగా అన్నాడు చంద్రారెడ్డి.
అతనికి మందు ఎక్కి గద్దింపుగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మాటలకు కుమార్ నొచ్చుకోలేదు. "నేనేమీ పెద్ద రైటర్ని కాదు కదా..." అని నసిగాడు.
"ఏం పర్వాలేదు సార్. మాకోసం ప్రయత్నించండి" అని విజ్ఞప్తి చేసాడు శంకరం.
"కథ అంటే మందు దాని దుష్పరిణామాలూ అని సందేశాలిచ్చే సాంఘిక కథలు మాకు అక్కరలేదు. ఫుల్లు సస్పెన్స్, థ్రిల్లూ వుండాలి" అని బల్లగుద్దాడు చంద్రారెడ్డి.
"హ్మ్. ఇప్పటికిప్పుడు మనమీద సస్పెన్స్, థ్రిల్లు కథ" అంటూ సాలోచనగా ఆ పార్టీ హోస్ట్ గిరి వైపు చూసాడు.
గిరి కూడా కుమారుని " ఓ మాంఛి కథ వదలండి సార్" అంటూ ప్రోత్సహించాడు.
నిమ్మకాయ ముక్కని కోడి మాంసం ముక్క మీద రాస్తూ కుమార్ ఆలోచించసాగాడు. అంతలోకే ఒక్కసారే కుమార్ అలర్టుగా కూర్చున్నాడు.
ఏమయ్యిందండీ అని కుమార్ ఉలికిపాటును గమనించి అడిగాడు శంకరం.
"ఎక్కడో దూరం నుండి ఓ ఆర్తనాదం వినపడుతోంది" అంటూ చెవులు ఇంకా రిక్కించాడు.
"ఏంటి సార్. కథ చెప్పమంటే జోకులు చెప్తున్నారు?" అని గలగలా నవ్వాడు చంద్రారెడ్డి.
"జోకు కాదు. కుమార్ అన్నది నిజమే. ఎక్కడినుండో దూరంగా ఎవరో
హెల్ప్ మీ అని దీనంగా పిలుస్తున్నారు" అని దిగ్గున నిలబడ్డాడు గిరి.
(ఇంకా వుంది)