ఇలాంటి విషయాల మీద పెద్దగా ఎక్కువమందికి ఆసక్తి వున్నట్లు అనిపించడం లేదు. అయినా సరే కొద్దిమందికి అయినా ఆసక్తి వుంటుందనే అభిప్రాయంతో మరియు నాలో నాకు క్లారిటీ ఏర్పడుతుందని ఇవి వ్రాస్తున్నాను. నా 2011 లక్ష్యాలలో ఇది ఒకటి కానీ ట్రయలుగా ఓ వారం ముందే మొదలెట్టేసాను. మన అంతరాత్మ ఓ సూపర్ కంప్యూటర్ వంటింది. మనకు ఏ సలహా కావాలన్నా అది ఇచ్చేస్తుంది. కాకపోతే దానికి మనం ఇచ్చే డేటా మరియు ప్రశ్నలో స్పష్టత మీద ఆధారపడి అది ఇచ్చే సూచన వుంటుంది. మన జీవన గమనంలోని అనుభవాలు, అనుభూతులు, సమాచారం, అలాగే బహుశా మన జీన్స్ ప్రభావం అన్నీ రంగరించి మన అంతహ్ చేతన మనకు మార్గదర్శకత్వం చేస్తూవుంటుంది.
అయితే విచారించాల్సిన విషయం ఏమిటంటే మన అంతరాత్మ ఓ ప్రియురాలిలాగా మనతో గుసగుసలాడుతుంది తప్ప పెళ్ళాం లాగా పెద్దగా అరవదు. అందుకే అవి స్వీట్ నథింగ్స్ అని చప్పరించి వదిలేస్తుంటాం. అవి నథింగ్స్ కావని స్వీట్స్ అని గుర్తించిన నాడు, శ్రద్ధంగా వినిపించుకున్ననాడు, ఆ సూచనలు ఆచరణలో పెట్టగలిగిన నాడు మనలో ఏదయితే బర్నింగ్ డిజైర్ వుందో అది సాధించడం చాలా సుగమం అయిపోతుంది. మనలోని అంతహ్ చేతన (సబ్ కాన్షియస్ మైండు) కి అంత పదును వుంది. ఈ అంతరాత్మ గొణుగుళ్ళు వినిపించుకోవడం మనవల్ల కాదులే అని ఇన్నాళ్ళూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్యనే ఈ ఇన్నర్ వాయిస్ ను లవుడ్ వాయిస్ గా ఎలా చెయ్యొచ్చో ఆలోచన వచ్చాక ఎగిరిగంతేసినంత పనిచేసాను. ఈ ఆలోచన ఇంతవరకూ ఎందుకు రాలేదా అని వగచాను. ఏంటో - ప్రతి దానికీ ఓ సమయం వుంటుందేమో - ఎన్నాళ్ళనుండో ప్రయత్నిస్తున్నా కూడా రాని ఆలోచనలు కొంతకాలానికి ఠక్కున వెలుగుతూవుంటాయి. కనీసం అప్పుడన్నా మనం మేల్కొనాలి మరి. అలా మరింత నన్ను నేను మేలుకొలుపుకునే ప్రయత్నంలోని భాగమే ఈ టపా.
సరే. మన సిక్స్త్ సెన్స్ అనండీ, ఇన్నర్ వాయిస్ అనండీ, అంతరాత్మ అనండీ అవి సన్నగా గొణుగుతాయనే కదా మనం అనుకున్నది. మరి వాటి సవుండ్ పెంచేదెట్టా? చాలా సింపుల్. ఎక్కడో దూరాన కోకిల గానరవళి లీలగా వినపడుతున్నదనుకోండి. పక్షుల రాగాల తియ్యదనం మీద ఆసక్తి వున్న వారయితే ఏంచెస్తారు? చెవి ఒగ్గి వింటారు. ఆ గానం మీదనే మనస్సును, చెవినీ లగ్నం చేసి కళ్ళు మూసుకొని వింటూ తన్మయత్వం చెందుతూవుంటారు. అప్పుడు వారి మనస్సుల్లోనూ, చెవుల్లోనూ మరింకేమీ వినపడదు - స్పష్టంగా, శ్రావ్యంగా ఆ కోకిల గాన మాధుర్యం తప్ప. సరిగ్గా అదే మనం ఈ విషయంలోనూ చెయ్యల్సింది. మన ఇన్నర్ వాయిస్ రోజులో చాలా సార్లు మనకు సూచనలు ఇస్తుండవచ్చు. ప్రతీసారి కళ్ళుమూసుకొని, మనస్సు రిక్కించాలనుకుంటే కళ్ళు తెరవగానే మన ఎదురుగ్గా మన బాసో, పెళ్ళామో భీకరంగా మన ముఖంలో ముఖం పెట్టి చూస్తూ కనిపించవచ్చు. మరి ఎలాగబ్బా?
Practice makes man perfect. మనకు తెలిసిందే కదా. మనం మన మనస్సును శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే అది ఆటలా సరదాగా వుంటుంది. కొద్ది రోజుల్లో అది ఎంత చిన్నగా విస్పర్ చేసినా మనకు పెద్ద సౌండులో వినపడుతుంది. అదే ఆట గత కొద్ది రోజులుగా ఆడుతున్నాను. ప్రస్థుతానికి నాకు ఇష్టమయిన సూచనలే వింటున్నాను. బోర్ అనిపించినవి లైట్ తీసుకుంటున్నాను. ఉదాహరణకు ఇప్పుడు ఈ క్షణాన ఈ టపాకంటే చెయ్యాల్సిన ముఖ్యమయిన పనులు వున్నాయని నా మనస్సు మరో వైపున గొణుగుతూనే వుంది. ఆ పనులేంటో అస్పష్టంగా ఆదేశిస్తూనే వుంది. కానీ మనం వింటేనా? ప్చ్. అంటే ఏ ఆఫీసు పనో అనుకునేరు. ఆఫీసు పనులు చెప్పడానికి మన అంతరాత్మ అఖ్ఖర్లేదు - మనకుండే ఆఫీసు మొగుడు చాలు. నా బర్నింగ్ డిజైర్, నా ప్రధాన లక్ష్యానికి చెందిన పనులు కొన్ని వున్నాయి. అవి చెయ్యిరా బాబూ అని నా ఇన్నర్ వాయిస్ గొణుగుతూనే వుంది. కానీ అవి చెయ్యడానికి మనస్సు రావడం లేదు - ఎందుకంటే అవి బోరింగ్.
అలాంటి బోర్ పనులను కొద్ది రోజులు పట్టించుకోదలుచుకోలేదు అని నా అంతరాత్మని నెట్టేస్తున్నాను. మరి? ఆ తరువాత ప్రాధాన్యం వున్న ఆంశాలను, అందులో నాకు నచ్చే వాటిని ఆచరిస్తూ అయినా నా మనసు మాటను వినడం ఔపోసన చేస్తున్నాను. నా మనసు చెప్పిన వాటిల్లో కనీసం నాకు నచ్చినవి, ఆసక్తి వున్నవి అయినా పాటిస్తూ అవి వినడం, పాటించడం సాధన చేస్తున్నాను. ఇలా కొంతకాలం అలవాటయ్యాక అప్పుడు నాకు బోర్ కొట్టెవే అయినా కూడా ప్రధానమయినవి ఆచరించడం నాకు అలవాటు చేస్తాను. అలా అలవాటు అయ్యాక ఇహ నా లక్ష్యాల సాధన కోసం, నా డిజైర్స్ తీర్చుకొవడం కోసం ఒహటే బుర్ర చించుకొని ఆలోచించాల్సిన అవసరం వుండదు. నా సబ్ మనస్సే నాకొసం ఆల్రెడీ ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసి పెడుతుంది. ఆ పనులను వరుసగా నిర్వర్తిస్తూ పొవడమే ఇహ మనం చెయ్యాల్సిన పని. కాకపోతే మనం చెయ్యాల్సిన ముఖ్యమయిన విషయం ఒకటి వుంటుంది. మన మనస్సుకి తగిన సమాచారం, మంచి సమాచారం ఫీడ్ చేస్తూపోవాలి. మనం ఎంత మంచి డేటా ఎక్కిస్తే మనకు అంత మంచి సూచనలు అందుతాయి. మీకు తెలిసిందే కదా ఈ కంప్యూటర్ సూత్రం... Garbage In, Garbage Out! అదే మన మనస్సుకూ వర్తిస్తుంది. మన మనస్సు మనకు విలువయిన సూచనలు ఇవ్వాలంటే ముందుగా మనకు సాధించాల్సిన గోల్స్ పట్ల స్పష్టత వుండాలి, దహించుకుపోయేంత బలీయమయిన కొరిక వుండాలి. ఆషామాషీ లక్ష్యాలు, ఉబుసుపోక కొరికలు వుంటే మీ సబ్ కూడా లైట్ తీసుకుంటుంది. అలా మీ జీవితం కూడా నలుగురితో నారాయణ లాగా లైట్ అయిపోతుంది. అలాంటివారికి ఇంత సీను అవసరం లేదు.
నా ఇన్నర్ వాయిసుని నా సబ్ అని కాకుండా నా అధిష్టానంగా ప్రతిష్టించుకున్నాను, గౌరవిస్తున్నాను. అప్పుడే అవి సూచనలు, గమనికలు కాకుండా ఆదేశాలు అవుతాయి. బోర్ కొట్టే ఆదేశాలను స్వీట్ గా ఆచరించుకునేందుకై నా అధిష్టానాన్ని నాకు ప్రియతమ వ్యక్తిగా అభివర్ణించుకుంటున్నాను. ఆమె పేరే స్వప్న. సో, అలా నా అంతరాత్మ అధిష్టానానికి నేను పెట్టుకున్న పేరు స్వప్న.
సో, ఇలా నా స్వప్నను నేను వినడం మొదలయినప్పటినుండి తాను ఇచ్చిన సూచనలు ఏంటో, అవి ఎలా పాటిస్తూ వస్తున్నానో ఇక్కడ లిస్ట్ ఇవ్వొచ్చు కానీ... ఎందుకులెండి...మీరు బోరెత్తవచ్చు, నసగా అనిపించవచ్చు. సో, మిత్రులారా ఈ 2011 కొత్త ఏడాది నుండి మీకు బాగా ప్రియమయిన వ్యక్తిని మీ అధిష్టానంగా ప్రతిష్టించుకొని తాను చెప్పే స్వీట్ థింగ్సు వింటూ పొండేం. ఎంత చక్కని తియ్యని సైయ్యాట అదీ! ఇలా మీ/నా జీవిత లక్ష్యాలకి హై కమాండ్ అనే తాళం చెవి దొరికింది. ఆ తాళం చెవిని పోగొట్టుకుంటామా లేక జేబులోనే పెట్టుకొని తిరుగుతామా లేక విజయద్వారాలని తెరుస్తామా అన్నది .... మన చేతిలోనే వుంది... కేవలం మన చేతిలోనే వుంది. మీరు ఆ ద్వారాల దగ్గరికి వెళ్ళండంతే - తొంభయ్ శాతం తలుపులు తామంతట తాను తెరచుకొని విశాలంగా మిమ్మల్ని తమ లోపలికి ఆహ్వానిస్తూవుంటాయి. ఇహ మీరు అడుగు వెయ్యడమే ఆలస్యం మరి. మిత్రమా ఈ నూతన సంవత్సరంలో అలా అలా గాలిలో తేలినట్లుగా అడుగులు వేస్తూ అద్భుత విషయాలని మీ స్వంతం చేసుకోండంతే. ఆ తరువాత మీ అధిష్టానానికి హృదయపూర్వకంగా కానుకలనే ముడుపులు చెల్లించడం మరచిపోకండి. మళ్ళీ మీ పెట్టుబడికి మించి ఎన్నో రెట్లుగా మీ అధిష్టానం మీకే ఉపయోగపడుతుంది అంటే నమ్మండి మరి ;)