వందనాలు వందనాలు చిలియన్ ప్రెసిడెంట్ నీకు వందనాలూ

మేము 33 మందిమీ క్షేమంగా వున్నామని మైనర్ల నుండి అందిన తొలి సమాచారాన్ని ప్రదర్శిస్తున్న చిలియన్ ప్రెసిడెంట్   సెబాస్టియన్ పినేరా

నిన్నటి నుండీ అప్పుడప్పుడయినా చిలీ బొగ్గు కార్మికుల రక్షణ చర్యలని టివి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూనేవున్నాను. వారిని బయటకి తీసే కార్యక్రమం మొదలయిన దగ్గరి నుండీ ప్రెసిడెంటూ, అతని భార్యానూ ఆ ప్రదేశంలోనే వేచివున్నారు. కొన్ని గంటల తరువాత ఒక్కొక్కరూ బయటపడుతుండగా ప్రతి ఒక్కరినీ బయట ప్రపంచానికి ఆహ్వానిస్తూ కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఇద్దరిలో ఒకరయినా అక్కడ వేచివున్నారు.
 
చిలియన్ ప్రధమ జంట

ఇప్పటికి 19 మందిని బయటకి తీసారు. ఇంకా 14 మంది వున్నారు. అందరినీ బయటకి తీసేదాకా అధ్యక్ష జంట అక్కడేవుండి   అందరూ బయటకి వచ్చాక ఈ రోజు చిలీ ప్రజలందరితో కలిసి ఘనంగా ఉత్సవాలు చేసుకుంటారట.  రాత్రి మరి కొద్ది సేపు ఏమయినా విశ్రాంతి తీసుకున్నారేమో నాకు తెలియదు కానీ బయటకి వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడినీ వారు పలకరించారని సమాచారం.  ఇంకో విషయమూ గమనించాను. వారి పక్కనే పెద్దగా రక్షణ కూడా లేదు. వారి పక్కనే నిన్న ఒక్క పోలీసు ఆఫీసరు కనపడ్డాడు కానీ ఇవాళ అయితే అతను కూడా లేడు.

ఒక్కొక్క మైనరు బయటకు వచ్చి తన ఆత్మీయులనూ, ప్రధమ జంటనూ, ఇతరులనూ కలుసుంటున్న సన్నివేశాలు చూస్తుంటే ఇంత దూరంలో వున్న నా కన్నులే చెమ్మగిల్లుతున్నాయంటే ఆ మైనర్ల, కుటుంబ సభ్యుల, చిలియన్ల భావోద్వేగాలు ఎలా వుంటుండొచ్చో మనం ఊహించొచ్చు.

2 comments:

  1. ఆ దేశంలో నిజమైన నేతలు ఉన్నారన్నమాట.

    ReplyDelete