ఇక్కడ తొడలు కొట్టబడును!

మన తెలుగు సినిమాలలో అందరూ తొడగొట్టడం చూసి నాకు ఆ ఉబలాటం ఎక్కువయ్యింది. కానీ ఒక చిన్న సందేహంతో ఆగిపోతున్నాను. నా సందేహం ఏంటో మీరు గెస్ చేసేస్తున్నారనుకుంటా. వాచిపోతుందని నా డవుట్ అనుకుంటున్నారు. అంతేనా? అది కాదండీ. అలాంటి చిన్న చిన్న డవుట్లు వస్తే వీడు శరత్ బాబు ఎందుకవుతాడు? మరేంటో చెప్పుకోండి.

సరే నేనే చెప్పేస్తున్నా. ఒకవేళ మన ఖర్మ కాలి ఆ తొడ కొట్టుకోవడం గురి తప్పి తగలరాని దగ్గర తగిలితే నా గతేం కాను? నా బాక్స్ బద్దలవుతుంది :(  అస్సలే తొడకొట్టుకోవడం మనకు కొత్త. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో ఎవడికి తెలుసు? అందుకే ఎందుకయినా మంచిదని నా తొడలు నేను కొట్టుకోకూడదని డిసైడ్ అయ్యా. అందుకే ఇతరుల తొడలు మాత్రమే కొట్టాలని మరీ డిసైడ్ అయ్యా.   అప్పుడెక్కడ తగిలినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా. అందుకే.

అలా పక్కనున్న వాళ్ల తొడలు కొట్టడం అస్తమానూ కుదిరి చావదు కనుక యథాశక్తి తొడలు కొట్టుకొమ్మని ఇతరులని ప్రోత్సహిస్తుంటాను. ముఖ్యంగా రౌడీగారిని ప్రోత్సహిస్తుంటాను. ఎప్పుడో ఒకప్పుడు గురితప్పకపోతుందా, నా చిరకాల కోరిక తీరకపోతుందా అని నా బుల్లి ఆశ. నేను రౌడీని ప్రోత్సహిస్తుంటే ఆ ఆనందం పట్టలేక పవన్ కూడా (తొడలు) కొట్టుకుంటున్నాడనీ, వాచిపోయి ఝండూబాం కూడా రాసుకుంటున్నాడనీ తెలియవచ్చింది. నా కోరిక తీరివుండొచ్చంటారా?    

బ్లాగుబద్ధమయిన హెచ్చరిక: నా తొడలు కొట్టాలని ఎవరూ చూడకండి!   కనీసం ఆ ఆలోచన కూడా మనస్సులోనికి రానివ్వకండి.  

గోరా గారితో నా పరిచయం

గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి గురించి చాలామందికి తెలిసేవుండవచ్చు. వారు నాస్తికోద్యమ నాయకులు. అలా మీకు తెలియకపోయినా ఇంకో విషయం చెబితే మీకు ఈజీగా తెలుస్తుంది. డాక్టర్ సమరం నాన్నగారు.  నేను అయిదవ తరగతి చదువుతున్నప్పుడు మా ఊరి దగ్గరలో వున్న పెదనెమిల గ్రామానికి వారు వచ్చారు. వారి ముఖ్య అనుచరులు మరియు తెలంగాణాలో ముఖ్యమయిన నాస్తిక కార్యకర్తలలో ఒకరయిన మా నాన్నగారు నన్ను కూడా పెదనెమిల గ్రామానికి తీసుకువెళ్ళారు.   అకడే తొలిసారి గోరాగారిని చూడటం. వారు నాతో ఏమయినా మాట్లాడారా లేదా అన్నది నాకు గుర్తుకులేదు. వారితో పాటుగా మిగతా వారితో పాటుగా కలిసి ఆ పల్లెలో తిరిగాను. హరిజనవాడలో ఒక ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్ళు అడిగారు.    శుభ్రమయిన ఆ గ్లాసుని చూసి అంత శుభ్రంగా చాలామంది అగ్రవర్ణాల కుటుంబీకులు కూడా వుండరని మెచ్చుకోవడం గుర్తుకువుంది.  

ఆ తరువాత ఆగ్రామంలో నాస్తికశిక్షణా శిబిరం జరిగింది. గోరా గారితో పాటుగా మా నాన్నగారు కూడా ఉపన్యసించారు. ఇంకా కొంతమంది ప్రసంగించారు. నా చిన్నప్పటి సంగతులు కాబట్టి ఎక్కువ సంగతులు గుర్తుకులేవు. మన ఊరికి ఎప్పుడు గోరాగారు వస్తారని ఉత్సాహంగా మా నాన్నగారిని అడిగాను. ఒకసారి వచ్చారని, మా ఇంటికి కూడా వచ్చారని నాన్న చెప్పారు. మా ఇంటిలో మా నాన్నగారి పెద్ద గ్రంధాలయం చూసి గోరాగారు ముచ్చటపడ్డారని కూడా గుర్తుకుచేసుకున్నారు. 

ఆ తరువాత కొన్ని నెలలకే ఓ సాయంత్రం రేడియో న్యూస్ విని గోరాగారు ఒక సభలో ఉపన్యసిస్తూ అలాగే ఒరిగిపోయి మరణించారని నాన్నగారు విచారంగా చెప్పారు.  మిగతా నాస్తికులతో కలిసి గోరాగారిని చివరిసారిగా చూడటానికై నాన్నగారు హడావిడిగా విజయవాడకి ప్రయాణం అయి వెళ్ళారు.  

అలా గోరాగారిని పెదనెమిలలో చూడటమే మొదటిసారి, చివరిసారి అయ్యింది నాకు. నిరాడంబరమయిన, నిజాయితీపరమయిన, నిష్కల్మషమయిన వారి యొక్క వ్యక్తిత్వం నాకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనేవుంటుంది.   

గోరా గారి గురించి, వారి యొక్క నాస్తిక కేంద్రం, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకులని క్లిక్ చేయండి.     

నేను 'ప్రస్థానం' ఇంకా ఎందుకు చూడలేదంటే...

ఏదయినా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మా చిన్నపాప నా అభిప్రాయం అడుగుతుంది. నేను బావుంది అన్నది కాక మరొకటి తాను తీసుకుంటుంది. ఇలాక్కాదని నాకు నచ్చనిది చెప్పడం ప్రారంభించాను. అప్పుడు మాత్రం నేను చెప్పిందే తీసుకుంటుంది :(

అలాగే వారికి నచ్చని వ్యాఖ్యాతల IPలు బ్లాక్ చేసే సైటు వారు ఈ సినిమా బావుందన్నప్పుడు ఈ సినిమా చూద్దామనుకున్నాను. కానీ... ఆ సినిమా గురించి అదే పనిగా మెడకో డోలు కట్టుకొని తెలుగు సినిమా సమీక్షలు చేయం అన్న ఆ సైటు వారు ఈ తెలుగు సినిమాకు మాత్రం డప్పు కొడుతూ, సమీక్షల పోటీలూ పెడుతూ హడావిడి చేస్తుండే సరికి ఎందుకయినా మంచిదని చూడకుండా ఆగాను.   

నా అనుమానానికి తగ్గట్టే వీరి హైప్ ని చూసి ఆ సినిమాకు వెళ్ళిన కొందరు ఆ సినిమానీ, ఈ IP అడ్రసు బ్లాకింగ్ సైటునీ  తిట్ల దండకం అందుకున్నారు. మీరు చెప్పింది విని సినిమా చూసి ఇన్నిన్ని రూపాయలు తగలేసామని మండిపోయారు. ఇంకా నయ్యం - నష్టపరిహారం క్రింద ఈ IP బ్లాక్ తరంగం మీద వారు దావా వెయ్యలేదు! మరి కొందరు ఈ సినిమాని ఆ సైటు వారు ప్రమోట్ చేయడంలో నకిలీ కణికుడి వ్యవస్థ వుందేమో లేక రామోజీ రావు హస్తం వుందేమో అని కాన్స్పిరసీ థియరీలు అల్లారు! గ్యారంటీగా వీరి ఐపిలు బ్లాకయి వుంటాయి.  మరి కొంతమంది ఆ సినిమాని మెచ్చుకున్నారు కూడా. దానితో 'టు డూ ఆర్ నాట్ టు డు' అన్న ధర్మ సందేహంలో పడిపోయాను. చివరికి రాజీ మార్గానికి వచ్చేసాను. ఈ సినిమాను  ఎందుకయినా మంచిదని అన్ని డబ్బులు పెట్టి సినిమా హాలుకు వెళ్ళి చూడొద్దనీ, ఆ సైటు వారు మరీ మరీ ఎగదోసి చెప్పారు కాబట్టి ఒఖ్ఖ డాలరు మాత్రం పెట్టి పైరేటేడ్ సినిమా మాత్రం చూడాలనీ డిసైడ్ అయిపోయాను. ఎలా వుందంటారు నా నిర్ణయం? 

IB (ఐ.పి. బ్లాక్) తరంగం వారు ఓ తెగ రికమెండ్ చేసిన సినిమా పైరేటేడ్ కాపీలు ఇంకా మా దగ్గరకు రాలేదు. నిన్న వెళ్ళి చూసాం కానీ ఈ సినిమా కాపీలు కనిపించలేదు.  కాపీ వచ్చాక సినిమా చూసి ఆ ఒఖ్ఖ డాలరూ తగలెట్టానని ఆ IBT (తరంగం) సైటు వారిని నేను కూడా తిట్టుకుంటానో లేక ఆ డాలరుకి కనీస న్యాయం జరిగిందనిపించిందో మీకు చెబుతానులెండి.  ఈ సినిమా చూసాక IBTకి  సమీక్ష రూపంలో నా అభిప్రాయాన్ని పంపితే ఓ 500 రూపాయలు నా ముఖాన విసిరేస్తారంటారా? అప్పుడు నాకు కనీసం తొమ్మిది డాలర్లు లాభం అవుతుంది.    

Living in Oblivion

కొద్ది రోజుల క్రితం నవతరంగంలో విప్లవ్ వ్రాసిన ఒక వ్యాసంలో ఈ చిత్రాన్ని ఉదహరించి కొన్ని బిట్స్ ఇచ్చారు. ఆ బిట్స్ చూసాక ఈ సినిమా తప్పక చూడాలని నిర్ణయించుకున్నాను. ఆ వ్యాసాన్ని ప్రశంసిస్తూ అక్కడ వ్యాఖ్యానిద్దామనుకున్నాను కానీ వాళ్ళు నా IP బ్లాక్ చేసారుగా ;)    

ఆ సినిమా బిట్స్ నచ్చడానికి ఒక చిన్న కారణం వుంది. మీకు తెలుసో తెలియదొ శరత్ - ఒక గొప్ప దర్శకుడు! ఓ రెండు చిత్రాలకు(!?) దర్శకత్వం వహించాను. ఆ తరువాత ఆ సినిమాలు ఏమయ్యాయి, నేనేమయ్యాను అని అడక్కండి - వీలు చూసుకొని నేనే చెబుతాను.  చిత్రాలంటే చిత్రాలు కాదులెండి - డివిడి సినిమాలు. క్యాంకార్డర్ తో షూట్ చేసి డివిడిలు చేసి అమ్మాలని అప్పట్లో ప్రయత్నించానులెండి. అందుకే డైరక్టర్లు పడే కష్టాలు నాకు బాగా తెలుసు. ఆ కథా కమీశూ త్వరలోనే వివరిస్తాగా.  లో బడ్జెట్ సినిమా డైరెక్టర్లు పడే కష్టాలని ఆ సినిమాలో చాలా చక్కగా చూపించినట్లున్నారు.

ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ లో ఆర్డర్ చేసాను. రేపు అందాక చూడాలి. ఆ సైటులో ఆ సినిమా నెట్టులో ఇన్స్టంటుగా చూడటానికి అందుబాటులో లేదు.  ఇలాగే ఏమయినా మంచి ఆంగ్ల సినిమాలు వుంటే సూచించండి. ఈమధ్య నెట్‌ఫ్లిక్స్ కి బాగా అలవాటు అయ్యాను.    అందులో బోలెడన్ని సినిమాలు వున్నాయి కానీ మనం సినీ మేధావులం కాదు కాబట్టి ఏవి మంచి సినిమాలో తెలియడం లేదు.   


Living in Oblivion

1995 R 92 minutes
Living in Oblivion takes you through one hellaciously funny day in the life of small-time independent filmmaker Nick Reve (Steve Buscemi). All Nick wants is to realize his artistic vision within the confines of an extremely low budget. Unfortunately, he keeps encountering a maddening number of obstacles, both real and imagined. Catherine Keener and James LeGros co-star.

వళ్ళు హూనం చేసింది!

అపార్ధం చేసుకోకండి. జిమ్ము ట్రైనర్ సామంతా నా వళ్ళు హూనం చేసింది. పాత జిమ్ముకి కొత్తగా వెళుతున్నా కదా. రెండు ఉచిత శిక్షణలు వుంటాయి లెండి. ట్రైనర్ మగ కావాలా, ఆడ కావాలా అని అడిగారు. ఆడ కావాలన్నాను. అంత అందమయిన ట్రైనర్ కాదు. ప్చ్ అనుకున్నా. క్రితం సారి వచ్చిన ట్రైనర్ కాస్త బావుండేది.     

గంటన్నర సేపు నన్ను ఇరగదీసింది. రోజూ జిమ్ముకి వెళుతుంటాకానీ శరీరాన్ని ఎక్కువ కష్టపడనివ్వకుండా సుతారంగా, సున్నితంగా వర్కవుట్ చేస్తుంటాను.   ఎక్కడ ఒక చెమట బిందువు కారితే అది వేస్టు అవుతుందో అని చెమట్లు పట్టకుండా జాగ్రత్తగా జిమ్ము చేస్తుంటాను. అలాంటి నా శరీరం పని ఇవాళ అయిపోయింది.   

ఆమె అలా నన్ను బాగా కష్టపెట్టిన తరువాత ఇక స్ట్రెచింగ్ చెయ్యి పద అంది. నేను ఇక చెయ్యలేనని మొరాయిద్దామనుకున్నాను. ఒక స్త్రీ ముందు పరువుపోతుందేమో అనుకొని  సరే అన్నాను. నన్ను బెంచ్ మీద పడుకొమ్మని చెప్పి హాశ్చర్యంగా నా మీదికి దాదాపుగా ఎక్కి నా చేతులు, కాళ్ళు, భుజాలు స్ట్రెచ్ చేసింది. ఓ ఇలాక్కూడా వుంటుందా జిమ్ము ట్రైనింగ్ అనుకున్నాను ఆ స్ట్రెచింగుకి తన్మయత్వం చెందుతూ.    

సమయమంతా ఆమెతోనే సరిపోవడం వల్ల ఇక ఆవిరి గదిలోకి వెళ్ళి యోగి వేమన భంగిమ వేసే అవకాశం ఈ రోజు దొరకలేదు. ఆమె దగ్గర ప్రతిరోజూ కూడా ఇలాంటి శిక్షణ తీసుకొని బాగా కండలు పెంచి మిమ్మల్నందరినీ భయపెట్టవచ్చు కానీ ఒక్కొక్క సెషనుకు 80 డాలర్లు. మనకంత దృశ్యం లేదు.   

దయ్యాలతో నా పరిచయం

నా చిన్నప్పుడు మా ఇంట్లో కొంతమంది కిరాయికి వుండేవారు. అందులో సూర్యనారాయణ సారు కుటుంబం ఒకటి. అప్పుడు ఆ సారు దగ్గరే ట్యూషనుకి వెళ్ళేవాడిని. వారు నాకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా కాకుండా చక్కటి దయ్యాల గురించి కూడా నేర్పించారు. మా నాన్నగారికి దయ్యాలంటే చిరాకు గనుక మా నాన్నగారు లేని సమయంలో ఇంట్లో వాళ్ళందరం  కలిసి కబుర్లు చెప్పుకునే సమయంలో దయ్యాల కథలు, దయ్యాలను వారు ఎదుర్కొన్న సంఘటణలు, వాటితో వారి సమావేశాలు వగైరాలు రసవత్తరంగా చెప్పుకువచ్చేవారు. నేను మనస్సులో కెవ్వు కెవ్వు మంటూనే వింటుండేవాడిని.  

అలా దయ్యాలు నాకు పరిచయం అయి ఎప్పటికీ నన్ను వదలలేదు. ఇహ అప్పటినుండీ  ఒంటరిగా ఒంటేలుకి పోవాలన్నా, చెంబటక పోవాలన్నా నాకు చచ్చేంత వణుకు పుట్టేది.   అప్పుడప్పుడు తోడుగా మా నాన్నని పిలిచేవాడిని. ఎందుకు భయం అని అంటే దయ్యాలు నన్ను పీక్కుతింటాయి అని చెప్పేవాడిని. ఛత్ దయ్యాల్లేవు ఏం లేవు అనేవాడు మా నాన్న. మా నాన్న అమాయకత్వానికి హాశ్చర్యపోయి 'వున్నాయి, సూర్యనారాయణ సారు నాకు దయ్యాల గురించి చాలా చెప్పారు' అని వాదించేవాడిని. ఈ సారు చిన్నపిల్లలకు ఎందుకు దయ్యాల కథలు చెబుతారు అని ఆ సారు మీద మా నాన్నగారు విసుక్కునేవారు.   

ఆ తరువాత మా స్వగ్రామం నుండి మేము భువనగిరికి మారాము. ఎనిమిదవ తరగతి చదువుతుండేవాడిని. నేను ఊరు వదిలినా దయ్యాలు నన్ను వదలలేదు. సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు నా మనస్సుని బాగా పీక్కుతినేవి. అర్ధరాత్రులు ఓంటేలుకి వస్తే ఫర్వాలేదు కానీ ఏ అర్ధరాత్రో నాకు నంబర్ టూకి వస్తే నా గుండె గుభేలుమనేది. అప్పుడు సెలవుల్లో నేను ఒక్కడినే ఊరికి వచ్చేవాడిని కాబట్టి అమ్మా నానలు తోడుగా వుండేవారు కాదు. ఊర్లో తాతయ్య, అమ్మమ్మలే వుండేవారు. పెద్ద ఇల్లు కావడంతో దూరంగా వున్న గదుల్లో పడుకునేవారు.

అది పల్లెటూరు కదా, ఇంట్లో పాయఖానా వుండకపోయేది. ఇంటివెనకాల వున్న పెరడులోకి వెళ్ళాల్సొచ్చేది. ఒకటో నంబర్ ఒక్క నిముషం పని కాబట్టి గాఠ్ఠిగా  కళ్ళుమూసుకొని హడావిడిగా దులపరించుకొని వచ్చేవాడిని కానీ రెండో నంబరుకి ఆ పప్పులు ఉడకవు కదా.  ఎంత ఆపుకున్నా ఎమర్జెన్సీ లెవలుకి వెళ్ళిపోయేది నా ఒత్తిడి. ఇహ చేసేది లేక మా ఇంటి ముందు వరండాలో పడుకున్న పని అమ్మాయిని నా పనికి తోడుకు రమ్మని బ్రతిమలాడేవాడిని. విసుక్కుంటూ, సణుక్కుంటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ 'మీకెందుకు అంత భయ్యం అబ్బాయి గారూ' అనుకుంటూ నా పనికి తోడుగా వచ్చేది. దాదాపు నా వయస్సే వున్న పని అమ్మాయిని నంబర్ టూ కోసం తోడుగా పిలుచుకోవడం సిగ్గుగా అనిపించినా ఆపద్ధర్మంగా అది తప్పేది కాదు.  

అలా ఎనిమిదవ తరగతి సెలవులు నడిపించాను. తొమ్మిదవ తరగతిలో నేను కొద్దిగా తెలివిమీరాను. అంటే దయ్యాలను ఓడించానని కాదు. నేను భయపడటం అటుంచి నేనే నా పద్ధతిలో ఇతరులని భయపెట్టడం ప్రారంభించాను - అంటే ఏమిటో కాదులెండి చిలిపి పనులు చేయాలని తాపత్రయపడేవాడిని.  ఓ శుభముహూర్తాన  'అమ్మగారూ, ఇవాల్టి నుండి రాత్రి మా ఇంట్లోనే పడుకుంటానండి' అని మా అమ్మమ్మతో మా పని అమ్మాయి చెప్పేసింది. ఎందుకే అని అడిగింది మా అమ్మమ్మ. ఈ ఇంట్లో దయ్యాలున్నాయండి అని చెప్పింది మా పని అమ్మాయి. తేలుకుట్టిన దొంగలా నేను కిక్కురుమనలేదు.