వుండాల్సింది మానసిక సారూప్యత

చాలా జంటలని పరిశీలించిన పిమ్మట నాకు అర్ధమయ్యిందేమిటంటే జంటల మధ్య (దంపతులు/ ప్రేమికులు/ సహ జీవనం చేస్తున్నవారు) ముఖ్యంగా వుండాల్సింది మానసిక సారూప్యత అని. పెళ్ళి చేసుకోబోయే యువతీ యువకులు తమకాబోయే పార్ట్నర్ లోని చాలా విషయాలని బేరీజు వేస్తారు కానీ దీనిని మాత్రం పెద్దగా పట్టించుకోరు.

సాధారణంగా పెళ్ళిళ్లలో కులం, మతం , డబ్బు. హోదా,ఆదాయం, పేరు, ప్రతిష్ట, మంచితనం గట్రా గట్రాలకే విలువ వుంటుంది కానీ ఎదుటి వ్యక్తి తమ ఆలోచనా రీతులకు ఎంతగా సరిపోలుతారు అన్న విషయం పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కొన్ని ఏళ్ళ క్రితం విన్న ఒక సర్వే రిజల్ట్ ప్రకారం సైక్లాజికల్ ఫ్రీక్వెన్సీ బాగా మ్యాచ్ అయిన దంపతుల జీవనాలే ఎక్కువ సుఖంగా వుంటున్నాయిట.

ఇద్దరు వ్యకులు మంచివారు అయినా వారి దాంపత్యజీవనం మంచిగా వుండాలని లేదు. తేడా ఎక్కడ వస్తుంది? ముఖ్యంగా ఇక్కడే. అలోచనా రీతుల్లో, భావాల్లో, ఆసక్తులలో తేడా. రాజీ పడవచ్చు - కానీ అది ఎంత శాతం? అన్ని విషయాలలో జీవితాంతం రాజీ పడుతూపోతే జీవితం నిస్సారంగా అవుతుంది. మింగలేని కక్కలేని బ్రతుకయ్యి జీవితం ముసుగులో గుద్దులాటవుతుంది.

అందుకే పెళ్ళి చేసుకోబోతున్నవారికీ, ప్రేమలోకి దిగబోతున్నవారికీ నాదయిన సలహా ఇది. మీ మధ్య సైకలాజికల్ ఫ్రీక్వెన్సీ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూసుకోండి. 60% కంటే తక్కువ సరిపోలితే కష్టమే. 30% కంటే తక్కువయితే ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది. 80% కంటే ఎక్కువ మ్యాచ్ అయితే మీది చాలా చక్కటి దాంపత్యం అవవచ్చు - అలా అని 90% కంటే ఎక్కువ మ్యాచ్ అయినా మీ జీవితాల్లో వైవిధ్యం వుండకపోవచ్చు.

పెళ్ళి చూపుల్లోనూ, వీలయితే అక్కడ మాట్లాడుకొనే కొద్ది సేపట్లోనూ ఎదుటివారి గురించి మనకు చాలా అవగాహన వస్తుంది అనుకోవడం పొరపాటు. అలాగే ప్రేమ గుడ్డిది కాబట్టి పెళ్ళయి వేడి చల్లారేంతవరకు వ్యక్తుల మధ్య వైరుధ్యాలు అర్ధం కావు. ఒక విపులమయిన ప్రశ్నావళి తయారు చేసుకొని ఇద్దరి ఆలోచనా విధానం కలుస్తుందా లేదా అన్నది బేరీజు వేసుకోవడం అన్నది దీనికి ఒక పరిష్కారం కాగలదు.

కొన్ని ఉదాహరణ ప్రశ్నలు:

అ. విజయవంత అయిన వ్యక్తి
1) డబ్బు వున్నవాడు 2) పేరు వున్నవాడు 3) మంచి వ్యక్తిత్వం వున్నవాడు

ఆ. ఈ జీవితం మీకు బాగా నచ్చుతుంది
1) నగర జీవితం 2) పల్లె జీవితం 3) ఆశ్రమ జీవితం

ఇ. ఈ సినిమాలు మీకు బాగా నచ్చుతాయి
1) అవార్డ్ సినిమాలు 2) కాలక్షేపం సినిమాలు 3) సెంటిమెంటు సినిమాలు

కేవలం పై మూడు జవాబులని బట్టి అంచనా వేస్తే కాలక్షేపం సినిమాలే బాగా ఇష్టమయ్యి, నగర వాతావరణమే బాగా నచ్చి డబ్బు వున్నవారే గొప్పవారనుకొనే ఒక అబ్బాయికి పల్లె వాతావరణం బాగా నచ్చి, మంచితనం ముఖ్యం అనుకునే, అవార్డ్ సినిమాలు నచ్చే అమ్మాయి దొరికిందనుకోండి. వారి వైరుధ్యాల జీవితం ఎలా వుంటుందో - అసలు దానిని దాంపత్యం అంటారో లేక దాంపత్యం వున్నా రూం మేట్స్ అనొచ్చో మీరు ఊహించుకోవచ్చు.

హ్మ్మ్. పెళ్ళికి ఇంత దృశ్యం అవసరమా అని మీరనుకుంటే కనీసం ఆ అభిప్రాయంతో నన్నా ఏకీభవించే పార్ట్నర్ ని చేసుకోండి. ఎందుకంటే కనీసం ఒక్క విషయంలోనన్నా మీలో సారూప్యత వుంది - జీవితంలో ముఖ్యవిషయాలను లైట్ తీసుకోవడం. మీరిద్దరూ అలాంటివారయితే కొంతవరకు నయమే కదా.

9 comments:

  1. thoughtful post. I agree with the point you raised.

    ReplyDelete
  2. ఎక్కడో చదివేను ఏమధ్యే...

    ఎప్పుడైనా కోపం వస్తే మనుషులు అతి దగ్గిరగా ఉన్నా గొంతెత్తి అరుస్తారెందుకూ అని.. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనస్సులు బాగా దూరం అవుతాయి. అంచేత దూరంగా ఉన్నవాళ్ళకి వినపడేట్టు గొంతు పెంచుతాము(ట). సింపుల్ నిజాన్ని భలే చెప్పారే అనిపించింది. ప్రేమికులు చూడండి. ఎప్పుడూ గుసగులే ఎందుకంటే మనసులు బాగా దగ్గిరగా ఉంటాయి కదా? అంచేత చెప్పొచ్చేదేమిటంటే ఎప్పుడైతే మనసులు కలహించుకుంటాయో అప్పుడే మనుషులు దూరమై పోతారు ఒకళ్ళనుంచి ఒకరికి.

    ReplyDelete
  3. this is probably the first post of your's( I read very few) that I found very thoughtful,informative and analytical!

    keep going !

    ReplyDelete
  4. "ఎప్పుడైనా కోపం వస్తే మనుషులు అతి దగ్గిరగా ఉన్నా గొంతెత్తి అరుస్తారెందుకూ అని.. "

    great explanation agnatha gaaroo !

    ReplyDelete
  5. ప్రేమ/పెళ్ళంటే ఇప్పుడు ఒక లెఖ్ఖ మాత్రమే. అబ్బాయిలేమో అందాన్ని, అమ్మాయిలేమో ఆస్థులను అంచనాలు వేసుకుంటు అదేదో practicality అనుకుంటున్నారు.

    అజ్ఞాత గారు: మీరు చెప్పింది చాలా బాగుంది.

    ReplyDelete
  6. "పెళ్ళయి వేడి చల్లారేంతవరకు వ్యక్తుల మధ్య వైరుధ్యాలు అర్ధం కావు."
    -----------
    చాలా బాగా చెప్పారు :)

    ReplyDelete
  7. చాలా బాగా రాశారు. కానీ ఇలా పర్సెంటేజీలు తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? కొన్నాళ్ళు పరిచయం కొనసాగిస్తే ఒక విషయాన్ని ఇద్దరూ ఎటువంటి దృష్టితో అర్థం చేసుకుంటున్నారో తెలుస్తంది. ఇలా కొన్నాళ్ళపాటు పరిశీలించాక, అవతలి వ్యక్తి తో జీవితకాల సంబంధంలోకి, అంటే పెళ్ళిలోకి దిగడమా లేక స్నేహంతోనే ముగించడమా నిర్ణయించుకోవాలంటాను. బాహ్య ఆకర్షణలకు ఇక్కడ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే అది ఎక్కువరోజులు నిలబడేది కాదు కనుక.

    మీరు ఉదాహరణలతో చెప్పిన వైరుధ్యాలు కల వాళ్ల పెళ్ళిళ్ళు ఎలా వుంటాయో చూపించిన పాత సినిమా ఒకటుంది. "తాయారమ్మ-బంగారయ్య"అని. ఈ మధ్యే టీవీలో చూశాను. అందులో ఇద్దరు ముసలి దంపతులు వచ్చి ఈ యువ జంటల మధ్య సామరస్యాన్ని కుదురుస్తారు . నిజ జీవితంలో అది సాధ్యం కాదు కాబట్టి, ఎంచుకునేటపుడే(అలాంటి అవకాశం ఉంటే) జాగ్రత్త పడటం మంచిది.

    అజ్ఞాత,
    మీరెక్కడ చదివారో కానీ కలకాలం గుర్తుపెట్టుకోవలసిన మాట చెప్పారు. చాలా బాగుంది.

    ReplyDelete
  8. @ మధురవాణి
    థేంక్స్

    @ అజ్ఞాత
    చాలా బావుంది

    @ అజ్ఞాత
    :)

    @ మినర్వా
    అవును. అంచనా వేయాల్సింది ఫ్రీక్వెన్సీని.

    @ ఏకలింగం
    :)

    @ సుజాత
    పెళ్ళి చేసుకోకుండా కొంతకాలం సహచర్యం చేసి చూసి అప్పటికీ ఆ వ్యక్తి నచ్చితే పెళ్ళి చేసుకోవడం వుత్తమం. పాశ్చాత్య దేశాలలో కొంతమంది ఇలా చేస్తున్నారు - బారత్ లో కూడా బాగా ఇది రావాల్సి వుంది.

    ReplyDelete
  9. Nee manasthathwam bhagaswamy manasthathwam okka laage unte neeku vaariki theda emi untundi. Oka laage unte thelusukovalsindi inka emuntundi. Eduti vaarini ardham chesukoni brathakadame jeevitham. Andulone maja untundi. Kashtam entha maathram kaadu.

    ReplyDelete