(గమనిక - వ్యక్తుల అసలు పేర్లు ఇవ్వలేదు)
నల్లగొండ జిల్లా లోని భోనగిరి/భువనగిరి గుట్టను చాలామంది హైదరాబాదుకి రైల్లో వెళుతూ చాలామంది చూసి వుండవచ్చు. ఒకేరాయితో అంత పెద్ద గుట్ట తయారవడం విశేషం. పర్యాటక శాఖ పట్టించుకోనందున ఆ చక్కటి, విశేషమయిన గుట్టగురించి ప్రచారం లేకపోవడముతో ఎక్కువమందికి ఈ గుట్ట గురంచి తెలియదు. అక్కడవున్న నిర్మాణాలని పట్టించుకున్నవారెవరూ లేకపోవడముతో రోజురోజుకీ అవి శిధిలావస్తకి చేరుకుంటున్నాయి.
ఏకశిల అనే పేరు భువనగిరి గుట్టకు రావాల్సిందని, అనవసరంగా వరంగల్లుకు వచ్చిందని మా నాన్నగారు అంటుండేవారు. భోనగిరిలో మా నాన్నగారు ఉపాధ్యాయులుగా పనిచేసినందున అక్కడే గంజ్ ప్రభుత్వ పాఠశాలలో నేను కూడా ఎనిమిది, తొమ్మిది తరగతులు చదివాను. సరదాపుట్టినప్పుడల్లా భోనగిరి గుట్టను మిత్రులతో సహా ఎక్కుతుండేవాడిని. అక్కడి కోట, రాజ భవనాలు, సొరంగాలు, ఆయుధశాలలు, గుర్రపు శాలలు మొదలయినవి అచ్చెరువొందిస్తూవుండేవి. ఆ గుట్టమీద కొలనులు, గుండాలు కూడా వున్నాయి. మా క్లాస్మేట్లందరమూ - అమ్మాయిలతో సహా కలిసి ఆ గుట్ట మీదికి పిక్నిక్ వెళుతుండేవారము.
అలా చిన్నప్పుడు వెళ్ళడమే తప్ప ఆ గుట్ట ఎక్కడానికి మళ్ళీ రెండు సంవత్సరాల క్రితమే వీలుపడింది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మా మిత్రులు, నేను ఎన్నిసార్లు ఎక్కాలనుకున్నా అప్పటికి మాత్రమే వీలుపడింది. అలా నల్లగొండనుండి నా మిత్రుడు సందీప్ నేనూ అక్కడికి వెళ్ళాము. అక్కడ వైదేహి అనే ఆమె అడ్రస్సు కోసం వెతికాముగానీ దొరకలేదు. ఆమె ఇల్లు ఖాళీచేసి వెళ్ళిందని ఎక్కడికి మారిందో తెలియదనీ ఆ ఇంటి ఓనర్ చెప్పారు. భువనగిరి గుట్ట ఎక్కినప్పుడు ఆమెకూడా వెంట వుంటే చాలా ప్రయోజనకరంగా వుండేది కదా అని అనుకున్నాము.
మేము ఇద్దరమూ గుట్ట ఎక్కసాగాము. నేను చాలాసార్లు ఆ గుట్టని చూసినా నా ఫ్రెండుకి అదే మొదటిసారి కావడముతో చాలా ఆసక్తిగా గుట్ట గురించిన విశేషాలు నన్ను అడుగుతూ, గుట్టని చాలా ఆసక్తిగా చూస్తూ వచ్చాడు. నాకు తెలిసిన వివరాలన్నీ చెబుతూవచ్చాను. ఈ భువనగిరి గుట్ట అంటే సందీప్ కి ఒక బంధం, ఆర్ద్రత వుంది. అందుకే గుట్టని ఆత్మీయతా భావంతో పరిశీలిస్తూవచ్చాడు. ఇదివరకు నేను గుట్టని చూసినదానికీ, ఇప్పుడు చూసినదానికీ ఒక తేడా వుంది. అందుకే నేనూ అర్ద్రమయిన మనస్సుతో, ఆలోచనలతో గుట్ట ఎక్కనారంభించాను.
సగం ఎక్కాక గుర్రపు శాలలు కనిపించాయి. వాటిగురించి అతనికి వివరించాక అక్కడికి దగ్గర్లో వున్న గుండాల దగ్గరికి తీసుకువెళ్ళాను. చిన్నవీ, పెద్దవీ కలుపుకొని ఏడెనిమిది గుండాలు వున్నాయక్కడ. కొన్ని బాగా లోతుగా, నీళ్ళ మీద పొదలు అలుముకొని భీతి కొలిపేలా వుంటాయి. ఈ గుండాల్లోనే ఏ గుండం లోనో విశాల యొక్క శవం బయటపడింది అని సందీప్ కి చెప్పాను.
Bhongir Fort Link: http://en.wikipedia.org/wiki/Bhongir
(ఇంకా వుంది)